ఉన్నమాట

ప్రమాదం అబద్ధం.. మరి నేతాజీ ఏమైనట్టు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు రహస్యం బయటపడనే లేదు.
ప్రపంచంలోకెల్లా పెద్ద మిస్టరీ ముడి ఇంకా విడనే లేదు.
జాతీయ వీరుడు, యావద్భారతానికి ప్రియతమ నాయకుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కొత్తగా బయటపడ్డ కొద్ది వివరాలు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.
నేతాజీ 1945 ఆగస్టు 18న ఫార్మోసా (తైవాన్)లోని తైహోకు వద్ద విమాన ప్రమాదంలో మరణించాడు. ఆయన చితాభస్మాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరిచారు. ఇది ఇనే్నళ్లుగా స్వతంత్ర భారత కాంగ్రెసు ప్రభువులు పాడుతున్న పాట.
ఇది నిజం నిజం అని వారు ఎంత నొక్కి చెబితే - అది నిజం కాదన్న అనుమానం భారత ప్రజలకు అంత ఎక్కువగా బలపడుతూ వచ్చింది. ప్రజాభిప్రాయ తీవ్రతకు తాళలేక 1956లో షానవాజ్ కమిటీని, 1970లో ఖోస్లా కమిషన్‌ను వేసి, విచారణ తతంగం ఆర్భాటంగా నడిపించి, అదే పలుకును ఆ చిలుకల చేతా చెప్పించారు. జనం నమ్మలేదు.
1999లో వచ్చిన ఎగస్పార్టీ ప్రభుత్వం రహస్యాన్ని ఛేదించేందుకు వేసిన ముఖర్జీ కమిషన్ విమాన ప్రమాదం కట్టుకథ అని తేల్చింది. కాని దాని నివేదిక చేతికందేలోపే వాజపేయి సర్కారుకు నూకలు చెల్లాయి. తరవాత వచ్చిన సోనియా దొరసానిగారి బినామీ ప్రభుత్వం ఆ నివేదికను కొనగోటితో బుట్టదాఖలు చేసింది. గుట్టు రట్టు కాకుండా జాగ్రత్తపడ్డామన్న కాంగ్రెసానందం ఎంతోకాలం నిలవకుండా మళ్లీ జమానా మారింది. గద్దెనెక్కిన నరేంద్ర మోది ప్రభుత్వ పాత దస్త్రాలను బయటపెట్టసాగటంతో కందిరీగల తుట్టె కదిలింది.
జనవరి 23న నేతాజీ జయంతి నాటి నుంచి మొదలుపెట్టి మోదీ సర్కార్ దఫాలవారీగా బహిరంగపరుస్తున్న సీక్రెట్ ఫైళ్లలో బ్రహ్మాండం బద్దలయ్యేంత గొప్ప సత్యాలయితే లేవు. అంతటి దేవరహస్యాలను వాటి నుంచి ఆశించిన వాడు అవివేకి. ఎందుకంటే నేతాజీ మిస్టరీ హఠాత్తుగా ఇప్పుడు లేచినది కాదు. అది డెబ్బయ్యేళ్ల పాతది. ఇనే్నళ్లూ రాజ్యమేలిన వారికి నిజమేమిటో తెలుసు. దాన్ని బయటికి రాకుండా ఎలా తొక్కిపెట్టాలో ఇంకా బాగా తెలుసు. తాము కట్టకట్టి అటకమీద పెట్టించిన ఫైళ్లలో ఏ కాగితాల్లో ఏమున్నదీ వారు బాగా ఎరుగుదురు. వారి కొంపముంచే విషయాలేవైనా వాటిలో ఉంటే పగవాళ్లొచ్చి వాటిని బయట పెట్టేంతవరకూ చేతులు ముడుచుకుని కూచోరు. మరీ ఇబ్బందికరమైన పత్రాలను అధికార దీపం చేతిలో ఉండగానే తగలెయ్యటం మంచిదని వారికి ఒకరు చెప్పక్కర్లేదు.
అలాగే చేశారు కూడా. 1999లో మనోజ్‌కుమార్ ముఖర్జీ కమిషన్ విచారణ మొదలు పెట్టేనాటికే కీలకమైన దస్త్రాలు గల్లంతు అయ్యాయి. 1960’ల్లో, 70’ల్లో చాలా ఫైళ్లను నాశనం చేసినట్టు ఆ కమిషన్ దృష్టికి వచ్చింది. కనీసం తగలబెట్టిన ఫైళ్ల తబిసీళ్లయినా ఒక చోట రాసి ఉంచారా అని కమిషన్ ఆరాతీస్తే ప్రధానమంత్రి కార్యాలయం చెప్పిన వివరాల్లో మచ్చుకు ఒకటి:
One file No.12(226) 56 - PM has been destroyed on 6.3.1972. Certain documents of file No.23(156) 51-PM have been destroyed. One file No.2(381) 60-66 PM is not readily traceble in our records.
