ఉన్నమాట

ఐదు లక్షలు పెట్టారు... ఐదు వేల కోట్లు కొట్టారు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనియాజీ అత్తను మించిన కోడలు.
పగవారు తనని జైల్లో వేయిస్తే అత్తగారు (1978 డిసెంబర్ 20న లక్నో నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్) విమానాన్ని ఓ పూట హైజాక్ చేయించింది.
కోర్టువారు తమని ఓసారి వచ్చి పొమ్మంటేనే కోడలమ్మ పగబట్టి ఏకంగా పార్లమెంటును రోజుల తరబడి హైజాక్ చేయిస్తోంది. అదేమి పనమ్మా అంటే- ఎవరనుకున్నారు; నేను ఇందిరాగాంధి కోడలిని అంటూ పెంకులెగిరేలా రంకెలు వేస్తోంది.
కోర్టు కేసుకూ, పార్లమెంటుకూ ఏమిటి సంబంధం? నిందితురాలు ఎవరి కోడలు అయతే ఏమిటి?
అదంతా నాకు తెలవదు. ఇది మాత్రం ముమ్మాటికీ కక్ష సాధింపే. డైరక్టుగా ప్రధానమంత్రే పనిగట్టుకుని చేయిస్తున్న దుర్మార్గమేనని - రైజైపోతున్నాడు మైనర్‌బాబు రాహుల్.
అమ్మా కొడుకుల మెడకు తగులుకున్నది నరేంద్ర మోదీ అనే దుర్మార్గపు ప్రధాని పట్టుబట్టి పెట్టించిన కేసా?
కాదు. 2012లో కింది కోర్టులో ప్రైవేటు క్రిమినల్ ఫిర్యాదు దాఖలైనప్పుడు నరేంద్రమోదీ పవర్లోనే లేడు. అప్పుడు ప్రధానిగా ఉన్నది మన్మోహన్ సర్దార్జీ. ప్రధానమంత్రి కార్యాలయమే కథ నడిపిస్తోందంటూ కాంగ్రెసు యువరాజు విసిరిన బాణం అయితేగియితే వాళ్ల జమానాలోని డమీ ప్రధానికే తగలాలి. తాము దేశాన్ని లెక్కా పత్రం లేకుండా ఏలిన కాలంలోనే తమ మీద పడ్డకేసుకు ఇప్పటి ప్రభుత్వాన్ని, ప్రధానిని తిట్టిపొయ్యటం కాంగ్రెసు మార్కు కామెడీ!
ప్రభుత్వానికీ, ప్రధానికీ ప్రమేయం లేకపోయినా దీని వెనుక పాలకపక్షం ఉన్నదేమోనని అనుమానిద్దామా?
మూడేళ్లకింద కేసు వేసిన సమయంలో ఫిర్యాదుదారు సుబ్రహ్మణ్యస్వామి అసలు బిజెపి మెంబరే కాదు. అప్పుడాయన జనతా పార్టీ అధ్యక్షుడు.
ఎవరు వేస్తేనేమి? పెట్టింది తప్పుడు కేసా? కేవలం అపూర్వ త్యాగమయి సోనియాజీనీ, అద్భుత వీరుడు రాహుల్‌జీనీ అన్యాయంగా, నిష్కారణంగా బద్‌నామ్ చేసే దురుద్దేశంతోనే బనాయించిన బాపతా?
దావాలోని విషయం రాజకీయ సంబంధమైనది కాదు. తల్లీ కొడుకులు బరితెగించి సాగించిన పగటి దోపిడీకి సంబంధించినది. అది నిరాధార నిందారోపణ కాదు. తిరుగులేని రుజువులూ సాక్ష్యాలతో పకడ్బందీగా బిగించిన కేసు.
