ఉన్నమాట

కాశ్మీర్ కబ్జా ఇంకెంతకాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజం చెప్పులేసుకునేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందట!
కాశ్మీర్ సమస్యకు, ముఖ్యంగా ఆక్రమిత కాశ్మీర్‌కి సంబంధించినంత వరకూ ఒకటి తక్కువ డెబ్భైఏళ్లు లేటుగా ఇప్పుడిప్పుడే నిజం చెప్పులేసుకున్నది.
స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా ఆక్రమిత కాశ్మీర్‌పై తిరుగులేని మన హక్కును, అక్కడ పాకిస్తాన్ ఇష్టారాజ్యంగా సాగిస్తున్న అఘాయిత్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను మన ప్రధాని ధైర్యంగా, విరోధుల దిమ్మతిరిగేలా లోకానికి ఢంకా కొట్టి చాటారు. ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, అంతకుముందు అఖిలపక్ష సమావేశంలో పాకిస్తాన్ దాదాగిరి గురించి నరేంద్రమోది మాట్లాడింది తక్కువే. ఆచి తూచి పలికిన ఆ కాసిని మాటలే పాక్ పాలకులకు దిగచెమటలు పట్టించాయి.
కాశ్మీర్ మీద మన హక్కు గురించి మునుపటి మన ప్రభుత్వాలూ గట్టిగా మాట్లాడలేదని కాదు. మాట్లాడాయి. జమ్మూ, కాశ్మీర్ భారత రిపబ్లిక్‌లో అవిభాజ్య భాగం; ఇండియాలో దాని విలీనం ముగిసిన ప్రకరణం; దాన్ని తిరగదోడటం దుర్మార్గం; కాశ్మీర్‌లో సమస్యల్లా సరిహద్దు ఆవలినుంచి పాక్ ఎగదోస్తున్న టెర్రరిజంతోనే - అంటూ మన ప్రభువులు సమయం వచ్చినప్పుడల్లా ప్రపంచంలో ప్రతి వేదికమీదా మన వాణిని, వాదాన్ని నిష్కర్షగా, నియమబద్ధంగా వినిపిస్తూనే ఉన్నారు. ఆ విషయంలో లోపం లేదు. కాని 1947 నుంచి నిన్న మొన్నటిదాకా మన గవర్నమెంట్లు ఎంతసేపూ మన కాశ్మీర్ గురించి, అందులో పాకిస్తాన్ పాపిష్టి జోక్యం గురించే మాట్లాడుతూ ఆక్రమిత కాశ్మీర్ ఊసే ఎత్తకపోవడంతో ‘కాశ్మీర్ సమస్య’ అనేది కాశ్మీర్ లోయకు మాత్రమే పరిమితమైందన్న దురభిప్రాయం ప్రపంచానికి సహజంగానే కలిగింది. తన కబ్జాలోని కాశ్మీర్‌లో ఇస్లామాబాద్ దురాగతాల గురించి, అక్కడ ప్రజాభిప్రాయాన్ని, మానవ హక్కులను కాలరాచివేస్తున్న ఘోరాల గురించి మనం నోరుమెదపక పోవడంతో మన కాశ్మీర్ లోయలో ప్రజాభీష్టానికి, మానవ హక్కులకు పుట్టి మునిగిందంటూ పాకిస్తాన్, దాని తైనాతీలు, మన దేశంలో దాని పంచమాంగదళాలు పెడుతున్న ఆభాండాల బొబ్బలే అంతర్జాతీయ దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తీరికూర్చుని పథకం ప్రకారం ఇస్లామాబాద్ విరజిమ్ముతున్న అబద్ధాల బురదను కడిగేసుకోవడంతోటే, అది రువ్వే చచ్చు సవాళ్లకు, పుచ్చు అభియోగాలకు సమాధానంతోటే మన పుణ్యకాలమంతా చెల్లిపోయింది. పాకిస్తాన్ అఫెన్సును, దానికి మన నంగిరి డిఫెన్సును చూసి చూసి కాశ్మీర్‌లో తప్పంతా భారత ప్రభుత్వానిదే, పాపమంతా భారత భద్రతా బలగాలదేనన్న పైత్యం మన లెఫ్ట్, లిబరల్, వీర సెక్యులర్ మేధావి గణాల్లో ప్రబలింది.
నిజమేమిటో లోకానికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పనప్పుడు ఎదిరిపక్షం చెప్పే అబద్ధమే నిజం కాబోలునన్న అపోహ ఎంతటివారికైనా కలుగుతుంది. కాబట్టే ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి సమావేశంలో దాని హై కమిషనర్ అంతటివాడే ఇండియా పాలిత కాశ్మీర్, పాక్ పాలిత కాశ్మీర్ అంటూ రెంటినీ మొన్న ఒకే గాటకట్టాడు. భారత్‌వైపు ఉన్న భూభాగంలో పౌరులపై మితిమించిన బలప్రయోగాల గురించి ఫిర్యాదులు వస్తున్నాయంటూ తెగ ఇదై పోయాడు.
వాస్తవానికి పాకిస్తానీ కాశ్మీరు, ఇండియన్ కాశ్మీరు అంటూ రెండు కాశ్మీర్‌లు లేవు. ఉన్నది ఒక్కటే జమ్మూ, కాశ్మీర్. ఒకప్పుడు అది స్వతంత్ర సంస్థానం. 1947లో బ్రిటిష్ సార్వభౌమాధికారం అంతరించాక సంస్థానాలపై సర్వాధికారాలూ వాటి ప్రభువులకు దఖలు పడ్డాయి. భారత్, పాకిస్తాన్‌లుగా బ్రిటిష్ ఇండియా విభజన జరిగాక పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం ఏ దేశంలో కలిసేదీ నిర్ణయించే అధికారాన్ని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టు సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకునే దుర్బుధ్ధితో ‘రైడర్ల’ పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. నాదిర్షా, అబ్దాలీల తరహాలో జనావాసాలను కబళిస్తూ మిడతల దండులా పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు చేరిన దశలో మహారాజ హరిసింగ్ తన రాజ్యాన్ని ఇండియన్ యూనియన్‌లో చట్టబద్ధంగా, యథావిధిగా విలీనం చేశాడు. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే భారత్‌లో విలీనమైందో, దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించటం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. భారత సైన్యం వెంటనే ఆకాశమార్గాన రంగంలోకి ఉరికింది. చొచ్చుకొచ్చిన శత్రు సేనలను వెనక్కి తరుముకుంటూ, ఆక్రమిత ప్రాంతాలను తిరిగి వశపరచుకుంటూ మన సైనికులు అద్భుత శౌర్య పరాక్రమాలతో ముందుకు దూసుకు పోతూండగా-
జరగకూడనిది జరిగింది. పాక్ ఆక్రమించిన మొత్తం భూమిని మరి కొద్దిరోజుల్లో స్వాధీన పరచుకుంటామని ఆర్మీ జనరల్స్ చెబుతున్నా వినకుండా నెహ్రు పండితుడు సైనిక చర్యలను అర్ధాంతరంగా ఆపించాడు. క్షాత్రంతో సాధించవలసిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చి, లిటిగేషను దారి పట్టించి పాకిస్తాన్‌పై పితూరీ చేస్తూ ఐక్యరాజ్యసమితి గడప ఎక్కాడు. మహారాజు సంతకంతో ఖరారు అయిపోయిన విలీనాన్ని తానే తిరగదోడాడు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికీ పెట్టని షరతును జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎవరూ అడక్కుండానే పనిగట్టుకుని చొప్పించాడు. ఆక్రమించిన ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలిగాక ప్లెబిసైట్ జరిపించడానికి ఐరాస సై అంది. ఆ ప్రకారం వైదొలగడానికి పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఐరాస తీర్మానం, దానిలోని ప్లెబిసైటు ప్రతిపాదన అటకెక్కాయి.
