ఉన్నమాట

‘సర్జికల్’ దాడి: అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదేళ్ల కింద ఒక అర్ధరాత్రి-
సి.ఐ.ఎ., అమెరికన్ నేవీ, ఆర్మీల ప్రత్యేక బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అల్‌ఖైదా రాక్షసుడు బిన్‌లాడెన్ కొంపమీద మెరపు దాడిచేసి, వాడిని చంపి సముద్రంలో పారేశాయి. ఇదిగో ఇలా చేశాం అని అంతా అయ్యాక అమెరికా ప్రెసిడెంటు ప్రకటించాడు. అన్ని పార్టీలు, ప్రతిపక్ష నాయకులు, మొత్తం మీడియా ‘శభాష్’ అన్నాయి.
అది అమెరికా కాబట్టి ఒబామా బతికిపోయాడు. అమెరికాకి కాక ఇండియాకు అతడు అధినాయకుడై అదే పనిని చేయించి ఉంటే-
వాడిని నిజంగా చంపారా? మీ పార్టీ లాభంకోసం నాటకమాడుతున్నారా? అంటూ కాంగ్రెస్ కోన్‌కిస్కాలు రాళ్లేసేవాళ్లు. దొంగాటకం ఆడించి మిలిటరీ పరువు తీశారని కొత్త పెళ్లికొడుకు దిగ్విజయ్‌సింగ్ యాగీ చేసేవాడు. వీరసైనికుల రక్తంతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని శాశ్వత బ్రహ్మచారి రాహుల్‌గాంధీ రంకెలేసేవాడు. నిజంగా చంపి ఉంటే భయమెందుకు; రుజువులూ, వీడియో సాక్ష్యాలు చూపించు; ఆక్షేపించేవాళ్ల నోళ్లు మూయించు అని ఢామ్ ఆద్మీ క్రేజీవాల్ అతి తెలివిగా గబ్బులేపేవాడు.
- ఇప్పుడు అధీనరేఖ (ఎల్.ఒ.సి.) ఆవలికి సాయుధ దళాలను దూకించి పాకిస్తాన్ దిమ్మ తిరిగేలా మోదీ ప్రభుత్వం జరిపించిన వీరోచిత చరిత్రాత్మక ‘సర్జికల్ దాడి’ మీద తీరికూర్చుని అవాకులు చవాకులు పేలుతున్నట్టు!
ఎక్కడైనా ఎప్పుడైనా - ఒక వాదాన్ని సవాలు చేసినవాడే తాననేది నిజమని నిరూపించుకోవాలి. ఇండియా ‘సర్జికల్ దాడి’ చెయ్యలేదని పాకిస్తాన్ సవాలు చేసినప్పుడు అలా దాడి జరగలేదని రుజువు చేసుకోవలసిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంటుంది. వాదులాడే ప్రతివాడికీ రుజువులు చూపెట్టాల్సిన అవసరం హిందుస్తాన్‌కి ఎంతమాత్రం లేదు. ఈ చిన్న కామన్‌సెన్సు పాయింటే మోదీ కీర్తిని ఓర్వలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్న రాజకీయ మరుగుజ్జులకు, మతిమాలిన కొందరు మీడియా పైత్యులకు బుర్రకెక్కటం లేదు.
మాటవరసకు మీకే ఒక పగవాడు ఉన్నాడు. నిష్కారణంగా మీ జోలికొస్తూ ముసుగు మనుషులను ఉసికొలిపి దొంగదెబ్బలు తీస్తూ, ఆగమాగం చేస్తూ చిరకాలంగా మిమ్మల్ని చికాకు పెడుతున్నాడు. ఓపిక పట్టినంతకాలం పట్టి, వారి చేతా వీరి చేతా బుద్ధి చెప్పించి, ఎంతకీ తీరు మారకపోవడంతో ఇక వాడిని వదలకూడదనుకున్నారు. మాటువేసి వాటం చూసి వాడి భరతం పట్టారు. మా బాగా అయిందని మీ ఇంటిల్లిపాదీ సంతోషించారు. మంచి పనిచేశారని ఊరి మోతుబరులూ మెచ్చుకున్నారు.
మరి - దెబ్బతిన్నవాడు ఏమి చేయాలి? దమ్ముంటే - తన బలగాన్నంతా వెంటనేసుకుని మీమీద దెబ్బలాటకు రావాలి. నేరుగా ఎదుర్కొంటే తన పని ఖాళీ అని అతడికి తెలుసు. కాబట్టి ఎప్పటిలా దొంగదెబ్బలు తియ్యటానికే కూహకాలు చేస్తాడు. దేహశుద్ధి జరిగినా ఏమీ చేయలేకపోయాడంటే నలుగురిలో నామర్దాకదా? కాబట్టి - తనకు దేహశుద్ధే కాలేదు; అంతా అబద్ధం అని బొంకుతాడు.