అనగా అనగా ఒక నేషనల్ హెరాల్డు. సోనియాగాంధీగా పిలవబడే ఆంటోనియా అల్బినా మైనోకి అత్తగారి నాన్నగారు పూర్వమెప్పుడో స్థాపించిన జాతీయ దినపత్రిక అది. మొదటి నుంచీ దానిది నష్ట జాతకమే. ఎప్పుడు చూసినా పీకల లోతు అప్పులే. ‘‘ఎన్నాళ్లిలా? పోనీ పత్రికను అమ్మెయ్యరాదా’’ - అని ఎవరైనా అంటే ఆనందభవన్‌ని అయినా అమ్ముతానేమోగాని నేషనల్ హెరాల్డ్‌ని మాత్రం ఎన్నటికీ అమ్మను’’ అనే వాడు నెహ్రూగారు. మన కోటం రాజు రామారావు, ఎం.చలపతిరావుల సంపాదకత్వంలో ఒకప్పుడు బాగానే వెలిగినా, వ్యాపారదక్షత లేక, మార్కెట్ పోటీకి నిలబడలేక ఆ పత్రిక క్షీణించి క్షీణించి చివరికి 2008లో శాశ్వతంగా మూతపడింది. ఎంతైనా మన పెద్దాయన పెట్టిన పత్రిక కదా ఏదో ఒక విధంగా దాన్ని కోమానుంచి పైకి తెద్దాం అని తల్లీకొడుకులు కలలోనైనా తలవలేదు.
వ్యవహార దక్షత లేక మూతపడ్డా ‘నేషనల్ హెరాల్డ్’కి స్థిరాస్తులు బాగానే ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రుగారు భారత ప్రధానిగా తన చేతిలోని అధికారాన్ని తన ముద్దుపత్రిక కోసం బాగానే వాడేసి ఢిల్లీ, లక్నో, పట్నా, ముంబయి లాంటి నగరాల్లో ప్రభుత్వ స్థలాలు ధారాళంగా ఇప్పించాడు. బ్యాంకు అప్పులను సరసంగా తెప్పించి భవనాలూ బాగా లేపించాడు. ఇప్పటి మార్కెట్లు రేట్ల ప్రకారం ఆ ఆస్తుల విలువ 5000 కోట్ల రూపాయల పైమాటే.
వాటి మీద పడింది ‘మా బేటా’ల కన్ను. ‘్ఫర్త్ ఎస్టేట్’ ఏమైపోతేనేమి? ‘రియలెస్టేట్’ బ్రహ్మాండంగా ఉంది కదా - అనుకున్నారు. ఎలాగైనా వాటిని అప్పనంగా కొట్టెయ్యాలనుకున్నారు. తలచిందే తడవుగా మాస్టర్ ప్లాను వేశారు. అర్జంటుగా అమలూ జరిపారు.
‘నేషనల్ హెరాల్డ్’ గ్రూపు పత్రికలను నడిపింది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏ.జె.ఎల్) సంస్థ. మూతపడే సమయానికి అది లోకులకు 90 కోట్ల రూపాయలకు పైగా బాకీ పడింది. ఇంకేం? దొరికింది ఉపాయం! మొదలైంది నాటకం.
‘నేషనల్ హెరాల్డ్’కి సొంతదారు అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) కంపెనీకి చైర్మను ఎవరోకాదు. కాంగ్రెసు రాచవారికి నమ్మినబంటు అయిన మోతీలాల్ ఓరా. అప్పుల చెల్లుబాటు నిమిత్తం 90 కోట్లు అప్పు మంజూరు చేయవలసింది అంటూ మొదటి అంకంలో అతడిచేత ఎఐసిసికి అర్జీ పెట్టించారు. కంపెనీ చైర్మన్ హోదాలో మోతీలాల్ ఓరా పెట్టుకున్న దరఖాస్తును ఎఐసిసి కోశాధికారి హోదాలో అదే మోతీలాల్ ఓరా వెంఠనే మంజూరు చేసి అంత సొమ్మునూ పార్టీ బొక్కసం నుంచి కళ్లు మూసుకుని ఇచ్చేశారు.
అదే పెద్ద అక్రమం. రాజకీయ పార్టీగా అనేక పన్ను మినహాయింపులు పొంది, రాజకీయ కార్యకలాపాల నిమిత్తం పబ్లికు నుంచి విరాళాలుగా వసూలు చేసిన సొమ్మును వ్యాపార అవసరాల నిమిత్తం వేరే కంపెనీకి మళ్లించటం నేరం. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద శిక్షార్హం.
ఆ సంగతి అలా ఉంచండి.
