తెలంగాణ

2019లో కాంగ్రెస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూరు, నవంబర్ 20: కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మాజీ ఎంపీ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్‌యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. రుణమాఫీని ఏకకాలంలో చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడంతో రైతులకు వడ్డీ భారం పడిందన్నారు. వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రే అసెంబ్లీలో ప్రకటించినా నేటికీ అమలుచేయడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ మాఫీ కాని రైతులు తమ ఖాతా నెంబర్లతో సహా తమకు అందిస్తే ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. గత మూడు సంవత్సరాల టీఆర్‌యస్ హయాంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు మద్దతు ధర లేక అప్పులు చెల్లించలేని స్థితిలో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ప్రతీ పంటకు 4వేలు అందిస్తామని చెబుతూ వచ్చే ఎన్నికల్లో రైతుల ఓట్లు పొందేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని, రైతులపై నిజంగా ప్రేముంటే మూడేళ్లలో ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4 కోట్ల మంది ఇబ్బందులు పడుతుంటే నలుగురు కుటుంబ సభ్యులు మాత్రం ఆనందంగా ఉన్నారన్నారు. 2015-16 సంవత్సరంలో 20 వేల కోట్ల కాంట్రాక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించిన కేసీఆర్ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం 1600 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. మండలంలోని గట్టుప్పల్‌ను తొలుత మండల కేంద్రంగా ప్రకటించి ఏ ప్రయోజనం కోసం వెనక్కు తగ్గారో ప్రకటించాలన్నారు. టీఆర్‌యస్ ప్రభుత్వం నేరెళ్లలో దళితులపై దాడులు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేయించిందన్నారు. పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి మరువలేనిదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారన్నారు. 1967 నుండే తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన వ్యక్తి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అని కొనియాడారు. తొలుత మండల కేంద్రంలో పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఏఐసిసి కార్యదర్శులు మధుయాష్కీగౌడ్, పాల్వాయి స్రవంతిరెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ టీజె.శ్రీనివాస్, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పున్నా కైలాష్, బూడిద బిక్షమయ్యగౌడ్, మల్లు రవి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం..మాజీ ఎంపీ పాల్వాయ గోవర్ధన్‌రెడ్డి సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి