ఆంధ్రప్రదేశ్‌

ఒక్క చాన్స్ ప్లీజ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 29: తెలంగాణాలో కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేస్తున్న టిటిడిపికి ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు, లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబును మరోసారి గెలిపించాలని ఏపి ప్రజకు తెలంగాణ నేత రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహానాడు వేదిక మీద సోమవారం సాయంత్రం అభిమానులను ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెదేపా అధికారంలో ఉండాల్సిన అవసరముందన్నారు. ఉభయ రాష్ట్రాల్లో చంద్రబాబు అధికారంలో ఉంటే, ఆయనను ఒప్పించో, మెప్పించో తెలంగాణ అభివృద్ధికి మేం చర్యలు తీసుకుంటామని రేవంత్ అన్నారు. కెసిఆర్ వైఫల్యాలపై ప్రస్తావిస్తూ, ఆయన తెలంగాణ సెంటిమెంట్‌తో ఆటాడుకుంటున్నాడని అన్నారు. పాములవాడు నాగుల చవితి రోజున పామును ఆడించి తిరిగి ఎలా బుట్టలో పెట్టుకుని తీసుకుపోతాడో, తెలంగాణ సెంటిమెంట్‌ను కెసిఆర్ తన చంకన పెట్టుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. విశాఖలో మహానాడు చూసి కెసిఆర్‌కు చలిజ్వరం వస్తోందన్నారు. బలమైన పాముపై దండెత్తడానికి చీమలు ఏవిధంగా వెళతాయో, మహానాడుకు టిడిపి కార్యకర్తలు ఆవిధంగా బారులు తీరి వెళ్లడాన్ని చూసి కేసిఆర్ బెంబేలెత్తుతున్నాడని అన్నారు. పార్టీనుంచి ఒక్కడు పోతే వెయ్యి మంది, వెయ్యి మంది పోతే లక్ష మంది, లక్షమంది పోతే కోటి మంది వస్తారు. ఆ భయం తమకు లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు రైతులకు రుణ మాఫీ చేస్తామని, ఫీజ్ రీయంబర్స్‌మెంట్ చేస్తామని, కేజి టు పిజీ నిర్బంధ విద్య, ఇంటికి ఒక ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని కెసిఆర్ హామీలు ఇచ్చారని, వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. తను అధికారంలోకి వస్తే తెలంగాణలో ఆత్మహత్యలు ఉండవని, ఎన్‌కౌంటర్లు ఉండబోవని, సమస్యపై ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. 1200 మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణ వచ్చిందని, కెసిఆర్ పాలన చూస్తే త్యాగాలు వృథా అయిపోయాయన్న భావన ప్రజల్లో కలుగుతోందన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చి 1100 రోజులైందని, 3300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. కెసిఆర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆమోదించిన 2013 భూసేకరణ చట్టాన్ని ఇప్పుడు సిఎంగా ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో భూములు కోల్పోతున్న నిరుపేదలు, బడుగుల పక్షాన నిలబడిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఉస్మానియా విద్యార్థులను కెసిఆర్ రెచ్చగొట్టారని, ఇప్పుడు వారినే ద్రోహులుగా చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే కెసిఆర్‌కు గుడి కడతామన్న విద్యార్థులే, ఇప్పుడు ఆయనకు గోరీ కట్టడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్టప్రతి వచ్చారని, ఆ సమావేశంలో కేసిఆర్ ఒక్క నిముషం కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన కేసిఆర్, ఇప్పుడు వారికి గొర్రెలు, బర్రెలు, పందులు ఇస్తానని పెంచుకోమని సూచించడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలు అనాధలైపోయాయని ఆరోపించారు. తెలంగాలో టిడిపి లేదని అంటున్న కేసిఆర్ ఈనెల 24న తెలంగాణలో మహానాడు నిర్వహించామని, సరిగ్గా చంద్రబాబు మాట్లాడే సమయంలో మీడియానంతా తన వద్దకు పిలిపించుకుని ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టారని కెసిఆర్‌ను ప్రశ్నించారు. 1982లో తెలంగాణలో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉందని, కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్నామన్నారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై మాట్లాడే సమయంలో తెలంగాణలో రమేష్ రాథోడ్‌ను పార్టీలో చేర్చుకోవడాన్ని చూస్తే కేసిఆర్ నీచవైఖరి అర్థం చేసుకోవచ్చన్నారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని ఇరు రాష్ట్రాల ప్రజలు 2019 ఎన్నికల్లో టిడిపిని గెలిపించేందుకు సమయాత్తం కావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

చిత్రం... విశాఖపట్నం మహానాడులో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి