తెలంగాణ

తెరాసకు దీటుగా ఎదిగేందుకు బిజెపి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 21: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రెండు రోజులపాటు వరంగల్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బిజెపి నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో అటు కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి పాలనను, ఇటు రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలోని తెరాస పాలనను ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలన్న దానిపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారని భావిస్తున్న రాష్ట్ర బిజెపి నాయకత్వం వచ్చే రెండేళ్లలో తెరాసకు ప్రత్యామ్నాయంగా బిజెపిని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరపనుంది. రాజకీయంగా తమకు తెరాసతో ఎటువంటి మైత్రి లేదని ఈ సమావేశం ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. మూడేళ్లలో పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకుని, ప్రజలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్న రాష్ట్ర బిజెపి నాయకులు, ఈ సంబంధాలు ఎంతో కాలం కొనసాగబోవని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని, అవినీతి, అక్రమాలు, అరాచకం మితిమీరిపోయాయని ఆరోపిస్తున్న బిజెపి నాయకత్వం, తెరాస సర్కారుకు వ్యతిరేకంగా సమగ్ర కార్యాచరణతో విస్తృత ప్రచారం జరపటం ద్వారా ప్రజలకు చేరువకావాలనే ప్రయత్నాల్లో ఉంది. ప్రధాని మోదీ, పార్టీ అధినేత అమిత్‌షా మార్గదర్శకత్వంలో చేపట్టిన కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల పోలింగ్ బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టం చేయగలిగామని, ఇతర పార్టీలను అధిగమించి ఇప్పటికే 31 జిల్లాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసామని రాష్ట్ర బిజెపి నాయకత్వం చెబుతోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలనతో పాటు రాష్ట్రంలోని కెసిఆర్ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, భూకుంభకోణాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం జరపటం ద్వారా ప్రజలకు చేరువకావాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర బిజెపి నాయకత్వం ఈ మేరకు కార్యవర్గ సమావేశంలో సమగ్ర చర్చ జరిపి కార్యాచరణ సిద్ధం చేయాలని యోచిస్తోంది. దీనికితోడు గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో సమస్యలపై ఎప్పటికపుడు స్పందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు విస్తృతం చేయటం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనకు కార్యవర్గ సమావేశం ద్వారా అంకురార్పణ జరపాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. శనివారం జరిగే సమావేశానికి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, జోన్ ఇన్‌చార్జ్‌లు కలిపి వందమందికిపైగా హాజరవుతున్నారు. ఆదివారం జరిగే రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గం, మోర్చాల కార్యవర్గాలు, జిల్లాల కార్యవర్గ సభ్యులు, మోర్చాల బాధ్యులు కలిపి సుమారు 400 మంది పాల్గొంటున్నారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రులు హన్స్‌రాజ్ భరద్వాజ్, దత్తాత్రేయ తదితరులు హాజరవుతున్నారు.