తెలంగాణ

రాజకీయ లబ్ధికే గిరిజనుల మధ్య చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుట్రలను తిప్పికొట్టండి
ఎంపీ సీతారాం నాయక్ పిలుపు
శంఖారావానికి పోటెత్తిన లంబాడీలు
2వేల మంది పోలీసులతో బందోబస్తు

హైదరాబాద్/ఎల్‌బినగర్, డిసెంబర్ 13: లంబాడీలపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పార్లమెంటు సభ్యుడు సీతారాం నాయక్ పిలుపునిచ్చారు. ఎస్‌టి జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు ఇటీవల నిర్వహించిన బహిరంగ సభను వ్యతిరేకిస్తూ నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ‘లంబాడీల శంఖారావం’ మహాగర్జన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ ఆదివాసీలు, లంబాడీలకు న్యాయం చేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎస్‌టి జాబితాలో చేర్చారని, ఇపుడు ఆ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనడం సరికాదన్నారు. కొంతమంది నేతలు రాజకీయ లబ్ది కోసం ఆదివాసీలను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో 5లక్షల మంది ఆదివాసీలు, 25లక్షల మంది లంబాడీలు ఉన్నారని, అయి తే- విద్య,ఉద్యోగాలు, రాజకీయాలలో ఆదివాసీలే రాణిస్తున్నారని అన్నారు. లంబాడీలను ఎస్‌టి జాబితా నుండి తొలగిస్తే పెద్దఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. గిరిజనులైన లంబాడీలు, ఆదివాసీలు ఎప్పటికీ అన్నదమ్ముల్లా ఉంటూ హక్కులకై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ, లంబాడీలకు రిజర్వేషన్లను తొలగిస్తే అన్ని స్థాయిల్లో ఆందోళనలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ రాము లు నాయక్, ఎమ్మెల్యేలు బానోతు మదన్‌లాల్, రమావత్ రవీంద్ర నాయక్, రెడ్యా నాయక్, రేఖాశ్యాం నాయక్, బాబురావ్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ, 50 నుండి 60 సీట్లను సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉన్న గిరిజనులను తక్కువగా అంచనా వేయరాదన్నారు. లంబాడీల ఐక్యతను అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. సుమారు 2వేల మం ది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించగా లంబాడీల శంఖారావం సదస్సు ప్రశాంతంగా జరిగింది. లంబాడీల గురువు రామారావు మహరాజ్, సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు బుక్యా సంజీవనాయక్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రాంచంద్రుడు నాయక్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆర్‌టిఎస్ నాయ క్, మాజీ మంత్రులు రవీందర్ నాయక్, పి.జగన్‌నాయక్, ఐఆర్‌ఎస్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్, డి.హన్మంత్, బంజారా సంఘం, గిరిజన సంఘం, సేవాలాల్ సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
పలు తీర్మానాల ఆమోదం
లంబాడీలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ బద్దంగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలి. గిరిజన తం డాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి. ఆదివాసీ గోండులు, కోయలు, లంబాడీలకు మధ్య గొడవలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. గుడుంబానే ప్రధాన వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధితో పాటు విద్య, వైద్యం, గృహవసతి వంటి వౌలిక సదుపాయాలను కల్పించాలి.
వేదికపై పోట్లాట..
వివిధ పార్టీలకు, సంఘాలకు చెందిన లంబాడీల మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని కొందరు డిమాండ్‌లు చేస్తూ పలుమార్లు వాగ్వాదానికి దిగటంతో పోలీసులు ఘర్షణ జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
స్తంభించిన ట్రాఫిక్
సభకు వివిధ జిల్లాల నుంచి లంబాడీ యువతీ యువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు భారీగా తరలివచ్చారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్ నుండి ఎల్‌బి నగర్ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. ఫలితంగా పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు