ఉత్తర తెలంగాణ

టీచర్ సుజాత (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం ఐదయింది. రోజంతా స్కూల్‌లో పాఠాలు చెప్పి.. అలసిన వదనంతో అప్పుడే ఇంటికి చేరింది టీచర్ సుజాత. ఫ్రెష్ అయ్యి..కాఫీ సేవించి.. దినపత్రికలను తిరగేస్తోంది..ఇంతలో ఫోన్ మ్రోగింది. ‘హలో ఎవరండీ’ అంటూ పలకరించింది..
‘నమస్కారం..నేను మేడం మీ స్టూడెంట్ విజయను..మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రీగా వున్నారా? అని అంది.
‘విజయ అంటే ఎవరు? భాగ్యమ్మ కూతురువా? పెళ్లయిందిగా? ఎలా వున్నావు? ఎక్కడుంటున్నావు? అంతా బాగేనా? అని ప్రశ్నల వర్షం కురిపించింది సుజాత.
‘ఏం చెప్పుమంటారు మేడం..మీ మాట కాదని ప్రేమ వివాహానికి ఒప్పుకున్నాను. ఇంతకు ఇంత అనుభవించా, నా గోడు మీకు చెప్పుకుని మీ మాటలతో కొంతైనా సాంత్వన పొందాలనుకుంటున్నాను’ అంది విజయ.
‘ఓ అలాగా! అయితే వచ్చేసెయ్! కలిసి మాట్లాడుకుందాంరా’ అంది సుజాత..
ఉన్న ఫళంగా ఆటోలో బయలుదేరి టీచర్ ఇంటికి చేరింది విజయ.
కాలింగ్ బెల్ మ్రోగగానే వెళ్లి తలుపు తీసింది సుజాత.. తలుపు తెరిచి ‘రా అమ్మ’.. అని విజయను దగ్గరకు తీసుకుని..హాల్ వైపు అడుగు వేసింది సుజాత..
అమ్మ ప్రేమను పంచే సుజాత మేడం అంటే విజయకు ప్రాణం..సుజాత మేడంను విజయ అమితంగా ప్రేమిస్తది. గౌరవిస్తది. ఆమె మాట విజయకు వేదం..కానీ పెళ్లి విషయంలోనే టీచర్ మాట విననందుకు కష్టాలు కొని తెచ్చుకుంది..
‘కూర్చో అమ్మా..నేను లోపలికెళ్లి మంచినీళ్లు తెస్తానని’ చెప్పి..వాటర్ బాటిల్‌తో వచ్చేసింది సుజాత.
‘ఏమమ్మా..బక్క చిక్కిపోయావు..నువ్వు అత్తారింట్లో ఉండటం లేదా? కాపురం ఎలా వుంది? తల్లిగారింటికి ఎప్పుడొచ్చావు?’ అని అడిగింది సుజాత.
‘ఏం చెప్పమంటారు? మేడం’ అంటూ టీచర్‌ను గట్టిగా హత్తుకుంది. దుఃఖంతో కళ్లు ఏకధాటిగా కారుతున్నాయి. నోట మాట రావడం లేదు..విజయకు..
‘్ఫరువాలేదు చెప్పమ్మా!’ అంటూ ఓ దారుస్తూ అడిగింది సుజాత..
‘ఎన్నో కలలు కని తల్లిదండ్రుల్ని, గురువుల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిన నాకు..కష్టాలు రావడం ఎంతో కాలం పట్టలేదు.. భర్త త్రాగుడికి బానిసై..రోజు శారీరకంగా, మానసికంగా వేధించడం నిత్యకృత్యమైంది. కోరిన కట్న కానుకలు కూడా ఇచ్చినా..నా కష్టాలు తీరలేదు..గర్భిణిని అని కూడా చూడకుండా నన్ను రోజు రాచి రంపానపెట్టాడు..బాధలు భరించలేక..పుట్టింటికి వచ్చేశా..రోజులు గడిచాయి..ఆడబిడ్డకు జన్మనిచ్చాను. ఆడబిడ్డ పుట్టిందని తెలిసి కనీసం చూడటానికైనా నా భర్త రాలేదు. అత్త మామలూ రాలేదు.
అలా మూడు సంవత్సరాలు గడిచాయి. మళ్లీ నన్ను తీసుకపోతానంటూ నాటకమాడుతున్నాడు అంది విజయ.
అయ్యో అలాగా..ఎంత అన్యాయం జరిగింది నీకు..అంటూ అనునయించ సాగింది సుజాత.
కళ్లలో సుడులు తిరుగుతున్న నీళ్లను తుడుచుకుంటూ ఇంకెం జరిగింది చెప్పమ్మా అంటూ అడిగింది టీచర్..
‘ఏం చెప్పమంటారు? మూడు సంవత్సరాల పాపతో పుట్టింట్లోనే ఉంటున్నా..మా నాన్న నన్ను బలవంతంగా మళ్లీ భర్త దగ్గరికి పంపాలని చూస్తున్నాడు..అక్కడికి వెళ్తే నా ప్రాణానికి ముప్పు వుందని ఎంత చెప్పినా వినడం లేదు. మీరైనా జోక్యం చేసుకుని మా నాన్నకు చెబుతారని వచ్చాను’ అంది విజయ.
‘అలాగే రాత్రవుతుందిగా నీవు ఇంటికి వెళ్లు..రేపు ఆదివారం కదా..నేనే మీ ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడుతా అంటూ వాటర్ బాటిల్‌లోని నీటిని గ్లాసులో పోసి అందించింది సుజాత.
‘సరే మేడం అంటూ మంచినీళ్లు త్రాగి ఇంటికెళ్లింది విజయ..
ఆదివారం ఉదయం..టిఫిన్ చేసి విజయ ఇంటికి బయలుదేరింది సుజాత.
విజయ ఇల్లుకు చేరింది. సుజాత కడుపేదరికంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను చూసి ఒకింత వేదనకు గురయ్యింది. బాధాతప్త హృదయంతో వారిని పలకరించింది. ‘రండి మేడం’ అంటూ విజయవాళ్ల అమ్మ భాగ్యమ్మ వాకిట్లో వున్న మంచాన్ని వేసింది.
మంచంపై మేడం సుజాత కూర్చుంది. ‘బాగున్నారా మేడం? మీరు ఈ వేళలో ఇక్కడా? అంటూ ప్రశ్నించింది భాగ్యమ్మ
‘నాకు అన్ని విషయాలు విజయ చెప్పింది. మీ ఆయన ఉన్నాడా? ఒకసారి పిలువు’ అంది.
‘అలాగే అంటూ ఇంటి వెనుక పెరట్లో వున్న భర్త రంగయ్యను పిలిచింది భాగ్యమ్మ.
‘రంగయ్య బాగున్నావా?’ అని అడిగింది సుజాత.
‘బాగున్నానమ్మా దండాలు..ఎటొచ్చారమ్మా’ అన్నాడు రంగయ్య..
‘ఏం లేదు రంగయ్య..నీ కూతుర్ని మళ్లీ అత్తారింటికి పంపిస్తానంటున్నావట! అక్కడ ఆమె ప్రాణాలకు ముప్పుందని తెలియదా?’ అంది సుజాత.
‘మేము ముసలోళ్లమయ్యాము..దీన్ని, దీని బిడ్డను పోషించడం మా వల్ల కావడం లేదు..ఎప్పటికైనా అది అక్కడుండాల్సిందే కదా’ అన్నాడు రంగయ్య.
‘నిజమే త్రాగుఫోతు భర్తతో అమ్మాయి కాపురం చేయడం కష్టం కదా’ అంది సుజాత.
‘అవును నాకు మరో మార్గం లేదమ్మా’ అన్నాడు రంగయ్య.
‘నీకు అభ్యంతరం లేక పోతే..నేను పిల్లలు లేని దాన్ని నా భర్త నేను ఇద్దరమే వుంటున్నాం. మనుమరాలు నీ కూతురును నేను పెంచుకోవాలా? అని అడిగింది సుజాత.
‘ఒక్కసారి మేడం మాటలు వినగానే ఆశ్ఛర్యపోయి.. మీ కెందుకమ్మా మా కష్టాలు.. మా బ్రతుకు మమ్మల్ని బ్రతుకనివ్వండి’ అని వినయంగా చెప్పాడు రంగయ్య.
ఇంతలో లోపలి నుంచి విజయ తల్లి భాగ్యమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి అంతకన్న మహాభాగ్యమా’ అంటూ టీచర్ కాళ్లపై పడింది. లేవమ్మా..లేవమ్మా అంటూ భాగ్యమ్మను కాళ్లపై నుండి లేపడానికి గట్టిగా అరుస్తోంది సుజాత.
