ఉన్నమాట

అసోం విజయానికి ఎందరో కారకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేనేళ్ల కిందటి ముచ్చట.
కేంద్ర హోంమంత్రి కూడా అయిన బిజెపి లోహ పురుషుడు ఎల్.కె.ఆడ్వాణీ గారు ఆకాశమార్గాన అసోం రాజధాని గువాహతికి పెద్ద పనిమీద విచ్చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అసోం గణ పరిషత్ (ఎ.జి.పి.)కీ బి.జె.పి.కీ అలయెన్సు. సీట్ల వాటా ఎవరికెంతో తేలాల్సి ఉంది.
మొత్తం 126 సీట్లు. తనకు 60 కావాలని బిజెపి అడుగుతున్నది. మీకంత సీను లేదు - అందులో సగం ఇస్తాం. మహా అయితే 30 మీద ఇంకో పది - అంటున్నది ‘పెద్దన్న’ ఎ.జి.పి. ఆడ్వాణీ అంతటివాడు వచ్చి, తన పలుకుబడినీ దౌత్యప్రజ్ఞనూ వినియోగించి నచ్చచెప్పిన మీదట అతికష్టం మీద 47 ఇవ్వటానికి ఎ.జి.పి. ఒప్పుకుంది. ‘‘మనమున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ ఆశించలేము. ఇచ్చినదాంతో సర్దుకుపోదాం’’ అని పార్టీ వారికి చెప్పాడు పెద్దాయన.
కిందటి నెలలో అలాంటి సందర్భం మళ్లీ వచ్చింది. అసోం అసెంబ్లీకి ఇంకోసారి ఎన్నికలొచ్చాయి. ఈసారీ ఆ రెండు పార్టీల మధ్యే అలయెన్సు. వాటాలు కుదర్చటానికి ఏ పెద్దాయనా ఢిల్లీ నుంచి విమానంలో రావలసిన అవసరం కలగలేదు. ఎందుకంటే పాత్రలు తారుమారయ్యాయి. 126లో మీకు 24కు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదంది బి.జె.పి. చాలాసేపు గింజుకుని, గుంజుకుని ‘ఏం చేస్తాం? పొత్తు ముఖ్యం. సరే! అలాగే కానివ్వండి’ అని దారికొచ్చింది ఒకనాటి అసోం పులి ఎ.జి.పి.!
సరిహద్దు రాష్ట్రంలో బలాబలాలు ఇంతలా మారతాయని రెండేళ్లకిందటి వరకూ ఎవరూ ఊహించి ఉండరు.
ఈశాన్య భారతంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు పూర్తిగా క్రైస్తవ మయం అయ్యాయి. బంగ్లాదేశ్ నుంచి అడ్డూ అదుపూ లేని అక్రమ వలసల మూలంగా కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ముస్లిం జనాభా రీత్యా జమ్మూ కాశ్మీర్ తరవాత రెండో పెద్ద రాష్ట్రం అసోమే. అక్కడి జనాభాలో నూటికి 34 మంది మహమ్మదీయులు. రాష్ట్ర రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంకే నిర్ణాయక శక్తి. దాని ప్రాపకం కోసం ‘సెక్యులర్’ పార్టీలన్నీ వెంపర్లాడుతూంటాయి. అటువంటి రాష్ట్రంలో ‘పక్కా ముస్లిం వ్యతిరేక హిందూ పార్టీగా’ సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు ముద్రవేసిన భారతీయ జనతా పార్టీకి అస్సామీలు ఏరికోరి పట్టంగట్టటం ఈ ఎన్నికల్లో పెద్ద విశేషం.
ఆ రాష్ట్రంలో పదిహేనేళ్లుగా తరుణ్ గోగోయ్ అనే ముసలి కాంగ్రెసు నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అసమర్థతలో, అవినీతిలో తన అద్భుత సామర్థ్యాన్ని మూడుటర్మ్‌ల పాలనలో నిస్సందేహంగా నిరూపించుకున్నాడు. అధికార పక్షం మీద రోతపుట్టినప్పుడు ప్రత్యామ్నాయంగా విపక్షానే్న ప్రజలు ఎంచుకోవటం సహజం. విజాతీయులకు వ్యతిరేకంగా దీర్ఘకాలం విద్యార్థి ఉద్యమం నడిపి, మూడు పర్యాయాలు అధికారం అందుకోగలిగిన ఎ.జి.పి.యే అసోంలో కొనే్నళ్ల కిందటిదాకా ప్రధాన ప్రతిపక్షం. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం దరిమిలా ఆ స్థానాన్ని బి.జె.పి. కైవసం చేసుకుంది. ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షంపట్ల అనుకూలతగా మారి బిజెపి మెడలో వరమాల పడటం మామూలుగా అయితే అబ్బురం కాదు.