రెండో అంకంలో మాతాసుతులు కూడబలుక్కుని (2010 నవంబర్ 23న) కేవలం 5 లక్షల రూపాయల పెట్టుబడితో ‘యంగ్ ఇండియన్’ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని అధికార దండం ఝళిపించి ఆగమేఘాల మీద పుట్టించారు. దానిలో 38 శాతం వాటా తల్లిది. 38 శాతం వాటా కుమార్రాజాది. వెరసి 76 శాతం పోగా మిగిలిన ఈక్విటీని పార్టీలోని కీలుబొమ్మలు మోతీలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్ పిట్రోడా, సుమన్ దుబేల వాటాలుగా చూపించారు.
ఇక మూడో అంకం. పుట్టి పదిరోజులు తిరక్కుండా నడమంత్రపు కంపెనీచేత కాంగ్రెసు పార్టీకి బంపర్ ఆఫర్ ఇప్పించారు. మీకు 90 కోట్లు బకాయిపడ్డ ఆ కంపెనీకి పూచిక పుల్లంత ఆస్తి లేదు. అది వసూలయ్యే బాకీ కాదు. కాబట్టి ఓ పని చేద్దాం. ఆ బాకీని మేము వాల్చుకుంటాం. మా తంటాలేవో మేము పడి ఆ కంపెనీ నుంచి వచ్చినకాడికి వసూలు చేసుకొంటాం. ఇందుకు ప్రతిఫలంగా ఓ యాభై లక్షలు మీకు దాఖల్చేసుకుంటాం. సమ్మతించవలసినది - అంటూ!
ఇది దగాకోరు ప్రతిపాదన. ఎ.జె.ఎల్. కంపెనీకి వేలకోట్లు విలువచేసే స్థిరాస్థులున్నాయి. వెంటపడి వాటిలో ఏ చిన్నది అమ్మించినా బాకీ తేలిగ్గా వసూలవుతుంది. కట్టెదుట కొండంత ఆస్తులు కనపడుతున్నా అవేవీ లేనట్టూ, బాకీ వసూలుకు వీలే లేనట్టూ చిత్రించటం పచ్చిమోసం. దానే్న నికార్సయిన నిజంగా ఎఐసిసి వారు ఔదలదాల్చారు. 50 లక్షలు పుచ్చేసుకుని 90 కోట్ల మీద హక్కులు వదిలేసుకున్నారు.
అప్పుడు పతాక సన్నివేశానికి తెరలేచింది. కాంగ్రెసు పార్టీ దగ్గర మీరు తీసుకున్న అప్పు ఇప్పుడు మాకు చెల్లించవలసి ఉంది. దానికింద మీ కంపెనీ వాటాలను మాకు ఇచ్చేస్తే సరిపోతుంది అని యంగ్ ఇండియన్ కంపెనీ తరఫున మోతీలాల్ ఓరాగారు ఎజెఎల్‌కి బేరం పెట్టారు. ఎ.జె.ఎల్. చైర్మన్ హోదాలో మళ్లీ ఓరాగారే దానికి ఒప్పేసుకున్నారు. నిబంధనల ప్రకారం కంపెనీ వాటాదారులను అడగా పెట్టకుండా, మాట మాత్రమైనా చెప్పకుండా ఎజెఎల్ డైరక్టర్ల బోర్డు చేత మమ అనిపించారు. తమ కంపెనీలోని 99 శాతం ఈక్విటీని అంటే మొత్తం కంపెనీనీ పువ్వుల్లో పెట్టి యంగ్ ఇండియన్ల చేతిలో పెట్టారు. యంగ్ ఇండియన్ కంపెనీలో ముప్పాతికపైగా వాటా ‘మాబేటా’లదే కాబట్టి నేషనల్ హెరాల్డు గ్రూపు కంపెనీ, దానికి చెందిన వేల కోట్ల కిమ్మతు చేసే ఆస్తులు దొడ్డిదారిన అడ్డగోలుగా కాంగ్రెసు రాజమాత, రాకుమారుల పరమయ్యాయి.
ఇది పట్టపగలు బందిపోటు దోపిడీ కాకపోతే మరేమిటి?
