తెలంగాణ

తెల్లబోయిన పసుపు రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 21: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అత్యధిక విస్తీర్ణంలో పసుపు పండిస్తున్న తెలంగాణ ప్రాంత రైతాంగం చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు కలగానే మారిపోతోంది. ఇదివరకటి యుపిఎ ప్రభుత్వ హయాంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం నుండి కాస్త సానుకూల సంకేతాలు కనిపించగా, ప్రస్తుతమైతే అసలు పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదంటూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పడం ఈ ప్రాంత రైతాంగాన్ని ఉసూరుమన్పించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు సాగు చేసే తెలంగాణ ప్రాంతం, ప్రత్యేకించి నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతులు కేంద్రం వైఖరిని ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. బోర్డు ఏర్పాటైతే తమ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో గత పుష్కర కాలంగా గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు పసుపు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాడినా ఫలితం దక్క లేదని నిర్వేదానికి లోనవుతున్నారు. కేంద్రం చెబుతున్నట్టుగా స్థానికంగా సుగంధ ద్రవ్యాల పార్కు(స్పైసెస్ పార్కు)ను ఏర్పాటు చేసినప్పటికీ, తమకు ఒరిగేది ఏమీ ఉండదని పేర్కొంటున్నారు.
నిజానికి గత ఏడాది క్రితమే నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఎంపిలు, ఈ ప్రాంత ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి పసుపు బోర్డు ఆవశ్యకత గురించి వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, బోర్డు ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేవో అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంటులోనూ పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహారాష్టత్రో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టి కేంద్రానికి లేఖలు అందించారు. ప్రధానిని కలిసిన సమయంలోనూ పసుపు బోర్డు ఏర్పాటు గురించి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కేంద్రంలో ఆశించిన కదలిక కానరాకపోవడంతో ఇటీవలే ఎంపి కవిత పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనైనా పసుపు బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదంటూ కేంద్రం కరాఖండిగా తేల్చి చెప్పడం వారి ఆశలను ఆవిరి చేసినట్లయ్యింది. స్పైసెస్ పార్క్ వల్ల తమకంటే వ్యాపారులకే అధిక లాభాలు సమకూరుతాయని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతూ, అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ పసుపు పంటను సాగు చేస్తున్న తమకు ఒకింత లబ్ధి చేకూరాలంటే పసుపు బోర్డుతోనే సాధ్యమవుతుందని గట్టిగా వాదిస్తున్నారు.
దేశంలోనే అత్యధికంగా పసుపు పంట సాగయ్యే ప్రాంతంగా నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ జిల్లాలోని ఆర్మూర్ సబ్ డివిజన్ రైతులతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ రైతులు పసుపు పంటను సాగు చేస్తారు. దేశం మొత్తం మీద సాగయ్యే పసుపులో 30శాతం ఇక్కడే సాగు చేస్తారు. పొగాకు పంట సాగు చేసే రైతులు టొబాకో బోర్డుతో అనేక లాభాలు పొందుతున్నారని, దాని తరహాలోనే పసుపు పంటకు కూడా ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తే ఈ పంట సాగు చేస్తున్న తమకు పూర్తి న్యాయం చేకూరుతుందని ఇక్కడి రైతులు ఆశిస్తున్నారు. వాస్తవంగానే పసుపు సాగు కోసం ఈ ప్రాంత రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. ఒక్కో రైతు ఎకరాకు లక్షా యాభైవేల రూపాయల వరకు భూసారం పెంపుదల కోసం ఖర్చు చేస్తారు. విత్తనాలు, క్రిమిసంహారక మందులు, కూలీ ఖర్చులు వీటికి అదనం. అయితే పెట్టిన పెట్టుబడికి, చేతికందుతున్న సొమ్ముకు పొంతన లేకపోవడంతో పసుపు రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ ఏడాది క్వింటాలుకు కనీసం 4వేల రూపాయల మద్దతు ధర అందడం కూడా గగన కుసుమంగా మారింది. ఇటీవలే పసుపు పంటను విక్రయించేందుకు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చిన జగిత్యాల జిల్లా రైతు చిన్న గంగారాం గిట్టుబాటు ధర అందడం లేదనే మనస్తాపంతో పంట కుప్ప పైనే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన రైతుల దైన్య స్థితికి అద్దం పడ్తోంది. ఈ దుస్థితి దూరం కావాలంటే పసుపు బోర్డు ఏర్పాటే ఏకైక మార్గమని ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ భావిస్తున్నారు.

చిత్రం... నిజామాబాద్ మార్కెట్ యార్డులో పెద్దఎత్తున కొనసాగుతున్న పసుపు క్రయవిక్రయాలు