ఉన్నమాట

ప్రజలపాట్లు... కార్డు కంపెనీలకు జాక్‌పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది! గిరీశం భాషలో చెప్పాలంటే ‘కుప్పు సామయ్యర్ మేడ్ డిఫికల్ట్’.
సాధారణంగా ఏ దేశంలోనైనా సంక్షోభం మీదపడ్డప్పుడు ఆర్థిక సంస్కరణకు ఉపక్రమిస్తారు. సూపర్‌మాన్ మోదీ ఆర్థిక సంస్కరణకు ఉపక్రమించి సంక్షోభం తెచ్చిపెట్టాడు. నవంబర్ 8న ఆయన పెద్దనోట్లు రద్దు చేయడానికి ముందు మనది అతివేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడది అతివేగంగా మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ.
నూటికి 90పైగా లావాదేవీలు నగదు రూపంలో జరిగే దేశంలో ఏకంగా 86 శాతం కరెన్సీని ఒక్క పెట్టున రద్దు చేయడంతో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పల్లెవాసులు, రోజువారి వేతనాల మీద బతికే కష్టజీవులు, వీధుల్లో చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు నానా అగచాట్లుపడుతున్నారు. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో 46 శాతానికి, మొత్తం పనివారిలో 80 శాతానికి ప్రాతినిధ్యం వహించే అనియత ఆర్థిక రంగం నోట్ల రద్దు పిడుగుపాటుతో కకావికలైంది. బ్లాక్‌మనీ మీద గురిపెట్టిన ‘సర్జికల్ దాడి’ దారితప్పి, సామాన్య ప్రజలను పిశాచంలా పీడిస్తున్నది. పెట్టుబడులకు డబ్బుల్లేక, కూలీలకు వేతనాలివ్వటానికి కరెన్సీ లేక రైతులు యమయాతనలు పడుతూండటంతో దేశానికి వెనె్నముక అయిన వ్యవసాయ రంగానికి, దానిమీద ఆధారపడిన శ్రామిక జనానికి పెద్ద దెబ్బ తప్పదని ‘డిలాయిట్’ లాంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేశాయి. 50 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందన్న తొలి ఆశ ఆవిరైంది. మళ్లీ మామూలు స్థితి నెలకొనడానికి మోదీగారు పెట్టిన డిసెంబర్ 31 గడువు దగ్గరపడ్డా, పరిస్థితి అంతకంతకూ విషమిస్తున్నది. 50 రోజుల్లోగా కష్టాలు తొలగకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని ఎలుగెత్తి చాటిన ప్రధానమంత్రి ఇప్పుడు బాణీ మార్చి, 50 రోజుల తరవాత పరిస్థితి మెల్లమెల్లగా మారడం మొదలెడుతుందని నాలుకమడత వేశారు. ఆ మెల్లమెల్ల చక్కబాటు ఏనాటికి పూర్తవుతుందో బహుశా ఆయనకే తెలియదు. అప్పటిదాకా అన్ని బాపతుల జనాలకు అష్టకష్టాలు తప్పవు.
తాను అధికారం అందుకున్న వెనువెంటనే విదేశీ బ్యాంకుల్లో అక్రమార్కులు దాచుకున్న వేలకోట్ల డాలర్లను ఇట్టే పట్టేసి, దేశంలోని ప్రతి పేదవాడికి తలా పదిహేను లక్షల రూపాయల చొప్పున పంచిపెడతానని ఎన్నికల్లో చేసిన భీషణ ప్రతిజ్ఞను గాలికొదిలారని విపక్షాలు చీటికీ మాటకీ ఎత్తిపొడవటం నరేంద్రమోదికి చికాకుగా ఉంది. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవం, మరి మూడునెలల్లో తప్పని అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా తప్పించుకోవటానికి ఏమి చేయాలా అని మేధోమథనం చేస్తే ‘పెద్దనోట్ల రద్దు’ దివ్యాలోచన స్ఫురించినట్టుంది. ఐదారు లక్షల కోట్ల వరకూ నగదు రూపంలో ఉన్నదనుకుంటున్న బ్లాక్‌మనీని 500, 1000 నోట్ల ఆకస్మిక రద్దు ద్వారా వదిలించుకోగలిగితే బీదాబిక్కీ జనానికి తలకు ఎన్ని లక్షల రూపాయలైనా పప్పుబెల్లాల్లా పంచిపెట్టవచ్చు; ఎన్ని సంక్షేమ చర్యలైనా ప్రకటించవచ్చు. కళ్లు తిరిగే భూరి ఉపకారాలతో యు.పి., పంజాబ్ ఓటర్లను ఎంచక్కా ప్రసన్నం చేసుకుని జయభేరి మోగించవచ్చు అని ప్లాను బాగానే వేశారు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఈపాటకి నరేంద్రమోది పేరు పేదలపాలిటి పెన్నిధిగా, ప్రపంచంలో సాటిలేని ఆర్థిక సంస్కర్తగా మోతమోగి ఉండేదే. రాగల సాధక బాధకాలపై సరైన అవగాహన, పకడ్బందీ ప్రణాళిక లేకుండా... ముందస్తు ఏర్పాట్లు, కట్టుదిట్టాలు చేయకుండా, తలచిందే తడవుగా తీవ్ర సాహసానికి తొందరపడటంతో బాణం గురి తప్పింది. మొత్తం దేశం కొత్త సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కాదు; ప్రజలే సుప్రీం. ప్రధానమంత్రి ఎంతటి మొనగాడయినా నియంతకాడు. ఐదేళ్లకోసారి తమ కాళ్ల దగ్గరికి వచ్చే పార్టీలు, నాయకులు తమ ముందు పెట్టే విధానాలను, ఆలోచనలను పరిశీలించి, ఎవరు యోగ్యులనిపిస్తే వారికి తమ తరఫున పరిపాలించేందుకు ఐదేళ్ల కౌలును ప్రజలు ఇస్తారు. అసలు యజమానులైన ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, అడ్డమైన ఆరళ్లకు గురి చేయకుండా తమ తాహతు గుర్తెరిగి తమ హద్దుల్లో తాముండటం రాజ్యమేలే వారికి మంచిది. దేశానికి తామే అధినాధులమని, ప్రజలు ఎలా బతకాలో, ఎలా మెలగాలో, ఏ పద్ధతిలో తమ వ్యవహారాలను సాగించాలో తామే నిరంకుశంగా నిర్ణయిస్తామని అహంకరిస్తే పాలకులకు మొదటికే మోసం తప్పదు.
విదేశాల్లోని నల్లడబ్బు గుట్టలను కొల్లగొట్టి ప్రజలకు పంచుతానని ఎన్నికల ఊపులో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవటం నరేంద్రమోదికి చేతకాకపోతే అదో నేరం కాదు. బ్లాక్‌మనీ మకిలిని వదిలించే సదుద్దేశంతో తలపెట్టిన పెద్ద నోట్లరద్దు సాహసం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతేనూ ఆయనను శిలువ వేయాల్సిన పనిలేదు. ప్రధానమంత్రి ఎంత నీతిమంతుడైనా, నిజాయతీపరుడైనా, ఆయన ఆశయం ఎంత వంకలేనిదైనా దాన్ని అమలుపరచడం లక్ష చేతుల, లక్ష కాళ్ల అధికార యంత్రాంగం పనితనం మీద ఆధారపడుతుంది. ఆ యంత్రాంగం నిలువెల్లా అవినీతి మయం అన్న సంగతి ప్రజలకూ తెలుసు. పెద్దనోట్ల రద్దువల్ల అనుకున్నది సాధించలేక పోయామని నరేంద్ర మోదీ బహిరంగంగా ఒప్పుకుని, జనానికి కలిగిన అసౌకర్యానికి సిన్సియర్‌గా విచారం వ్యక్తపరిచి, నడమంత్రపు ఇబ్బందులను తొలగించడానికి నిర్దిష్ట చర్యలు సమర్థంగా తీసుకుంటున్నారన్న నమ్మకం కలిగించగలిగితే జనం సహృదయంతో అర్థం చేసుకోగలరు. ఈ రాజమార్గాన్ని వదిలి, ఒక భంగపాటును కప్పిపుచ్చుకోవటానికి ఇంకా పెద్ద తప్పులు చేసి, అసలు ప్రభువులైన ప్రజలను అడ్డగోలు ఆంక్షలతో శాసించబోతే అది మహాపరాధం.
తమ కష్టార్జితాన్ని ఎలా , ఏ రూపంలో ఖర్చుపెట్టాలి, దాచుకున్న సొమ్మును ఎప్పుడు ఎంత ఎలా వాడుకోవాలి అన్నది ప్రజల ఇష్టం. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులను కట్టకపోతే చట్టప్రకారం శిక్షించవచ్చు. పన్నులు కట్టగా మిగిలిన, లేక పన్నులు కట్టనవసరం లేని కష్టార్జితాన్ని ఎలా వినియోగించాలో ఏవిధంగా వాడుకోవాలో శాసించే హక్కు ప్రభుత్వానికి లేదు. నూటికి 90 లావాదేవీలను నగదు రూపేణా జరుపుకోవడానికి ఇంతకాలమూ అలవాటు పడిన వారిని ఇకపై లావాదేవీలన్నీ ప్లాస్టిక్ కార్డుల ద్వారానే, ఆన్‌లైన్‌లోనే జరగాలని కట్టడి చేయడంలోని ఔచిత్యమేమిటో ప్రభుత్వానికే తెలియాలి. దేశంలో ఉన్న క్యాష్ అంతా బ్లాక్‌మనీ కాదు. బ్లాక్ సొత్తు యావత్తూ క్యాష్ రూపంలోనూ ఉండదు. విదేశీ బ్యాంకుల రహస్య ఖాతాల్లో, బినామీ ఆస్తుల్లో, వెండి బంగారాల రూపంలో, హవాలా దారిలో, క్రయవిక్రయాల మోసపు లెక్కల్లో వందల, వేల కోట్ల రూపాయల అక్రమార్జనను దాచిపుచ్చే వారిమీద... బ్యాంకులకు ప్రభుత్వ ఏజన్సీలకు బకాయిలు భారీగా ఎగ్గొట్టే ‘మాల్యా’ల మీద సర్కారువారు ప్రతాపం చూపిస్తే అందరూ మెచ్చుకుంటారు. పట్టపగ్గాలు లేని ‘నల్ల’ తిమింగలాలను ఏమీ చేయలేక, వాటి పనిపట్టాలన్న గట్టి పట్టుదలనూ కనపరచక చేతులు ముడుచుకున్న వారు ఏవో కొన్ని వేలనో, లక్షలనో రుజుమార్గంలో కూడబెట్టి, బ్యాంకుల్లో దాచుకున్న వారిని తక్షణ అవసరాలకు కూడా వాటిని వాడుకునే వీలు లేకుండా సవాలక్ష ఆంక్షలకు గురిచేయటం ఏ రకంగా చూసినా దుర్మార్గం, దారుణం.
ప్రతి కరెన్సీ నోటు మీద 'I promise to pay the bearer the sum of Rupees...' (దీనిని చూపించిన వ్యక్తికి ఇన్ని రూపాయలు చెల్లించగల వాడను) అంటూ రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకంతో విస్పష్టమైన హామీ ఉంటుంది. ఆ హామీ మీద నమ్మకంతోటే జనం ఆ కాగితం ముక్కను విలువైన కరెన్సీ కింద పరిగణిస్తారు. మొత్తం కరెన్సీలో ఒకేసారి 86 శాతాన్ని చెల్లదు పొమ్మని ప్రభుత్వం ప్రకటిస్తే, అన్ని లక్షల కోట్ల నోట్ల మీద చట్టబద్ధంగా రిజర్వు బ్యాంకు ఇచ్చిన హామీ ఏమవుతుంది? ఆ నిర్ణయం చట్టరీత్యా ఎంతవరకు చెల్లుతుంది? చెల్లని నోట్ల స్థానంలో తెచ్చిన 500 రూపాయల నోటు ఎవరో కొద్దిమంది అదృష్టవంతులకే తప్ప జనబాహుళ్యానికి చంద్రమతి మాంగల్యంలా కంటపడటం లేదు. పెద్దదని చెప్పి వెయ్యి నోటును తీసిపారేసి, దాని స్థానంలో తెచ్చిన అంతకంటే పెద్ద 2000 రూపాయల నోటు అట్టే కాలం చలామణిలో ఉండదనీ అభిజ్ఞ వర్గాలే సెలవిస్తున్నాయి. ఎప్పుడు మంగళం పాడతారో తెలియని నోట్లను జనం మాత్రం ఎలా విశ్వసించగలరు? ప్రభుత్వం ఇచ్చే కాగితాల కరెన్సీ మీద జనానికి నమ్మకం పోయి ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కుంటే ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది?
పార్టీలోగాని, ప్రభుత్వంలోగాని, పార్లమెంటులోగాని సాకల్యంగా చర్చించకుండా, పర్యవసానాలను కానకుండా, మొత్తం కరెన్సీలో 86 శాతాన్ని ఒక్క పోటుతో రద్దు చేసిన ప్రభుత్వానికి దానివల్ల రాగల తక్షణ సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో స్పష్టత లేదు. పూటకో మాట, తడవకో రూలు గమనిస్తే ప్రభుత్వానికి స్థిర నిర్ణయం, నిర్దిష్ట విధానం ఉన్నట్టు తోచదు. పెట్టిన రూలునూ అమలుపరిచే దిక్కు లేదు. సేవింగ్సు బ్యాంకు ఖాతా నుంచి వారానికి 24వేల రూపాయలు తీసుకోవచ్చని సర్కారీ దేవుడు వరం ఇచ్చినా మామూలు కస్టమర్లకు 4వేలకు మించి ఇవ్వటానికి బ్యాంకుల పూజార్లు ససేమిరా ఒప్పుకోవటం లేదు. ఎంత కష్టం, ఎంత అవసరం వచ్చినా సరే, తమ డబ్బును తాము వాడుకోవటానికి సామాన్య ఖాతాదారుల మీద అడ్డగోలు ఆంక్షలు. ప్రతి తడవా ఆధార్‌కార్డు చూపించాలి, ఆరాలు చెప్పాలి అంటూ అర్థం లేని కట్టుబాట్లు. ఖాతాలో తగినంత డబ్బు లేకుండా చెక్కు ఇస్తే కస్టమర్లమీద బ్యాంకులు పెనాల్టీ వేస్తాయ కదా? మీ ఖాతాలో డబ్బున్నా మీది మీకివ్వటానికి మా వద్ద డబ్బు లేదని చేతులెత్తే బ్యాంకులకు, వాటిని నియంత్రించే ప్రభుత్వానికి ఏమిటి పెనాల్టీ?
మామూలు మనుషులు తడవకు 4వేలకు మించి బ్యాంకులో, 2వేలకు మించి ఎటిఎంల్లో డ్రా చేసుకునే ఆస్కారం లేకుండా బిగదీసి, చేంతాడంత క్యూలలో నిలవేసి, ‘నో క్యాష్’ బోర్డులు పెట్టి జనాన్ని నానా యాతన పెడుతున్నవారు ఘరానా ఆసాములకు మాత్రం కోట్ల లెక్కన నోట్ల కట్టలు ఎన్ని అడిగితే అన్ని సమర్పించుకుంటున్నారు. టి.టి.డి.కి చెందిన ఒక ఆసామి దగ్గరే 70 కోట్ల రూపాయలు పట్టుబడిందంటే, యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఒక్క బ్రాంచిలోనే 60 కోట్ల మేర దొంగ ఖాతాల్లో ‘నల్ల’ డిపాజిట్లు కనపడ్డాయంటే - దేశం మొత్తంమీద దొరకని బందిపోట్లు దగ్గర పోగుపడ్డ కొత్త కరెన్సీ ఎన్ని వేలకోట్లు ఉంటుంది? బ్యాంకుల్లో ఇంటి దొంగలనే పట్టలేక, వందల కోట్ల విలువైన కొత్త నోట్లు బాహాటంగా దారిమళ్లుతున్నా ఏమీ చేయలేని ప్రభుత్వం మీద... ముష్టి విదిలింపుల కోసం క్యూలలో నిలబడి నిలబడి సొమ్మసిల్లే ప్రజలకు ఎటువంటి సుహృద్భావం ఉంటుంది?
నూటపాతికకోట్ల పైచిలుకు జనాభాగల దేశంలో నూరుకోట్ల మంది దగ్గర స్మార్ట్ ఫోన్లూ లేవు; ప్లాస్టిక్ కార్డులూ లేవు. ముప్పాతిక భాగం పల్లెల్లో ఎటిఎంలు లేవు. ఇంటర్నెట్ కనెక్టివిటీ అసలే లేదు. అయినాసరే కార్డుల ద్వారా, ఆన్‌లైన్‌లోనే అన్ని చెల్లింపులూ జరగాలి, క్యాష్ వాడితే పెనాల్టీ వేస్తాం అని నిర్బంధాలు పెడితే అక్షర జ్ఞానంలేని, టెక్నాలజీ తెలియని కోటానుకోట్ల ప్రజానీకం ఏమి కావాలి? ఎందుకు అవస్థలు పడాలి? ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ఉన్న యు.పి.ఐ. పద్ధతిని ప్రోత్సహించకుండా ‘పేటిఎం’లాంటి ప్రైవేటు సంస్థలకు క్యాష్‌లెస్ వేలంవెర్రితో వందలకోట్ల రూపాయలు ప్రభుత్వమే, దోచిపెట్టటం ఎంతవరకు సమంజసం? ‘కాష్’ మలినం, ‘కార్డు’ పరిశుద్ధం అంటున్న ప్రభుత్వ నిర్వాకం మూలంగా దేశంలో ముమ్మరమైన కోటానుకోట్ల ఆర్థిక లావాదేవీల్లో ప్రతి ఒక్క దానిమీదా వీసా, మాస్టర్ కార్డు వంటి విదేశీ కంపెనీలకు తేరగా జమపడేది ఏడాదికి ఎన్ని లక్షల కోట్లు? విదేశీ గద్దలను మేపడానికి దేశవాసులను ఇంతలా హింసపెట్టాలా?

ఎం.వి.ఆర్.శాస్ర్తీ