అప్పుడు మీ ఇంట్లోనే ఒక అడ్డగాడిద లేచి - ‘నిజంగా వాడిని తన్ని ఉంటే ఎందుకు జంకు? తన్నినట్టు ఫొటోలూ గట్రా సాక్ష్యాలు చూపి వాడి నోరు మూయించు. లేదా - అబద్ధం అడానని ఒప్పుకో’ అని వాగసాగాడనుకోండి. మీరేం చేస్తారు? చేయాల్సింది చేశాం; తగలాల్సిన దెబ్బ తగలాల్సిన చోట తగిలించాం; ఆ సంగతి తెలియాల్సిన వాళ్లకు తెలిసింది; మనం తప్పు చేశామని ఎవరూ అనడం లేదు; భంగపడ్డ పగవాడు సిగ్గు దాసుకోవటంకోసం, దాడి అబద్ధమని బుకాయిస్తుంటే మనమెందుకు కాదనాలి? ఆ సిగ్గుబిళ్లను కూడా ఎందుకు లాగెయ్యాలి? - అని దూరం ఆలోచించి నిబ్బరంగా ఉంటారా? లేక - అడ్డగాడిదలేవో కూశాయి కాబట్టి వాటి నోరు మూయించడం కోసం ఇదిగో సాక్ష్యాలు, ఇవిగో రుజువులు - అంటూ చాటింపు వేసి, చిక్కులో పడతారా?
పాకిస్తాన్ అన్ని విధాల విఫలమైన రాజ్యం. హిందుస్తాన్ మీద కసి దానికి ఊపిరి. ఆగర్భశత్రువు మీద కక్ష తీర్చుకునేందుకు దానికి ఉన్న ఒకే ఒక సాధనం, అది నమ్మే ఏకైక వ్యవస్థ మిలిటరీ. అది అజేయమని పాకిస్తానీల నమ్మిక. అదికూడా వమ్మయి, భారతీయుల మెరుపుదాడిని ఎదుర్కోలేక సైన్యం తెల్లమొగం వేసిందన్న సంగతి బయటపడితే పరువు పోతుంది. అందుకే అది సరిహద్దుల్లో మామూలు ఘర్షణే తప్ప ‘సర్జికల్ దాడి’ కానేకాదని పాక్ సైన్యం బుకాయించింది.
జరిగింది జరగనట్టు నమ్మించటం కోసం అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కొందరిని అధీనరేఖ దగ్గరికి పట్టుకెళ్లి, ‘దాడి అబద్ధం... అంతా ప్రశాంతం’ అంటూ కొంతమంది స్థానికుల చేత చెప్పించారు. కాని నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ పరిసరాల్లో మీడియా వారిని స్వేచ్ఛగా తిరగనివ్వలేదు. స్థానికులతో నేరుగా మాట్లాడనివ్వలేదు.
అలా మీడియాకు మూకుడు అడ్డంపెట్టినా పాకిస్తాన్ లోకం కళ్లు కప్పలేకపోయింది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ లాంటి పత్రికల ప్రతినిధులు అధీనరేఖ అవతలికి సాహసించి వెళ్లి స్థానికులను కదిలిస్తే నిజం బయటపడింది. సెప్టెంబర్ 29 రాత్రి టెర్రరిస్టుల మీద ఎక్కడెక్కడ దాడులు జరిగాయో ప్రత్యక్ష సాక్షులు పూసగుచ్చినట్టు వివరించారు.
పాకిస్తానీలకు కావలసిన విధంగా విదేశీ మీడియా చేత చెప్పించుకున్నట్టే, భారత ప్రభుత్వమూ తనకు కావలసిన విధంగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లాంటి దేశవాళి మీడియాచేత రాయించుకున్నదని అనుమానిద్దామా?
సెప్టెంబర్ 29 అర్ధరాత్రి 2 గంటల నుంచి నాలుగైదింటి వరకూ వేరువేరు చోట్ల దాడులు జరిగాయి; పాక్ సైనికులు ఐదుగురి ప్రాణాలు పోయాయి; చచ్చిన టెర్రరిస్టులను మిలిటరీ వాహనాల్లో తీసుకుని పోయి ఎక్కడెక్కడో పాతిపెట్టారు. భింబర్, పూంచ్, నీలంల్లో దాడులు జరిగిన ప్రాంతాలన్నిటినీ ఆర్మీ చుట్టుముట్టింది. గోరీల లెక్కను తేల్చేపనిలో ఉన్నాం - అని ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌పుర్ రేంజి పోలీసు సూపర్నెంటు గులాం అక్బరే ఏకరవుపెట్టాడు. మన సి.ఎన్.ఎన్. న్యూస్ 18 టీవీ చానల్ ప్రతినిధి ఫోన్‌చేసి, ‘‘ఐజిని మాట్లాడుతున్నా. ఏమయింది అక్కడ’’ అని గద్దించేసరికి బుట్టలోపడి ఎస్.పి. తనకు తెలిసిందంతా చెప్పాడు. స్థానిక ఎస్.పి. మాటలకంటే ‘సర్జికల్ దాడి’కి రుజువు ఏమికావాలి?
