తెలంగాణ

మరిచిపోయారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 23: గ్రామాలను ప్రముఖులు ‘దత్తత’ తీసుకుంటే సమస్యలు మటుమాయం అవుతాయని జనం నమ్మారు. కాదు... కాదు ‘దత్తత’ వేళ ఆయా నాయకులు అలా ‘నమ్మబలికారు’. నాయకుల మాటలను మామూలుగానే నమ్మిన జనం ‘నిజమే కాబోల’ని కలలుగన్నారు. వాస్తవానికి వచ్చేసరికి అది ఒట్టి ‘పొల్లే’నని తేలిపోయింది. ఇంకా విచిత్రమేంటంటే దత్తత గ్రామాల్లో శ్రద్ధ వహించి పనులు చేపట్టాల్సి ఉండగా కనీసం ఆ పల్లెల వైపు ‘అడుగు వేసిన’ పాపాన కూడా పోలేదు. ఒకరిద్దరు ‘ఉత్సాహం’ ప్రదర్శించి కొద్దిపాటి పనులు చేపట్టినా అవి గతంలో చేసిన ‘బాసల’ ముందు సముద్రంలో ఇసుక రేణువంతే.
ఖమ్మం జిల్లాలో రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, జిల్లా ఉన్నతాధికారులు తమకు తోచిన గ్రామాలను ఎంపిక చేసుకుని ‘దత్తత తీసుకుంటున్నాం’... ‘దశ తిరిగిపోతుందని’ చెప్పేసి ఆ తరువాత ఆ విషయమే మర్చిపోవడం ‘మామూలు’గానే జరిగిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, వైసిపికి చెందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసలు ‘దత్తత’ జోలికే పోలేదు. నాయకులు తీసుకున్న దత్తత గ్రామాల్లో అనేక సమస్యలు టన్నుల కొద్దీ పేరుకుపోతున్నా వీరి ‘దృష్టి’ పడకపోవడం గమనార్హం. ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలం ‘మొత్తాన్ని దత్తత తీసేసుకుంటున్నానని’ ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ఓ ప్రకటన పడేసి దాంతో ‘తన పని అయిపోయిందని’ మిన్నకుండిపోయారు. ఒకటి రెండు గ్రామాల్లో మాత్రం ‘మమ’ పేరుతో ‘కంటి తుడుపు’ పనులు చేపట్టారు.
రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ప్రజా సమస్యలను మాత్రం అధిక శాతం పరిష్కరించారు. ఇక పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అభివృద్ధి చెందిన సత్తుపల్లి మండలం గంగారం గ్రామాన్ని దత్తత తీసుకుని రెండు సిసి రోడ్లు నిర్మించి ‘తాను చేయగలిగింది ఇంతే’ అని మిన్నకున్నారు. తాన్లా సొల్యూషన్స్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఈ గ్రామాన్ని గతంలోనే దత్తత తీసుకుని అభివృద్ధి బాటలు వేశారు. నాయకుల సంగతి అలాగుంటే జిల్లాకు పెద్దదిక్కయిన కలెక్టర్ తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుని ‘ఓసారి’ సందర్శించారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఆ ‘సమస్య పరిష్కారం’ తన పరిధిలోనే ఉన్నా అటువైపు దృష్టి సారించకపోవడంతో ‘సమస్య సమస్యగానే’ ఉండిపోయింది.
అంచనాలకే పరిమితమైన ‘ఇల్లెందు’
ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యుడు కోరం కనకయ్య ఇల్లెందు మండలంలోని రాగ్యాతండా, బయ్యారం మండలంలో ఇసుకమేతి గ్రామాలను దత్తత తీసుకుని, ఇసుకమేతిలో ఓ రెండు రోడ్లు వేయించారు. రాగ్యాండాలో ‘అంచనా’లకు పరిమితం చేశారు.
బంగారుచెలకలో సోలార్ బోర్లు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో 19 సోలార్ బోర్లు వేయించేందుకు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మూడు బోర్లు వేసి కొంతమేర దప్పిక బాధ తప్పించారు. అయితే తాను దత్తత తీసుకున్న దంతెలబోరు గ్రామాన్ని ఓసారి సందర్శించి ‘చాల్లే’ అని ఊరకుండిపోయారు.
నిధులున్నా పనులు సున్నా
కొత్తగూడెం మండలంలోని నర్సింహసాగర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత గ్రామంలో ‘రెండు రోడ్ల అభివృద్ధి’కే పరిమితం చేశారు. నిధులు నిండుగా ఉన్నా ఇక్కడ అనేక సమస్యలు ‘సహవాసం’ చేస్తున్నా అటు వైపు ‘దృష్టి’ సారించే తీరికలేకుండా పోయింది. కొత్తగూడెం పట్టణానికి చెంతనే ఈ గ్రామాలు ఉన్నా ఆమె రెండే రెండుసార్లు ‘సందర్శించారు’.
ప్రకటనలకే పరిమితం..
వైరా నియోజకవర్గంలో దత్తత గ్రామాలైన వల్లాపురం, తనికెళ్ళ గ్రామాలను స్థానిక శాసనసభ్యుడు మదన్‌లాల్ ‘దత్తత’ చేసుకుని పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘మా గోడు వినండి మహాప్రభో...’ అని ఆయా గ్రామాల ప్రజలు గొంతెత్తి ఘోషిస్తున్నా అవి మదన్‌లాల్ చెవికెక్కడంలేదు.

ఒక్క పనికీ నోచుకోని భద్రాచలం
భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య వాజేడు మండలంలోని గుమ్మడిదొడ్డి, వెంకటాపురం మండలంలో ఎదిర, చర్ల మండలంలో ఆర్.కొత్తగూడెం, దుమ్ముగూడెం మండలంలోని ప్రగళ్ళపల్లి గ్రామాలను దత్తత తీసుకున్నారు. దత్తత అయితే తీసుకున్నారు గానీ, ఏ ఒక్కపనీ చేపట్టలేకపోయారు. ‘ఇదేంటంటే...’ దత్తత గ్రామాలకు నిధులు మంజూరు చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఆ ‘ఊసే మరిచిపోయింద’ని... నిధులు లేనప్పుడు ‘నేను మాత్రం చేసేదేముందని’ అంటున్నారు.

మంత్రి నియోజకవర్గంలోనూ...
రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా సమస్యలు పేరుకుపోయాయి. ఇక్కడి శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట మండలంలోని నందిపాడు, దమ్మపేటలోని లింగాలపల్లి, చండ్రుగొండలో తిప్పనపల్లి, ములకలపల్లిలో మొగరాయిగుప్ప గ్రామాలను దత్తత తీసుకుని తరువాత ఆ విషయమే ‘మర్చిపోయారు’. కనీసం ఆ గ్రామాలను కనె్నత్తి చూసిన పాపాన కూడా పోలేదు. పేరుకు అధికార పార్టీలో కొనసాగుతున్నా సర్కారు కరుణ లేనిదే తాము మాత్రం చేయగలిగింది ఏమీ లేదని అని ‘సరిపెట్టుకుంటున్నారు’.