ఉన్నమాట

‘వింత జంతువుల’కు జెల్లకొట్టిన జల్లికట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇంటి పేరు హిపోక్రసీ!
జంతు హింసలో మనకు మనమే సాటి.
అమాయక జీవాలను ఘోరంగా చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకునే క్రూరత్వంలో రాక్షసులు, కిరాతకులు మనముందు బలాదూరు.
అయినా - ఎగ్గు లేకుండా మనం ఒలికించే జీవకారుణ్యాన్ని చూస్తే బుద్ధుడు, మహావీరుడు కూడా మూర్ఛపోవలసిందే.
ప్రస్తుతం మన కారుణ్య మహా ప్రవాహం జల్లికట్టు కోడెలను కుమ్మి, తమిళ తీరాన్ని ముంచెత్తింది.
జల్లికట్టును తిట్టి పొయ్యటం నాగరిక లక్షణం. దాన్ని ఆడటం మూగజీవాలను క్రూరంగా హింసించటం; అమానుషం- అని ఒప్పుకోనివాడికి మానవత్వం లేనట్టు లెక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆడనివ్వరాదని ఎలుగెత్తడానికి దాని గురించి తెలియాల్సిన అవసరం లేదు. పనీపాటా లేని విదేశవాళీ ‘పేటా’ (People for Ethical Treatment of Animals) వాళ్ల రణగొణ ధ్వనిలో కళ్లు మూసుకుని గొంతు కలిపితే చాలు.
‘పేటా’ ప్రేరేపణతో ఇవాళ జల్లికట్టును దేశమంతటా దుమ్మెత్తిపోస్తున్న ‘జంతు ప్రేమికులు’ అనే వింత జంతువుల్లో నూటికి 99 మంది తమిళనాడులో ఏవో కొద్ది ప్రాంతాల్లో అదీ ఏడాదికి ఒకసారి సంక్రాంతి సీజనులో ఆడే ఆ ఆటను జన్మలో ఎన్నడూ చూసి ఉండరు. అందులో కోడె వయసు కుర్రవాళ్లు తలపడేది కోడెతో. దాన్ని ఇంగ్లిషులో బుల్ అంటారు. బుల్ అనగానే విద్యావంతులకు స్పెయిన్ లాంటి దేశాల్లో జరిగే బుల్‌ఫైట్ గుర్తుకొస్తుంది. అందులో బల్లేలతో పొడిచి ఎద్దులను క్రూరంగా హింసిస్తారు. పందెంలో గెలిచిన వాడు ఎద్దును పొడిచి అమాంతం చంపేస్తాడు. సినిమాల్లో, పుస్తకాల్లో ఆ బీభత్సం చూశాం, చదివాం కాబట్టి తమిళ్నాట జరిగేదీ ఆ బాపతేనని మహామేధావులమని అనుకునే వారికి బోలెడంత తెలియని తనం.
నిజానికి జల్లికట్టు వేట కాదు... ఆట! అదీ ఎద్దును హింసించి పైశాచికానందం అనుభవించటానికి కాదు. ఆట అయ్యాక దాన్ని కోసుకు తినడానికీ కాదు. అది యువకుల్లో ధైర్యాన్ని, ప్రమాదంతో పందెం వేసే సాహసాన్ని పెంచేందుకు ఉద్దేశించింది. అందులో రిస్కు, డేంజరు చాలా ఉన్నాయి. కాని జంతువుకు కాదు. మనిషికి.