కాని అసోం పరిస్థితి వేరు. అక్కడి జాతులు, ఉపజాతులు, నైసర్గిక, రాజకీయ పరిస్థితులు, కుల, మత వర్గాలు... వాటి మధ్య వైరుధ్యాలు, కీలక రంగాల్లో వెనకబాట్లు, వాటిని ఆశ్రయించుకున్న దుష్ట రాజకీయాలు, వాటి నడుమ అపవిత్ర బంధాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రజల్లో ఎంతలా భ్రష్టుపట్టినా తిమ్మిని బమ్మిని చేసి, ఏ కాస్త సందు దొరికినా ఎదిరి పక్షం శక్తిని లాగేయగలిగిన తప్పుడు తెలివితేటలు కాంగ్రెసు ముఖ్యమంత్రికి దండిగా ఉన్నాయి.
కలిసికట్టుగా పోరాడితే కాంగ్రెసు కొమ్ములు వంచటం కష్టం కాదు. కాని విపక్ష శిబిరంలోనూ ఐక్యత అంతంత మాత్రమే. ‘ఎ.జి.పి.తో అలయెన్సు అవసరమే లేదు; మనం సొంతంగానే గెలవగలం’ అని బిజెపిలో పలుకుబడిగల వర్గాలు పట్టుబట్టాయి. బిజెపితో పొత్తు వద్దేవద్దు అని ఎజిపిలోనూ కొన్ని వర్గాల నుంచి గట్టి ప్రతిఘటన వచ్చింది. అలాగే వివాదాస్పద చరిత్రగల బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంటు (బి.పి.ఎఫ్.)తో అంట కాగటం మంచిదా అన్న విషయంలోనూ రెండు పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ పార్టీలపట్ల బోడోలకూ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ స్థితిలో ఆధికారికంగా పొత్తు కుదిరినా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయటంలో చాలా చిక్కులు ఉన్నాయి.
ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ భాజపా ముందుకు దూసుకు వెళ్లి ఘనవిజయం సాధించింది. విదేశీయుల చొరబాట్లు కారణంగా తమ గడ్డమీద తామే పరాయివాళ్లమవబోతున్నామని మొదటి నుంచీ అక్కడ నివసిస్తున్న మెజారిటీ ప్రజల్లో చిరకాలంగా ఉన్న ఆందోళనను ఆసరా చేసుకుని హిందూ ఓటు బ్యాంకును గట్టిపరచడం ఒకటే కాదు. అనేక నియోజకవర్గాల్లో ముస్లింల మద్దతును కూడా బిజెపి గణనీయంగా కూడగట్ట గలిగింది. భారతీయ జనతా పార్టీ అన్నా, దానికి గల హిందుత్వ వాసన అన్నా సరిపడని వారు, ఏమాత్రం అవకాశమున్నా దాని కీడునే కోరేవారు సైతం అసోంలో బిజెపి ధాటికి తిరుగులేదని ఫలితాలు వెలువడటానికి ముందే ఒప్పుకోక తప్ప లేదు.
