ఉన్నమాట

తురక దయ్యం పట్టిన స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాములవారికి తురక దయ్యం పట్టింది.
కోట్లాది హిందువులు కొలిచే సాయబాబాలో కన్నుమూసినా తెరచినా ఆయనకు తురకే కనపడుతున్నాడు.
దయ్యం పట్టిన మనిషికి తానెవరో గుర్తుండదు. తన స్థాయికి తగ్గట్టు మర్యాదగా మాట్లాడాలి, హుందాగా మెలగాలి అన్న ఇంగిత జ్ఞానం ఉండదు. తన చేతలకు, కూతలకు లోకులు ఏమనుకుంటారోనన్న ధ్యాస ఉండదు. వికృత చేష్టల పర్యవసానం ఏమిటన్న వివేకమూ మిగలదు.
బదరి, ద్వారక శంకరపీఠాలను జాయింటుగా అధిష్ఠించిన శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారి ప్రస్తుత స్థితి అంతే.
స్వామివారు అల్లాటప్పా మనిషి కాదు. ఆయన చిన్నతనంలో క్విట్టిండియా పోరాటంలో పాల్గొని రెండు పర్యాయాలు జైలుకెళ్లిన స్వాతంత్య్ర యోధుడు. విప్లవ సాధువుగా పేరు పొందినవాడు. 1973 నుంచీ ఉత్తరామ్నాయ బదరీ జ్యోతిష్పీఠానికీ, 1982 నుంచీ పశ్చిమామ్నాయ ద్వారకపీఠానికీ ఆధిపత్యం వహిస్తున్న మహానుభావుడు. తొంబయ్యో పడిలో, శరీరం సహకరించని స్థితిలో కూడా ఉత్తర, పశ్చిమ భారతాలలో ఏకధాటిగా పర్యటిస్తూ, గంగానదిని మైలపరిచే హైడ్రో ప్రాజెక్టులకు గోహత్యకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ..., కాశ్మీర్ హిందువుల అవస్థలపై, 370 అధికరణంపై ధైర్యంగా గళమెత్తగలిగిన స్వరూపానంద స్వామి అంటే హిందువులకు ఎనలేని గౌరవం. అది కాస్తా ఆయనకు సాయ ద్వేషం పూనాక సన్నగిల్లింది.
రకరకాల భ్రాంతుల్లో, భ్రమల్లో కొట్టుమిట్టాడుతున్న జనాలకు సత్యమేదో తెలియపరచి... అవైదిక మతాలనూ, అధార్మిక వైఖరులనూ, అనాచారాలనూ నిష్కర్షగా ఖండించి, కళ్లు తెరిపించటం జగద్గురు పీఠాధిపతిగా తన బాధ్యత అని స్వరూపానంద సరస్వతి మహాస్వామి భావిస్తే ఎవరూ ఆక్షేపించాల్సిన పనిలేదు. శిరిడీ సాయి ఆరాధన వేద విరుద్ధం, ధర్మానికి వ్యతిరేకం అని స్వాములవారు నమ్మితే - ఆ విషయాన్ని స్ఫుటంగా, దృఢంగా ప్రజల ముందు ప్రకటించే హక్కు ఆయనకు ఉంది. శిష్టాచారానికి, ఆర్ష సంప్రదాయానికి, వైదిక విధి విధానాలకు సాయి మతం ఏవిధంగా విరుద్ధమో, ఆ దారిపట్టటంవల్ల అపాయమేమిటో తన స్థాయికి తగిన రీతిలో ఆయన ప్రవచించి, హెచ్చరించి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ధర్మాచార్యుడిగా తన బోధ తాను చెయ్యాలి; విన్నవాడు వింటాడు అనుకుని స్వామివారు తన హద్దుల్లో తానుంటే సమస్యే లేదు.
