తెలంగాణ

మార్చిలోగా ప్రత్యేక ‘వ్యవసాయ బడ్జెట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 18: వచ్చే మార్చిలో ప్రత్యేకంగా ‘వ్యవసాయ బడ్జెట్’ ప్రవేశ పెడుతున్నామని, వ్యవసాయంపై ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది మొదటిదని, ఇది రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శుక్రవారం సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ పాలిటెక్నిక్’ కళాశాల భవనం, బాలికలు, బాలుర హాస్టల్ భవనాలు, వ్యవసాయ గోదాములకు రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుతో కలిసి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో గత ప్రభుత్వాలు వ్యవసాయంను పట్టించుకోలేదని, బీడు భూములకు కారణం వీరేనన్నారు. గోదావరి, కృష్ణా నదులతో కోటి ఎకరాలకు నీరందించే కార్యక్రమానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టాడని, ఇదే ఆలోచన గత పాలకులు చేస్తే ఈ భూములన్నీ సస్యశ్యామలమై రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావన్నారు. ఎండిన బోర్లు, వర్షాలు లేక పంటలు ఎండి రైతుల ఆత్మహత్యలు సాగాయని, భూమిలో నీరున్నా కరెంట్ లేక నీరివ్వలేని దుస్థితిగా పేర్కొన్నారు. తెలంగాణ వస్తే రెండు గంటల కరెంటు కూడా ఉండదని, అంధకారంలో ఉంటారని వెక్కిరించిన అప్పటి సిఎం కిరణ్‌కుమార్ మూతిపై కొట్టినట్టుగా నేడు 24 గంటల నిరంతర కరెంటు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాల సాగుభూములుంటే ఇందులో 50 లక్షల ఎకరాలు 24 లక్షల బోర్లపై ఆధారపడ్డాయని, 20 లక్షల ఎకరాలు ప్రాజెక్టులపై, మిగితా భూములు వర్షాధారంపై ఆధారపడ్డాయని, భూమిలో నీరు, కరెంటు ఉంటేనే మూడు పంటలు పండే అవకాశం ఉందని, దీనిని కెసిఆర్ తీరుస్తున్నాడని అన్నారు.
గోదావరి 450 కి.మీ, కృష్ణానది 200 కి.మీ. పొడవున తెలంగాణలో ప్రవహిస్తున్నాయని, సమైక్య పాలనలో కాంగ్రెస్, టిడిపిలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ నీటిని అందుకోలేక పోయామని, అందుకే 83,500 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని, ఇపుడున్న ఎస్సారెస్పీ, నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి నీటి చుక్క రాలేదని ఫలితంగా ప్రాజెక్టుల కింద ఉన్న 18 లక్షల ఎకరాలకు నీరందడం లేదన్నారు. నాసిక్ నుండి గోదావరిపై మహరాష్ట్ర ప్రభుత్వం 400 ప్రాజెక్టులు కట్టిందని, ఫలితంగా మనకు నీరందడం లేదని, ఒకనాడు ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు అయిన నిజాంసాగర్‌కు చుక్క నీరు రాలేదన్నారు. నిజాంసాగర్‌పై 40 ప్రాజెక్టులు కట్టారని, దీనితో ముందు చూపుతో సిఎం కెసిఆర్ కోటి ఎకరాలకు నీరందించాలన్న సంకల్పంతో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులను రూ.1500 కోట్లతో చేపట్టి రాత్రింబళ్ళు పని నడిపిస్తున్నారని, దీని వల్ల ప్రాజెక్టుల కింద నీరందని 18 లక్షల ఎకరాలను స్థిరీకరించి, మరో 18 లక్షల ఎకరాలకు నీరందించడానికి పనులు సాగుతున్నాయని, మేడిగడ్డ వద్ద 1600 టిఎంసిల నీరు అందుబాటులో ఉండగా, 36 లక్షల ఎకరాలకు కేవలం 500 టిఎంసిల నీరు సరిపోతుందన్నారు. ఎల్లంపలి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్, తూఫ్రాన్, నిజాంసాగర్‌ల మీదుగా కామారెడ్డి ప్రాంతం సస్యశ్యామలం చేస్తూ నిజాం సాగర్‌ను నింపి, ఇక్కడి నాన్ కమాండ్ ఏరియాకు సైతం నీరివ్వ బోతున్నామన్నారు. నాణ్యమైన కరెంటు, నీరు అందిస్తే ఆత్మహత్యలుండవన్నారు. వచ్చే జూన్ వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరందస్తామని పోచారం వెల్లడించారు.