ఈ చారిత్రక విజయం వెనుక పటిష్ఠమైన వ్యూహం ఉంది. ఎందరెందరివో క్రియాశీల సహాయ సహకారాలు ఉన్నాయి. ముఖ్యంగా వెనుకటి భంగపాట్ల నుంచి బిజెపి నాయకత్వం గుణపాఠం నేర్చుకుంది. కేంద్ర నాయకులు అతి చేయటంవల్లే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో భాజపాకు గతి చెడింది. రాష్ట్ర ఎన్నికల్లో పార్టీని గెలిపించే భారమంతటినీ మోది, అమిత్‌షా తమ భుజాలమీదే వేసుకుని, కేంద్రమంత్రులను భారీగా మోహరించి, పూర్తిగా మోదీ ప్రభుత్వ ప్రయోజకత్వంతోనే ప్రజలను ఇట్టే ఆకట్టుకోగలమని భ్రమపడటంతో ఆ రాష్ట్రాల్లో మొదటికి మోసం వచ్చింది. కాలికి బలపం కట్టుకున్నట్టు ప్రధానమంత్రి తిరిగి సుడిగాలి పర్యటనలు చేసి, ప్రచార సభల్లో ప్రతిద్వంద్విని పేరుపెట్టి తిట్టి పోయటంవల్ల నష్టం ఎక్కువ జరిగింది. ఢిల్లీలో కేజ్రీవాల్‌కు, బిహార్‌లో నితీశ్‌కుమార్‌కు సమ ఉజ్జీగా బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ చూపెట్టలేకపోయారు. ఢిల్లీలో కిరణ్‌బేడీని కాబోయే ముఖ్యమంత్రిగా అధినాయకత్వం ఏకపక్షంగా ప్రకటించింది. దానివల్ల పార్టీలోపలే తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. బిజెపిని ఓడించే శ్రమ ఎదిరి పక్షానికి లేకుండా బిజెపిలోని అసంతృప్తులే శాయశక్తులా కష్టపడి ఆ పుణ్యం కట్టుకున్నారు.
అనుభవం అయ్యాక రాష్ట్ర ఎన్నికలతత్వం బిజెపి పెద్దలకు బోధపడింది. వెనుక చేసిన తప్పులు ఈసారి అసోంలో చేయలేదు. ఎన్నికల ప్రకటన వెలువడటానికి చాలాముందే మచ్చలేని రాజకీయ చరిత్ర, యోగ్యత, సమర్థత ఉన్న సర్వానంద సోనోవాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అతడి విషయంలో పార్టీలో, కూటమిలో ఎవరికీ అభ్యంతరం లేదు. విదేశీయుల చొరబాట్ల వ్యతిరేక ఉద్యమం నడిపించిన ‘ఆసు’కు అధ్యక్షుడుగా, చాలాకాలం అసోం గణపరిషత్ ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వాడు; స్వయానా ఆదివాసి తెగకు చెందినవాడు. వయసు 53 కాబట్టి కాంగ్రెసు వృద్ధుడి పాలనతో మొగం మొత్తిన యువతరానికి ఇష్టుడు.
ఇలా అన్ని విధాల సరైన వ్యక్తిని ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించటంతోబాటు నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచారం బాధ్యతను కూడా పూర్తిగా రాష్ట్ర పార్టీ విభాగంమీదే బిజెపి నాయకత్వం వదిలేసింది. ఎన్నికల ప్రచారం కోసం బిహార్ చుట్టూ 18 సార్లు తిరిగిన నరేంద్రమోది ఈసారి ఎన్నికల సమయంలో అసోంకు వెళ్లింది మూడేసార్లు. జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా అంతే. ఎన్నికల ప్రచారం యావత్తు వ్యక్తిగత నిందలు, రెచ్చగొట్టే అంశాలు లేకుండా పూర్తిగా అభివృద్ధి, అక్రమ వలసన నిరోధం వంటి అంశాలు, కాంగ్రెస్ అవినీతి, పాలనా వైఫల్యాలు, ప్రజల అవసరాల చుట్టూనే తిరిగింది. కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా మంచిపేరు తెచ్చుకుని, రాజకీయంగా పెద్దబలం ఉన్న హిమంత విశ్వశర్మ అనే అపరచాణక్యుడు ముఖ్యమంత్రి బంధుప్రీతికి, రాహుల్‌గాంధీ నిర్లక్ష్యపు పోకడకు మనసు విరిగి కాంగ్రెసును విడిచి బిజెపిలో చేరటంతో కాంగ్రెసు శిబిరం డీలాపడింది. అతడి వ్యూహరచన పాటవం, రాజకీయ కౌశలం బిజెపికి బాగా లాభించాయి. అందరూ అంగలార్చే ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగట్టటానికి ‘‘సెక్యులర్’’ శక్తులు పోటీలు పడటం కూడా భాజపాకు అయాచితవరమైంది. భేషజాలు లేకుండా చిన్నా పెద్దా అందరి దగ్గరికీ వెళ్లి, నచ్చ చెప్పి ఎన్నికల పొత్తులు కుదర్చటం దగ్గర నుంచి, పార్టీ ప్రచారాన్ని క్రమ పద్ధతిన నడిపించటం దాకా వివిధ దశల్లో, అనేక రీతుల్లో మన తెలుగువాడైన రామ్ మాధవ్ జాతీయ పార్టీ కార్యదర్శిగా, ఎన్నికల ఇన్‌చార్జిగా అసోంలో నిర్వహించిన పాత్రనూ తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు.
