తెలంగాణ

సంప్రదాయానికి భిన్నంగా సిఎం ప్రజంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 1: పార్లమెంటరీ సంప్రదాయానికి భిన్నంగా అసెంబ్లీ వేదికగా సిఎం కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని, దీనికి స్పీకర్ అనుమతించడం సరికాదని జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. అయినా, సిఎం కెసిఆర్ ప్రసంగంలో కొత్త అంశాలేమి లేవని విమర్శించారు. శుక్రవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ అనాలోచిత నిర్ణయాలతో చేపడుతున్న ప్రాజెక్టుల రీడిజైన్‌లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. మహా ప్రభుత్వంతో సిఎం కెసిఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ వరకు 120కిలోమీటర్లు గోదావరి నది ప్రవాహంలో ఇరు రాష్ట్రాలకు హక్కు ఉందని అన్నారు. ప్రాణహిత-చెవెళ్లకు జాతీయ హోదా రాకుండా చేశారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ పేరుతో శాసనసభ వేదికగా సిఎం కెసిఆర్ కొత్త సినిమా చూపించారని విమర్శించారు. తమకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో నెలకొన్న కరువుపై వాస్తవిక చిత్రం చూపుతామని అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి మెదక్ జిల్లాకు నీటిని తీసుకెళ్తున్నారని విమర్శించారు.

కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సరిపడా నీటిని ఇచ్చాకే మెదక్ తీసుకెళ్లాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన కల్పిస్తామని శ్రీ్ధర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నాయకులు కర్ర రాజశేఖర్, గందె మాధవి, ఉప్పుల అంజనీప్రసాద్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ వైకాపా సమావేశం 4న
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం సమావేశం ఈ నెల 4వ తేదీన ఇక్కడ లోటస్‌పాండ్‌లో జరుగుతుందని ఆ పార్టీ అధ్యక్షులు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న కరవు, ప్రాజెక్టుల డిజైన్ల మార్పుపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన ప్రతిపాదనలు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చిస్తారు. ఈ సమావేశానికి మండల స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు నేతలు, కార్యకర్తలు హాజరవుతారని వారు తెలిపారు.

ఈ ప్రశ్నలకు బదులేదీ?
కెసిఆర్‌కు నాగం ప్రశ్నావళి
హైదరాబాద్, ఏప్రిల్ 1: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి 17 ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానాలు ఇచ్చి ప్రతిపక్షాలను మెప్పిస్తే తాను క్షమాపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేనిపక్షంలో కెసిఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డాక్టర్ నాగం శుక్రవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి అంచనాలు ఎందుకు రెట్టింపు అయ్యాయి?, గత ఏడాది జూన్ 10న ఇచ్చిన జివో నెంబర్ 105లో 35,200 కోట్లతో పాలమూరు-రంగారెడ్డికి జివో ఇచ్చారని, ఇప్పుడు 60 వేల కోట్లకు ఎందుకు పెంచారు? 30 నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తే సగం గుండు కొట్టించుకుని తిరుగుతా?, 10 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది?, ఆరు నెలల్లో అంచనాలు ఎందుకు రెట్టింపు అయ్యాయి?, వాటర్ గ్రిడ్‌లో కూడా రింగ్ ఏర్పాటైంది, క్యాంపు ఆఫీసు వేదికగా కాంట్రాక్టర్లతో కుమ్మక్కైంది వాస్తవమేనా?, టెండర్ విలువలు బాటా షూ కంపెనీ రేట్లా?, మంచి పేరున్న కాంట్రాక్టర్లు ఎవరూ పోటీలో లేకుండానే టెండర్లు ఎలా ఇస్తున్నారు?, ముఖ్యమంత్రి తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులతో తప్పులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విలేఖరుల సమావేశంలో అంజిరెడ్డి, యోగీశ్వర్ రెడ్డి, రామరాజు పాల్గొన్నారు.

గొప్పల కోసం అప్పులు
కెసిఆర్‌పై లక్ష్మణ్ ధ్వజం
హైదరాబాద్, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం గొప్పల కోసం అప్పుల దిశగా వెళుతున్నదని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజాసమస్యలను లేవదీస్తే పాలకపక్ష సభ్యులు, మంత్రులు ఎదురు దాడి చేశారని విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ పేరిట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రంగుల కల చూపించారని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.
అవి బడ్జెట్ భ్రమలు: సిపిఎం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎండమావుల్ని తలపిస్తూ భ్రమలు కల్పించే విధంగా జరిగాయని సిపిఎం శాసనసభాపక్షం నాయకుడు సున్నం రాజయ్య విమర్శించారు. ప్రాధాన్యతలను మరచి, కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఒక ప్రకటనలో ఆరోపించారు. బడ్జెట్ సమావేశాలు 45 రోజులు జరిగే సంప్రదాయాన్ని 17 రోజులకు కుదించి డిమాండ్లను మాత్రమే దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాలు కూడా సభను నడిపారని తెలిపారు. సభ నియమ నిబంధనలను సరిగా పాటించకుండా, స్పీకర్ ప్రభుత్వ కనుసన్నల్లో సభను నడపటం శోచనీయమని అన్నారు.

‘నీళ్లొచ్చేసినట్లే...’
సినిమా చూపించారు
అసెంబ్లీని మయసభలా మార్చిన కెసిఆర్: రేవంత్, సండ్ర ఎద్దేవా
హైదరాబాద్, ఏప్రిల్ 1: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీని మయసభలా చూపించారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. మయసభలో సుయోధన సార్వభౌముడు నీళ్ళు ఉన్నాయని ఒకచోట, నీళ్ళు లేవనుకుని మరోచోట భ్రమించి కిందపడిపోయాడని, ఆ పరిణామం మహాభారత యుద్ధానికి దారి తీసిందని, చివరకు కౌరవులు అంతరించిపోయారని వారు శుక్రవారం విలేఖరుల సమావేశంలో గుర్తుచేశారు. ముఖ్యమంత్రి తన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో ప్రాజెక్టులు పూర్తయి అసెంబ్లీలోకి కూడా నీరు వచ్చేసిందన్నట్లు చెప్పడంతో, ఎమ్మెల్యేలు కొందరు తమ పాదాల వద్దకు నీరు వచ్చేసిందేమోనని, ప్యాంట్లు తడుస్తాయేమోనన్నట్లు ప్యాంట్లు పైకి ఎత్తిపట్టుకున్నారని వారు వ్యంగ్యంగా అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే చట్ట సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉంది కాబట్టి తాము సభకు హాజరుకాలేదని వారు తెలిపారు. ప్రతిపక్షాలకు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అవకాశం ఇచ్చి ఉంటే, తమ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు ఏ మేరకు పూర్తి చేశామో వివరించేవాళ్ళమని అన్నారు. కృష్ణా-గోదావరి ప్రాజెక్టులపై 450 అక్రమ ప్రాజెక్టులు కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినట్లు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని వారు తెలిపారు. ఈ విషయాన్ని లోగడ తాము చెబితే అవహేళన చేశారని, తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు అక్రమ ప్రాజెక్టులు అంటూ అల్లరి చేస్తున్నారని అన్నారని వారు గుర్తు చేశారు.