మామూలు కాపలాకుక్క మొరుగుతూ మీదికొస్తేనే ఎంత ధైర్యస్థులైనా కంగారుపడతారు. వీధిలో మామూలు ఆవుకు చిర్రెత్తి కొమ్ములతో పొడవ వస్తే నవనాగరికులకు గుండె జారుతుంది. అలాంటిది సంవత్సరంపాటు దిట్టంగా మేసి, పోతరించిన వందల కిలోల బరువైన ఆంబోతు కట్టు వదిలీ వదలగానే భీకరంగా రంకెలేస్తూ దూసుకొస్తుంటే ఏ ఆయుధమూ లేకుండా బరిలో దానికి ఎదురు నిలిచి తలబడాలంటే కింగ్‌సైజు గుండె, దమ్ము కావాలి. ఒడుపుగా దాని మూపురాన్ని కరచుకునో, ఎగిరి పట్టి కొమ్ములు వంచో నిర్ణీత దూరంలో దానిని నిలవరించాలంటే ఎంతో శక్తి, సత్తువ ఉండాలి. ఏమాత్రం గురి తప్పినా కత్తుల్లాంటి కొమ్ములతో గిత్త పొడిచెయ్యగలదు. కింద పడేసి గిట్టలతో తొక్కి దారుణంగా గాయపరచగలదు. ఒక్కోమారు ప్రాణాలు తీయనూ గలదు. కాబట్టి ఆందోళన పడాల్సింది జంతువుకు ఎంత నొప్పి కలుగుతుందోనని కాదు. వట్టి చేతులతో దాన్ని ఎదిరించే మనుషుల ఒళ్లు, ప్రాణాలు ఏమవుతాయోనని! పూర్వకాలంలో ఏవో దేశాల్లో లాగా ఆటగాళ్లు బానిసలు కాదు; ఖైదీలు కారు. ఎద్దు కొమ్ములకు కట్టే డబ్బు సంచిని కొట్టెయ్యటం కంటే పదిమందిలో తమ పరాక్రమం చాటుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడి ఏ బలవంతమూ లేకుండా, ఇష్టపూర్వకంగా ప్రమాదంతో తలపడే వారికోసం మనం బెంగపడనక్కర్లేదు. ఎంతమంది నిలువరించ జూపినా లొంగని కోడెను బోలెడు డబ్బుపెట్టి కొనుక్కొని దాని ద్వారా మేలుజాతి పశుసంతతి పొందడానికి రైతులు సిద్ధంగా ఉంటారు. అది గాయపడితే వారికే నష్టం. నాణ్యమైన దేశవాళి పశుసంతతిని వృద్ధి చేయటమే ఉద్దేశంగా తరతరాల నుంచి నడుస్తున్న ఆ సాహసోపేత క్రీడలో ఎద్దులు ఎక్కడ కందిపోతాయోనని విదేశీ ‘పేటా’గాళ్లు గుండెలు బాదుకోవటం హాస్యాస్పదం.
స్మార్ట్ఫోన్లో పిచ్చిగేమ్సు ఆడుకోవటమే, టీవీల్లో క్రికెటు మాచి చూస్తూ వెర్రెత్తిపోవటమే క్రీడానందం అనుకునే మనకు... పౌరుషాన్ని, సాహసిక ప్రవృత్తిని పెంచే జల్లికట్టు లాంటి సాంప్రదాయిక ఆటలంటే వెగటు సహజమే. క్రికెట్, ఫుట్‌బాల్ లాంటి ఆధునిక క్రీడల్లో ప్రమాదాలు, గాయాలు, ఒక్కోసారి మరణాలు సంభవిస్తున్న కారణం చేత వాటిని నిషేధించాలని ఎవరూ అనరు. మరి జల్లికట్టుకు మాత్రం నిషేధం ఎందుకు? ఊళ్లలో ఎవరుపడితే వాళ్లు ఆడే ఆ ఆటలో అనవసరపు హింస, క్రూరత్వం ఏదైనా ఇటీవలి కాలాన చోటు చేసుకుంటే అలాంటి వాటిని నిరోధించడానికి చట్టపరంగా కట్టుదిట్టాలు చేయటంలో తప్పులేదు. సోకాల్డ్ జంతు ప్రేమికుల సుకుమారాలకు సరిపడలేదు కాబట్టి వేల సంవత్సరాలుగా తమిళ సంస్కృతిలో భాగమైన జల్లికట్టును కట్టిపెట్టించబోతే ఇప్పటిలాగే భంగపాటు తప్పదు.
జల్లికట్టు ఆడేది మధుర, తిరుచిరాపల్లి, దిండిగుల్ లాంటి కొన్ని జిల్లాల గ్రామాల్లోనే అయినా ‘పేటా’ల పితూరిపై సుప్రీంకోర్టు దానిమీద పెట్టిన నిషేధానికి మొత్తం తమిళనాడు భగ్గున మండింది. సంప్రదాయానికి, పూర్వాచారాలకు సాధారణంగా విలువ ఇవ్వని కుర్రకారు, ముఖ్యంగా కాలేజి విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే యువతీ యువకులు ఎవరూ పిలవకుండానే కదిలారు. సోషల్ మీడియాలో కూడబలుక్కుని మద్రాసు మెరీనాబీచ్ తీరాన వేనకు వేలుగా ఏకంగా మూడురోజులపాటు బైఠాయించి, నిషేధం ఎత్తేస్తేగానే కుదరదని భీష్మించి, నవతరం సత్తా ఏమిటో చూపారు. డబ్బులిచ్చి, తాగబోసి రాజకీయ పార్టీలు చేసే జనసమీకరణలకు భిన్నంగా అనేక నగరాల్లో, పట్టాల్లో యువత స్వచ్ఛందంగా లేచి, రాజకీయ జీవులను పక్కనపెట్టి, ప్రత్యేకంగా ఒక నాయకుడంటూ లేకపోయినా క్రమశిక్షణాయుతంగా, హుందాగా వ్యవహరించి పరిపాలకులకు చెమటలు పట్టించింది. తమిళనాడు ముఖ్యమంత్రిని ఢిల్లీకి పరుగుపెట్టించి, కేంద్రనాధుల గొంతుమీద కూచునేట్టు చేసి, జల్లికట్టుకు సై అంటూ అర్జంటుగా ఆర్డినెన్సును సాధించింది. ససేమిరా బెసగేది లేదన్న సుప్రీంకోర్టు కూడా పరిస్థితి తీవ్రత గుర్తెరిగి, కనీసం కొన్ని రోజులపాటు చూసీ చూడనట్టు పోవడానికి సుముఖమయేట్టు చేసింది.
ఈ పరిణామాల్లో సావధానంగా ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
సాధారణంగా జల్లికట్టు ఆడేది సంక్రాంతి రోజుల్లో. నిషేధం ఎత్తేయించాలన్నది ఒక్కటే జనం తపన అయినట్లయితే తీవ్రాందోళన ఏదో సంక్రాంతికి ముందే భళ్లుమనాల్సింది కదా?
ఆంక్షలు, నిషేధాలు ఎన్ని ఉన్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. సుప్రీంకోర్టు నిషేధం మూడేళ్లకిందే వచ్చినా, ప్రతి ఏడులాగే ఈసారీ తమిళనాట చాలాచోట్ల జల్లికట్లు ఆడారు. సక్రమం కాకపోతే అక్రమంగా అయినా పండుగ సరదా ఎప్పటిలాగే తీరాక కూడా నిషేధానికి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున ఉద్యమించారేమిటి?
ఆట జరిగే పల్లెల్లో, ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో కాక ఎక్కడో ఉన్న చెన్నై మహానగరంలో పొద్దస్తమానం నెట్ మాలోకంలో గడిపే నవయువతను ఆ నెట్‌మాలోకమే అంతలా కదిలించి, లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చేట్టు చేసిందంటే కేవలం జల్లికట్టు కోసమే కాదు. ఆ ఆట ఆడడం, ఆడకపోనివ్వటం కంటే కూడా మొత్తం వ్యవహారంలో తమిళ సంస్కృతి మీద, హిందూ సంప్రదాయాల మీద జరిగిన, జరుగుతున్న దాడి కుర్రకారును ఎక్కువ బాధించింది. ఆ దాడి ఎంత దుర్మార్గమనడానికి వందల ఉదాహరణలు ఇవ్వవచ్చు. మచ్చుకు ఒక జంతు ప్రేమికురాలి రతనాల మాటలను చిత్తగించండి:

‘‘మకర సంక్రాంతి హిందువుల బక్రీద్. ఆ రోజు దేశమంతటా జంతువులను క్రూరంగా ఊచకోత కోస్తారు... జల్లికట్టు అందులో భాగం. వారాల తరబడి ఎడ్లను చీకటి గదుల్లో బంధిస్తారు. వాటికి మద్యం పట్టించి, చితకబాదుతారు. వెర్రెత్తిన కుర్రాళ్లు చర్మం ఊడివచ్చేలా వాటిని కరుస్తారు. అప్పుడు వాటిని ఒకచోటికి వదిలిపెడతారు. పూటుగా తాగి ఉన్న కుర్రవాళ్లు వాటి మీదికి ఎగిరి కొమ్ముల్ని విరచబోతారు. ఎడ్లు చస్తాయి. కొందరు మనుషులూ చస్తారు. అన్ని పార్టీల రాజకీయ వాదులూ ‘తమిళ సంస్కృతి’ పేరుతో ఈ హింస రొంపిలోకి ఎగబడతారు. ఇండియాలో నాగరికుడైన ప్రతి ఒక్కడూ దీనిని అసహ్యించుకుంటున్నాడు. కాని పాప్యులారిటీ కోసం పాకులాడే మసకబారిన తమిళ నటులు మాత్రం ఈ ఎడ్లను తలలు పగలగొట్టి చంపకపోతే మొత్తం తమిళనాడు సంస్కృతి నాశనమవుతుందని వాదిస్తున్నారు.
‘‘బక్రీదుకూ మకర సంక్రాంతికి ఒకటే తేడా. ముస్లింలు జంతువులను నరికి, చంపుతారే కాని వాటిమీద పందెం కాయరు. హిందువులు కాస్తారు. వాళ్లు చెడతాగి, ఏ జంతువు ఎంత త్వరగా చస్తుందన్న దానిమీద పందేలు కాస్తారు. దీన్ని వాళ్లు హిందూ సంస్కృతి అంటారు.’’
[http://www.firstpost.com/living/makar - sankranti - much - like - bakr - id - is - a - day - of - cruel - animal - slaughter - throughout - india - 3206674.html]

అక్షర లక్షలు ఛేసే ఈ మాటలన్న మానినీమణి పేరు మేనకా గాంథి. హిందుత్వ వాది అని విరోధులు అనుక్షణం ఆరోపించే నరేంద్రమోది గారి ప్రభుత్వంలో ఈ వింతమానవి బాధ్యతగల మంత్రి!
సాక్షాత్తూ ఒక కేంద్రమంత్రే పాచినోటితో పచ్చి అబద్ధాల అవాకులు చవాకులు పేలెటప్పుడు ఈ దేశమన్నా, దాని సంస్కృతి అన్నా, సంప్రదాయాలన్నా వీసమెత్తు గౌరవం లేని హక్కులరాయుళ్లు, లిబరల్, అల్ట్రా మోడరన్ విదేశీదాసులు ఎలా పేట్రేగుతారో వేరే చెప్పాలా? తాము ఎద్దు మాంసం తేరగా తింటామని సగర్వంగా చెబుతూనే, జల్లికట్టులో ఎద్దుకు తగిలే దెబ్బలకు బోలెడు విలవిలలాడుతూ, జల్లికట్టు అనాగరికం, ఆటవికం అని తిట్టిపోసే బుద్ధిలేని బుద్ధిజీవులను చూస్తే జనానికి ఒళ్లు మండదా? కోళ్లు, చేపల నుంచి గొర్రెలు, పందులు దాకా... ఆఖరికి ఆవులనూ, బర్రెలను కూడా ఘోరంగా చంపి, వాటి మాంసాన్ని ముప్పూటలా మెక్కేవాళ్లకు జీవకారుణ్యం గురించి మాట్లాడే హక్కు ఉన్నదా? లక్షల సంఖ్యలో మేకలను, ఒంటెలను, ఆవులను నరికి పోగులు పెట్టే బక్రీద్‌కూ, సంవత్సరానికొక రోజు కోడెలతో ఆటలాడే సంక్రాంతికీ పోలికా? జల్లికట్టులో ఎందరో మనుషులలాగే గిత్తలకూ ఒక్కోసారి ప్రమాదవశాత్తూ తగిలే గాయాలకే తల్లడిల్లి, నిషేధానికి అంగలార్చే ‘పేటా’గాళ్లకు దేశమంతటా ప్రతి ఊళ్లో, ప్రతిరోజూ జంతు వధశాలల్లో, అల్‌కబీర్‌లాంటి కబేళాల్లో ఎద్దులు, దున్నలు, బర్రెల తలలను పెద్ద సుత్తులతో కొట్టికొట్టి పగులగొట్టి... ఆవుల మీద మరిగే నీళ్లు చిమ్మి, బతికుండగానే చర్మం వొలిచి... గొంతుకోసి రక్తం ఓడ్చి ఎంత క్రూరంగా, రాక్షసంగా చంపుతారో తెలుసా? భయానక బాధ భరించలేక ఆవులు, ఎద్దులు, పందులు ఎంత దీనంగా ఆక్రందిస్తాయో ఎప్పుడైనా విన్నారా? ఆ అమానుష చిత్రహింసలకు, చిత్రవధలకు కిమ్మనే దమ్ములేక కళ్లు గట్టిగా మూసుకునే మన హిపోక్రైట్లకు జల్లికట్టులో కోడెలకు తగిలే గాయాలు మాత్రం ఇల్లెక్కి రంకెలు వేయాల్సినంతటి జంతు హింసలా కనిపిస్తున్నాయా?
పీల్చేగాలిని, తాగే నీటిని, పరిసరాలను రోజుకు 24 గంటలూ, సంవత్సరం పొడవునా కలుషితం చేసి మనమేమో పర్యావరణాన్ని చెడామడా పాడుచేయవచ్చు. కాని సంవత్సరానికొకసారి దీపావళికి మతాబులు కాలిస్తే తప్పు. దీపాలు పెడితే తప్పు. వినాయక చవితికి పెద్ద విగ్రహాన్ని పెడితే తప్పు. హోలీకి రంగులు చిమ్మటం తప్పు. ఇలా హిందువుల పండుగల మీద, హైందవ సంస్కృతి మీద బండలేసి, పర్యావరణ సంరక్షణ నెపంతో వాటి వైవిధ్యాన్ని కాలరాచి వేయటమే పనిగా పెట్టుకున్న విజాతీయ కుట్రకు కొనసాగింపే జల్లికట్టు మీద దుర్మార్గపు దుమారం. ఆ సంగతి గ్రహించే యువతరం మండిపడుతున్నది. తమిళ సంస్కృతి మీద, సంప్రదాయం మీద ముప్పేట దాడి తీవ్రతను గుర్తించే సోషల్ మీడియాలో కలకలం లేచింది. అదే క్రమంగా వాయుగుండంగా మారి ఢిల్లీ తీరాన్ని తాకింది.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