కాని ఆ నిగ్రహమే స్వాముల వారికి కరవైంది. అడ్డగోలుగా స్టేట్‌మెంట్లిచ్చి ఆయన తమ మత విశ్వాసాలను గాయపరచాడని ఐపిసి సెక్షన్ 298 కింద అభియోగం మోపి రాజేష్‌భాయ్ అనే సాయిభక్తుడు రెండేళ్ల కిందే కోర్టుకెక్కాడు. సాయిభక్తుల సెంటిమెంట్లను తన ప్రకటన నొప్పించి ఉంటే క్షమాపణ చెబుతున్నట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచి ముందు 2015, సెప్టెంబర్ 24న అపాలజీ లేఖ ఇచ్చుకుని ఆ కేసు నుంచి స్వామీజీ బయటపడ్డాడు. ఆ భంగపాటు తరవాతైనా ఆయన తీరు మారకపోగా ఇంకా వికటించి వెర్రితలలు వేస్తున్నది. సనాతన ధర్మానికి, వైదిక సంప్రదాయానికి వచ్చి పడిన ఏకైక బెడద సాయి ఆరాధనే అయినట్టూ... తక్షణం దానిని అరికట్టి నామరూపాలు లేకుండా చేయకపోతే హిందూ జాతికి మనుగడ లేనట్టూ స్వామీజీ ఎగిరెగిరి పడుతున్నాడు.
సాయబాబా మహమ్మదీయుడు... మాంసం తినే, మాయలు చేసే తురక పకీరుకు పూజార్హత లేదు, సాయని పూజించటం వేదానికీ, ధర్మానికీ, వ్యతిరేకం- అని ఫత్వా ఇవ్వడం మాత్రమే కాదు. గొప్ప సాయి భక్తులూ, మహా చరిత్ర పరిశోధకులూ వందేళ్ల నుంచీ ఎంత కష్టపడుతున్నా పట్టుకోలేకపోయిన సాయిబాబా జనన రహస్యాన్ని ఈ మహానుభావుడు దివ్యదృష్టితో ఇట్టే కనిపెట్టేశాడు. అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పిండారీకి అహమద్‌నగర్‌లో ఒక పడుపుగత్తెవల్ల కలిగిన సంతానమే సాయిబాబా అనబడే చాంద్‌మియా అని గంటకొట్టి చాటాడు. సాయిబాబా 1857 తిరుగుబాటు కాలంలో దోపిడీలు చేసి పట్టుబడిన బందిపోటు అని కూడా కర్ణపిశాచి సాయంతో కూపీ లాగాడు. శిరిడీ సాయి దైవం కాదు భూతం, ఆ సైతాన్‌ను వదిలించుకోకపోతే దేశానికి అరిష్టం అంటూ పెద్ద పీఠాధిపతి రంకెలేస్తున్నాడు. ఈ కారుకూతలకు ఒళ్లు మండి సాయిభక్తులెవరో తన దిష్టిబొమ్మను తగలబెడితే అందుకు ప్రతీకారంగా సాయిగుడులను పాడుబెడతాం... శిరీడీలో సాయిమందిరాన్ని కూల్చి అక్కడ సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠిస్తాం అంటూ పెడబొబ్బలు పెడుతున్నాడు. గుళ్లు కూల్చే పుణ్యకార్యంలోకి ఆంజనేయ స్వామిని కూడా అడ్డగోలుగా లాక్కొచ్చాడు.
నాందేడ్ జిల్లాలో ఈయనగారి భక్తుడొకడికి హనుమంతుడు చెట్టు మానుతో సాయిబాబాను మోదుతున్నట్టు కలవచ్చిందట. ఇంకేం? కలలోని దృశ్యాన్ని పోస్టరుగా వేయించి 2015 అక్టోబర్ 30న భోపాల్ సభలో దాన్ని స్వామీజీ అట్టహాసంగా రిలీజ్ చేశాడు. అలా మారుతిని తన సేనాపతిగా నియమించుకోవడమే కాదు. తన దిష్టిబొమ్మను కాల్చినందుకు శిక్షగా శిరిడీ సహా సాయి దేవాలయాలను ఆగం చేయడానికి కదలి రమ్మంటూ తన మాటవినే నాగసాధువుల ఆఖాడాలకు ప్రశస్తమైన పిలుపు ఇచ్చాడు. ఆ భయంకర మానవులను ఉసికొలిపి తాను సాగించదలిచిన విధ్వంసకాండకు ‘్ధర్మయుద్ధం’ అని గొప్ప పేరు పెట్టాడు. ఆ యుద్ధానికి సన్నాహంగా కొద్ది రోజుల కింద తెలుగు రాష్ట్రాలకూ విజయం చేసి, సాయి అనే భూతాన్ని పూజించటం దేశానికి అరిష్టం... అంటూ ఉద్బోధించాడు. ‘శిరిడీ సాయిని కొలవము... కొలిచే వారితో కలవము’ అంటూ తనను చూడవచ్చిన వారితో ప్రతిజ్ఞలు చేయించాడు.
ఏవిధంగా చూసినా ఇవి ఆకతాయి చేష్టలు. దేశంలోకెల్లా పెద్ద దేవాలయాల్లో మూడవదిగా విలసిల్లుతూ కోట్లాది భక్తులకు మహాపుణ్యక్షేత్రమైన శిరిడీ మీదికి నాగసాధువుల దండును ఉసికొలపటం, ఊరూరా వేల సంఖ్యలో హిందువులు కొలిచే సాయిబాబాను దుర్భాషలాడటం, ఆయన విగ్రహాలను కూల్చాలనటం సాయగుళ్లలో వేరే హిందూ దైవాల విగ్రహాలు, హిందూ దేవాలయాల్లో సాయబాబా బొమ్మలు పెట్టనే కూడదని శాసించటం మత విద్వేషాలను రెచ్చగొట్టి హిందూ సమాజంలో చిచ్చుపెట్టే దుర్మార్గం. ముక్కోటి దేవతలను కొలిచేందుకు అవకాశం ఉన్న మతంలో ఆ జాబితాలోకి సాయిబాబా పేరు చేరినందువల్ల హాని లేదు. చెట్టును, పుట్టను, జంతువును కూడా దైవసమానంగా తలిచి, జగత్తు అంతటా ఈశ్వరుడిని దర్శించి, ఎవరికి నచ్చిన మూర్తిని వారు ‘ఇష్టదేవత’గా ఎంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చిన మహోన్నత హిందూ ధర్మంలో ఈ రెండు పీఠాల పెద్దాయన గుర్తించిన ఐదుగురు దేవుళ్లకు మాత్రమే పూజార్హత కలదని చెప్పటం మూర్ఖత్వం. తన మసీదుకు ‘ద్వారకామాయి’ పేరుపెట్టి, తన భక్తులకు వారివారి ఇష్టదైవాల రూపంలో సాక్షాత్కరించి, హైందవ సంప్రదాయ ప్రకారం తనకు హారతులను, పూజాదికాలను చేయించుకుంటున్న సాయిబాబా హిందువులకు పూజ్యుడు కాడనటం తెంపరితనం.
తాను దేవుడినని సాయబాబా ఎన్నడూ చెప్పుకోలేదు. సమర్థ సద్గురు సాయనాథ్ మహారాజ్ అనే ఆయనను భక్తులు స్తుతిస్తారు. పిలిస్తే పలుకుతాడు; ఆపదలో ఆదుకుంటాడు; అనుక్షణం అండగా ఉంటాడు అని అనుభవపూర్వకంగా గురి కుదరడం వల్లే కోట్లాది హిందువులు ఆయనను భక్తితో కొలుస్తున్నారు. రాముడు, కృష్ణుడు, శివుడు లాంటి దేవుళ్లను భక్తితో ఆరాధించే వారిలో చాలామంది సాయని కూడా పూజిస్తారు. ఇంకొందరికైతే సాయబాబా మాత్రమే దేవుడు. ఎవరి విశ్వాసం వారిది. తమ ఆరాధ్య దైవాన్ని దూషిస్తే భక్తులకు తీవ్ర మనస్తాపం కలగటం సహజం. పెద్ద స్వామికి పూనిన సాయ ద్వేషాన్ని సకాలంలో అదుపు చేయకపోతే అసలే అన్ని వైపులా సమస్యలు చుట్టుముట్టిన హిందూ సమాజం పాలిట అది ముసలంగా మారే ప్రమాదం ఉంది. తన అప్రూవ్‌డ్ లిస్టులో లేడు కనుక సాయిబాబాకు పూజార్హత లేదన్న స్వామి, రేపు అదే కారణం చెప్పి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి వారికి కూడా ‘దేవుడు మన్నా’ చేయగలడు.
సాయిబాబా ‘్భతాన్ని’ పారదోలడానికి మారుతి చేత మానును పట్టించినట్టే ప్రకృతిని కూడా మహాస్వామి వదలలేదు. శిరిడీలో సాయిబాబాను పూజిస్తున్నందువల్లే మహారాష్ట్ర అంతటా దుర్భిక్షం నెలకొన్నదని ఆయన జనాలను భయపెట్టాడు. దానికి సాక్ష్యంగా మనువుగారినీ లాక్కొచ్చి, మనుస్మృతిలోని ఈ శ్లోకాన్ని ప్రతిచోటా ఉటంకిస్తున్నాడు.
అపూజ్యా యత్ర పూజ్యంతే, పూజ్యానాం చ వ్యతిక్రమః
త్రీణి తత్ర భవిష్యన్తి, దుర్భిక్షం మరణం భయమ్‌॥
(పూజించదగని వారిని పూజించినా, పూజనీయులను అవమానించినా కరవు, చావు, భయం అనే మూడు ఉత్పాతాలు సంభవిస్తాయి)
స్వాముల వారు చెబుతున్న శ్లోకం చాలా కరెక్టు. నిజానికి అది సాయిబాబాకు కాదు ఆయనకే వర్తిస్తుంది. పూజించదగని వాచాలుడిని జగద్గురు శంకరాచార్యుడిగా లోకులు పూజిస్తున్నందువల్లే దుర్భిక్షం లాంటివి తటస్థిస్తున్నాయేమో?! ఆయనకు పట్టిన ద్వేషపు దయ్యాన్ని సకాలంలో వదిలించకపోతే మరెన్నో ఉపద్రవాలూ తప్పవు.
ఇంతకీ బాబామీద ఈ ‘అధర్మయుద్ధం’ స్వాములవారి పుర్రెకు పుట్టిన బుద్ధేనా? దీని వెనక రాజకీయ క్షుద్ర ప్రయోగమేదైనా ఉందా? ఈ స్వామిజీ ఆధ్యాత్మికరంగంలో కాంగ్రెసు పార్టీ కోవర్టు అని కొంతమందికి ఎప్పటినుంచో డౌటు. దేశాన్ని ఊపేసిన రామజన్మభూమి ఉద్యమాన్ని నిలువరించటానికి రాజీవ్‌గాంధి ఈయనతో పోటీ కుంపటి పెట్టించే ప్రయత్నం చేశాడు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ విషయం ప్రస్తావించిన నేరానికే మండిపడి ఒక మీడియా విలేఖరిని లెంపకాయ కొట్టిన మహా సాత్వికుడు మన స్వామి. సర్వజ్ఞుడైన స్వరూపానందులకు సాయిబాబా తురక, మాంసాహారి, మాయలోడు, భూతం, సైతాను అన్న సంగతి 43 ఏళ్ల కింద జగద్గురు శంకర పీఠాన్ని ఎక్కినప్పుడూ తెలిసే ఉండాలి. అయినా నలభై ఏళ్లపాటు దానిపై శివాలెత్తకుండా తమాయించుకున్న వాడు రెండున్నరేళ్ల కింద కాంగ్రెసు రాజ్యం పోయి మోదీ గద్దెనెక్కిన తరవాతే సాయిపూజ మానాలి, సాయి విగ్రహాలు కూల్చెయ్యాలి అంటూ గగ్గోలు పెడుతూ పెద్ద ఎత్తున కాంపెయిన్ సాగిస్తున్నాడేమిటి? మోదీకి, బిజెపికి మూలబలం అయిన హిందూ సమాజంలో చిచ్చుపెట్టి, అంతర్యుద్ధం తెచ్చే దురుద్దేశంతో ఏ కాంగ్రెసువాళ్లో పన్నిన కుట్రలో తెలిసో తెలియకో ఈ స్వామి తలదూర్చాడా?

ఎం.వి.ఆర్.శాస్ర్తీ