[12(226) 56P PM ఫైలు 6.3.1972న నాశనం చేయబడ్డది. 23(156) 51P PM
12(226) 56- - ఫైలు 6.3.1972న నాశనం చేయబడ్డది. 23(156) 51- - నెంబరు ఫైలులోని కొన్ని డాక్యుమెంట్లను ధ్వంసం చేయడమైనది. 2(381) 60-66 - అనే ఫైలు రికార్డులలో కనపడుట లేదు
6.3.1972 తేథీన ప్రధానమంత్రిగా ఉన్నది నెహ్రూగారి అమ్మాయి. ఆ సమయాన ఖోస్లా కమిషన్ నేతాజీ మరణంపై విచారణ జరుపుతున్నది. సరిగ్గా అప్పుడే ఫైళ్ల నిర్మూలన కార్యక్రమం ముమ్మరంగా జరిగినట్టు పై వివరాలు తెలుపుతున్నాయి. కీలక రహస్యాల వెల్లవేత, ఏరివేతలు కడు జాగ్రత్తగా సాగాక, ఎవరు చూసినా ఫరవాలేదు లెమ్మని వెనకటి ప్రభువులు బతకనిచ్చిన కాగితాలే ఫైళ్లలో మిగులుతాయి, ఇప్పుడొచ్చిన మోదీ గవర్నమెంటు వాటిని బయటపెట్టినంత మాత్రాన భూమి తలకిందులయిపోదు. నిజమే.
కాని అలా బతికి బయటపడ్డ పత్రాల్లోనే దేశాన్ని నివ్వెరపరిచే నిజాలున్నాయి. ఉదాహరణకు విమాన ప్రమాదంలో బోసుబాబు మరణించినట్టుగా నెహ్రూగారు, వారి అమ్మాయిగారు, వారి వారసులు అధికారికంగా నొక్కి వక్కాణించినట్టి 1945 ఆగస్టు 18 తేదీ తరవాత కూడా ఆ మహానాయకుడు బతికే ఉన్నాడు. 1945 డిసెంబర్, 1946 జనవరి, 1946 ఫిబ్రవరిల్లో ఆయన రేడియోలో మాట్లాడాడు. భారతదేశం కోసం తన గుండె మండుతున్నదనీ, త్వరలో తాను విజయవంతంగా తిరిగి రాగలననీ అప్పుడు చెప్పాడు. ఆ ప్రసారాలను బెంగాల్ గవర్నరుకు సహాయకుడైన పి.సి.కర్ అనే అధికారి మానిటర్ చేశాడు. ఆ వివరాలు 870/11/-/16/92/-్జ/ నెంబరుగల ప్రధాని కార్యాలయం ఫైలులో ఉన్నది. తరవాత కొద్ది కాలానికే జవాహర్‌లాల్ నెహ్రూగారు దేశాధినేత అయ్యాడు. దేశంలో ప్రతి ఒక్కరూ ఆందోళన పడుతున్న నేతాజీ క్షేమం గురించిన ఈ సమాచారం ఆయనకు తెలియదని నమ్మలేము. 1945 ఆగస్టులోనే సుభాష్ బోస్ మరణించాడన్న అబద్ధాన్ని ఆయనా, ఆయన ఉత్తరాధికారులూ బుద్ధిపూర్వకంగా వ్యాప్తి చేశారనే అనుకోవాలి.
స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందిన సుభాష్‌చంద్రబోస్ తన మిత్ర క్షేత్రంలో విమాన ప్రమాదంలో మరణిస్తే దానికి సంబంధించిన ఏ రికార్డూ ఎక్కడా ఉండకుండా పోతుందా? ఆయన మరణించాడనటానికి పిసరంత రుజువు లేదు. ఆయన మరణించలేదని, వేరే దేశానికి రహస్యంగా తరలిపోవటానికే విమాన ప్రమాదం కథ అల్లాడని అప్పుడే వైస్రాయి మొదలుకుని బ్రిటిష్ ఉన్నతాధికారులెందరో చెప్పారు. అనంతరకాలంలో నెహ్రూ కాబినెట్‌లో చేరిన షానవాజ్ నడిపింది బూటకపు విచారణ; తన దర్యాప్తులో బయటపడ్డ కీలక సాక్ష్యాలను తొక్కిపెట్టి ఖోస్లా కమిషన్ చేసింది వాస్తవానికి వక్రీకరణ - అన్న సంగతి ఇప్పుడు ప్రజలముందుకు వచ్చిన క్లాసిఫైడ్ ఫైళ్లవల్ల మరోసారి ధ్రువపడింది.
