తెలంగాణ

సెజ్‌లు నిరుపయోగమైతే వెనక్కే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూములు నిరుపయోగంగా ఉంటే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదని రాష్ట్రప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సెజ్‌లకు భూముల కేటాయింపుపై దేశ వ్యాప్తంగా వస్తున్న అనేక విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు కేటాయించే భూముల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 70కు పైగా సెజ్‌లు ఉన్నాయి. ఇందులో ఐటి, ఐటిఇఎస్ రంగాలకు చెందిన సెజ్‌లు హైదరాబాద్ శివార్లలో ఉన్నాయి. 2004-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సెజ్‌లకు అప్పటి ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో భూములను కేటాయించాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం సెజ్‌లకు కేటాయించిన భూములను ఉపయోగించని పక్షంలో వెనక్కు తీసుకునేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేయడం విశేషం. నిబంధనల్లో ఈ అంశాన్ని చేర్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేటాయించిన భూములు వివాదస్పదం కావడంతో పాటు కొన్ని భూములు వివిద ఏజన్సీల దర్యాప్తుకు వెళ్లాయి. కాని తెలంగాణ ఏర్పాటు తర్వాత మాత్రం ప్రభుత్వం భూముల కేటాయింపులో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు ఏరోస్పేస్ సెజ్ నిమిత్తం 35 ఎకరాలను ఆదిబొట్లలో ఇక్కడ కేటాయించారు. ఇక్కడ హెలికాప్టర్ కేబిన్స్ విడిభాగాలు తయారవుతాయి. 2014లో అరబిందో ఫార్మాకు 5.50 ఎకరాలు, మరో సంస్ధకు 2015 జనవరిలో ఐదు ఎకరాలు, ఫార్మా యూనిట్‌కు 5.10 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ సెజ్‌ల్లో చాలా మటుకు ఉత్పత్తి ప్రారంభం కావడం, మరి కొన్నింటిలో పనులు పురోగతిలో ఉన్నాయని పరిశ్రమల శాఖలో ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు సక్రమంగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఉపయోగించని పక్షంలో వెనక్కు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో పలుసార్లు ప్రకటించింది. ఇదే విషయమై కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేవారు. నిర్దేశించిన కాలపరిమితిలోపల భూములను ఉపయోగించుకోని పక్షంలో ఆ భూములను ల్యాండ్ బ్యాంకుకు కలపాలని, భవిష్యత్తు అవసరాలకు వినియోగించాలని పరిశ్రమల శాఖ షరతు విధించింది.
కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యపాలనలో ఎడాపెడా కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంది. నల్లగొండ జిల్లలో ఒక ఇన్‌ఫ్రా కంపెనీకి కేటాయించిన 247 ఎకరాలు, ఆమనగల్ వద్ద ఒక టెక్స్‌టైల్ కంపెనీకి ఇచ్చిన 101 ఎకరాలు, దేసర్లపల్లి గ్రామం వద్ద ఒక బయోటెక్ కంపెనీకి కేటాయించిన 50 ఎకరాలు, మామిడిపల్లి గ్రామం వద్ద ఒక ఫుట్‌వేర్ కంపెనీకి ఇచ్చిన వంద ఎకరాలు, కుకుట్‌పల్లి వద్ద ఐటి కంపెనీకి ఇచ్చిన 25 ఎకరాలు, శంషాబాద్ వద్ద మరో ఐటి కంపెనీకి ఇచ్చిన 25 ఎకరాలు, కొహెడ వద్ద ఒక ఐటి కంపెనీకి ఇచ్చిన 99 ఎకరాలను, నల్లగొండ జిల్లా భువనగిరి వద్ద ఒక ఇంజనీరింగ్ సంస్ధకు ఇచ్చిన 250 ఎకరాలు, బాచుపల్లి వద్ద ఒక ఐటి కంపెనీకి ఇచ్చిన 50 ఎకరాలు, ఉత్తర తెలంగాణలో ఒక ఐటి కంపెనీకి ఇచ్చిన 25 ఎకరాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
కాగా సెజ్‌ల పేరిట తమ వద్ద నుంచి తీసుకున్న భూములను నిరుపయోగంగా కొన్ని రాష్ట్రాలు ఉంచుతున్నాయని, వీటిని తమకు ఇచ్చేయాలంటూ సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్‌అసోసియేషన్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఈ ఏడాది పిల్ దాఖలు చేసింది. ఈ పిల్ త్వరలో విచారణకు రానుంది. కేంద్రం ఈ పిల్‌పై స్పందించాలని కోరుతూ అనేక రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్రంలో చాలా వరకు సెజ్‌లు ఆపరేషన్‌లో ఉన్నాయని, ఈ విషయమై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నివేదికను ప్రభుత్వం రూపొందిస్తోంది. కొన్ని చోట్ల సెజ్‌లు పని చేయకపోయినా, వాటికి కేటాయించిన భూములు ప్రభుత్వానికి చెందినవని, వీటిపై వివరాలను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. దేశంలో ఇంతవరకు 4842.38 హెక్టార్ల భూమిని సెజ్‌ల కోసం వివిధ రాష్ట్రప్రభుత్వాలు సేకరించాయి. ఇందులో 362 హెక్టార్ల భూమిని మాత్రమే పరిశ్రమల ఏర్పాటునిమిత్తం ఉపయోగించారు. మిగిలిన భూమి నిరుపయోగంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 వరకు సెజ్‌లు ఉండగా, ఇందులో రికార్డు స్థాయిలో 40 వరకు సెజ్‌లు పనిచేస్తున్నాయి. మిగిలిన సెజ్‌ల్లో పరిశ్రమల ఏర్పాటు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్నింటిలో మాత్రమే పనులు మొదలు కాలేదు. కొన్ని సెజ్‌లకు చెందిన భూములను పరిశ్రమల శాఖ వెనక్కు తీసుకుంది. సెజ్‌ల్లో ఉన్ననిరుపయోగంగా ఉన్న భూమి ప్రభుత్వానికి చెందిన కేటగిరీలో ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. పనిచేయని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి భూములను వెనక్కు తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

చిత్రం..గతంలో తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి