ఉన్నమాట

కరెన్సీ కష్టాలు తీర్చలేకే ‘కాష్‌లెస్’ ఇచ్చకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. నల్లకాసురవధ అనుకున్నంత తేలిక కాదని నరేంద్రమోదిగారికి పెద్దనోట్ల అనుభవం తరవాత బోధపడినట్టుంది. నల్ల డబ్బును పెల్లగించడం కోసమే ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉన్నపళాన రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ఫెళఫెళార్భాటంతో ప్రకటించిన సర్కారువారి స్వరం అర్ధాంతరంగా మారింది. నగదు రహిత ఆర్థిక స్వర్గం కోసం కొత్త పలవరింత మొదలైంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఓపెనింగు అదిరింది. ప్లాను బ్రహ్మాండం. చలామణిలో ఉన్న కరెన్సీ విలువ సుమారు 15 లక్షల కోట్ల రూపాయలు. అందులో దాదాపు 40 శాతం అంటే 6 లక్షల కోట్ల రూపాయల వరకు లెక్కకు దొరకని, పన్నులకు చిక్కని, ఖజానాకు ఏవిధంగానూ ఉపయోగం లేని బ్లాక్‌మనీ. దాన్ని వదిలించుకోగలిగితే ఆర్థిక యంత్రానికి తుప్పు వదులుతుంది. అభివృద్ధికి, సంక్షేమానికి నిధుల కరవుపోతుంది. బీదాబిక్కి జనానికి పండగే పండగ. నల్లడబ్బు అక్రమ నిల్వకు ఉపయోగించేది ఐదొందలు, వెయ్యి రూపాయల పెద్దనోట్లు. చెప్పా పెట్టకుండా, సర్దుకునేందుకు వ్యవధి ఇవ్వకుండా వాటిని హఠాత్తుగా రద్దుచేస్తే ‘నల్ల’దొరల దిమ్మ తిరుగుతుంది. చెల్లని నోట్లను మార్చుకోవాలంటే వాటికి లెక్కలు, ఆరాలు చెప్పాలని షరతు పెడితే, ఎలాగూ బయటపెట్టలేరు. వాటిలో చాలామటుకు చిత్తు కాగితాల కింద బయట పారేసుకోవలసిందే. ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు ఆ విధంగా ‘నల్ల’ చెర వదిలితే ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు బంపర్ జాక్‌పాటే.
ఇదిగో ఇలా ఆలోచించే మోదీగారు నవంబర్ 8న నల్లధనంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. ‘నల్ల’కుబేరుల నడ్డి విరుగుతుంది. వాళ్ల రహస్య అరల్లోని నోట్ల కట్టలు చిత్తుకాగితాలయిపోతాయి. పనిలో పనిగా నకిలీ నోట్ల పీడ పోతుంది. టెర్రరిజానికి ఇంధనంగా వాటిని అచ్చోసి దేశం మీదికి వదులుతున్న విదేశీ శత్రువుల ఆట కడుతుంది. ఇనే్నసి భూరి లాభాలు కుప్ప తెప్పలుగా ఒనగూడబోతున్నాయి కాబట్టి కాస్త ఓపిక పట్టండి; తప్పని తిప్పలను ఎలాగో భరించండి; దేశంకోసం సహకరించండి - అంటూ ప్రధానమంత్రి గొప్ప ప్రేరణ ఇచ్చారు. అంత మంచి జరగబోతోందంటే మేము మాత్రం కాదంటామా, అలాగే కానిమ్మని ప్రజలు కూడా ఇబ్బందులకు సిద్ధపడ్డారు.
నోట్లరద్దు బాగోతం అలా బాగానే మొదలైంది. కాని అనుకోని విధంగా మధ్యలో అడ్డం తిరిగింది. పెద్దనోట్ల రద్దుకు ప్రధాని చెప్పుకున్న సంకల్పమే బ్లాక్‌మనీ పీచమణచడం కాబట్టి అందులో ఏమేరకు సఫలమైతే ఆ మేరకు రద్దు యజ్ఞం విజయవంతమైనట్టు! రద్దయిన నోట్లలో ఐదు లక్షల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు తిరిగి రాకుండా మురిగిపోతాయని ఆశిస్తున్నట్టు భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అధికార పూర్వకంగా విన్నవించింది. అదే నెరవేరితే నోట్ల రద్దు వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయినట్టే.
తీరా జరిగింది వేరొకటి. రద్దయిన నోట్ల విలువ మొత్తం కలిపి పదిహేను లక్షల కోట్ల రూపాయలు. అందులో ఏకంగా పదకొండున్నరకోట్ల రూపాయలు నెలతిరిగే సరికి బ్యాంకులకు వచ్చిపడ్డట్టు రిజర్వుబ్యాంకు గవర్నరుగారు సెలవిచ్చారు. నోట్ల మార్పిడికి సర్కారువారు పెట్టిన 50 రోజుల గడువులో 20 రోజులు అప్పటికి మిగిలే ఉన్నాయి. ఆలోగా మిగిలిన 500, 1000 రూపాయల నోట్లు కూడా బ్యాంకింగు సిస్టమ్‌లోకి వచ్చి తీరతాయని అనుకుంటున్నట్టు కేంద్ర రెవెన్యూ సెక్రటరీ హస్‌ముఖ్ అథియా ఉవాచ.
అంటే హళ్లికి హళ్లి. సున్నకుసున్న. రద్దుచేసిన పెద్దనోట్లన్నీ కట్టకట్టుకుని గువ్వపిట్టల్లా మళ్లీ బ్యాంకులకు వచ్చిపడేటప్పుడు నోట్ల రద్దు ఏమి సాధించినట్టు? బ్లాక్‌మనీదారులు ఇక చిత్తుకాగితాల కింద చలిమంటలు వేసుకోవలసిందేనని మోదీగారు సంబరంగా అంచనా వేసిన ‘నల్ల’ నోట్ల కట్టలన్నీ బ్యాంకులకు భద్రంగా వలసపోతాయి అంటే - ‘నల్ల’కాసురుల తలవెంట్రుకైనా చెదరనట్టే. మోదీగారి నోట్ల రద్దు మహాక్రతువు కష్టపడి సాధించింది ఏమిటయ్యా అంటే - ఇప్పటిదాకా అక్రమ సొత్తుగా ‘బ్లాక్’ మార్కు పడిన నల్లడబ్బును రాజమార్గంలో వెల్లవేసి పెట్టటమే.
తిరిగి రావనుకున్న నోట్లన్నీ రామబాణంలా వెనక్కి వచ్చేస్తున్నప్పుడు 5 లక్షల కోట్ల రూపాయల దాకా గల్లంతవుతాయని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏమవుతుంది? ఇంతకీ లెక్క ఎక్కడ తప్పింది?
పెద్దనోట్ల రూపంలో నేల మాళిగల్లో దాగిన లక్షలకోట్ల ‘బ్లాక్‌మనీ’ బ్యాంకుల్లోకి చొరబడకుండా పాపం, సర్కారు వారు మడిబట్టలు బాగానే కట్టారు. పాతనోట్లను నేరుగా మార్చుకోదలిస్తే ఎవరికీ 4వేల రూపాయలకు మించి ఇచ్చేది లేదన్నారు. దానికీ గుర్తింపు పత్రం చూపించాలన్నారు. ఏ ఖాతాలోనైనా 2 లక్షలకు మించి జమ అయితే లెక్కలు చెప్పాలన్నారు. వేరేవారి ద్వారా నోట్ల మార్పిడికి వీలు లేకుండా మొత్తంగా నగదు సరఫరాను బిగదీశారు. ఎ.టి.ఎం.ల నుంచి 2 వేలకు మించి, బ్యాంకు అకౌంట్ల నుంచి వారానికి 24 వేలకు మించి ఎవరూ తీసుకోలేకుండా ఆంక్షలు పెట్టారు. కరంటు అకౌంట్ల నుంచి ఎంత పెద్ద ఆసామీకీ అరిచిగీపెట్టినా వారానికి 50వేలకు మించి ఇచ్చేది లేదన్నారు. ఇక ‘నల్ల’ మోతుబరులు ఎక్కడికి పోతారు... వందల, వేల కోట్ల రూపాయలను ఎన్ని క్యూలలో నిలబడ్డా, చిల్లరగా ఎన్ని అకౌంట్లలో వేయించినా, 50 రోజుల్లో ఎలా మార్చుకోగలరు అని గవర్నమెంటు ప్లాను ఎంచక్కా వేసింది.
కాని - ‘నల్ల’ కామందులు తెలివి తేటల్లో ఏలినవారిని తలదన్నిన వారు. బ్లాక్ ఎకానమీని పెంచి పోషించేది అవినీతి. దానికి దారులు మూయనంతవరకూ ఎన్ని ఆంక్షలు పెట్టినా ఫలితం సున్న. పట్టుకోవలసిన వారిని పట్టుకోవలసిన విధంగా పట్టుకుంటే కాని పని ఏదీ ఉండదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ విద్య నల్లమూటల వారికి బాగా తెలుసు. నోట్లు మార్చుకోవటానికి బ్యాంకుల ముందు క్యూలలోనే నిలబడాలా? బ్యాంకుల పెద్దోళ్లనే ప్రసన్నం చేసుకుంటే చాలదా? ఇవ్వాల్సిన కమిషన్ ఇచ్చుకుంటే బ్యాంకుల్లోని కొత్త నోట్ల కట్టలు పొలోమంటూ బ్లాక్ భోషాణాలకు చేరవా? రిజర్వుబ్యాంకు శాఖల కట్టెదుటే కమిషన్ వ్యాపారాలు విజృంభించి కోట్ల లెక్కన సాగేటప్పుడు నోట్లు ఎలా మార్చుకోవాలన్న దిగులెందుకు? బంగారం బిస్కెట్లు, నగలు బ్లాక్‌లో ఎంతకావాలంటే అంత దొరుకుతున్నప్పుడు పాతనోట్లు ఏమి చేసుకోవాలన్న బెంబేలు ఏల? సర్కారువారే అప్పనంగా అమర్చిపెట్టిన ‘జన్‌ధన్’ ఖాతాలు ‘జీరో అకౌంట్లు’గా అక్కరకు రావడానికి లక్షల సంఖ్యలో సిద్ధంగా ఉన్నప్పుడు నోట్ల మూటలను చిల్లరగా బినామీ ఖాతాల్లో సర్దడానికి అడ్డేముంది? ఇలా అంతటా ఆవరించిన అవినీతి మార్గాలను తేరగా వాడుకుని ‘బ్లాక్’ బకాసురులు చెల్లని నోట్ల కట్టలను వదిలించుకుంటున్నారు.
నోట్ల రద్దు బ్రహ్మాస్త్రం బ్లాక్‌మనీని బద్దలు కొట్టటానికి పనిచేయలేదన్న సంగతి గ్రహించాక ప్రభుత్వం తబ్బిబ్బును కప్పిపుచ్చుకోవడానికి బాణీ మార్చింది. బ్లాక్‌మనీని చీరేస్తాం, ఏరేస్తాం అన్న హడావుడి మాని ఆరాటమంతా ‘నగదు రహిత ఆర్థిక విధానం’ కోసమేనని కొత్త రాగం ఎత్తుకుంది. నూటికి 97 లావాదేవీలు నగదు రూపంలో జరిగే దేశంలో... కష్టజీవుల్లో నూటికి 94 మంది బ్యాంకు ఖాతాలు, ప్లాస్టిక్ కార్డులు, ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా కాక కాష్ రూపంలోనే పనికి ప్రతిఫలం అందుకుంటున్న దేశంలో... చలామణిలోని కరెన్సీలో ఏకంగా 86 శాతాన్ని ఒక్క పెట్టున రద్దు చెయ్యడం అంటే ఒక మనిషి ఒంట్లో 86 శాతం రక్తాన్ని ఒకేసారి తోడెయ్యటం లాంటిదే. బ్యాంకుల శాఖలను ఎంత విరివిగా పెంచినా నేటికీ ఒక బ్యాంకుకు గాని, ఎటిఎంకు గాని నోచుకోని గ్రామాలు దేశంలో సగందాకా ఉన్నాయి. చదువుకున్న పట్నవాసులే క్రెడిట్ కార్డుల, డెబిట్ కార్డుల అడ్డమైన చార్జిల బాదుళ్లతో తిప్పలు పడుతూ, నానా మోసాలకు లోనవుతూ, అప్పుల ఊబినుంచి బయటపడలేక సతమతమవుతుంటే అక్షర జ్ఞానంలేని ఆదివాసులకు, పల్లెజనాలకు కూడా అర్జంటుగా ప్లాస్టిక్ కార్డులు అంటగడితే గాని ఆర్థిక రథం ముందుకు సాగదన్న సర్కారీ ఆలోచన ఏడ్చినట్టే ఉంది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బునే అవసరానికి వాడుకునే వీలు లేకుండా, తడవకో ఆంక్షతో, సామాన్య జనాన్ని యమ యాతన పెడుతున్న ప్రభుత్వం నగదు రహిత స్వర్గానికి నిచ్చెనలు వేయటం ఉట్టికెగర లేనమ్మ స్వర్గానికి ఎగురుతాననడం వంటిదే.
ప్రపంచంలో ఇప్పటికి ఎన్నో దేశాలు ఎంతగా ప్రయత్నించినా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ గతుకుల పుంతగానే మిగిలింది. అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లోనే నూటికి నూరుశాతం కాష్‌లెస్ ఎకానమీ సాధ్యపడనప్పుడు ఒక ఉపఖండం ప్రమాణంగల... విభిన్న ఆర్థిక వ్యత్యాసాలకు, నెలవైన ఇండియా లాంటి సువిశాల దేశంలో ఉన్న క్యాష్‌ను నలిపేసి, ఇకపై అంతా ‘కాష్‌లెస్’ అనగానే నగదు రహిత ‘మాయాబజార్’ ఆగమేఘాల మీద సాకారమవుతుందా?
నగదు వద్దు - కార్డులు ముద్దు అని ఎంత గంతులేసినా ఆ కార్డులు మన చేతిలో ఉన్నవి కావు. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సముదాయమైన స్టేట్‌బ్యాంకు సహా ఏ బ్యాంకు జారీచేసే క్రెడిట్, డెబిట్ కార్డులైనా బహుళజాతి కంపెనీలైన ‘వీసా’, ‘మాస్టర్ కార్డు’ల అజమాయిషీలో ఉన్నవే. ‘కాష్‌లెస్’ విధానంవల్ల ముఖ్యంగా బాగుపడేది ఆ విదేశవాళి కంపెనీలే. ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘రూపీ’ కార్డులను ప్రవేశపెట్టినా విదేశీ కంపెనీల కార్డులతో పోల్చితే వాటి విస్తృతి నగణ్యమే. ప్లాస్టిక్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల్లో సెక్యూరిటీ పరమైన సమస్యలవల్ల, నేరగాళ్ల మోసాలవల్ల ఇప్పటికే సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మొత్తం జనాభాకు ఆ బాపతు కార్డులను నిర్బంధం చేయడంవల్ల కొత్త తలనెప్పులు ఎన్ని వస్తాయి? ఇటువంటి కీలక, వౌలిక ఆర్థిక సంస్కరణలకు లేడికి లేచిందే పరుగన్నట్టు ఆదరాబాదరా ఉపక్రమిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేదా?
అసలు సంగతి ఏమిటంటే - బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు. చరిత్రలో ఏ దేశమూ ఎన్నడూ సాహసించని స్థాయిలో ఏకంగా 86 శాతం నగదును రాత్రికి రాత్రి రద్దుపరచడంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రద్దుచేసిన కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీని సరిపడా ప్రవేశపెట్టడానికి అన్ని ప్రభుత్వ ముద్రణశాలలు నిర్విరామంగా రేయింబవళ్లు పనిచేసినా కనీసం ఐదునెలలు పడుతుందని అంటున్నారు. బ్లాక్‌మనీ పోవాలంటే పెద్దనోట్లు ఉండకూడదని 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, అంతకంటే పెద్ద 2000 రూపాయల నోటును తెచ్చిపెట్టిన తుగ్లక్ చర్య అక్రమ నిల్వదారులకు వాటంగా ఉపయోగపడుతున్నది సరే. కాని కాళ్లు నొప్పులు పుట్టి, కళ్లు తిరిగేంతలా ఎన్నో గంటలు కొండవీటి చాంతాడంత క్యూలలో నిలబడితే, ఎటిఎంలు దయ కలిగితే ముష్టిలా విదిలించే 2వేల రూపాయల నోటుకు చిల్లర దొరకక అన్ని వర్గాల జనం అష్టకష్టాలు పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబరు లాంటి వాడి ఇంట్లో మాత్రం అవే 2వేల నోట్ల కట్టలు ఏకంగా 70 కోట్ల రూపాయల పైగా పట్టుబడ్డాయి. దొరకని ఘరానా దొంగల సంఖ్య ఇంకా ఎన్ని వందలో, వేలో ఏడుకొండలవాడికి ఎరుక. ముద్రించే కొత్త నోట్లు ఎక్కువ భాగం పలుకుబడిగల ఆసాముల ఇనప్పెట్టెలకు నిరాఘాటంగా చేరుతూండగా ప్రభుత్వం అనుమతించిన మేరకైనా కష్టార్జితాన్ని బ్యాంకుల నుంచి తీసుకునే తెరవు లేక, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న మొత్తాలను కూడా దిక్కుమాలిన డబ్బు ‘రేషన్’ కారణంగా అవసరానికి పొందలేక సాధారణ కుటుంబీకులు డబ్బుండీ దరిద్రులై హాహాకారాలు చేస్తున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, పకడ్బందీ ప్రణాళిక లేకుండా తీరికూర్చుని పెద్దనోట్లు రద్దుచేసి, తాను చేతులారా తెచ్చిపెట్టిన సంకటాన్ని దాటలేకే సర్కారువారి కాష్‌లెస్ ఆపసోపాలు! తీవ్రతరమైన నగదు సమస్యను తీర్చలేకే ‘నగదు రహిత’ ఆకాశానికి సోపానాలు!

ఎం.వి.ఆర్.శాస్ర్తీ