తెలంగాణ

భానుడి ప్రతాపానికి 66 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో ప్రచండ భానుడి ప్రతాపానికి బుధవారం నాటికి 66 మంది మృతి చెందారు. హైదరాబాద్ సహా తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారింది. మార్చి నెల నుంచే ఎండలు ముదిరి ఏప్రిల్ నాటికి 42 డిగ్రీలకు చేరితే ఇక మే నెల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతల ధాటికి జనం అల్లాడి పోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో వడదెబ్బకు మృతి చెందిన వారు ఉన్నారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. అధికంగా మహబూబ్‌నగర్‌లో 28, ఆ తర్వాత మెదక్‌లో 11 మంది, నిజామాబాద్‌లో 7, ఖమ్మంలో 5, కరీంనగర్‌లో 5, ఆదిలాబాద్‌లో 4, వరంగల్‌లో 4, నల్గొండ జిల్లాలో 2 చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం బుధవారం అధికారికంగా వెల్లడించింది. వడగాడ్పుల థాటికి తట్టుకోలేకే వీరంతా మృతి చెందారని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి సహా రామగుండం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, భద్రాచలంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, పగటి ఉష్ణోగ్రత క్రమేణా పెరుగుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా కూలీలు, కార్మికులు మండు వేసవిలో పని చేయడం వల్ల ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. దడపుట్టిస్తున్న వడగాడ్పులు ఒక వైపు, తాగునీటి జలాశయాలు ఎండిపోవడం, తాగునీటి వనరులు అందుబాటులో లేక దాహార్తి తట్టుకోలేక పలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు మరో వైపు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలోకి రావద్దని ప్రభుత్వ వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ చాలా చోట్ల వడగాలుల తీవ్రతకు తట్టుకునే పరిస్థితి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు వివరాలను పరిశీలిస్తే 8 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండలో అధికంగా 43 డిగ్రీల సెల్షియస్ నమోదైంది.

విహెచ్‌కు స్వల్ప అస్వస్థత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనను పరిశీలించి, అపెండిసైటిస్ సమస్య ఉన్నదని, శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతానని విహెచ్ తెలిపారు. బిహార్ సిఎం నితీశ్ కుమార్‌కు పెరియార్ అవార్డు లభించడంతో ఆయనకు ఫోన్ చేసి అభినందించారు.

‘ప్రోత్సాహక సబ్సిడీ రూ.89 కోట్లు విడుదల చేయాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: గత మూడేళ్లగా గిరిజన ఔత్సాహిక ప్రారిశ్రామిక వేత్తలకు రాయితీలుగా చెల్లించాల్సి ఉన్న ప్రోత్సాహ సబ్సిడీ దాదాపు రూ.89 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ శాసనసభ పక్ష నేత ఆర్.రవీందర్‌నాయక్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరారు. ఈ మేరకు ఆయన సిఎంకు లేఖ రాశారు.

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన షబ్బీర్ అలీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా కల్పిస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మైనారిటీల రిజర్వేషన్ల విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని, కాంగ్రెస్‌ను నిలదీయాలని రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు విమర్శించడాన్ని షబ్బీర్ అలీ బుధవారం విలేఖరుల సమావేశంలో తప్పుబట్టారు. ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి చివరకు 4 శాతమే ఇచ్చిందని మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ అలీ ప్రస్తావిస్తూ, నిజానికి తమ ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. అయితే రాష్ట్రంలో అప్పటికే 46 శాతం రిజర్వేషన్లు అమలులో ఉండడం, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని సుప్రీంకోర్టు నిబంధన ఉండడంతో ఒక్క శాతాన్ని తగ్గించి మొత్తం 50 శాతం అయ్యేలా చూశామని ఆయన వివరించారు. ఐదు శాతం రిజర్వేషన్లనే తాము కల్పించలేకపోయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్ల అంశంలో అనేక కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు 3 తీర్పులు, ఒకటి సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. వీటన్నింటిని తాను రాష్ట్ర మంత్రి కెటిఆర్‌కు పంపిస్తున్నానని, వాటిని పూర్తిగా అధ్యయనం చేయాలని కోరుతున్నానని ఆయన చెప్పారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు దక్కితే సంతోషించే వారిలో మొదటి వ్యక్తిని తానే అవుతానని ఆయన తెలిపారు. అయితే అది ఎలా సాధ్యమో ప్రభుత్వం వివరించాలని షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు.

పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంచాలి

శాంతి భద్రతల విషయంలో రాజీలేదు డిజిపి అనురాగ్ శర్మ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని, పోలీసు అధికారులు, సాధారణ పోలీసులు పోలీసు ప్రతిష్ఠను పెంచే విధంగా కృషి చేయాలని డిజిపి అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిపి అధికారుల సమావేశంలో జారీ చేసిన మార్గదర్శకాలపై ఆయన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పోలీసు శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించడం, పోలీసు నియామకాల్లో 33 శాతం మహిళలకు కేటాయించిందన్నారు. శాంతి భద్రతల్లో నూతన సాంకేతిక విధానాన్ని అమలు చేయాలని, షీ టీమ్స్‌తో మహిళల్లో భద్రతా భావాన్ని నెలకొల్పాలని కోరారు. గతంలో ఆర్మ్‌డ్ రిజర్వ్ బెటాలియన్స్, సిపిఎల్ విభాగాల్లో మహిళల నియామకం ఉండేది కాదన్నారు. ప్రస్తుతం వీటిలో కూడా ప్రభుత్వం మహిళలకు చోటు కల్పించడంతో పాటుగా పోలీసు బ్యాండ్ నియామకంలో కూడా మహిళలను తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఒక రాష్ట్ర కంటింజెంట్ సిబ్బంది మరో రాష్ట్రంలో కూడా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారన్నారు. రాష్ట్రంలో జరిగే పోలీసు అధికారుల సమావేశంలో కేంద్ర పోలీసు శాఖ అధికారులను పిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని, స్మార్ట్ పోలీస్ అమలుకు రోడ్‌మ్యాప్‌ను తయారు చేయాలని ప్రధాని ఆదేశించారన్నారు. పోలీసు శాఖ ప్రతిష్ఠను కాపాడే విధంగ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి పోలీసు స్టేషన్లో నిర్వహించాలని, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో పాసైన విద్యార్థులను వారి కుటుంబ సభ్యులతో పోలీసు స్టేషన్‌కు ఆహ్వానించి గౌరవించాలని డిజిపి కోరారు. సోషల్ మీడియాకు సంబంధించి రాష్ట్రంలో 400 పోలీసు స్టేషన్లకు పైగా ఫేస్ బుక్, ట్విట్జర్లను ఉపయోగిస్తున్నారన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు సుదీప్ లక్తాకియా, సత్యనారాయణ, గోపి కృష్ణ, పూర్ణ చంద్రరావు, రవిగుప్త, నవీన్ చంద్, సౌమ్య మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల విభజన ఆగస్టుకు పూర్తి

డివోపిటి కార్యదర్శి సంజయ్ కొఠారి
ముఖ్యమంత్రి కెసిఆర్‌తో డివోపిటి అధికారుల భేటీ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 6: ఉద్యోగుల విభజన ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తి అవుతుందని, ఇప్పటి వరకు 92 శాఖల్లో 84 శాతం ఉద్యోగుల విభజన పూర్తి అయిందని డివోపిటి కార్యదర్శి సంజయ్ కొఠారి ముఖ్యమంత్రికి తెలియజేశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి డివోపిటి కార్యదర్శి సంజయ్ కొఠారి, డివోపిటి సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ, డైరెక్టర్ మిస్ కిమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారుల అవసరం ఎంతో ఉందని, ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఉద్యోగుల విభజన పూర్తి అయితే ఖాళీలను భర్తీ చేయడానికి వీలు అవుతుందని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఉద్యోగుల విభజనలో జాప్యం జరగటం వల్ల పరిపాలనలో చిక్కులు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. డివోపిటి కార్యదర్శి సంజయ్ కొఠారి స్పందిస్తూ, విభజన తర్వాత ఉద్యోగుల విభజన అంశాన్ని ముఖ్యమైందిగా తీసుకున్నామన్నారు. తెలంగాణకు ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల కొరత ఉండటం వల్లనే 30 శాతం ఉద్యోగులను అదనంగా కేటాయించినట్టు సంజయ్ కొఠారి వివరించారు. నెలనెలా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అధికారులంతా తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన అన్నారు.