తెలంగాణ

కరవు విలయ తాండవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24:రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో మండుతున్న ఎండలు, మంచినీటి కొరత, కరవు విలయ తాండవంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లతో ఈనెల 29న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమీక్ష జరుపుతారు. గోదావరి జలాలను సకాలంలో తీసుకు రావడంతో హైదరాబాద్‌లో నీటి కొరతను కొంత వరకు తీర్చినా, గ్రామాల్లో మాత్రం మంచినీటి సమస్య చాలా ఉంది. నగర నీటి అవసరాలను తీర్చే గండిపేట, ఉస్మాన్ సాగర్ పూర్తిగా ఎండిపోయింది. ఇలాంటి పరిస్థితిలో గోదావరి జలాలు హైదరాబాద్‌ను ఆదుకున్నాయి. తెలంగాణలో పావు బాగం తీవ్రమైన కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం నుంచి ఆశించిన సహాయం అందలేదు. దేశ వ్యాప్తంగా కరవు సహాయ చర్యలపై సుప్రీంకోర్టు సైతం కేంద్రాన్ని ప్రశ్నించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. రోజుకు దాదాపు 40 మంది వరకు ఎండ దెబ్బకు మరణిస్తున్నారు. పశుగ్రాసం లభించక పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఎక్కువ సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని కరవు పరిస్థితిపై సమీక్షించారు. అయితే కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కరవు సహాయ ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించడానికి తీసుకుంటున్న చర్యలు, కరవుసహాయ కార్యక్రమాలు, మంచినీటి సమస్య తీర్చడానికి తీసుకుంటున్న చర్యలపై జిల్లా కల్టెర్లతో ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతారు. కేంద్రం నుంచి సహాయం అందే విషయం ఎలా ఉన్నా కరవు సహాయ పనులకు నిధుల కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మంచినీటి సరఫరాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది.
ఉపాధి హామీ కూలీలపై వడగాలుల ప్రభావం పడకుండా మధ్యాహ్నాం పనె్నండు గంటల నుంచి మూడు గంటల వరకు పని చేయవద్దనే నిబంధన విధించారు. ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.
అడుగంటిన జలాశయాలు
తెలంగాణలోని జలాశయాలన్నీ అడుగంటిపోయాయి.
ఉస్మాన్ సాగర్ జలాశయంలో 3.900 టిఎంసిల నీటిని నిల్వ చేసే సామర్ధ్యం ఉంటే ప్రస్తుతం ఒక్క చుక్క నీరు కూడా లేదు.
ఎండిపోయిన ఉస్మాన్ సాగర్‌ను జనం చూసేందుకు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు.
హిమాయత్ సాగర్, సింగూర్, మంజీరా, నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌లతో మంచినీటిని వాడుకునే అవకాశమే లేకుండా పోయింది.
ఏప్రిల్, మే నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోవడంతో పలు గ్రామాల్లో మంచినీటిని ఎలా అందించాలో దిక్కు తెలియని పరిస్థితి.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీసివేసినా భారీ వర్షాలు కురిస్తే ఈ చెరువులు భవిష్యత్తు అవసరాలకు ఉపయోపడతాయి.

