ఉన్నమాట

ఆంధ్రకు సాయం అబ్రకదబ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే మాట. అదే పాట. అక్షరమ్ముక్క తేడా లేదు. నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక సహాయం గురించి కేంద్ర బిజెపి సర్కారు రెండేళ్లకు పైగా వినిపిస్తున్న రికార్డునే ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మొన్న మళ్లీ వేశారు. విభజన మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటిల్లిన కష్టనష్టాలు మహా ప్రభువులకు బాగా తెలుసు. అన్యాయానికి లోనైన ఆంధ్రను అన్ని విధాల ఆదుకోవడానికి వారు కంకణం కట్టుకున్నారు. విభజన చట్టంలో ఆ రాష్ట్రానికి పొందుపరిచిన హామీలను తు.చ. తప్పక అమలు జరిపించడానికి వారిది పూచీ! చట్టంలో చేర్చకుండా పూర్వ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ పార్లమెంటులో మాటమాత్రంగా ఇచ్చిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ప్రత్యేక హోదాను కూడా ఇవ్వాలనే ఢిల్లీ పెద్దలకు ఉంది. కాని 14వ ఫైనాన్స్ కమిషన్ అందుకు ఒప్పుకోలేదు. ఆంధ్రకు ఇస్తే అలాంటి హోదా తమకూ ఇవ్వాలని ఇతర రాష్ట్రాలూ పోటీకొస్తున్నాయి. కాబట్టి కుదరదు. అయినా బెంగలేదు. ‘హోదా’ అంటూ ప్రత్యేకంగా ఇవ్వకపోయినా ఆ హోదావల్ల ఒరిగే ప్రయోజనాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికీ ఇంకో విధంగా సమకూడేలా వేరే ఏర్పాటు చేస్తున్నారు. ఇదీ స్క్రిప్టు. పార్లమెంటులోపలా వెలుపలా ‘ప్రత్యేక హోదా’ ఊసును ఎవరైనా ఎత్తిన ప్రతిసారీ పాడిందే పాట.
మునుపటికీ ఇప్పటికీ ఒకటే తేడా. జంకు గొంకు లేకుండా ఆంధ్రుల చెవులకు తాటాకులు కట్టటానికి కేంద్ర నాధులు ఎవర్‌రెడీగా ఉన్నా కట్టించుకోవడానికి ఆంధ్ర ప్రజలు ఇంకే మాత్రం సిద్ధంగా లేరు. రాష్ట్ర విభజన తెలంగాణకు వరం. చిరకాలంగా అది పట్టుబట్టి సాగించిన మహోద్యమానికి సాఫల్యం. సందేహం లేదు. కాని ఆ విభజన ఆంధ్రకు శాపం. కాంగ్రెసు, బిజెపి కూడబలుక్కుని, పార్లమెంటు తలుపులు మూసి ఆదరాబాదరా కానిచ్చిన అడ్డగోలు విభజన మూలంగా సీమాంధ్ర రాజధానిని కోల్పోయి, సమస్యల సుడిగుండంలో చిక్కి అష్టకష్టాల పాలైంది. దారుణ అన్యాయాన్ని కొంతైనా సరి చేయాలన్న ఉద్దేశంతోటే అవశేష ఆంధ్ర రాష్ట్రానికి కాస్త కాలునిలదొక్కుకునేందుకు వీలుగా ఐదేళ్ల స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని నాటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రకటించారు. అది ఎందుకూ చాలదు; ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఉండాలని ఇదే అరుణ్‌జైట్లీ, ఇదే వెంకయ్యనాయుడు ప్రతిపక్ష నాయకుల అవతారాల్లో అప్పుడు పట్టుబట్టారు. ‘ప్రత్యేక హోదా’ నిర్ణయాన్ని విభజన చట్టంలో చేర్చకపోయినా మునిగిపోయింది లేదు; తాము కేంద్రాన అధికారంలోకి వచ్చీరాగానే, అనుకున్న ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి పరిపూర్ణ న్యాయం చేయగలమనీ కమలనాధులు ఆశగొలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ నొక్కి చెప్పారు. కాలం కలిసొచ్చి వారి చేతికి పవరు అందడంతో మునుపు తమ నోటితో తామే చేసిన డిమాండును ఈడేర్చి, పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వకపోతారా అని అఖిలాంధ్ర ప్రజలు ఆశపెట్టుకున్నారు. పదేళ్లమాట దేవుడెరుగు; కనీసం నాటి ప్రధాని పార్లమెంటులో సాధికారికంగా ఇచ్చిన ఐదేళ్ల హోదా హామీనే మోదీ ప్రభుత్వం చాపచుట్టి అటకెక్కించింది. అది చాలా కరెక్ట్ అని ఆర్థిక అమాత్యుడి ఉవాచ.
అరుణ్‌జైట్లీ అర్భకుడు కాదు. కేంద్రాన బిజెపికి కలరనుకునే కొద్దిమంది బుద్ధిశాలుల్లో ఒకడు. ఒకప్పుడు కేంద్ర న్యాయశాఖను వెలిగించి, విశేష పాలనానుభవం గడించిన ఆయనకు న్యాయం, చట్టం తెలియవనీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రాలకు ఏ పరిస్థితుల్లో ఏవిధంగా కలగజేస్తారో ఆయన ఎరగడనీ అనుకోలేము. అన్నీ ఎరిగే అవశేషాంధ్ర రాష్ట్రానికి ఆ హోదా పదేళ్లపాటు కావాలని అడిగిన వారికి, తమకు అవకాశం వస్తే దాన్ని ఎలా అమలు జేయగలరన్నదీ తెలిసే ఉండాలి. స్పెషల్ కేటగిరీ స్టాటస్‌కి సంబంధించినంతవరకూ రాష్ట్ర విభజన నాటికీ నేటికీ నిబంధనలు మారింది ఏమీ లేదు. దాన్ని నవ్యాంధ్రకు ఇవ్వటం కుదరదని జైట్లీ మహాశయుడు ఇప్పుడు చెప్పటం కల్తీలేని అవకాశవాదం. ఫైనాన్స్ కమిషన్ వలదని చెప్పినంత మాత్రాన కేంద్రం చేతులు కట్టుబడిపోవు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు ఈ విషయంలో కలిసి వచ్చేటప్పుడు అందరినీ సంప్రదించి, ఇతర రాష్ట్రాలను ఒప్పించి, అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజకీయ నిర్ణయం చేయటం కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే అసాధ్యం కాదు.
ప్రధానమంత్రి పార్లమెంటులో అధికార పూర్వకంగా మాట ఇచ్చాక, కేంద్ర మంత్రివర్గం దాన్ని ఆమోదించి, అమలు నిమిత్తం ప్రణాళికా సంఘానికి పంపాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసినట్టే. తరవాత వచ్చిన ప్రభుత్వం చేతిలో ఆ ప్రణాళికా సంఘానికి నూకలు చెల్లి, దాని స్థానంలో ‘నీతి ఆయోగ్’ అనే వ్యవస్థ పుట్టుకొస్తే, ప్రభుత్వం ఇదివరకే కమిట్ అయిపోయిన హామీని కొత్త సంస్థ ద్వారానో, మరో విధంగానో ఎలా అమలు జరిపించాలన్నది కొత్త ప్రభుత్వం తలనెప్పి. ప్రభుత్వమనేది నిరంతరంగా కొనసాగే వ్యవస్థ. వెనకటి ప్రభుత్వం చేయబట్టినదాన్ని పూర్తి చేయటం ప్రస్తుత ప్రభుత్వ విధి.
పోనీ, ప్రతిపక్షంలో ఉండి వెనకాముందు చూడకుండా తాము నెత్తికెత్తుకోదలిచింది ఎంత మోయరాని బరువో పవర్లోకి వచ్చాకే కమలనాథులకు అర్థమైందా? ఆ సంగతైనా నసుగుడు లేకుండా ధైర్యంగా ప్రజలముందు ఒప్పుకుని ఉండాల్సింది. గద్దెనెక్కిన కొత్తలోనే తప్పు ఒప్పుకుని తాము ఇవ్వలేని ‘ప్రత్యేక హోదా’కు ప్రత్యామ్నాయంగా ఫలానా ఫలానా ఉపకారాలు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తామని చెప్పి, జాగులేకుండా వాటికి కార్యరూపం ఇచ్చి ఉంటే వారి అగత్యాన్ని జనం అర్థం చేసుకునేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచీ ‘ప్రత్యేక హోదా ఇస్తే మంచిదే. అది కుదరనప్పుడు పాకేజైనా సరే’ అనే అంటున్నారు. ఊరిస్తూ వచ్చిన పాకేజీ ఏదో మొదటే ప్రకటించి, యథావిధిగా అమలు జరిపి ఉంటే...కనీసం అమరావతి రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంలో గుప్పెడు మట్టి, కాసిని నీళ్లు ఆంధ్రుల మొగాన చల్లకుండా సమంజసమైన ఆర్థిక సహాయాల పాకేజిని ప్రధానమంత్రి ప్రకటించి ఉంటే ఎంత బాగుండేది? ఇటీవల రాజ్యసభలో ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రైవేటు బిల్లు వచ్చినప్పుడైనా మాయోపాయాలు పన్ని, ఇచ్చకాలతో మభ్యపెట్టి ఇరకాటంనుంచి బయటపడాలని చూడకుండా అఖిల పక్ష సహకారంతో వాస్తవిక పరిష్కారం కనుగొని ఉంటే కేంద్ర నాయకత్వం తక్కువ నష్టంతో బయటపడగలిగేది. ఇవ్వలేమని చెబుతున్న ‘హోదా’ విషయాన్ని అలా ఉంచి, చట్టంలో పొందుపరిచిన మిగతా వరాలనైనా సవ్యంగా, నిరాక్షేపణీయంగా ఈడేర్చి ఉంటే మోదీ ప్రభుత్వ నిజాయతి, చిత్తశుద్ధి పట్ల జనానికి కొంత నమ్మకం కలిగేది.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా 2014 ఏప్రిల్ 1నే ప్రకటించారు కదా? దాని నిర్మాణానికయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించదలిచినప్పుడు అవసరమైన నిధులు కేటాయించి జాగులేకుండా పనులు సాగించడానికి వచ్చిన అడ్డేమిటి? దానికి ఏ ఫైనాన్స్ కమిషన్ వద్దంటుంది? కొత్త ప్రభుత్వం గజ్జెకట్టి రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఆ నిధులు ఎలా విడుదల చేయాలో ఇంకా ఖరారు చెయ్యాల్సే ఉందని ఆర్థిక మంత్రి అంటున్నాడంటే ఏమనుకోవాలి? అలాగే కడప స్టీలు ప్లాంటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు కాగితాలమీదే ఎందుకు మిగిలిపోయంది? చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా విశాఖ రైల్వే జోనుకు ఎందుకు మోసం వచ్చింది? రెండేళ్లు గడిచినా ఇంకా సంబంధిత శాఖల పరిశీలన ఇంకా ఎందుకు తెమలలేదు? కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల, విద్యా సంస్థల స్థాపనకు అయ్యే వ్యయాన్ని ఇంకా ఎనే్నళ్లు మదింపు చేస్తూనే ఉంటారు? రాష్ట్ర బడ్జెటులోటు కింద ఇప్పటికి ఎంత ఇచ్చిందీ చెబుతారే తప్ప మొత్తం ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇస్తారో చెప్పరెందుచేత? ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఒరగబెడతామంటున్న బయటి సహాయం ప్రాజెక్టులు (ఎక్సటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు) ఎలాంటివి? ఏ దేశాల చలవతో ఎక్కడికి వస్తాయి? వాటిని సాధించటంలో కేంద్రం చేసేది ఏమిటి? అవి కాగితాల నుంచి కార్యరంగంలోకి ఎప్పటికి తర్జుమా అవుతాయి? మిగిలిన రెండున్నర ఏళ్ల పుణ్యకాలంలో అవి ఎన్ని అంగుళాలు కదులుతాయి? రాష్ట్రానికి ఎంత మేలు చేస్తాయి?
నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక సహాయం అందించదలిచిందే ఐదేళ్లపాటు. అందులో సగభాగం దాదాపుగా చెల్లిపోయంది. ఆ సహాయం ఏ బాపతు ఎంత, రాష్ట్రానికి అందేది ఎప్పటికి, దానివల్ల నికర ప్రయోజనమెంత అన్నది కేంద్ర ప్రభువులు ఇప్పటికీ చెప్పరు. మీడియా గోష్ఠికి తరువాయిగా నిన్న ఆర్థికమంత్రి వెలువరించిన నోట్‌లో మాటల మూటలే తప్ప ఒక్క వివరమూ లేదు. రెండులక్షల కోట్లు, మూడు లక్షల కోట్లు కురిపిస్తున్నామంటూ ఇంకో మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నవి కాకుల లెక్కలు. హోదా రాదు... పాకేజి లేదు అని చెప్పకనే చెబుతూ ఇంకేవో విదేశవాళీ లంకెల బిందెలను సీమాంధ్రకు తవ్విపోయనున్నట్టుగా జైట్లీ బిల్డప్ ఇవ్వటం కమలం మార్కు అబ్రకదబ్ర!
సమస్య తెలుగుదేశం పార్టీకి, భాజపాకూ, లేక చంద్రబాబు సర్కారుకూ మోదీ ప్రభుత్వానికి మాత్రం పరిమితమైనదైతే ఇలాగే కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ, లోపాయకారి సర్దుబాట్లు చేసుకుంటూ, బెట్టు, అలక, ఉత్తుత్తి వరాల నాటకాలాడుతూ ఎంచక్కా కాలక్షేపం చేయగలరు. కాని-రోజులు మారాయి. జనం కళ్లు తెరిచారు. ఇంతకాలమూ మోదీ ప్రభుత్వం అనుసరించిన సాచివేతల, సాగతీతల, మాయమాటల పర్యవసానంగా ‘ప్రత్యేక హోదా’ అనేది ఇప్పుడు సెంటిమెంటు ఇమిడిన తక్షణ ప్రజా సమస్య. ప్రతిపక్ష పార్టీలను తిట్టిపోసి, విపక్ష నాయకులను పాపాలభైరవులుగా చూపించి, ప్రతి ప్రజాందోళనలో కుట్రల బూచిని చూపి శుష్క క్రియాలతో, వట్టి చేతులతో మభ్యపెట్టటం పనికిమాలిన పని. బిజెపిని, మోదీ నాయకత్వాన్ని అభిమానించి, ఇతర విషయాల్లో నెత్తిన పెట్టుకునే వారిలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి నయవంచన పట్ల రగులుతున్న అసంతృప్తిని... రాష్ట్రం మంతటా పెరుగుతున్న ఉద్రిక్తతను మోదీ ప్రభుత్వం గమనించి ఇకనైనా ప్రాప్తకాలజ్ఞత చూపితే మేలు. కాంగ్రెసు దారిలోనే కమలమూ నడిస్తే కాంగ్రెసుకు జరిగిన సన్మానం ఆంధ్ర రాష్ట్రంలో దానికీ తప్పదు!