అపజయం అనాథ; విజయానికి ఎందరో తండ్రులు - అని ఇంగ్లిషులో సామెత. అసోం అద్భుత విజయానికి ఎంతోమంది తలా ఒక చెయ్యి వేశారు. ఎవరి పాలు ఎంత అన్నదాని మీద రాజకీయ పండితులు, మీడియా వ్యాఖ్యాతలు ఎవరికి తోచిన విశే్లషణలు వారు చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులపాటు చేస్తూనే ఉంటారు. హై ప్రొఫైల్ ఉన్నవాళ్లు సాధారణంగా అందరి కంటికీ నదరుగా కనపడతారు. లో ప్రొఫైల్‌లో ఉండేవాళ్లు, ఎలాంటి ప్రచారాన్ని, ఎవరి గుర్తింపును ఆశించని వాళ్లు ఎంత పనిచేసినా అజ్ఞాతంగానే మిగిలిపోతారు.
అసోం ఎన్నికల విజయం వెనుక అటువంటి అజ్ఞాతశక్తి ఆరెస్సెస్! ఎన్నికలు, రాజకీయ జయాపజయాల మీద దృష్టి లేకుండా, విజాతీయుల చొరబాట్ల పర్యవసానమైన పరారుూకరణను నిరోధించి, జాతీయ భావాన్ని, జాతీయ శ్రేయాన్ని పెంపొందించటమే ధ్యేయంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఎన్నో దశాబ్దాలుగా ఈశాన్య భారతంలో సేవా కార్యక్రమాలు, విద్యా వ్యాప్తి ద్వారా నిశ్శబ్దంగా పాటుపడుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు సహా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎందరో ప్రచారకులు అసోంకు, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి విద్యాభారతి స్కూళ్లను, మారుమూల గిరిజన గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలను, వేల సంఖ్యలో వైద్యశాలలను నడుపుతూ ఆదివాసులతో కలిసి మెలిసి, భారతీయ సంస్కృతిని, సంస్కారాన్ని వ్యాప్తి చేయడానికి అవిరళ కృషి చేశారు. ఆరెస్సెస్ స్థాపించిన లోక్‌జాగరణ్ మంచ్ 1979 నుంచి మేధావులను, సంఘసేవకులను కూడగట్టి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తేయాకు తోటల పనివారిని, అసోంలో ఆదివాసులైన అహోంతెగ వారిని సంఘటితపరిచి, ఉపజాతీయతను సరైన దారికి మళ్లించి... వ్యక్తిగత దాడులకు, వేధింపులకు జంకకుండా ప్రజలలోకి చొచ్చుకువెళ్లి కొన్ని దశాబ్దాలుగా జనజీవితంలో మమేకమైన ఆరెస్సెస్ స్వయంసేవకులు ఈ ఎన్నికల్లో బిజెపికి అండగా నిలిచారు. పాతికవేలమంది సంఘ్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో, పోలింగ్ బూత్‌లకు ఓటర్ల సమీకరణలో చురుకుగా పాల్గొన్నారు.
ఆరెస్సెస్ కార్యక్షేత్రం అసోంకు పరిమితం కాదు. దాని విద్య, విజ్ఞాన, సేవా కార్యక్రమాలు ఈశాన్య ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలలోను ఎప్పటి నుంచో ముమ్మరంగా సాగుతున్నాయ. ఇక ముందు జరగనున్న మిజోరం, మణిపూర్, నాగాలాండ్ ఎన్నికల్లో ఈ సేవా ఫలం బిజెపికి పెన్నిధి.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