ఏపి సెక్రటేరియట్ ప్రారంభం నేడే
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 24: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలగపూడి సమీపంలో 42.90 ఎకరాలలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం సోమవారం ప్రారంభమవుతోంది. జూన్ నాటికి హైదరాబాద్‌నుంచి సచివాలయ ఉద్యోగులందరినీ తరలించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. తొలుత అంచనా వ్యయం రూ.180 కోట్లు కాగా క్రమేణా పెరుగుతూ నిన్న మొన్నటికి రూ.500 కోట్లకు చేరుకుంది. ఇందులో 50 శాతం అంటే రూ.250 కోట్లను ప్రభుత్వం భరిస్తూ మిగిలిన సొమ్మును 10 శాతం వడ్డీపై హడ్కో నుంచి రుణంగా తీసుకుంది. తాజాగా మరో రెండు అంతస్తులను నిర్మించాలని ప్రభుత్వం భావించడంతో అంచనా వ్యయం 900 కోట్లకు చేరింది. ఏది ఏమైనా తొలుత భావించినట్లుగా జి ప్లస్ 1 భవనాల నిర్మాణం సరిగ్గా 100 రోజుల్లో పూర్తికావటం రికార్డే. మే, జూన్ మాసాల్లో సరైన ముహూర్తాలు లేవు. మరోవైపు జూన్ మాసాంతానికి హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగులందరిని తరలించాలని భావించడంతో హడావుడిగా మొదటి అంతస్తులోని రెండు గదులను ఈ నెల 25న తెల్లవారుజామున 4.01 నిమిషాలకు శాస్త్రోక్తంగా ప్రారంభించాలని నిర్ణయించడంతో ఆగమేఘాలపై పనులు జరుగుతున్నాయి.
అసలు తాత్కాలిక సచివాలయ నిర్మాణం కోసం సిఆర్‌డిఎ రూ.180 కోట్ల అంచనా వ్యయంతో 15న టెండర్లు పిలువగా షాపూర్జీ అండ్ పల్లాంజీ, ఎల్ అండ్ టి కంపెనీలు రూ.203 కోట్లకు టెండర్లు దాఖలు చేశాయి. ఒక బ్లాక్‌ను షాపూర్జీ కంపెనీకి, 4 భవనాలతో కూడిన రెండు బ్లాక్‌ల పనులను ఎల్ అండ్ టికి అప్పగించారు. ఇందులో షాపూర్జీ కంపెనీ చేపట్టిన బ్లాక్ ప్రధానమైంది. అందులోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటవుతోంది. ఇతర భవనాల్లో సచివాలయం, శాసనసభ, శాసనమండలి ఏర్పాటవుతాయి.
తొలుత తాత్కాలిక సచివాలయాన్ని మంత్రులు, వారి కార్యదర్శులు, సచివాలయం కార్యదర్శులకే పరిమితం చేయాలనుకున్న సిఎం ఆ తర్వాత విజయవాడ, గుంటూరు నగరాల్లో ఏర్పాటు చేయదలచిన హెచ్‌వోడి కార్యాలయాలను కూడా ఒకే గూటికి చేర్చేందుకు మరో రెండు అంతస్తుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఆగస్టు నాటికి మొత్తం పది వేలమందిని ఈ తాత్కాలిక సచివాలయానికి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా గత ఫిబ్రవరి 17న ఈ తాత్కాలిక సచివాలయం భవనాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా ఆ రెండు కంపెనీలు తమకున్న అనుభవాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సరిగ్గా వంద రోజుల్లో మొదటి అంతస్తుకు శ్లాబ్ కూడా పూర్తి చేయగలిగాయి. ఇందుకోసం 1500 మంది కూలీలు రాత్రింబవళ్లు శ్రమించారు. ఈనెల 18న కేవలం 11 గంటల వ్యవధిలో 10వేల చదరపు అడుగుల నిర్మాణానికి శ్లాబ్ వేసి రికార్డు సృష్టించారు. ప్రతి బ్లాక్ లోను 8 లిఫ్ట్‌లు చొప్పున 24 లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్‌డిఎ కన్సల్టెన్సీక్రీజా సంస్థ ఇంటీరియర్ డిజైన్‌కు డ్రాయింగ్‌లను సిద్ధం చేసింది.

తీవ్ర సంక్షోభంలోకి పత్తి పంట
* ప్రత్యామ్నాయాలపై రైతులు దృష్టిపెట్టాలి
* కలెక్టర్ల సమావేశంలో కార్యాచరణ
* కెసిఆర్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24:రానున్న రోజుల్లో పత్తి పంట తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని , రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సూచించారు. ఈ అంశంపై అనుసరించాల్సిన వ్యూహం, రైతులకు చేయాల్సిన సూచనలు, ప్రభుత్వ కార్యాచరణ తదితర అంశాలపై ఈనెల 29న కలెక్టర్ల సదస్సులో కూలంకషంగా చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు పడిపోతున్నాయని, దేశీయ మార్కెట్లలో కూడా ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆయన చెప్పారు. వీటితో సంబంధం లేకుండా రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేస్తున్నారని, అధిక పెట్టుబడి పెట్టి సరైన ధర రాక నష్టపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పత్తి ఎగుమతి సుంకాన్ని కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నదని, పత్తి ఎగుమతులపై విధించే పన్నులో రాయితీలను రద్దు చేసే విషయంలో నైరోబిలో జరిగిన డబ్ల్యుటిఓ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం చేశారని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో పత్తి మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని, ఈ ప్రభావం తెలంగాణ రైతులపై పడకుండా చూసేందుకు అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 29న కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొని విస్తృత చర్చ జరిగేట్టు చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
దేశీయ టెర్మినల్‌కు
ఎన్టీఆర్ పేరు పెట్టండి
* సిఎం కెసిఆర్‌కు లేఖ రాసిన
టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేసిన స్వర్గీయ ఎన్‌టి రామారావుకు సముచిత స్థానం కల్పించే విధంగా రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఆయన పేరు పెట్టాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రేవంత్ ఆదివారం సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. గతంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్రం తీర్మానించిన సంగతిని ఆయన గుర్తు చేస్తూ తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. నందమూరి బాలకృష్ణ 150వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టేందుకు హాజరైన మీరు ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలన్నీ వాస్తవాలని రేవంత్ సిఎంను ఉద్దేశించి తెలిపారు.
తెలుగువాళ్లను మదరాసీలు అని పిలిచే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంటూ ఒకటి ఉందని చెప్పి తెలుగువారి గౌరవం పెంచిన ఎన్టీఆర్‌కు సరైన గౌరవం ఇవ్వడం అంటే దేశీయ టెర్మినల్‌కు ఆయన పేరు పెట్టడమే సముచితంగా ఉంటుందని తెలిపారు. పేదలను పీడించుకు తినే పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, రెండు రూపాయల కిలోబియ్యం పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, బడుగు బలహీన వర్గాలకు పక్కా గృహాలు నిర్మించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని అన్నారు. సిఎం కెసిఆర్ ఎన్టీఆర్‌ను కొనియాడిన వైనం ఆచరణలో పెడుతూ దేశీయ టెర్మినల్‌కు ఆయన పేరు పెట్టాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.