ఇక మిగిలిన సమస్యల్లా పాకిస్తాన్ దౌర్జన్యంగా ఆక్రమించిన మన భూమిని తిరిగి మన వశం చేసుకోవటం ఎలాగన్నదే. అది కాస్తా కూస్తా కాదు. విలీన పత్రం ద్వారా చట్టబద్ధంగా మన పరమైన జమ్మూ కాశ్మీర్ మొత్తం వైశాల్యం 3,09,897 చదరపు కిలోమీటర్లు కాగా నేటికీ కబ్జాలో ఉన్న భూమి మొత్తం కలిపి 87,661 చ.కి.మీ.! అంటే దాదాపు 30 శాతం.
అంత విశాల ప్రాంతాన్ని చూస్తూ చూస్తూ ఎవరూ వదులుకోరు. మన జాగాలో రెండు గజాలను పక్కవాడు కలిపేసుకున్నాడంటేనే మనవాళ్లు కొట్లాడి, తలలు పగలగొట్టుకుని, కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిరిగి అవతలివాడి దుంప తెంచుతారు. సొంత ఆస్తి విషయంలో మన నాయకులూ అంతే. కాని దేశానికి చెందిన భూమి దగ్గరికి వచ్చేసరికి వారు కడు ఉదారులు. ఏదీ పట్టని పరమ విరాగులు. ‘గడ్డిపరక మొలవని భూమి... కాబట్టి పరాయి దేశం ఆక్రమించినా మనం పట్టించుకోకూడదు’ అని చెప్పి అక్సాయిచిన్‌లో మనకు చెందిన విలువైన ప్రాంతాన్ని చైనాకు ధారపోసిన చాచా నెహ్రూ ఇంతకాలమూ మన ఇలవేల్పు.
మన ఆస్తిని పొదం చేసుకోవటంలో మనం ఎప్పుడైతే విఫలమయ్యామో, ఆక్రమణకు గురైన భూమిని తిరిగి పొందాలన్న శ్రద్ధ, పట్టుదల మన ఏలికలకు ఎప్పుడైతే మృగ్యమయ్యాయో, పాకిస్తాన్ జంకు లేకుండా బరి తెగించింది. ఆక్రమిత కాశ్మీర్ మీద తనకు లీగల్‌గా ఎలాంటి హక్కూ లేకపోయినా అడ్డగోలుగా దానిని తన కబంధ హస్తాల్లో ఇరికించుకుంది. తన కబ్జా భూమికి డాబుసరిగా ‘ఆజాద్ జమ్మూకాశ్మీర్’ అని పేరైతే పెట్టింది. ఆచరణలో దాని ‘ఆజాదీ’ని గుంటబెట్టి గంట వాయించింది.
ఆజాద్ కాశ్మీర్‌కి ప్రెసిడెంటు, ప్రధానమంత్రి పేరుకైతే ఉన్నారు. కాని వారు రాజ్యంలో ఉండరు. వారి నివాసం ఇస్లామాబాదులో! పాక్ పాలకుల దృష్టిలో వారు హైక్లాస్ చప్రాసీలు. అసెంబ్లీ, మంత్రి మండలి, ప్రధాని కేవలం ఉత్సవ విగ్రహాలు. మొత్తం అధికారాలన్నీ రావల్పిండిలోని హెడ్ క్వార్టర్సు చేతిలో ఉంటుంది. ముజఫరాబాద్ దగ్గర ముర్రీలో ఉండే కోర్ కమాండర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆజాద్ కాశ్మీర్ ప్రెసిడెంటయినా, ప్రధానమంత్రి అయినా పరుగున వెళ్లి చేతులు కట్టుకు నిలబడవలసిందే. పేరుకు ప్రధాని ప్రభుత్వాధినేత అయినా ఆజాద్ కాశ్మీర్‌లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ పాక్ సర్కారు చెప్పుచేతల్లో ఉంటుంది. పాక్ ప్రధాని అగ్రసనాధిపతి అయిన ఆజాద్ కాశ్మీర్ కౌన్సిలే అసలు అధికార కేంద్రం. అధ్యక్షుడిని, ప్రధానిని నియమించడమైనా, తొలగించడమైనా ఇస్లామాబాద్ ఇష్టానుసారం!
అడిగేవాళ్లు లేనప్పుడు ఏ ఆట ఆడినా సాగుతుంది. దౌర్జన్యంగా కబ్జాచేసినా ఆక్రమిత కాశ్మీర్ తనది అని చెప్పుకునే ధైర్యం పాకిస్తాన్‌కి లేదు. ‘జ్దీళశ ఆ్దళ ఔళ్యఔళ యచి డఆ్ఘఆళ యచి చ్ఘౄౄఖ ఘశజూ ఘ్‌ఒ్దౄజూ జూళషజజూళ ఆ్య ఘషషళజూళ ఆ్య -్ఘరీజఒఆ్ఘశ, ఆ్దళ ళ్ఘఆజ్యశఒ్దజఔ ఇళఆతీళళశ -్ఘరీజఒఆ్ఘశ ఘశజూ ఆ్దళ డఆ్ఘఆళ ఒ్ద్ఘ ఇళ జూళఆళూౄజశళజూ జశ ఘషష్యూజ్ఘూశషళ తీజఆ్ద ఆ్దళ తీజఒ్దళఒ యచి ఆ్దళ ఔళ్యఔళ యచి ఆ్దళ డఆ్ఘఆళ‘ (జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు పాకిస్తాన్‌లో విలీన మవాలని భవిష్యత్తులో నిర్ణయించినప్పుడు ఆ రాష్ట్రానికి, పాకిస్తాన్‌కి మధ్య సంబంధం ఎలా ఉండాలో ఆ రాష్ట్ర ప్రజల ఇష్టాన్ని బట్టి నిర్ణయించబడును) అని పాకిస్తాన్ రాజ్యాంగం 257వ అధికరణం ఇప్పటికీ చెబుతుంది. విలీనం ఇంకా జరగలేదని, ఆజాద్ కాశ్మీర్ అనేది పాకిస్తాన్‌కి చెందని వేరే భూభాగమని పైకి అంటూనే ఆ ప్రాంతాన్ని తన కాళ్ల కింద తొక్కి వేయటం పాకిస్తాన్ ప్రత్యేకత. అంతేకాదు. ఐరాస తీర్మానం ప్రకారం ఇక ముందు పాకిస్తాన్‌లో విలీనం అయితే గియితే తప్ప ఆజాద్ కాశ్మీర్‌పై తనకు హక్కు లేదని ఒక చెంప చెబుతూనే ఇంకోవంక అదే ఆజాద్ కాశ్మీర్ నుంచి ఐదింట నాలుగువంతుల భూమిని అడ్డగోలుగా కాజేసిన ఘనత ఇస్లామాబాద్‌ది.
తాడూ బొంగరం లేని ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వాన్ని పీటలమీద కూచోబెట్టి, కరాచీ ఒప్పందమనేది బనాయించి, తనకు లేని అధికారంతో ఉత్తరాదిన 74,364 చదరపు కిలోమీటర్ల గిల్గిట్ - బాల్టిస్తాన్ ప్రాంతాలను 1949లోనే పాకిస్తాన్ అడ్డగోలుగా తన పులుసులో కలిపేసుకుంటే అప్పటి మన నెహ్రూ ప్రభుత్వం చేతులు ముడుచుకుని చోద్యం చూస్తూండిపోయింది. తనకు ఏ హక్కు లేని ఆ భూమిలో నుంచి ఏకంగా 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్టు పాకిస్తాన్ 1963లో చైనాకు దానంచేసినా నెహ్రు పండితుడు తగిన రీతిలో ప్రతిఘటించలేదు. తేరగా కొట్టేసిన భూమిగుండా చైనా కారాకోరం రహదారిని నిర్మించి, ఆయిల్, గాస్‌పైప్‌లైన్లు వేయబట్టి, ఇండియాపై ఎక్కుపెట్టే విధంగా అణ్వస్త్రాలను మొహరించేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నా భారత ప్రభుత్వం ఆక్షేపణల తాటాకు చప్పుళ్లే తప్ప పాకిస్తాన్-చైనాల అక్రమ లావాదేవీలను దృఢంగా ఎదిరించిన పాపాన పోలేదు.
ఆక్రమిత కాశ్మీర్ అనేది మనది కానట్టూ, దానిని ఇష్టమొచ్చినట్టు కొట్టుకుతింటూ, కనీస మానవ హక్కులకే దిక్కులేని రీతిలో దాని ప్రజలను ఇష్టం వచ్చినట్టు ఆరళ్లు పెడుతూ... త్రిశంకు నరకంలో వేసి చిత్రహింసలు పెడుతున్నా మనం కలగజేసుకోవలసిన అవసరం లేనట్టూ, అధీనరేఖ వెలుపల ఏమి జరిగినా అదంతా పాకిస్తాన్ అంతరంగిక వ్యవహారమైనట్టూ ఇనే్నళ్లూ మన ప్రభుత్వాలూ ఉపేక్ష వహించాయ. కాబట్టే పాకిస్తానీలకు తోక లేచింది. చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా ఇండియన్ రిపబ్లికులో ఏనాడో జరిగిపోయన జమ్మూకాశ్మీర్ విలీనానే్న తిరగదోడి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్నానే్న ఆక్రమణదారుగా చిత్రించి, ఆ రాష్ట్రంపై భారత సార్వభౌమాధికారానే్న సవాలు చేసే స్థితికి ఇస్లామాబాద్ బరి తెగించింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే, మనకే చెంది తీరాలి అంటూ పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానమైతే చేసింది. అంతటితో తన బాధ్యత తీరినట్టు ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఆ తరవాత వచ్చిన ప్రభుత్వాలూ పాకిస్తాన్‌కి సుద్దులు చెప్పటం, దాని మెరమెచ్చులకు అంగలార్చటంతో కాలం గడిపాయే తప్ప పాక్, చైనాల కబ్జాల నుంచి ఆక్రమిత కాశ్మీర్‌కు విముక్తి కలిగించే దిశగా కనీసం దృష్టి సారించలేదు.
నరేంద్రమోది సర్కారు కూడా నిన్నమొన్నటిదాకా ఆ దారినే నడిచింది. కారణాలు ఏమైతేనేమి పొరపాటును దిద్దుకుని ఇప్పుడు సరైన వైఖరి అవలంబించింది. ఎర్రకోట మీద వీరాలాపాలతో ఆగకుండా పాకిస్తాన్‌కి కీలెరిగి వాత పెట్టేందుకు నడుం కట్టింది. ఆక్రమిత కాశ్మీర్‌లో టెర్రరిజం బాధితులకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం, మునుపటి యుద్ధాల్లో నిర్వాసితులైన వారి పునరావాసానికి 2000 కోట్ల పాకేజి ప్రకటించటం, ప్రవాసీ భారతీయ వేడుకలకు ఆక్రమిత కాశ్మీర్ వారిని ఆహ్వానించటం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో ఉపఖండంలో పరిస్థితి మారింది. పాక్ ఎజండా ప్రకారం కాశ్మీర్ కథ నడిచే రోజులు పోయాయ. కేవలం పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టే ఎత్తుగడగానే కాకుండా దాదాపు 70 ఏళ్లుగా భారతదేశం తనకు తాను చేసుకున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం కడదాకా ముందుకు సాగగలిగితే పాకిస్తాన్ ఆటకట్టు. దేశాన్ని దశాబ్దాలుగా తిప్పలు పెడుతున్న టెర్రరిజం విషానికి అదే విరుగుడు.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