తెలంగాణ

టీఆర్‌ఎస్-కాంగ్రెస్ దొంగాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 17: పారదర్శకమైన పాలనకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే, నిలదీసే బాధ్యత ప్రతిపక్షంపై ఉంటుందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు జతకట్టి దొంగాట ఆడుతున్నాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్‌మద్దూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఇద్దరు రైతు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నాయకులు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యుత్ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 233 మంది రైతులు వివిధ రకాలుగా మృతి చెందారని వెల్లడించారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు కనీసం పైసా పరిహారం కూడా ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు ట్రాన్స్‌కో కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా ఫలితం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రంలో తొలినాళ్లలో మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు మాత్రం అప్పుల భారం మోయలేకపోతుందని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా అప్పులు చేస్తూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల పునరాభివృద్ధి పేరిట సిఎం కెసిఆర్ తన అనుచరులకు టెండర్లు అప్పగిస్తున్నారన్నారు. కష్టపడి పండించిన పంటలకు సరియైన గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఖమ్మం మిర్చి రైతులు మద్దతు ధరను కోరితే కేసులు బనాయించి చేతులకు బేడీలు వేయించిన ఘనతను టీఆర్‌ఎస్ ప్రభుత్వం దక్కించుకుందని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల వరి పంట దోమకాటుకు గురై రైతులు పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయారని విచారం వ్యక్తం చేసారు. వ్యవసాయంలో శాస్ర్తియ విధానం పూర్తిగా లోపించిందని ఆందోళన చెందారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఏ మాత్రం చర్చలు లేవని, నామమాత్రంగా కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెరుగన్నం తిని కడుపునిండా నిద్రపోతారని సీఎం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, రైతులకు కంటి కునుకు కరవైందన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అండగా ఉంటుందని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించినట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పి అధికారం దక్కించుకున్న అనంతరం ఆ నిధులను వెచ్చించి ప్రగతి భవన్ నిర్మించారని ఆరోపించారు. దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సచివాలయం నుంచి పాలన సాగిస్తే తెలంగాణ సీఎం మాత్రం ప్రగతి భవన్ నుంచి నియంతలా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజల సొత్తుతో నిర్మించిన ప్రగతి భవన్ ప్రజల సొత్తుగానే టీడీపీ పేర్కొంటూ అప్పగిస్తుందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, రైతులను చైతన్య పర్చి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఈ నెల 20వ తేదీన నల్గొండలో రైతు దీక్షలు చేపడుతున్నట్లు రమణ వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, పటాన్‌చెరు జడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సంగారెడ్డిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