తెలంగాణ

కేసీఆర్ వ్యూహం, రాజకీయ చతురత.. చిత్తవుతున్న విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణ తీరు, వివిధ అంశాలపై సభ్యులు చర్చించిన విధానం చూస్తుంటే సభ లోపల, వెలుపల కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావువ్యూహం, రాజకీయ చతురత ముందు ప్రతిపక్ష పార్టీలు చిత్తయినట్లు కనపడుతున్నాయి. రాష్ట్రంలో, టిఆర్‌ఎస్ పార్టీలో కెసిఆర్‌కు సమీప భవిష్యత్తులో ఎదిరించే నాయకుడు లేరని మరోసారి సుస్పష్టమైంది. అసెంబ్లీ వెలుపల, లోపల విపక్ష పార్టీలు చేసే విమర్శలను ఒంటిచేత్తో ధాటిగా తిప్పిగొడుతూ మొగ్గదశలోనే చీల్చి చెండాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త తరానికి గుర్తుండే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలపైన, ప్రతిపక్ష పార్టీలపైన వాగ్దాటితో కుమ్మేస్తున్నారు.
విద్యుత్, బిసి, ఎస్సీల సంక్షేమం, నిధుల విడుదల, నిరుద్యోగం, రైతుల సమన్వయ సమితులు, భూసర్వే, పరిపాలన సంస్కరణలు, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై కెసిఆర్ ఏకధాటిగా, చెలరేగి మాట్లాడారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా 40 నెలలుగా ఉన్నా, ఇంకా ఉద్యమస్వభావం, ఉపును పోగొట్టుకోలేదు. కెసిఆర్ మాట్లాడుతుంటే, అసెంబ్లీలో అన్ని పార్టీల సభ్యులు శ్రద్ధగా వినడం కనిపించింది. విద్యుత్ అంశమే తీసుకుంటే ఉమ్మడి ఆంధ్ర శాసనసభకు అధికారంలో ఏ పార్టీ ఉన్న, విపక్ష పార్టీలు ఎండిన వివిధ పంటల కంకులను తీసుకువచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మొత్తం సీను మారింది. విద్యుత్ రంగం వెలుగులను విరజిమ్ముతోంది. త్వరలో మిగులు విద్యుత్‌ను సాధించనుంది. విద్యుత్‌పై కెసిఆర్ గణాంకలతో విపక్షాలపై విరుచుకుపడ్డారు. రైతుల సమితులు, భూసర్వే చేపట్టడంపై కూడా కెసిఆర్ చక్కగా వివరించారు. ఎస్సీ, బిసి సంక్షేమానికి నిధుల వ్యయంపై మరో రెండు రోజుల పాటు పూర్తిగా అసెంబ్లీని నిర్వహించి చర్చిస్తామని ప్రకటించారు.
ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలను తిప్పిగొట్టడమే కాకుండా, ఆ విషయమై ఇంకా బాగా మాట్లాడి ఉంటేబాగుండేదని, సరిగా అధ్యయనం చేయకుండా విపక్ష పార్టీలు సభకు వచ్చాయని విరుచుకుపడ్డారు. 21 కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ప్రస్తావిస్తూ, దేశంలో పశ్చిమబెంగాల్, నవ్యాంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ జిల్లాల సంఖ్యను పెంచాయన్నారు. దీని వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయని చెప్పారు. జిల్లాల సంఖ్యను పెంచకపోవడం వల్ల వచ్చే నష్టాన్ని కళ్లకుకట్టినట్లు వివరించారు. కెసిఆర్ ఏ అంశం మాట్లాడిన, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాన్ని వివరిస్తూ ముగించడం హైలెట్‌గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటును కేంద్రం నోటిఫై చేయాలన్న విపక్షాల విమర్శలను తిప్పిగొట్టి సందేహాలను నివృత్తి చేశారు.
ప్రతిపక్ష పార్టీల్లో అనైక్యత అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దీనికి కారణం సైద్ధాంతికంగా వ్యతిరేకించుకునే పార్టీలు అసెంబ్లీలో ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపికి సైద్ధాంతికంగా పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు. ఈ రెండు పార్టీలు టిఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలో పడేందుకు చేతులు కలిపే ప్రసక్తిలేదు. అలాగే ఏడుగురు ఎమ్మెల్యేల బలం ఉన్న మజ్లిస్ పార్టీతో బిజెపి కలిసే ప్రసక్తిలేదు. అదే మజ్లిస్ గతంలో కాంగ్రెస్‌తో అంటకాగినా, ఇప్పుడు ఆ పార్టీ అంటే ఒంటికాలిమీద లేస్తోంది.
టిడిపి బలం అసెంబ్లీలో దాదాపు క్షీణించింది. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పరిమితులకు లోబడి తన వంతు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. సిపిఐకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. వివిధ అంశాలపై మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ చక్కగా బదులిస్తున్నారు. అధికార పార్టీని సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని కల్పించే విధంగా వ్యవహరించడంలో ప్రతిపక్ష పార్టీలు దాదాపు విఫలమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలపై క్షేత్ర స్థాయిలో చురుకుగా అధ్యయనం చేసి గణాంకాలతో సభకు వస్తే బాగుంటుందని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది.