తెలంగాణ

రెండో రాజధాని హైదరాబాదా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంచి-చెడుల గురించి ఆలోచించకుండా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. రెండవ రాజధానిగా ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరవని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగంగా ఉండాలని తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరూ పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌పై హక్కును కోల్పోతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించలేమన్నారు. హైదరాబాద్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్‌ను ఎప్పటికీ రాజధానిగా ఉంచాలన్న ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రతిపాదనలను తిరస్కరించామని ఆయన వివరించారు. కాబట్టి అటువంటి ఆలోచన మానుకోవాలని ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు.
ఇలాఉండగా టి.పిసిసి అనుబంధ విభాగమైన రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. రెండవ రాజధానిగా చేస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు సమకూరుతాయని ఆయన చెప్పారు. పైగా రాష్టప్రతి ఢిల్లీలోనే కాకుండా ఎక్కువ కాలం హైదరాబాద్‌లో గడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులూ హైదరాబాద్‌లో మకాం ఉంటారని, నీతి ఆయోగ్, కేంద్ర ఎన్నికల కమిషన్ సంఘం వంటి కేంద్ర కార్యాలయాలెన్నో హైదరాబాద్‌లో ఉంటాయని ఆయన తెలిపారు. తద్వారా కేంద్రంతో పని పడితే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదని, దక్షిణ భారతీయులందరికీ అందుబాటులోకి వస్తుందని కనుకుల జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. తద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా ఢిల్లీ ప్రజలు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని, దీంతో వారికి ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పారు.