జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంను 2జి కేసులో నిందితునిగా చేర్చాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడాన్ని ప్రభుత్వం శనివారం ప్రశంసించింది. దీని వల్ల తమ వైఖరి, కాంగ్రెస్ పార్టీ వైఖరి సమర్ధనీయమని తేలిందని పేర్కొంది. 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో చిదంబరం పాత్ర లేదని, ఆయనపై చేసిన ఆరోపణలు రాజకీయంతో కూడినవని సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, అంబికాసోని తదితరులు పేర్కొన్నారు. ‘పార్లమెంటులో, ప్రభుత్వంలోనూ మా సహచరుడైన చిదంబరం దోషి కాడని, సుబ్రమణ్యస్వామి చేసిన ఆరోపణలకు ఆయన ఎంత మాత్రం బాధ్యులు కారు’ అని టెలికం మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. ‘ఇది మంచి తీర్పు’ అని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కోల్‌కతాలో విలేఖరులతో అన్నారు. ‘ప్రాసిక్యూట్ కాకుండా ఇది ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన తీర్పులో కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహా పట్టించుకోలేదని తెలియచేసింది. ఈ తీర్పు ఆహ్వానించదగినదే’ అని ఆయన చెప్పారు. ‘2జి వ్యవహారంలో చిదంబరం అపరాధికాడని సుప్రీంకోర్టు తీర్పులో తెలిపింది’ అని సిబల్ తెలిపారు. కానీ ప్రతిపక్షనాయకులు మాత్రం రాజకీయ ప్రయోజనం కోసం దీన్ని వినియోగించుకుంటూ కోర్టును ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంటులో మాత్రం కొంత మంది బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకులు చాలా అభ్యంతరకర రీతిలో విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘ఈతీర్పుతో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వైఖరి సమర్ధనీయమని తేలింది’ అని చెప్పారు. ఈ తీర్పు పట్ల న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హర్షం ప్రకటిస్తూ, ప్రభుత్వానికి ఊరట కలిగించిందని విలేఖరులతో అన్నారు. కాగా అందరి దృష్టిలో పడాలనే సుబ్రమణ్యస్వామి ఇదంతా చేశారని సమాచార ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోని ఆరోపించారు. ‘స్వామి మాకు ఎన్నో ఏళ్లనుంచి తెలుసు. ఆయన పిటిషన్‌ను కొట్టివేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని కోర్టులు కొట్టివేసాయి. ప్రజల దృష్టిలో పడేందుకే ఆయన ఇలా చేస్తుంటాడు’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్వామి దీనిపై పై కోర్టుకు వెళ్తానన్నారు కదా, అన్నదానిపై సిబల్ వ్యాఖ్యానిస్తూ,‘ఆయన హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు, భగవంతునికి కూడా అపీల్ చేస్తారు’ అని వ్యంగ్యంగా అన్నారు. టివి ఛానల్స్ తీర్పునకు ముందు ఈ అంశంపై చర్చాగోష్టి నిర్వహించడం పట్ల సిబల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Add new comment