రాష్ట్రీయం

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 17: తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. వారాంతపు సెలవులు కావడంతో శని, ఆదివారాల్లో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా రద్దీ అధికంగా ఉండడంతో గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గదులు పొందేందుకు సుమారు 4 నుంచి 5 గంటల పాటు క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తలనీలాలు సమర్పించేందుకు అధిక సమయం పడుతోంది. ఇక శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం అయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ట్యాక్సీలకు గిరాకీ పెరిగింది. దీనిని అదునుగా తీసుకున్న ట్యాక్సీ యజమానులు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తూ భక్తులను దోచుకుంటున్నారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు ఉచిత క్యూలైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకునే భక్తులకు 12 గంటల సమయం, కాలినడకన వెళ్లి దివ్యదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 63,299 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా భక్తుల హుండీలో సమర్పించిన కానుకల ద్వారా సుమారు 2.47 కోట్లు ఆదాయం లభించింది.

నారాయణపూర్ నుండి
రేపు నీటి విడుదల?
మన రాష్ట్రానికి రానున్న కృష్ణమ్మ

హైదరాబాద్, జూలై 17 : కర్నాటక నుండి కృష్ణా వరద మూడు, నాలుగు రోజుల్లో మన రాష్ట్రానికి చేరే అవకాశం ఉంది. నారాయణపూర్ జలాశయం నుండి సోమవారం అదనపు జలాలను వదిలివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్‌మట్టి జలాశయం నుండి అదనపు నీటిని నారాయణపూర్‌కు వదిలివేస్తున్నారు. ఆదివారం ఉదయం వరకు అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఆల్‌మట్టిలో 112 టిఎంసిల నీటిని నిలిపి, 1,01,524 క్యూసెక్కుల నీటిని వదిలివేశారు.
ఈ జలాశయంలో 129 టిఎంసిల నీటిని నిలువచేసేందుకు వీలుంది. ఆల్‌మట్టి నుండి విడుదల చేస్తున్న నీరు నారాయణపూర్ జలాశయానికి చేరుతోంది. అయితే ఆదివారం సాయంత్రానికి కేవలం హైడల్ విద్యుత్ కేంద్రం ద్వారా మాత్రమే 45 వేల క్యూసెక్కుల నీటిని వదిలివేస్తున్నారని జూరాల ప్రాజెక్టు ఇంజనీర్ ఒకరు తెలిపారు. నారాయణపూర్ జలాశయం నిలువనీటి సామర్థ్యం 37.646 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 24.34 టిఎంసిల నీరు ఉంది. ఆల్‌మట్టి నుండి భారీగా వరద వస్తుండటంతో ముందు జాగ్రత్తచర్యగా అదనపు నీటిని సోమవారం వదిలివేస్తారని తెలిసింది. ఎంత నీటిని వదిలివేస్తారో సోమవారం ఉదయం తెలుస్తుంది. నారాయణపూర్ జలాశయం నుండి విడుదల చేసే నీరు జూరాల చేరేందుకు రెండుమూడు రోజుల సమయం పడుతుందని ఇంజనీర్లు వెల్లడించారు.