నిజమే కావచ్చు. కాని మన టీవీ చానల్ వాడెవడో చేసిన స్టింగ్ ఆపరేషన్ తిరుగులేని సాక్ష్యం ఎలా అవుతుంది? అటువైపు పోలీసు అధికారి అన్నమాట మీద నిలబడతాడా? అదీ పాయింటే. భారతీయ పత్రికలు, టీవీ చానెళ్లు చెప్పినవి పక్కనపెట్టి పాకిస్తానీ పత్రికల కథనాలనే చూద్దాం. నిన్నగాక మొన్న జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ‘మనమాట ఎవరూ నమ్మడం లేదు. ప్రపంచంలో ఏకాకి అవుతున్నాం. మిలిటరీ, ఐ.ఎస్.ఐ. ఇప్పటిలాగే మిలిటెంట్ల కొమ్ముకాస్తూ పోతే కష్టం’ అని ఐ.ఎస్.ఐ. అధిపతి మొగం మీద పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి చెప్పాడట. 2008 నవంబర్ 26 ముంబయి ముట్టడి, ఈ ఏటి పఠాన్‌కోట దాడి కేసుల్లో దర్యాప్తు ఇకనైనా తెమల్చండి. యథా ప్రకారం టెర్రరిస్టులను వెనకేసుకు వస్తే చెడ్డపేరు వస్తుంది - అని ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ఐ.ఎస్.ఐ.కి హెచ్చరిక చేశాడట. ఇది మన వాళ్లెవరో పుట్టించిన పుకారు కాదు. పాకిస్తాన్‌లో అగ్రశ్రేణి దినపత్రిక ‘డాన్’ బయటపెట్టిన వార్త.
ఈ మధ్య ఉరీలో మన సైనిక స్థావరంపై టెర్రరిస్టుల దాడి తరవాత కూడా తానే పాపం ఎరుగనంటూ షరామామూలు బుకాయింపులతో చిద్విలాసం ఒలికించి... తనను బదనామ్ చేయడానికి ఇండియాయే బూటకపు దాడి చేయించి నాటకమాడుతున్నదని దబాయించిన ఘనులు కదా పాకిస్తానీ పాలకులు? అలాంటి వారిలో హఠాత్తుగా ఈ గంగవెర్రులు ఎందుకు లేచాయి? అంతర్జాతీయంగా వేరుపడి పోతున్నామన్న కంగారు ఎందుకు పుట్టింది? ఉగ్రవాద కర్కోటకులపై చర్య ఏదీ తీసుకోకుండా ఇంకెంతమాత్రం ఉపేక్షించలేమని పాకిస్తాన్ ప్రధానమంత్రి అంతటి వాడికే చురుకు పుట్టటానికి కారణం మన మెరపుదాడి కాక మరేమిటి?
‘అధీనరేఖ ఆవల సైనిక చర్య కొత్తేమీ కాదు. మా హయాంలో నాలుగుసార్లు అలా ‘సర్జికల్ దాడి’ చేయించాం. కాని ఆ సంగతి మేము బయటికి చెప్పలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వంలా దానిని తెగ ప్రచారం చేసుకోలేదు. వీడియో కూడా తీయించామని దండోరా వేయలేదు’ అంటూ శరద్‌పవార్, చిదంబరం లాంటి కాంగ్రెసు పోటుగాళ్లు పెద్ద కబుర్లు బాగానే చెబుతున్నారు. రహస్యంగా లాగించామని వారే సెలవిస్తున్నారు కాబట్టి అలాంటి దాడులు నిజంగా జరిగాయో లేదో ఎవరికి ఎరుక? 4 కాదు 40 సార్లో 400 సార్లో రహస్యదాడులు చేయించామని వారు క్లెయిము చేసినా ఎవరు కాదనగలరు? వారు నిజమే చెబుతున్నారని మాట వరసకు అనుకున్నా... యు.పి.ఎ. మార్కు ‘సర్జికల్ దాడులు’ నాలుగింటిలో ఏ ఒక్కదానికీ పాకిస్తాన్‌లో చీమకుట్టిన పాటి చలనం లేదు. సోనియా రాజ్యం చల్లగాసాగిన పదేళ్లూ పాక్ కండకావరం నానాటికీ పెరుగుతూ పోయిందే తప్ప వీసమెత్తు తగ్గలేదు. మోదీ ప్రభుత్వం కూడా వారినే ఆదర్శంగా తీసుకుని, అతిరహస్యంగా ‘సర్జికల్ దాడి’ని చేసి, నోరు కట్టుకుని మిన్నకుండి ఉంటే - వారి ప్రభుత్వాల లాగా మోదీ అన్నా లెక్క లేకుండా ఇస్లామాబాద్ విర్రవీగేది. ఎల్.ఒ.సి. ఆవలికి తన టెర్రరిస్టు తొత్తులను సమీకరిస్తున్నదీ, వారికి వెన్నుదన్నుగా నిలిచి ఇండియాలోకి ప్రయోగిస్తున్నదీ పాక్ సైన్యమే అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలను చిత్రీకరించి, ఉగ్రవాద సైనిక స్థావరాలను మనవాళ్లు కెమెరా సాక్షిగా ధ్వంసం చేయగలిగారు కాబట్టే తేలుకుట్టిన దొంగలా పాకిస్తాన్ కిమ్మనడం లేదు. దానికి అలా వాకట్టు చేయడానికే, అవసరమైనప్పుడు బయటపెట్టి అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను బోనులో నిలబెట్టటం కోసమే న్యూఢిల్లీ దానిని వీడియో తీయించింది. తీయించినట్టు వ్యూహాత్మకంగా బహిరంగ ప్రకటన చేసింది.
