జాతీయ వార్తలు

ఉగ్రదాడి కుట్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ బెంగళూరు/ హైదరాబాద్, జనవరి 22: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్ర భగ్నమయింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్‌ఐఎ శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపి 13మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను అరెస్టు చేయడంతో పెద్ద ముప్పు తప్పింది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ సిద్ధాంతాలతో పోలిన సిద్ధాంతాలు గల ఒక ఉగ్రవాద సంస్థ భారత్‌లో ఏర్పడినట్లు కూడా ఈ దాడుల్లో బయటపడింది. ‘జనూద్ ఉల్ ఖలీఫా ఎ హింద్’ పేరిట ఏర్పడిన ఈ కొత్త ఉగ్రవాద సంస్థ అధినేతగా ప్రకటించుకున్న ముంబయి నివాసి అమీర్ అలియాస్ మునబీర్ ముస్తాక్‌ను కూడా ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. కర్ణాటకలోని బెంగళూరులో అనుమానిత ఉగ్రవాదులు నలుగురిని, తుంకూరులో ఒకరిని, హుబ్బల్లిలో ఒకరిని, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నలుగురిని ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. బెంగళూరులో కొద్ది రోజుల క్రితం అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మదరసాలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిని అరెస్టు చేసిన ఎన్‌ఐఎ ఇంటరాగేషన్‌లో అతని నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా శుక్రవారం దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేసింది. హైదరాబాద్ టోలిచౌక్ ప్రాంతానికి చెందిన నలుగురు ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. నఫీజ్ ఖాన్, ఉబేదుల్లా ఖాన్, షరీఫ్ మొహినుద్దీన్‌లతో పాటు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబూ అమాజ్‌లను అదుపులోకి తీసుకుంది.
వివిధ రాష్ట్రాల్లో అరెస్టు చేసిన 13మందిని లోతుగా ఇంటరాగేట్ చేయడం కోసం ఎన్‌ఐఎ ఢిల్లీకి తరలిస్తోంది. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థకు దేశంలో పక్కా నిర్మాణమే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడయింది. అరెస్టయిన వారి నుంచి 42 మొబైల్ ఫోన్లు, పేలుడు పదార్థాలు, డిటొనేటర్లు, వైర్లు, బ్యాటరీలు, హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు జిహాదీ సాహిత్యాన్ని ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక్క అమీర్ నుంచే ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్‌ఐఎస్ అనుబంధ జనూద్ ఉగ్రవాద సంస్థకు విదేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు అందినట్టు కూడా తేలింది.
పేలుళ్లకు కుట్ర
దేశంలోని వివిధ ప్రాంతాలలో పేలుళ్లకు పాల్పడటంతో పాటు కొంత మంది విదేశీయులపైన దాడులు చేయాలని అమీర్ నేతృత్వంలోని ఐఎస్‌ఐఎస్ అనుబంధ జనూద్ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర భద్రతా సంస్థలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలతో కలిసి ఎన్‌ఐఎ ఈ దాడులు నిర్వహించిందని ఆ వర్గాలు వివరించాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో అతని పర్యటనను వ్యతిరేకిస్తూ బెంగాళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్‌కు బెదిరింపు లేఖ అందిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం, ప్రత్యేకంగా బెంగళూరులోనే నలుగురిని అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో హైఅలర్ట్
హైదరాబాద్‌లో నలుగురు ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులు అరెస్టు కావడంతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఎక్కడైనా ఐఎస్‌ఐఎస్ దాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో పోలీసులు భద్రతను పెంచారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్‌ఏఎఫ్ దళాలను మోహరించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ వంటి ప్రాంతాల్లో సిసి కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ నెల 28 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధించినట్టు సిపి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రజాప్రతినిధులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నియమావళి మేరకే ప్రచారం నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.