తెలంగాణ

హిట్లర్‌ను మరిపిస్తున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఆగస్టు 12: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హంతక ప్రభుత్వం కొనసాగుతోందని, అక్రమాలను ప్రశ్నించే వారిని అణచివేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన హిట్లర్‌ను సైతం తలదనే్నలా ఉందని టి-మాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్‌లో శనివారం జరిగిన టి-మాస్ ఫోరం ఆవిర్భావ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆశలను నీరుగార్చిందని, నీళ్లు, నియామకాలు, సామాజిక న్యాయం ధ్యేయంగా అన్ని కుల సంఘాలు, పార్టీలు ఏకమై సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఇప్పుడు దొరల పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు. సామాజిక న్యాయం జరిగి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేవరకు టి-మాస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళిత, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి మాట తప్పిన కెసిఆర్‌కు ముకుతాడు వేసి ప్రజాక్షేత్రంలోకి లాగుతామని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాలకు ఎక్కడ ఆన్యాయం జరిగినా టిమాస్ ఫోరం అండగా ఉంటుందన్నారు. గత 60 ఏళ్లుగా రాష్ట్రంలో జరగని అభివృద్ధిని మూడేళ్లలో చేశామని చెప్పుకుంటున్న కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని, ఇసుక మాఫియా, డ్రగ్స్ మాఫియా ఆగడాలకు వత్తాసు పలుకుతోందని తమ్మినేని దుయ్యబట్టారు. రోడ్లు, భవనాలు కట్టడమే అభివృద్ధి కాదని, ఐటి పరిశ్రమలు వచ్చినంత మాత్రాన అభివృద్ధి జరగదని, పేద వర్గాల అభ్యున్నతి జరగాలని ఆయన అన్నారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 10 వేల ప్రభుత్వ పాఠశాలలు మూయించారని, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువులను కొనలేక పేదలు విద్యకు దూరమవుతుండగా, కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూడు, గూడు, గుడ్డ ఇవ్వలేని ప్రభుత్వాలకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని, ఇది భూములిచ్చే ప్రభుత్వం కాదని భూములు లాక్కునే ప్రభుత్వమని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో పేద రైతుల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం వారికి న్యాయం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రాజెక్టుల కింద పంటలు పండించుకొని రైతులు ఎంతగా సంతోషంగా ఉంటారో అంతకంటే ఎక్కువగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు, పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని, నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి గొంతు నొక్కడానికి పోలీసు బలగాన్ని, పార్టీలోని గూండాలను రంగంలోకి దింపుతున్నారని, ఇది ఎంతో కాలం నిలవదని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ విశే్వశ్వర్‌రావు, టి-మాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు జె.బి రాజు, జాన్‌వెస్లీ, యం.డి జబ్బార్, పుట్ట ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

చిత్రం.. టి-మాస్ ఫోరం ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం