ఉన్నమాట

నేతాజీ, వివేకానందలకే దిక్కులేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యా విషయక పరిశోధన, శిక్షణల జాతీయ మండలి (NCERT) అని మన దేశంలో పేరు గొప్ప పనికిమాలిన వ్యవస్థ ఒకటుంది. ‘జాతి వ్యతిరేక విద్యా... ... మండలి’ అని దాని పేరును మారిస్తే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి అది బహునిష్ఠగా సాగిస్తున్న మహాకార్యానికి న్యాయం చేసినట్టూ అవుతుంది.
దేశంలోని విద్యాసంస్థల్లో పిల్లలకు ఎలాంటి చదువులు ఏవిధంగా బోధించాలి అన్నది ఈ మండలి నిర్ణయిస్తుంది. అది తయారు చేయించిన సిలబసును, వాటి ప్రకారం అది రాయించిన పాఠ్యపుస్తకాలను దేశమంతటా ఉన్న పాఠశాలలు ఔదలదాల్చుతాయి. ఈ సిలబసునే రాష్ట్రాల్లోని (ఎస్.సి.ఇ.ఆర్.టి.) విద్యా మండలులూ నమూనాగా తీసుకుని అదే దారిన తామూ పోతాయి. ఎన్.సి.ఇ.ఆర్.టి.కి మతిసరిగా ఉంటే... అది ఉత్పత్తిచేసే సిలబసు వంకలేనిదైతే రేపు దేశాన్ని నడిపించవలసిన మన పిల్లలు మంచి చదువు చదువుతారు. ఆ సిలబసే కలుషితమైతే దాని కాలుష్యం విద్యార్థుల బుర్రలను పాడుచేసి పెడుతుంది. వారి దేశంలోనే వారిని మానసికంగా పరాయివారిగా మార్చి తీరుతుంది.
ఇప్పుడు మన దేశంలో నడుస్తున్నది రెండో విధం.
ఒకప్పుడు అటల్ బిహారీ వాజపేయి అనే దుర్మార్గుడి హయాంలో మురళీ మనోహర్ జోషి అనే హిందూ మతోన్మాది మానవ వనరుల అభివృద్ధి అనబడే కేంద్ర విద్యాశాఖకు మంత్రిగా ఉండేవాడు. జాతి యథార్థ చరిత్రను, సంస్కృతిని, జాతీయ విలువలను ప్రతిబింబించేలా పాఠ్య పుస్తకాల తుప్పు వదిలించటం అనే ప్రమాదకరమైన దుస్సాహసానికి అతగాడు ఉపక్రమించాడు. ఆ దిశలో కొంతమేరకు పని చేయగలిగాడు. అప్పుడు మన మేధావిలోకం చడామడా చెలరేగి... రాజకీయ, సాంస్కృతిక, హిందూ వ్యతిరేక, సూడో సెక్యులర్ చతురంగ బలాలను సమీకరించి, ‘విద్య కాషారుూకరణ’ బెడదకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. ఎన్నికల్లో ‘కాషాయ’రథం పల్టీకొట్టి, ప్రభువు దయవల్ల ఇటలీ మారాణి బినామీ పాలన వచ్చాక విద్యా రంగానికి నడమంత్రపు గ్రహణం తొలిగింది. సెక్యులర్, లిబరల్, మార్క్సిస్టు మహాజ్ఞానులంతా కలిసి ఆరెస్సెస్ మార్కు వక్రీకరణలను సరిదిద్ది, పాఠ్య గ్రంథాలను శుద్ధిచేసి, మైలపడ్డ విద్యామండలికి సంప్రోక్షణ చేశారు.
సరే! ఆ విధంగా పునః సంస్కరించబడిన పాఠ్యగ్రంథాలు ఎంత లక్షణంగా ఉన్నాయి, దేశ చరిత్రను, జాతీయ వీరుల ఘనతను, భారతీయ ఔన్నత్యాన్ని అవి ఎంత బాగా చూపెడుతున్నాయి - అని కొనే్నళ్ల కింద రాజస్తాన్‌లో సూర్యప్రతాప్ సింగ్ రాజవత్ అనే ఆయనకు తెలుసుకోబుద్ధి అయింది. మచ్చుకు 8వ తరగతి, 12వ తరగతి సెంట్రల్ సిలబసు విద్యార్థులు చదువుతున్న టెక్స్ట్ బుక్‌లను ముందేసుకుని, పాతవాటితో జాగ్రత్తగా బేరీజు వేశాడు. నిలువునా షాకయ్యాడు.
12వ తరగతి హిస్టరీ టెక్ట్స్‌బుక్‌లో స్వామి వివేకానంద గురించి అంతకు ముందు 1200 పదాలు ఉండేవట. సోనియా జమానాలో సెక్యులర్ ప్రక్షాళన దరిమిలా వివేకానందుడు కాస్తా ముష్టి 26 మాటలకు పడిపోయాడట.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి 2007కు ముందు 8వ క్లాసు పుస్తకంలో 500 పదాలు, 12వ క్లాసు పుస్తకంలో 1250 పదాలు ఉండేవట. మా-బేటాల హయాంలో సెక్యులర్ తిరగరాత ఫలితంగా ఆయన 8వ క్లాసులో ఏకంగా ఎగిరిపోయాడు. 12వ క్లాసులో 87 పదాలతో మిగిలాడట.
మిగతా జాతీయ వీరులకు, స్వాతంత్య్రయోధులకు ఆపాటి ప్రాప్తం కూడా లేదు. అరవింద ఘోష్, అష్‌ఫాక్ ఉల్లాఖాన్, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, వీరసావర్కార్, కర్తార్‌సింగ్, యతీంద్రనాథ్‌దాస్, మదన్‌లాల్ థింగ్రా, శ్యామ్‌జీ కృష్ణవర్మ, ఖుదీరామ్ బోస్, ఎం.ఎన్.రాయ్, రాస్‌బిహారీ బోస్, శచీంద్రనాథ్ సన్యాల్, ఉద్దం సింగ్ లాంటి 36 మంది జాతీయ యోధుల ఊసే ‘‘శుద్ధి చేయబడిన’’ పాఠ్యగ్రంథాల్లో కలికానికైనా కానరాదట. క్రికెట్ చరిత్ర గురించి, వస్త్ర తయారీ చరిత్ర గురించి 37 పేజీలు నింపిన వారికి జాతికి స్ఫూర్తినిచ్చిన స్వాతంత్య్ర మహావీరుల గురించి మాటమాత్రమైనా ప్రస్తావించాల్సిన అవసరం లేదనిపించిందట. జాతి విముక్తి కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఆయా విప్లవవీరుల గురించి అంతకుముందు టెక్స్ట్‌బుక్స్‌లో ఉన్న పాఠాలన్నీ అమాంతం లేపేశారట.
ఇదెక్కడి అన్యాయం, ఎందుకిలా చేశారు అంటూ ఆ పౌరుడు సమాచార హక్కు చట్టం కింద ఎన్.సి.ఇ.ఆర్.టి.ని 2013 ఫిబ్రవరి 12న ప్రశ్నించాడు. అటునుంచి జవాబు లేదు. అడగ్గా అడగ్గా ఎట్టకేలకు 2014 జూన్ 16 తేదీతో విద్యామండలి వారు ప్రశస్తమైన బదులిచ్చారు.
(కేంద్రంలో సోనియా బినామీ పరిపాలన వచ్చిన తరవాత) 2005లో ఆమోదించిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌లో నిర్దేశించిన 'Learning without burden' (బరువు లేని ఛదువు) అనే మార్గదర్శక సూత్రం ప్రకారం సోషల్ సైనె్సస్ సిలబసు యథావిధిగా సవరించబడిందనీ...
థీమ్‌ల వారీగా, విద్యార్థికి మరింత నచ్చేవిధంగా ‘ప్రయోగాత్మక విద్య’కు అవసరమైన టెక్స్ట్‌బుక్‌లను నిపుణులు తయారుచేసినట్టు గ్రహించవలసిందనీ - దాని సారాంశం. నువ్వు అడిగింది ఒక ప్రశ్న కాదు; దానికి మేము ఇవ్వగలిగిన జవాబూ లేదు - అని ఎన్.సి.ఇ.ఆర్.టి. వారు చివరికి తేల్చారు. దానిమీద సమాచార హక్కుకు సంబంధించిన కేంద్ర కమిషనుకు అపీలు చేయగా కమిషనరు మాడభూషి శ్రీ్ధర్ ఈ నెల 22న ఎన్.సి.ఇ.ఆర్.టి.ని చివాట్లు పెట్టాడు. అర్జీదారు చేసిన దాన్ని కేవలం వాకబుగా కాక ఫిర్యాదుగా పరిగణించండి; పాఠ్య పుస్తకాలలో అలా ఎందుకు జరిగిందో సమాధానం ఇవ్వండి; చరిత్రకూ జాతీయ వీరులకూ సంబంధించిన పాఠాలు నిర్దుష్టంగా నిష్పాక్షికంగా ఉండేందుకు ఏమి చేస్తారో పదిరోజుల్లోగా చెప్పండి - అని అభినందించదగ్గ ఆదేశం ఇచ్చారు.
అంతమాత్రానే ఏదో అయిపోతుంది; పాఠాలకు పట్టిన పీడ విరగడై, చదువులకు పట్టిన మెకాలే చెదలు ఈ దెబ్బతో వదిలిపోతాయ- అని ఆశించడం పేరాశే కావచ్చు. కాని - కేంద్రంలో ప్రభుత్వం మారినా విధానాలు మారలేదు; యు.పి.ఎ. సర్కారు అవకరాలే విద్యారంగంలో ఎన్.డి.ఎ. హయాంలోనూ కొనసాగుతున్నాయి అన్న కఠోర వాస్తవాన్ని తెలుగుబిడ్డ అయిన సెంట్రల్ కమిషనర్ శ్రీధర్ చేసిన న్యాయ నిర్ణయం యావద్దేశానికి ఉలిక్కిపడేలా గుర్తు చేసింది.
విద్యను కాషారుూకరిస్తున్నారని గగ్గోలుపెట్టి, మురళీమనోహర్ జోషిని పాపాలభైరవుడిగా చిత్రించిన కాంగ్రెస్ - మార్క్సిస్ట్ - సూడో సెక్యులర్ గ్యాంగు తీరా తమకు అవకాశం చిక్కాక చరిత్రకు, చదువులకు చేసిన హానిని వివరించాలంటే పెద్ద గ్రంథమవుతుంది. ఆర్.టి.ఐ. కమిషను పుణ్యమా అని తాజా ఉదంతంతో వెలుగులోకి వచ్చిన వికృతాలే దిగ్భ్రాంతి కలిగిస్తూంటే, వెలికిరానివి ఇంకా కొల్లలు. యు.పి.ఎ. పాలనలో అడ్డగోలుగా తిరగరాయబడ్డ చరిత్ర పాఠాలనిండా తప్పులు, దారుణ వక్రీకరణలు కుప్పలు కుప్పలు.
ఉదాహరణకు - 7వ క్లాసుకు నిర్దేశించిన ఎన్.సి.ఇ.ఆర్.టి. టెక్స్ట్ బుక్‌లో లక్షల సంఖ్యలో హిందువులను చంపి, దేవాలయాలను కూల్చి, రాక్షసంగా చెలరేగిన ముస్లిం పాలకుల చరిత్రకు 60 పేజీలు కేటాయించగా, మొగల్ ధాటిని ఎదుర్కొని ‘హిందవీ స్వరాజ్’ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఉన్నవి ఐదే లైన్లు. అది కూడా అతడో చిన్నపాటి మోతుబరి అంటూ, ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా. అల్లా ఉద్దీన్ ఖిల్జీతో మొదలుపెట్టి, బాబరు నుంచి ఔరంగజేబు దాకా ప్రతి ముస్లిం మతోన్మాద నరపిశాచి బొమ్మనూ కష్టపడి సేకరించిన సర్కారీ చరిత్రకారులకు జాతి జనులందరూ తమ గుండెలో పటం కట్టి పూజించే శివాజీ సుప్రసిద్ధ చిత్రాన్ని చూపడానికే చేతులు రాక స్థలం ఖాళీగా పెట్టారు. మొగలారుూలకు దాసోహమన్న రాజపుత్ర ప్రముఖుల పేర్లనైతే గొప్పగా పేర్కొన్నారు. ధర్మంకోసం రాజ్యభోగాలను వదులుకుని, కొండల్లో కారడవుల్లో కటికనేల మీద పడుకుని, గెరిల్లా పోరాటంతో అక్బర్‌ని గడగడలాడించిన మహావీరుడు రాణాప్రతాప్ పేరైనా తలవలేదు.
ఇక 12వ క్లాసుకు పెట్టిన Themes in Indian History అనే టెక్స్ట్‌బుక్‌లో జాతీయోద్యమానికి సంబంధించిన పాఠం 1915లో గాంధీజీ ఇండియాకు తిరిగి రావడంతో మొదలవుతుంది. అంతకుముందు బెంగాల్ విభజన, ‘వందేమాతరం’, ‘స్వదేశీ’ ఉద్యమాల ఊసుగాని, లాల్ - బాల్ - పాల్ మూర్తిత్రయం నిర్వహించిన పాత్రగాని... సావర్కార్, అరవింద ఘోష్ వంటి విప్లవ వీరుల సాహస కృత్యాలుగాని... బ్రిటిషు పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారత జాతీయుడు దాదాభాయ్ నౌరోజీ విశిష్టతగాని విద్యార్థులకు తెలియాల్సిన విషయాలు అని మన పాఠ్యగ్రంథ విధాతలు అనుకోలేదు. ముస్లింల మెహర్బానీకి వెంపర్లాడి ఖిలాఫత్ రోలును మెడకు తగిలించుకుని గాంధీ చేసిన చారిత్రక తప్పిదాన్ని గాని, మోప్లాలో ముస్లిం మతోన్మాదులు సాగించిన వేలాది హిందువుల ఊచకోతను గాని పొరపాటున కూడా ప్రస్తావించలేదు. గాంధీ, నెహ్రులను మాత్రమే జాతి నేతలుగా ఆకాశానికెత్తి... నేతాజీ, భగత్‌సింగ్ వంటి జాతీయ వీరులను చరిత్ర పుటల్లోంచి తొలగించాలని చూడటమే, ఆబ్జెక్టివ్ చరిత్ర రచన అని మన కమ్యూనిస్టు, కమ్యూనలిస్టు మహామేధావులు దబాయిస్తారు. గాంధీకి సరిసమానంగా జిన్నాను లిబరల్ ముస్లిం మహానాయకుడిగా చూపెట్టి, డైరెక్టు ఏక్షనుకు పిలుపిచ్చి అతడు పారించిన రక్తపుటేర్లను మరుగుపరచటమే ఎన్సీఈఆర్టీవారి ఆబ్జెక్టివిటీ. గోఖలే, తిలక్, నెహ్రూల బ్రాహ్మణులుగా ఎక్కడా పేర్కొనని వారు నాథూరాంగాడ్సేను మాత్రం ‘పుణెకి చెందిన బ్రాహ్మణుడు’, ‘హిందూ మతోన్మాది’ అని పేర్కొనడం విద్యార్థుల మనసుల్లో ఎటువంటి విషం నింపడానికి అని మనం అడగకూడదు!
‘బరువులేని చదువు’ తమ కొత్త విధానమని ఎన్సీఈఆర్టీవారు ఆర్టీఐ కమిషనుకు చెప్పారు కదా? 36 మంది జాతీయ మహావీరుల చరిత్రలను మొత్తం ఎత్తెయ్యటం... స్వామి వివేకానంద, నేతాజీ, శివాజీలను ఏదో పేజీలో ఎక్కడో ఒక మూలకి నెట్టి, ముఖ్య విశేషాలను తొలగించటం విద్యార్థుల మీద బరువు తగ్గించడానికా? జాతి పరువు తియ్యడానికా? గర్వించదగ్గ గత చరిత్ర, జాతీయ సంస్కృతి, ఉజ్వల వారసత్వాలు నేటి తరానికి తెలియనివ్వకుండా... మెకాలే మూసలో, బాబర్, తైమూర్‌ల ప్రేతాలు పరవశించేలా జాతి చరిత్రకు కల్లల వెల్ల వేయటానికా జాతీయ విద్యా పరిశోధక శిక్షణ మండలి ఉన్నది? యు.పి.ఎ.ను తుంగలో తొక్కి ఎన్డీఏను వరించి, 56 అంగుళాల ఛాతీని చరచుకునే మొనగాడికి అధికార దండం అప్పగించాక కూడా విద్యారంగం ఇంకా భూతాల కొంపగానే మిగలటం సిగ్గుచేటుకాదా?

-ఎం.వి.ఆర్. శాస్త్రి