ఉన్నమాట

‘ఫ్రీ’ మిథ్య... ‘బేసిక్’ మిథ్య... ‘ఫ్రీ బేసిక్స్’ అంతా మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా కోడీ కుంపటీ లేకపోతే ఎట్లా తెల్లవారుతుందో, నిప్పు ఎట్లా దొరుకుతుందో చూస్తానందిట ఒక అవ్వ.
నా ఫేస్‌బుక్కూ, ఫ్రీ బేసిక్కూ లేకపోతే లోకానికి ఎట్లా తెల్లవారుతుందో, పేదరికం ఎట్లా పోతుందో చూస్తానంటున్నాడు ఈ రోజుల్లో ఒక జుకరయ్య.
పలుకుబడి లేని పేదరాలు కాబట్టి అవ్వ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పెద్ద శ్రీమంతుడూ, మెదళ్లను శాసించే మోతుబరీ కాబట్టి జుకర్‌బెర్గ్ మాటే రైటు; అతడు లేకుంటే దేశానికి చీకటి అని మనవాళ్లే పలువురు ఓవరైపోతున్నారు.
దారిద్య్రాన్ని పోగొట్టటం, పేదల బతుకులు బాగు చేయటం, వారికి వైద్యం, రవాణా వంటి సదుపాయాలు సమకూర్చటం ప్రభుత్వాలు చెయ్యాల్సిన పని అని మనం ఇప్పటిదాకా అనుకుంటున్నాం. వాటికి దీర్ఘకాలిక ప్రణాళికలు, వేల కోట్ల రూపాయల నిధులు, బృహత్ యంత్రాంగాలు అవసరపడతాయనీ బళ్లో చదువుకున్నాం.
అదంతా నానె్సన్స్! ఇండియానుంచి దరిద్రాన్ని గెంటెయ్యటం అమెరికాలో కోట్లకు పడగలెత్తిన పెద్ద షావుకారు చెయ్యాల్సిన - కాదు; అతడు మాత్రమే చెయ్యకలిగిన పని. సెల్‌ఫోన్లో ఖర్చులేకుండా ఇంటర్నెట్టును అతడు పెట్టిస్తాడు. తనకు ఇష్టమైన కొన్ని సైట్లను అందులో చూపిస్తాడు. అంతే దరిద్రుడి దశ తిరుగుతుంది; అతడి ఇల్లు బంగారం అవుతుంది - అని ఇప్పుడు అర్జంటుగా కొత్తపాఠం నేర్చుకోవాలి.
ఈ సంగతేమిటో తెలియని వారికి ఒకింత వివరణ.
అనగా అనగా ఒక ఫేస్‌బుక్. అది ప్రపంచంలోకెల్లా పెద్ద సోమరి సత్రం. ‘‘రండి. కాణీ ఖర్చులేకుండా మా దగ్గర ఖాతా తెరవండి. మీ పనికిమాలిన స్వగతాలు, పోచుకోలు కబుర్లు, చచ్చు జోకులు, పుచ్చు కవిత్వాలు, పిచ్చి ఫోటోలు అన్నీ అందులో నింపండి. వాటిమీద మీలాంటి పనిలేనివాళ్లు కొట్టే ‘లైకు’లకు, చేసే ‘షేర్ల’కు పొంగిపోతూ పొద్దస్తమానం కాలక్షేపం చేయండి’’ అంటూ అది చల్లిన మాయలో ప్రపంచమంతటా కోట్ల జనం పడ్డారు. సరిగా ఉపయోగించుకుంటే సమాచార వినిమయానికి, విజ్ఞానవ్యాప్తికి, అభిప్రాయాల అనుసంధానానికి, భావాల ప్రచారానికి, సాంస్కృతిక సఖ్యతకు, వ్యక్తిగత, వ్యాపార, సామాజిక ప్రయోజనాలకు ప్రోదిచేసి ప్రపంచాన్ని దగ్గర చేయగల సాధనమే అది. కాని సద్వినియోగంకంటే దాన్ని దురుపయోగం