తెలంగాణ

మూసీ తీరంలో మరో ఉద్యమ కెరటం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 25: మూసీ తీరం గ్రామాల రైతులు భూగర్భ జలాల కోసం లక్షలు వెచ్చించి బోర్లు వేసి భగీరథ ప్రయత్నం చేస్తుండగా పంటల సాగుకు, చెరువుల్లో చేపల పెంపకానికి జీవనాధారంగా ఉన్న మురుగు మూసీ నీటి కోసం నది తీర గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడిగా ఆందోళనలు సాగిస్తున్నారు. కొత్తగా పులిచింతలకు మూసీ వరద జలాలు భారీగా చేరుతున్న తీరును ప్రశ్నిస్తూ కొత్త ఆనకట్టలు, కాలువలతో మూసీ నీరు మూసీ తీరం గ్రామాలకే మళ్లించాలన్న డిమాండ్‌తో మరో ఉద్యమానికి పదును పెడుతున్నారు. మంజీరా, గండిపేట, కృష్ణాజలాలతో పాటు పలు జలాశయాల ద్వారా జంటనగర ప్రజలకు అందుతున్న నీరంతా వారు వినియోగించుకున్న పిదప మూసీలో కలుస్తుండగా ఆ మురుగు మూసీ నీరే తీర ప్రాంతంలోని రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలకు వరాదాయినిగా మారింది
. వేసవిలో సైతం జలకళతో కనిపించే మూసీ నదికి వర్షాకాలం సీజన్‌లో భారీగా వరద జలాల ఉద్ధృతి సాగుతూ కృష్ణానదిలో కలుస్తుంది. నది తీరం వెంట ఉన్న తమ గ్రామాలను దాటి పెద్ద ఎత్తున మూసీ నీరు వృథాగా పోతున్నందున మూసీ కాలువలను పొడిగించి తమ గ్రామాలకు నీరందించాలని మూసీ బేసిన్‌లోని పలు మండలాల ప్రజలు ఏళ్ల తరబడిగా ఆందోళనల పర్వం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భీమలింగం, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పొడిగింపునకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా సిఎం కెసిఆర్ 290 కోట్ల నిధులను అందించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా మూసీ నదిలో వర్షాకాలంలో వచ్చే వరద జలాలను వాడుకోవడంలో ప్రభుత్వం మరింత కసరత్తు చేయాలన్న వాదన మూసీ తీరం గ్రామాల ప్రజల నుండి బలంగా వినిపిస్తూ సరికొత్త ఆందోళనకు బాటలు వేస్తోంది. ఇందుకు గత వర్షాకాలంలో మూసీ వరద జలాలు ఏకంగా 24 టిఎంసిల మేరకు పులిచింతల జలాశయానికి చేరడం ప్రధాన ఆధారమైంది. మూసీ నీటిని సద్వినియోగం చేసుకునే దిశగా తమకు కావాల్సిన ఆనకట్టలు, కాల్వలు ఉండి ఉంటే ఇప్పటికే కాకతీయులు, నిజాంల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులకు సమృద్ధిగా నీరంది మరిన్ని గ్రామాల బీడు భూములు సస్యశ్యామలమయ్యేవన్న తలంపు ఇక్కడి ప్రజల్లో వినిపిస్తుంది.
అదీగాక మూసీ కాలువల పనులు, మిషన్ కాకతీయ చెరువుల పనులతో ఈ ఏడాది ఆయకట్టు మండలాల్లో పలుచోట్ల క్రాప్ హాలిడే పాటిస్తుండడంతో మూసీ నీటితో వర్షాకాలం ఆరంభంనాటికే మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకుగాను 629 అడుగులకు చేరరింది. దీంతో ఈ దఫా వర్షాకాలంలో మూసీ వరద జలాలు మరింత భారీగా పులిచింతలకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్ర లోగిలికి మూసీ నీరు..నిలదీస్తున్న మూసీ వాసులు !!
తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు..నిధులు, నియామకాల సాధన పోరాటం. ఈ నేపథ్యంలో రాష్ట్రా సాధన పిదప అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం నదీ జలాల్లో తెలంగాణ వాటా నికర, వరద జలాల సాధనకు పాత ప్రాజెక్టుల రీడైజన్లు, కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలతో కోటి ఎకరాల సాగుకు భగీరథ కసరత్తు సాగిస్తోంది. ఈ క్రమంలో మూసీ తీరంలోని భువనగిరి, సూర్యాపేట డివిజన్‌కు తొలుత దేవాదుల, ఇప్పుడు కాళేశ్వరం, ఇంకోవైపు ఎస్సారెస్పీ నుండి గోదావరి సాగు జలాలు, మరోవైపు ఎఎమ్మార్పీ, డిండి ఎత్తిపోతల, మిషన్ భగీరథతో కృష్ణా సాగు తాగుజలాలు అందించే పనులు సాగుతున్నాయి. అయితే మూసీతీరంలోని తమ ప్రాంతానికి తమ గ్రామాల మధ్య నుండే సాగుతున్న మూసీ నీటిని అందించడంలో కొత్త పథకాలకు ఎందుకు రూపకల్పన చేయడం లేదన్న వాదన క్రమంగా తీర ప్రాంత గ్రామాల్లో బలపడుతోంది. 2016 జనవరిలో రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం చైర్మన్ శ్యాంప్రసాద్‌రెడ్డి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా, గోదావరి జలాల ఉపనదులైన మూసీ, హాలియా, మునే్నరు, కనగల్, తుంగపాడు తదితర వాగులపై ప్రస్తుతమున్న 50 ఆనకట్టలకు తోడుగా కొత్తగా 190 ఆనకట్టలను ఒక్కోటి కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదికపై ప్రభుత్వం స్పందించి మూసీ నదిపై మరిన్ని ఆనకట్టలు, కాలువల పొడిగింపు చేసినట్లయితే వరద జలాలు పులిచింతల నుండి ఆంధ్రకు పోయేవి కావని తెలంగాణ బీడుభూములకే జలసిరులుగా మిగిలేవన్న వాదన బలపడుతోంది. నిజానికి 47 టిఎంసిల సామర్ధ్యం గల పులిచింతల ప్రాజెక్టును కృష్ణానది జలాల లభ్యతపై ఆధారపడి నిర్మించారు.
మూసీ జలాల లభ్యతపై ప్రధానంగా ఆధారపడనప్పటికి గత వర్షాకాలంలో పులిచింతలకు సెప్టెంబర్-అక్టోబర్‌లలో చేరిన 34 టిఎంసిల్లో 24 టిఎంసిలు మూసీ నీరే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మూసీ నీటిని భువనగిరి, సూర్యాపేట, చౌటుప్పల్ డివిజన్‌లోని మరిన్ని గ్రామాలకు అందించేందుకు అవసరమైన కొత్త పథకాలకు కసరత్తు చేయాల్సిన ఆవశ్యకతను చాటుతుందని మూసీ పరిరక్షణ సమితి వాదిస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం శ్యాంప్రసాద్‌రెడ్డి బృందం ఈ అంశంపై ప్రభుత్వానికి సరైన దిశా నిర్ధేశం చేయాలని మూసీ తీర ప్రాంతంలోని రైతు సంఘాలు కోరుతున్నాయి. మూసీ నీరు మూసీ తీర గ్రామాలకు మళ్లించాలన్న డిమాండ్ ఇప్పుడు సిపిఎం, యువ తెలంగాణ, బిజెపిలకు పోరాట అస్త్రంగా మారగా గులాబీ సర్కార్‌కు ఇరకాటంగా మారనుంది.

చిత్రం.. వర్షాకాలం ఆరంభంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో మూసీ