వట్టిగా కంపెనీ వాటాలు కొట్టెయ్యటమే కాదు. పత్రిక నిర్వహణ కోసమని చెప్పి నేషనల్ హెరాల్డ్ వారు లోగడ ప్రభుత్వం నుంచి ఢిల్లీలో పొందిన ఖరీదైన స్థలాలను, వాటిలోని భవనాలను తమ అదుపాజ్ఞల్లోని వివిధ ప్రభుత్వ శాఖలకు అక్రమంగా లీజుకిప్పించి, నెలనెలా అరవై లక్షల రూపాయలనూ మా బేటాలు తేరగా దండుకున్నారు.
అయితే ఏమిటట? మా పత్రిక; మా పార్టీ; మా కంపెనీ; మా గవర్నమెంటు; మా ఇష్టం - అని ‘మదరిండియా’, ‘సన్‌ఇండియా’లు దబాయించవచ్చుగాక. ఇండియా తమ జాగీరు అని వారు ఎంత అనుకున్నా ఈ దిక్కుమాలిన దేశంలో న్యాయం, చట్టం అనేవి ఇంకా ఉండి ఏడ్చాయి. వాటి ప్రకారం వీళ్లు చేసింది మోసం; కుట్ర పూరితమైన నేరం; కఠిన శిక్షార్హమైన అపరాధం అంటూ సుబ్రహ్మణ్యస్వామి మూడేళ్ల కింద కోర్టుకెక్కాడు. మా అంతటివాళ్లకు ఇదో లెక్కా అనుకుని కనీసం కోర్టు గుమ్మమైనా తొక్కకుండా ఇనే్నళ్లూ మాతాపుత్రులు ఎలాగో నెట్టుకొచ్చారు.
వారి చేతి నుంచి అధికారం గల్లంతైతేనేమి? జమానా మారినా ప్రభుత్వ యంత్రాన్ని నడిపేది పాత యంత్రాంగమే. అందులో వారి ఉప్పుతిన్న, వారివల్ల ఉపకారాలు పొందిన శాల్తీలూ చాలానే ఉన్నాయి. వాటిద్వారా ఎలా ఠస్సా వేశారోగాని, మాబేటాల మీద కేసులో పసలేదని ఈ మధ్య కూడా కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరక్టరేటు (ఇ.డి.) చేతే కోర్టుకు చెప్పించారు. మోదీ ప్రభుత్వం ఆలస్యంగా నైనా మేల్కొని ఇ.డి.ని కట్టడి చేయటంతో కాంగ్రెసు వేల్పులకు కష్టాలొచ్చాయి.
అదిగో అందుకే మోదీ సర్కారు మీద వారికి ఇంత కడుపుమంట. ఎంచక్కా మీ గవర్నమెంటులోని మా వాళ్ల ద్వారా మా పని కానిచ్చుకోకుండా అడ్డం కొడతారా? ఇది కక్ష సాధింపుకాదా? అని కాంగ్రెసీయుల అధర్మాగ్రహం. హైకోర్టుకూ దయతప్పి, ఈ 19న కింది కోర్టు విచారణకు హాజరుకాక తప్పదని ఆజ్ఞాపించటంతో దిక్కుతోచకే పార్లమెంటు లోపలా బయటా విచ్చలవిడి వీరంగం.
గొప్పోళ్లు చట్టాన్ని చాప చుట్టదలచుకుంటే ‘సల్మాన్‌ఖాన్’ రూటు ఎలాగూ ఉంటుందనుకోండి. కర్మం చాలక ఆ పప్పులుడకక, చట్టం బారిన పడాల్సి వస్తే మాత్రం కాంగ్రెసు మాతాసుతులకు ఇరవై ఏళ్ల పైనే జైలు శిక్ష ఖాయమని స్వామిగారి లెక్క. దాని ఎక్కువ తక్కువలు ఎలా ఉన్నా, అదే జరిగితే ఇద్దరికీ ఓ పదేళ్ల దాకా పార్లమెంటు వైపు తొంగిచూసే ఆశ సున్న. ఒంటి స్తంభం (లేక ఒకటిన్నర స్తంభం) మేడలాంటి కాంగ్రెసు పార్టీకి అదే ప్రళయం. దాన్ని తప్పించుకోవటానికే ఇన్నిన్ని అవాకులూ, చవాకులూ, పార్లమెంటు హైజాకులూ.

-ఎం.వి.ఆర్. శాస్త్రి