చేసేవాళ్లే ఎక్కువ. మోసాలకు, దుర్మార్గాలకు, విద్రోహాలకు, గూఢచర్యాలకు అది వాటంగా అక్కరకొచ్చిన దృష్టాంతాలు లెక్కలేనన్ని. దేశదేశాల్లో లక్షల, కోట్ల జనాలకు ‘ఫేస్‌బుక్’ పెద్ద వ్యసనం. ‘అంతా ఉచితం’ అనడంవల్ల ఎక్కడెక్కడి వాళ్లూ విరగబడి, తేరగా వచ్చిందికదా అని తమకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందులో పెడతారు. ఆ సమాచారాన్ని బహుళ జాతీయ వ్యాపార సంస్థలకు టోకుగా, చిల్లరగా అమ్ముకుని, తమ దగ్గర అన్ని కోట్లమంది ఖాతాదారులున్నారని చెప్పి వాణిజ్య ప్రకటనలు పుష్కలంగా రాబట్టి ‘ఫేస్‌బుక్’ వారు విపరీతంగా లాభాలు సంపాదిస్తారు. అనేక దేశాల్లోని అన్నివర్గాల ప్రజలు తమ అకౌంట్లలో ఉంచిన సమాచారాన్ని, ఇతర వివరాలను అమెరికా గూఢచారి సంస్థలకూ నమ్మకంగా చేరవేస్తారు. వెర్రి జనాలు ఫేస్‌బుక్ ‘ఫేసు’నే చూసి మైమరచిపోతారుతప్ప ముఖపుస్తకపు అసలు మొహాన్ని ఎరుగరు.
ఈ రకంగా సోషల్ నెట్‌వర్కింగులో ప్రపంచంలోకెల్లా పెద్ద వ్యాపార సంస్థగా బిలియన్లకు పడగలెత్తాక, ఇబ్బడి ముబ్బడి లాభాలకు ఇంకా ఏమి దారులు ఉన్నాయా అని దుర్భిణీవేస్తే ‘ఫేసుబుక్’ ఆసాములకు వర్ధమాన దేశాల్లోని పామర జనం బంగారపు గనిలా కనిపించారు. అందులోనూ అతిపెద్ద పేద రాశి భారతదేశంలో దర్శనమిచ్చింది.
ఇండియాలో ఇప్పటికే పనె్నండు కోట్లమంది ‘ఫేస్‌బుక్’లోకి ఎక్కారు. వారినుంచి ఏటేటా కోట్ల డాలర్ల లాభాలు వస్తున్నాయి, కాని ఇండియా జనాభా 130 కోట్లు. ఇంకా 118 కోట్లమంది తమకు దొరకకుండా బయటే ఉన్నారు. వారిలో ఎంతమందిని తమ ‘బుక్’లోకి ఇరికిస్తే అన్ని భూరి లాభాలు!
ఎవరైనా ముఖపుస్తకానికి చిక్కాలంటే వారికి ముందు ఇంటర్నెట్టు కనెక్షను ఉండాలి. ఆ కనెక్షను లేనివాళ్లు ఒక్క ఇండియాలోనే వందకోట్లమందికి పైగా ఉన్నారు. మరి వారికి ‘వల’ వేయడం ఎలా?
సింపుల్! ఆ కనెక్షనేదో మనమే ఇస్తే సరి!
ఇవ్వవచ్చు. ఎక్కీతక్కీ లాభాల్లో మునిగి తేలుతున్న మనకు ఆ ఖర్చు పెద్ద లెక్కలోనిదికాదు. కాని ఇంటర్నెట్టులో వందకోట్ల వెబ్‌సైట్లు ఉన్నాయి. మన పోటీదారులవే బోలెడు దుకాణాలున్నాయి. మనం చేసే దానంవల్ల ప్రత్యర్థులు బాగుపడితే ఎలా? తీరా ఇంటర్నెట్టును మనం చేతుల్లో పెట్టినా జనాలు మన దుకాణానికి మాత్రమే పరిమితమవుతారన్న గ్యారంటీ ఏమిటి? అసలు మన మొగం చూస్తారని నమ్మడం ఎలా? మన వ్యాపారాన్ని పెంచుకోవడం ఎలా?
ఏముందీ? మొత్తంగా కాకుండా మనకు అవసరమైనంతవరకే ఇంటర్నెట్టు సదుపాయాన్ని జనాల చేతిలో పెడితేసరి. మనవి, మనకు కావలసినవారివి, మనతో వ్యాపార సంబంధాలున్న వారివి అయిన వెబ్‌సైట్లకు మాత్రమే దాన్ని పరిమితంచేస్తే సరి.
కాని- ఇంటర్నెట్ అనేది మహాసముద్రం. అందులో ఎవరైనా మునకలేయొచ్చు. పడవలు నడపొచ్చు. ‘వల’లు వేయొచ్చు. ఎవరికందిన చేపలు వారు పట్టొచ్చు. ఆ చేపలతో ఏ వ్యాపారాలైనా చేయవచ్చు. అన్ని విధాలా అందరికీ సమానావకాశాలు ఉండాలి; వాడుకునే వారికీ పూర్తి స్వేచ్ఛ ఉండాలి అన్నది నెట్‌లోకం పాటించే సార్వజనీన సూత్రం. Net Neutrality అనే ఆ పెద్ద అడ్డంకిని దాటితేగానీ ‘ఫేస్‌బుక్’ పబ్బం గడవదు. మరి దానిని దాటటం ఎలాగ?
జుకర్‌బెర్గ్ దొర ఒక ఉపాయం కనిపెట్టాడు. ‘ఫ్రీ బేసిక్స్’ అని కొత్త కొట్టు తెరిచాడు. డబ్బుకట్టి ఇంటర్నెట్టు సదుపాయం పొందాల్సిన అవసరం లేకుండానే కొత్త ఫ్లాట్‌ఫారం ద్వారా ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థల సేవలను పొందే సౌలభ్యం ఉచితంగా కల్పిసామన్నాడు. విద్య, ఆరోగ్యం, రవాణా, వాతావరణం మార్కెటింగ్‌లకు సంబంధించిన వివరాలు, సేవలు అందజేసే ఏర్పాట్లూ వాటిలో చేయిస్తామన్నాడు. వాటిని అందిపుచ్చుకుంటే చాలు పేదరికం పారిపోతుంది, సామాన్యుడు కాస్తా సంపన్నుడైపోతాడు అంటూ చిటికెల పందిరి వేశాడు. ఇండియాలో తన వ్యాపార భాగస్వామి అయిన అంబానీల ‘రిలయెన్సు’ సంస్థద్వారా మాయదారి ‘ఫ్రీ బేసిక్’ వ్యాపారం మొదలుపెట్టాడు.
దానిమీద దేశంలోని మేధావి లోకం మండిపడింది. పేదలను బాగుచేసే మిషమీద, సర్వసమానత్వ ‘నెట్ న్యూట్రాలిటీ’ సూత్రాన్ని ధిక్కరించి, మదించిన అమెరికన్ కంపెనీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక వరం ఇచ్చి, ఇతరులపట్ల తగని వివక్ష ఎలా చూపుతారని అందరూ నిగ్గదీశారు. దేశంలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (‘ట్రాయ్’) అభ్యంతరాలను మన్నించి, ‘ఫ్రీ బేసిక్స్’ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలుపు చేయించింది. 2015 డిసెంబర్ 31లోగా ఈ వ్యవహారంపై అభిప్రాయాలను తెలపాలని సర్వజనులనూ కోరింది.
ఈ అవాంతరాన్ని దాటి, ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని భారత సర్కారును బుట్టలోవేయటం కోసం జుకర్‌బెర్గ్ సర్వశక్తులూ ఒడ్డి పెద్ద ప్రచారయుద్ధం సాగించాడు. ఇండియాకువచ్చి, పలుచోట్లకు తిరిగి, గొప్ప గొప్ప వాళ్లతో కరచాలనాలుచేసి, తియ్యటి కబుర్లు చెప్పాడు. వందకోట్ల రూపాయలు విరజిమ్మి దేశంలోని పట్టణాల, నగరాల కూడళ్లలో హోర్డింగులు పెట్టించాడు. పత్రికలనిండా పేజీలకొద్దీ అడ్వర్టయిజ్‌మెంట్లు గుప్పించాడు. లేనివాళ్లకు నెట్ భాగ్యం కలిగించి తాము పేదలను ఉద్ధరించబోతే గిట్టనివారు అన్యాయంగా అడ్డుకుంటున్నారంటూ యాగీ చేశాడు. తమకు అనుకూలంగా పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ప్రచారం చేయించాడు. ఫేస్‌బుక్‌లోని కోట్లాది ఖాతాదారులను ఉసిగొలిపి, మభ్యపెట్టి భారత ప్రజాహితం మీద యుద్ధం ప్రకటించాడు. వీటి ప్రభావం ఎలా ఉంటుందో, పర్యవసానం ఏమవుతుందో వేచిచూడాలి.
ఇంటర్నెట్టు అసలే లేని దానికంటే ఎంతో కొంతయినా అమరడం మేలుకదా? లేనివారికి దాన్ని ఉచితంగా ఇస్తామని ముందుకొచ్చిన వాళ్లను ఎందుకు కాదనాలి? మనవల్ల కానిదానికి విదేశీ సంస్థ సహాయం తీసుకుంటే తప్పేమిటి... అంటూ తెలిసీ తెలియని మేధావులు సవాళ్లు బాగానే విసురుతున్నారు. నిజానికి ఇది మన దేశంమీద, ప్రభుత్వ సార్వభౌమాధికారం మీద, ప్రజల విశాల ప్రయోజనాలమీద జరుగుతున్న కనిపించని దాడి! అంతా ఉచితం, పేదరికాన్ని పారదోలడం, కలవాళ్లకు లేనివాళ్లకు నడుమ డిజిటల్ సమానత్వం... వగైరా మాయకబుర్లు ఎన్ని చెప్పినా వీటి వెనుక విదేశీయ కుటిల వ్యూహం దాగి ఉంది.
ఈ దేశంలో పనె్నండు కోట్లకు పైగా ఖాతాదారులుండి, వారిద్వారా వందలకోట్లు ఆర్జిస్తున్నా ఈ దేశంలోని న్యాయానికి తాము అతీతులమని, తమమీద ఇక్కడి కోర్టుల్లో ఎవరూ దావా వెయ్యడానికి వీల్లేదని చెప్పే అమెరికన్ దుకాణానికి భారత ప్రజలమీద, వారి సంక్షేమం మీద వల్లమాలిన ప్రేమ ఉన్నట్టుండి పుట్టుకొచ్చిందంటే నమ్మడం కష్టం. చేసేదంతా ఉచితసేవే, అందులో ఏ వ్యాపార స్వార్థమూ లేదంటూనే.... తమ అక్కర గడుపుకోవటానికి మీడియాతో వాణిజ్య ప్రకటనలమీదే వందలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టటాన్నిబట్టే ఈ ప్రజాసేవ వెనుక ఎంత పెద్ద వ్యాపార వ్యూహం ఉందో అర్థం చేసుకోవచ్చు.
తిండి, బట్ట, ఉండేందుకు గూడు లాగా ఇంటర్నెట్టు ఏమీ నిత్యావసర వస్తువు కాదు. అది చేతిలో ఉన్నంత మాత్రాన బతుకులు వెలిగిపోతాయనుకోవడం భ్రమ. ఫేస్‌బుక్‌వారు చూడనిచ్చే ఇంగ్లిషు వెబ్‌సైట్లలో విద్యగురించి ఎంత సమాచారం ఉన్నా ఆ భాష తెలియని, అక్షరజ్ఞానంలేని సామాన్యులకు ఉపయోగం సున్న. వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన వెబ్‌సైట్లను చూడగలిగినంత మాత్రాన రోగార్తులకు వైద్య సదుపాయం అందినట్టూ కాదు. వెబ్‌సైట్ నొక్కితే మందులు నోట్లో పడవు. మహారాష్టల్రో ఎవడో గణేశ్ అనేవాడు ‘ఫ్రీ బేసిక్స్’ ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకుని, దానికి తగ్గట్టు వ్యవసాయంచేసి, మార్కెటింగ్ ఆరాలు తీసి బ్రహ్మాండంగా లాభపడ్డాడంటూ జుకర్‌బెర్గ్ చెప్పేది కాకమ్మ కథ. ఇంటర్నెట్టువల్లే రైతులు, పేదలు బ్రహ్మాండంగా బాగుపడే పక్షంలో ఈ దేశాన ఇప్పటికే ‘ఫేస్‌బుక్’ భాగ్యం పట్టిన కోట్లాది విద్యావంతులు ఈ వరకే సిరిసంపదల్లో తులతూగుతూండాలి. ‘ఫ్రీ బేసిక్స్’ అని డాబుసరి పేరు పెట్టుకున్నంత మాత్రాన జుకర్‌బెర్గ్ ఇవ్వజూపేది ఏదీ ‘ఫ్రీ’ కాదు. మనిషికి తప్పనిసరిగా కావలసిన ‘బేసిక్’ విషయాలూ కావు. ఏది బేసికో, ఏది కాదో తామే నిర్ణయిస్తామని, తాము అనుమతించే వారికి మాత్రమే తమ నిబంధనలకు లోబడే తమ ఉచిత నాటకంలో చోటు పెడతామనీ చెప్పటం... స్వేచ్ఛాసూత్రాన్ని తుంగలో తొక్కి ఇంటర్నెట్టుకు గేటు కీపరు ఉద్యోగాన్ని ఎవ్వరూ ఇవ్వకుండానే పైన వేసుకోవడం ‘ఫేస్‌బుక్’ చేస్తున్న మోసం.
‘‘్భరతీయులు తమ వాయుతరంగాలను ఉపయోగించుకుని ఏ రకమైన డిజిటల్ సర్వీసులను బేసిక్‌గా పొందాలి అన్నది విదేశీ గడ్డమీద ఉన్న ప్రైవేటు సంస్థ నిర్ణయస్తుందనటం విడ్డూరం. మాటవరసకు ఒక చాక్లెట్ కంపెనీ భారతీయులందరికీ బేసిక్ ఆహారాన్ని ఉచితంగా ఇస్తాను; కాని ఏది బేసిక్ ఆహారమో నేనే నిర్ణయస్తాను - అని చెప్పిందనుకోండి. తాను అమ్మే చాక్లెట్లే అసలైన బేసిక్ ఆహారం అని తేల్చిందనుకోండి. అది ఎంత హాస్యాస్పదమో ఇప్పుడు ఫేస్‌బుక్ డబాయంపూ అంతే అసంబద్ధం’’- అంటున్నారు దేశంలో ప్రసిద్ధమైన ఐ.ఐ.టి.లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు యాభైమంది కలిసికట్టుగా చేసిన ఒక ప్రకటనలో.
‘‘హెయరాయల్ బాటిల్ కొంటే దువ్వెన ఫ్రీ అన్నారూ అంటే ఆ దువ్వెన ధరను ఇంకెక్కడో కలిపి వినియోగదారు నుంచే వసూలు చేస్తారు. ‘ఫ్రీ బేసిక్స్’ ఫ్రీ అనడమూ మార్కెటింగ్ చిట్కాయే. ఆ ‘ఉచిత’ సేవకయ్యే ఖర్చును ఫేస్‌బుక్కేమీ భరించదు. టెలికాం ఆపరేటర్ల నెత్తినే వేస్తుంది. వాళ్లేమో దాన్ని ఇంటర్నెట్టు వాడే మామూలు కస్టమర్ల నెత్తిమీదికి బదలాయస్తారు. దానివల్ల మిగతా సర్వీసులన్నిటి చార్జిలు పెరుగుతాయ. ధరల విధానంలో ఎగుడుదిగుళ్లు చోటు చేసుకుంటాయ. ఫేస్‌బుక్ మెహర్బానీ ఖరీదును మిగతా సర్వీసుల వాళ్లు భరించవలసి వస్తుంది. దేని ఖరీదు ఎంతో ‘ఫేస్‌బుక్’ నిర్ణయంచగలిగే పరిస్థితి వస్తే భారతీయులు తమ డిజిటల్ స్వాతంత్య్రాన్ని ఫేస్‌బుక్‌కు సరెండర్ చేసినట్టే అవుతుంది’’ అని ఐ.ఐ.టి.ల సీనియర్ ఉపాధ్యాయుల హెచ్చరిక. మన ‘డేటా’ను అమెరికా వాళ్ల చేతిలో పెట్టటం మన భద్రతకు ప్రమాదకరం. వాయుతరంగాల మీద సార్వభౌమత్వాన్ని అమెరికావాడికి అప్పగించడమంటే ఇంకో ‘ఈస్టిండియా కంపెనీ’కి తలుపులు తెరిచినట్టే.
జీతం బత్తెం లేకుండా గొర్రెలను కాపు కాస్తానన్న విదేశీ తోడేళ్లను నమ్మటంవల్ల ఇప్పటికే దేశం ఎంతో నష్టపోయింది. పత్తిసాగులో బహుళజాతి మాన్‌సాంటో రాకాసి గుత్త్ధాపత్యం వల్ల ఏమయిందో అందరికీ తెలిసిందే. బి.టి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్నిటిమీదా విదేశీయుల పెత్తనంమూలంగా సేద్యం వికటించి, ఎందరో రైతులు ఉరితాళ్లను వెదుక్కుంటున్నారు. పత్తివిత్తనాలమీద పేటెంట్లు, మేధోహక్కులద్వారా మాన్‌సాంటో చేసిన స్వైర విహారానే్న... ఇంటర్నెట్టు స్వేచ్ఛను ఉచ్చులో ఇరికించడంద్వారా జుకర్‌బెర్గ్ కాంక్షిస్తున్నాడు. అన్నట్టు మాయదారి మాన్‌సాంటోలో పెట్టుబడి పెట్టినవారే వగలమారి ‘ఫేస్‌బుక్’లోనూ పెద్ద పెట్టుబడిదారులు! విదేశీ మారీచులతో జాగ్రత్త అనడానికి ఈ దృష్టాంతం చాలదా?
ఏ ‘ఫేస్‌బుక్’ చేతివాటమూ లేకుండానే ఇండియాలో ఇంటర్నెట్ వాడకం నానాటికీ పెరుగుతున్నది. ఒక్క 2015 సంవత్సరంలోనే పది కోట్లమంది వినియోగదారులు కొత్తగా చేరారు. రెండువేల రూపాయలు పెట్టి బేసిక్‌ఫోను కొనుక్కోగలిగినవాడు ఇంటర్నెట్టువల్ల అన్ని లాభాలున్నాయనుకుంటే దాన్ని అమర్చుకోవడానికి నెలకు పాతిక రూపాయలు పెట్టలేడా? అందరికీ ఇంటర్నెట్టు ఇస్తే చాలు పేదరికం పరారయ్యేపక్షంలో ఆ ఉచిత సౌలభ్యమేదో భారత ప్రభుత్వమే కలిగించలేదా? సర్కారు తలచుకుంటే టెలికాం ఆపరేటర్లను, సర్వీసు ప్రొవైడర్లను కట్టడిచేసి ప్రజలందరికీ ఉచితంగా ‘నెట్’ ఇప్పించలేదా? దానికి అమెరికాలోని అమాంబాపతు దివాణమే కావాలా?

ఎం.వి.ఆర్.శాస్త్రి