నేతాజీ మిస్టరీకి సంబంధించిన ఫైళ్లను బహిరంగపరచాలని డిమాండు వచ్చిన ప్రతిసారీ - అలా చేస్తే శాంతిభద్రతలకు పుట్టి మునుగుతుంది. ప్రజా క్షేమం మంట కలుస్తుంది. ఇతర దేశాలతో మన స్నేహసంబంధాలకు కొంపలంటుకుంటాయి - అని ఇప్పటిదాకా రాజ్యమేలిన ప్రతి ప్రభుత్వమూ అరిగిపోయిన రికార్డును వినిపించేది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మీద కన్నుతోనే కావచ్చు - మొదట మమతాబెనర్జీ, తరవాత నరేంద్ర మోదీ చొరవచూపి తమతమ కచేరీల్లోని ఫైళ్లను బయటపెట్టాక కూడా శాంతి, భద్రత సజావుగానే ఉన్నాయి. ప్రజా క్షేమం ప్రమాదంలో పడలేదు. మిత్ర దేశాలేవీ కొట్లాటకు రాలేదు.
విమాన ప్రమాదంలో నేతాజీ మరణం అబద్ధం అని తేలాక అనివార్యంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నలు - అయితే ఆయన ఏమయ్యాడు? ఎలా బతికాడు? ఏమి చేశాడు? ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మరణించాడు- అని. దేశవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమాచారం అది. ఇప్పటికి బహిర్గతమైన ఫైళ్లలో ఆ ఊసులు లేవు. ఉండవు కూడా. అవి దొరకాలంటే వెతకాల్సింది ఢిల్లీలో, కోల్‌కతాలో సర్కారీ అటకల మీద కాదు. ఆ సమయాన నేతాజీ తిరుగాడిన, ఆయన అజ్ఞాతంగా వెళ్లినట్టుగా తెలిసిన, లేక అనుమానం ఉన్న దేశాల్లో! అప్పటి ఘటనలకు సంబంధించిన ఆయా ప్రభుత్వాల పాత రికార్డుల్లో! వాటికి సంబంధించి ఇప్పటికే వెలికి వచ్చిన దిగ్భ్రాంతకర కథనాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాల తీగ పట్టుకుని లాగితే మొత్తం డొంక కదులుతుంది. ఏ దుర్మార్గుల ప్రేరేపణతోనో ఏ సైబీరియా చెరలోనో, భారత మహా నేతను ఎవరు ఎలా నిర్బంధించారో, ఎలా హింసించారో, ఆకాలాన ఆయనను మన మహానుభావులు ఎవరెవరికి చూపించారో, అసలు నిజం ఎక్కడ బయటపడుతుందోనని నేతాజీ బంధుమిత్రుల మీద నిఘా పెట్టి ఏళ్ల తరబడి నీడలా ఎలా వెంటాడారో, నీచ రాజకీయ స్వార్థం కోసం ఎందరిని బలి తీసుకున్నారో, దార్శనికులు, దేశానికి మార్గదర్శకులు అనుకున్న పెద్దలే ఎంతటి కుత్సితాలకు పాల్పడ్డారో లోకానికి వెల్లడవుతుంది. అది నెరవేరాలంటే అరకొర ఫైళ్లను బయట పెడితే సరిపోదు. అత్యున్నత స్థాయిలో సమగ్ర విచారణ సత్వరం జరిపించాలి. వీలైనంత వేగంగా నివేదిక తెప్పించాలి. మొగమాటం లేకుండా దాని మీద కదలాలి.
జాతి కోరేది, మోదీ ప్రభుత్వం నుంచి అవశ్యం ఆశించేది అది! నేతాజీ మిస్టరీని మొదలంటా కుళ్లగించే క్రమంలో లాల్ బహదూర్ శాస్ర్తి మరణం వెనుక మర్మమూ బయటపడితే మరీ మంచిది!

ఎం.వి.ఆర్.శాస్ర్తీ