పాకిస్తాన్ భరతం నిజంగా పట్టారా లేదా అన్న విషయంలో భారత ప్రజలకు అనుమానం లేదు. 45 ఏళ్ల తరవాత నిర్భయంగా, బాహాటంగా ‘గీత’ దాటి పాకిస్తానీలకు మన తడాఖా చవిచూపించిన మోదీ ప్రభుత్వ ప్రయోజకత్వానికి జాతి యావత్తూ మురిసిపోయింది. ప్రాంత, భాష, రాజకీయ తేడాపాడాలకు అతీతంగా యావద్దేశం మన సైనికుల శౌర్యాన్ని శ్లాఘిస్తున్నది. దాడి జరిగింది; వంక పెట్టలేనంత దివ్యంగా జరిగింది అని తెలుసుకాబట్టే అమెరికా, రష్యాలాంటి అగ్రరాజ్యాల అధినేతలు కూడా న్యూఢిల్లీకి వెంటనే ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అటు ప్రపంచానికీ, ఇటు దేశ ప్రజలకీ లేని అనుమానాలు కాంగ్రెసు శాల్తీలకు, క్రేజీవాలాలకు, వారికి పక్క వాయిద్యాలుగా మారిన మీడియా మిడిమేలం గాళ్లకు పొడుచుకుని వస్తే అది వారి మానసిక సమస్య. పనిలేని వాళ్లకు వచ్చే ప్రతి పనికిమాలిన సందేహానికీ సమాధానం చెప్పవలసిన అవసరం దేశానే్నలే ప్రభుత్వానికి లేదు.
అధీన రేఖ వెంబడి సర్వశక్తులు మొహరించి, ఎంత అప్రమత్తంగా ఉన్నా భారతీయులు ఎటునుంచి చొరబడ్డారు, అతి తక్కువ వ్యవధిలో అన్నిచోట్లకు ఎలా దూసుకెళ్లి టెర్రర్ సెంటర్లని, అందులోని వాళ్లని ఎలా మట్టుపెట్టగలిగారు అన్నది అంతుబట్టక కొమ్ములు తిరిగిన పాక్ కమాండర్లు జుట్లు పీక్కుంటున్నారు. మన ఏబ్రాసుల కాకిగోల పుణ్యమా అని ఆ వీడియోలు కనుక బయటపడితే వారికి పరమానందమే.
మోదీ కదలనంతవరకేమో ఎందుకు కదలడం లేదని ఎత్తిపొడుపు. కదిలాకేమో కదిలినట్టు రుజువు చేసుకోమని సవాళ్లు. దుర్మార్గపు దుమారానికి ఒకవేళ తల ఒగ్గి, సర్జికల్ దాడికి సంబంధించి ముందు జాగ్రత్తగా తీయించిపెట్టిన వీడియో సాక్ష్యాలను బయటపెట్టినా గోల ఆగదు. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా అత్యంత సెన్సిటివ్ అయిన భాగాలను ఎలాగూ బయటపెట్టకూడదు. వాటిని తొలగించి మిగతాది చూపెడితే - అదిగో సాక్ష్యాలను టింకరింగు చేశారని గగ్గోలు తప్పదు. ముంబయి ముట్టడి, పఠాన్‌కోట దాడికి సంబంధించి తిరుగులేని రుజువులు ఎన్ని చూపెడితే మాత్రం పాకిస్తాన్ తన తప్పును ఒప్పకుందా? ఆ సాక్ష్యాలు చాలవంటూ శషభిషలు మానిందా? అడిగే వాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