ఉత్తరాయనం

త్యాగయ్యకు మనం చేసిందేమిటి?

  • 22/02/2012

శ్రీరామ భక్తాగ్రేసరుడు, వాగ్గేయకారుడు, సాక్షాత్తూ నారదుల నుండి అపారమైన సంగీత జ్ఞానామృతాన్ని అందుకున్న త్యాగరాజస్వామి తెలుగువాడు! అచ్చతెలుగులో వేలాది కీర్తనలు రచించి శ్రీరామచంద్రుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఆయనకోసం మనం చేసింది శూన్యం. తమిళనాడు ప్రభుత్వం ఆ వాగ్గేయకారుని పేరిట స్మారక చిహ్నం ఏర్పాటుచేసింది. లబ్దప్రతిష్టులైన సంగీత కళాకారులకు ఏటేటా అవార్డులు ప్రదానం చేస్తోంది. ఆయన జయంతినాడు రాష్టవ్య్రాప్తంగా సంగీతోత్సవాలు నిర్వహిస్తోంది. కళాకారులను గౌరవించడంలో మన పొరుగు రాష్ట్రాలనుండి నేర్చుకోవాల్సింది ఎంతోవుంది. తెలుగు జాతి ప్రతిష్ఠను యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన త్యాగయ్య పేరిట స్మృతి చిహ్నం, అవార్డుల ప్రదానోత్సవం, సంగీత కళాశాలను నెలకొల్పడం ఇత్యాది కార్యక్రమాలను తక్షణం చేపట్టాలి.
- సి.ప్రతాప్, సూర్యాపేట
కఠినంగా శిక్షించాలి
విగ్రహారాధన వ్యతిరేకులు సహితం విగ్రహాల ప్రాధాన్యతను గుర్తించి గౌరవించడం ఆనందదాయకం, పరమ సంతోషం. గతంలో విజయవాడలో మాజీ రాష్టప్రతి శ్రీ నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో విగ్రహాల ధ్వంసమునకు నాంది పలికినట్లైనది. భవిష్యత్‌లో యిటువంటి దుస్సంఘటనలు జరుగకుండా నేరస్థులను జాతి విద్రోహులుగా ప్రకటించి, కఠిన శిక్షలకు విధించాలని ప్రభుత్వానికి (సంబంధిత అధికారులకు) విజ్ఞప్తి చేస్తున్నాం.
- సాయిరామానందస్వామి, పొదలకొండపల్లె
అంధ పరిశోధకులను ఆదుకోండి
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు నిర్వహించిన పిహెచ్‌డి వంటి పరిశోధక సీట్లలో అర్హత పరీక్ష పాసై యూనివర్సిటీలో పిహెచ్‌డి కోర్సు చేస్తున్న పరిశోధక విద్యార్థుల్లో అంధులను ఆదుకోవాలని వివిధ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకు మనవి. అంధత్వంతో బాధపడుతూ తాము ఎవరికీ తక్కువ కాదంటూ యూనివర్సిటీల్లో రీసెర్చి స్కాలర్లుగా చేరిన వారికి యుజిసి ద్వారా రాజీవ్‌గాంధీ ఫెలోషిప్‌లు తప్పక అందించి ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవాలి.
- ఆర్.రవీందర్, జనగామ
వస్త్రాలపై పన్ను తగదు
మన రాష్ట్రంలో వ్యాట్‌ను అమలుచేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల ట్యాక్స్‌లను విపరీతంగా పెంచడమేకాక, నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతుండటంతో సామాన్యుల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికితోడు నేడు వస్త్ర వ్యాపారంపై ఊహించని రీతిలో ఏకంగా ఐదు శాతం వ్యాట్‌ను విధించడం జనజీవనాన్ని మరిన్ని కష్టాలకు గురిచేయడమేనన్నది ప్రభుత్వం గుర్తించాలి. వస్త్ర వ్యాపారంపై విధించిన వ్యాట్ పన్ను కేవలం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకే వర్తిస్తుందన్న ప్రభుత్వ వాదన సరికాదు. ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో వస్త్ర వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు లక్షల సంఖ్యలో వున్నాయి. ప్రధానంగా చేనేత వస్త్రాలకు రాష్ట్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నది తెలిసిందే. వస్త్రాలపై విధించే ఎలాంటి పన్నులైనా, ఆఖరికి వాటి భారాన్ని మోసేది వినియోగదారులేనన్నది మరువకూడదు. కాబట్టి ప్రభుత్వం వ్యాట్‌ను రద్దుచేయడం సబబుగా వుంటుంది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
ప్రజాదర్బార్ నిర్వహణ అభినందనీయం
రాష్ట్ర డిజిపి ప్రతీరోజు ప్రజాదర్బార్ పేరిట ప్రజలను కలుసుకొని వారి సమస్యలను స్వయంగా విని పరిష్కారాలకోసం కృషిచేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే ఇటువంటి కార్యక్రమాలను విధిగా కనీసం వారానికి ఒకరోజు పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా నిర్వహిస్తే మంచి ఫలితం వుంటుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు మరింత ధైర్యంగా పోలీస్‌స్టేషన్లకు వెళ్ళే అవకాశం వుంటుంది. నేరాల పట్ల, తమకు వున్న అనుమానాల గురించి పోలీసు డిపార్ట్‌మెంట్‌తో మరింత స్వేచ్ఛగా సమాచారం పంచుకోవడం వలన కేసుల పురోగతి వేగవంతమై దొంగలను త్వరగా పట్టుకునే వీలు. తద్వారా నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం వుంటుంది.
- ఎం.కనకదుర్గ, విశాఖపట్నం

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading