జాతీయ వార్తలు

ప్రధానిని కలుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించాలని తెలుగుదేశం ఎంపీలు ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం జనవరి మొదటి వారంలో నరేంద్ర మోదీని కలవాలని తెలుగుదేశం ఎంపీలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తరువాత టిడిపిపి మొదటిసారి బుధవారం సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన బిజెపి సభ్యులు హాజరు కాలేదు. మామూలుగా అయితే టిడిపిపి సమావేశానికి బిజెపి ఎంపీలు హాజరవుతారు.
ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వంలో తాము భాగస్వాములమైనప్పటికీ తమ పనులేవీ జరగటం లేదు, రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి అందవలసిన సహాయం, చేయూత అందటం లేదని పలువురు ఎంపీలు వాపోయారు. తెలుగుదేశం ఎంపీలకు ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లభించటం లేదని ఒక సీనియర్ ఎంపీ విమర్శించారు. తన నియోజకవర్గంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తెస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని పలువురు టిడిపి ఎంపీలు వాపోయారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా బిజెపి ప్రభుత్వం అమలుచేయటం లేదని కొందరు ఎంపీలు దుయ్యబట్టారు.
సమయం మించిపోకముందే తమ సమస్యలు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకురావటం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని ఒక ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే లోక్‌సభ నియోజకవర్గంలోని పార్టీ శాసనసభ్యులతో కలిసి పనిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జారీచేసిన ఆదేశం పట్ల కూడా కొందరు ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమను శాసనసభ్యులతో ముడివేయటం వలన పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. శాసన సభ్యులతో కలిసి పనిచేయాలనే ఆదేశం వల్ల తమ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పథకాలను అమలు చేయించలేకపోతున్నామని కొందరు ఎంపీలు వాపోయారు. ఈ అంశాన్ని సిఎం దృష్టికి తీసుకురావాలని ఎంపీలు భావిస్తున్నారు.