తెలంగాణ

అహంకార టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాజకీయ పరంగా టిఆర్‌ఎస్ తప్పుడు విధానాలు, దుందుడుకుకు, అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాటం చేసి అత్యధిక స్థానాలను సంపాదించే ప్రయత్నం బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. రాబోయే 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన తయారీ ప్రక్రియను ఏడాదిన్నర ముందే బిజెపి కేంద్ర నాయకత్వం ప్రారంభించిందని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో 282 స్థానాలు సాధించి, మిత్రపక్షాలతో కలిసి స్థిరమైన, బలీయమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి ఏర్పాటు చేసిందని అన్నారు. 2019 ప్రారంభంలో పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయని, సహజంగా ఎన్నికలు వచ్చినపుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం పోటీ చేస్తున్నామని ప్రకటిస్తుంటాయని, ఆ ఎన్నికలకు సంబంధించి తాము కేవలం గెలవడం కోసం మాత్రమే పోటీ చేయడం లేదని బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని విపక్షాలు సైతం భావిస్తున్నాయని అన్నారు.
2019 ఎన్నికలు బిజెపి విజయం ఖాయమని పేర్కొన్నారు. గెలుపు బలాన్ని మూడింట రెండొంతులుకు పెంచేందుకు బిజెపి ఏడాదిన్నర ముందుగానే ప్రారంభించిందని చెప్పారు. గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉండి, గత ఎన్నికల్లో గెలవలేకపోయిన 120- 130 నియోజకవర్గాల్లో ముందస్తుగా వ్యూహాత్మక కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. వచ్చే ప్రభుత్వం మరింత బలీయమైనదిగా ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ గతంలో గెలిచామని, ఈసారి మిగిలిన 16 నియోజకవర్గాలలో బిజెపి గెలిచేందుకు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారని అన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమని, టిఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయంగా ప్రజల ముందు బిజెపి మాత్రమే ఉందని, బిజెపి సొంత బలంతో 17 సీట్లుతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీ స్థానాల్లో సొంత బలంతో పోటీ చేస్తామని వెల్లడించారు.
వర్తమాన రాజకీయ పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, నిజాం పాలనకు తీసిపోని విధంగా పాలన కొనసాగుతోందని, ప్రభుత్వవ్యవస్థను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ విపక్షాలకు ఇవ్వాల్సిన అవకాశాన్ని కూడా ఇవ్వకుండా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు దిక్కేలేదని, తెలంగాణ పోరాట సమయంలో కెసిఆర్ అనేక మాటలు చెప్పారని, వైభవంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకున్న టిఆర్‌ఎస్ గుట్టుచప్పుడు కాకుండా పార్టీ కార్యాలయంలో చేసుకుంటూ తంతుముగించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే ప్రయత్నాన్ని బిజెపి చేస్తే బిజెపి యాత్రను అడ్డుకునే విఫల యత్నం ప్రభుత్వం చేసిందని అన్నారు. వాగ్దానాలపై కెసిఆర్‌కు ఎలాంటి పట్టింపులేదని తేలిపోయిందని, కేవలం అధికారం కోసం మాత్రమే మాటలు చెబుతున్నారని ఇపుడు స్పష్టమైందని అన్నారు. ఆనాడు ఎస్సీ,ఎస్టీల కోసం ఎన్నో మాటలు చెప్పిన కెసిఆర్ అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులను సైతం భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ పోకడలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేస్తుందని అన్నారు. అధికార దురహంకారానికి వ్యతిరేకంగా బిజెపి పోరాడుతుందని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రజల అభిమానాన్ని తాము చూరగొంటామని చెప్పారు. మోదీ పాలనపై దేశప్రజలకు మంచి గురి ఏర్పడిందని, రాబోయే రోజుల్లో బిజెపి అత్యధిక స్థానాలు సంపాదించుకోవాలనే తయారీ ప్రారంభించామని అన్నారు. మూడు లోక్‌సభ నియోజకవర్గాల సమీక్ష సోమవారం జరిగిందని, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను సమీక్షిస్తారని , ఇద్దరు కేంద్ర మంత్రులు, తాను కలిసి బిజెపి బలాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.
రాష్ట్రప్రభుత్వంలో ఎవరైనా మంత్రులు తాను చేసిన మంచి పనులుగా చెప్పుకుంటున్నవాటిలో కేంద్రం ఇచ్చిన నిధులే ఉన్నాయని, తాము కూడా ఆ కార్యక్రమాలు మంచిగా జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. మంచి పనులను కేంద్ర మంత్రులు అభినందించడం అంటే టిఆర్‌ఎస్ తీరును సమర్ధించినట్టు కాదని, పార్టీ వేరు, ప్రభుత్వం వేరుగా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అక్రమాలు జరిగితే దానిపై దర్యాప్తు సహజంగానే జరుగుతుందని వ్యాఖ్యానించిన రాం మాధవ్, తాజాగా తెలంగాణ చీరల పంపిణీలో స్కాండల్ ఉందని అనిపిస్తోందని పేర్కొన్నారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. చిత్రంలో పార్టీ రాష్ట్ర నేత లక్ష్మణ్ తదితరులు ఉన్నారు