ప్రక్కనే బెడ్‌పై వున్న సుజాత భర్త కలవరిస్తున్న సుజాతను తడుతూ నిద్రలేపాడు. మేల్కొంది సుజాత. ఏమైంది సుజాత కలవరిస్తున్నావు? ఏదైనా పీడ కలొచ్చిందా? అంటూ వాటర్ బాటిల్‌లోని నీళ్లు వంచి గ్లాసందించాడు భర్త..ఇలాగైనా పిల్లలు లేని లోటు తీరుతుందనుకున్నా. అయ్యో ఇదంతా కలనా? అని మనసులో అనుకొని నీళ్లు త్రాగి మళ్లీ నిద్రలోకి జారిపోయింది సుజాత.

- చిందం సునీత
కోరుట్ల, జగిత్యాల జిల్లా
సెల్.నం.9701075502

పుస్తక సమీక్ష

మమతానురాగాలను
పంచే ‘్భవతరంగాలు’!

పేజీలు: 84, వెల: 50/-
ప్రతులకు:
డాక్టర్ వరలక్ష్మి వరికూటి (ఎంబిబిఎస్)
హైదరాబాద్
సెల్.నం.9849442495

ప్రేమ కంటే త్యాగమే మిన్న అనుకుంటే ఆ త్యాగానికి ‘శ్రీ’కారం చుడతా.. అంటూ తన అంతరంగంలోని ఆలోచనలకు అందమైన అక్షర సొబగులద్ది..డాక్టర్ వరలక్ష్మి వరికూటి ‘్భవతరంగాలు’ కవితా సంపుటిని ప్రకటించారు. ‘ప్రేమ ప్రేమించడానికే అయితే..మరింత ప్రేమిస్తానని చెప్పే ఆమె వృత్తిరీత్యా ఉద్యోగ విరమణ చేసిన వైద్యురాలు..ఆమె కవిత్వంలో ఎక్కడా సంక్షిష్టతకు తావివ్వకుండా అలతి అలతి పదాలతో..అద్భుతమైన భావాలను పండించడం విశేషం! ప్రతీ ఒక్కరూ మానవత్వంతో ముందుకు సాగాలనీ..సామాన్య జీవితానికి కట్టుబాట్లతో, ఆచార వ్యవహారాల మార్గాలతో సరళమైన రీతిలో పయనించాలన్న సంకల్పంతో..ఈ గ్రంథంలోని యాభై కవితలను తీర్చిదిద్దారు.
కవయిత్రి తమ హృదయాంతరాల్లో కదలాడే ఉద్వేగాలను, స్పందనలను సామాజిక దృక్పథంతో మనముందుంచారు.
ఈ గ్రంథంలో బాధ్యత గల ఒక వైద్యురాలిగా సహజ ఆరోగ్యాన్ని గురించి తపన పడుతూ ‘పదిలంగా పది సూత్రాలను’ పాఠకులకందించారు. శ్రమ దోపిడీపై తమ కలాన్ని ఎక్కుపెట్టారు. మంచి గాయనిగా పేరున్న డాక్టర్ వరలక్ష్మి..సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఆరాటం..అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై పోరాటం చేయాలన్న ఉబలాటం..మసక బారుతున్న మానవ సంబంధాలకు మెరుగులు అద్దాలన్న సంకల్పం..వంటి లక్షణాలు ఆమె కవిత్వంలో ముప్పేటా అల్లుకుపోయాయి. మనల్ని విజయపథంలో నడిపించేది ‘అమ్మ ప్రేమేనని’ తేల్చి చెప్పారు. కవితల్లో ఆమె ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ఆమె అమాయకత్వంతో నిలదీసే తత్వమూ ప్రతిబింభిస్తోంది.
అతిథిగా వచ్చి..ఆద్యంతం అండగా నిలిచి..సృష్టికర్తగా మలచి, సాటిలేని మేటి వ్యక్తిగా నిలిపే జీవిత భాగస్వామికి ప్రేమాభివందనం సమర్పించాలని మాతృమూర్తిని ఉన్నతంగా చిత్రించారు.
జీతం లేనిదే జీవితం లేదనీ..ఉద్యోగం పురుషలక్షణం’ మాత్రమే కాదు..ఉద్యోగం మనిషి లక్షణం అవ్వాలని ఆకాంక్షించారు.
డియర్ బున్నీ..అంటూ ‘రమ్యప్రకాష్’ కవితను రమ్యంగా ఆవిష్కరించారు. ముగ్ధ మనోహరంగా, స్నిగ్ధ సింధూరంగా..బున్నీతో ఓ అమ్మగా వున్న ఆత్మీయ అనుబంధాన్ని అక్షరాల్లో బంధించిన తీరు అభినందనీయం! తీరానికి ఎగసే అలల్లాంటి జ్ఞాపకాలను..సముద్రంలో ఆణిముత్యాల్లాంటి వాక్యాలతో..బున్నీని అందంగా ఈ కవితలో తీర్చిదిద్దారు. ఆమె దీపం..ఆమె నిత్యం..ఆమే సర్వం అని చక్కని ముగింపునిచ్చారు.
చైత్ర మాసంలోని నీరెండలా శిశిరంలోని మామిడాకులా.. ఉగాది వేప పూతలా.. పున్నమి కలువ భామలా..మన ముందుకు నవ యవ్వనిలా వస్తుందని దిన పత్రికను అభివర్ణించారు.
ఆగస్టు-2007 జంట నగరాల బాంబు పేలుళ్లపై స్పందిస్తూ రాసిన కవితలో..మతం కంటే మానవత్వం గొప్పదనీ..అహింసే పరమ ధర్మంగా జాతిని బతికించుకోవాలని హితవు పలికారు.
ఇప్పుడు కావలసింది ‘అక్షర సమరం’ కాదు అక్షర ‘వరం’ కావాలనీ..కుల వివక్షను దూరం చేయడానికి ప్రతీ ఒక్కరూ చైతన్యవంతులు అవ్వాలని ‘ప్రేమి’‘కులం’ కవిత ద్వారా పిలుపునిచ్చారు.
మరో కవితలో నేటి ఆకలి కేకలకు కారణాలను ఏకరువు పెట్టారు.
కవయిత్రిలోని భావ‘నా’తరంగాలను ‘నేనెవర్నీ!?’ కవితలో ఆవిష్కరించిన తీరు ఆలోచనాత్మకంగా వుంది. నేను నేనేనంటూ..ఇప్పటికే ఎప్పటికీ సగటు మనిషిని..సాటి మాతృమూర్తినని సవినయంగా ప్రకటించారు.
‘చిరునవ్వుతో’ అన్న కవితలో..ప్రతి ఒక్కరి జన్మదినానికి అన్వయించుకునేలా కవయిత్రి తమ మదిలోని భావాలను మనతో పంచుకున్నారు.
ప్రతి అనుభవమూ ఒక పాఠమేననీ, ప్రతి గులాబీ ఒక గురువని మరో కవితలో పేర్కొన్నారు.
గుండె బరువెక్కినప్పుడు, ఒళ్లు వేడెక్కినప్పుడు కనిపించే ‘కన్నీటి తరంగాలను’ ఆవిష్కరిస్తూ కన్నీరు ఒకటే అయినా..కారణాలెన్నో..ఎనె్నన్నో అంటూ చెప్పడంలో ఔచిత్యం ఉంది.
ఈ గ్రంథంలో..ఇలా ఎన్నో కవితల్లోని పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి?
కవిత్వానికి ఒక దృక్పథముండాలని భావించే డాక్టర్ వరలక్ష్మి సామాజిక దృక్పథంతో ఇందలి కవితల్ని అల్లడం ఆహ్వానించదగింది. మెదడు పొరల్లో నిక్షిప్తం కాగల ఏకైక మహత్తర సంపదే ‘కవిత్వం’ అన్న రహస్యం తెలిసిన ఆమె..తమ కలానికి ఇంకా పదును పెట్టుకుని..గాఢమైన కవిత్వాన్ని అందిస్తారన్న విశ్వాసం ఉంది. కవిత్వం రాయడంలో మెలకువలను తెలుసుకుని..తమ అంతరంగంలో కదలాడే భావాలకు..ఆమె మనో ఫలకంపై నాట్యం చేసే ఆలోచనలకు ఇంకా అందంగా అక్షరాకృతిని ఇవ్వాలని కోరుకుందాం..ఇందలి కవితల్లోని భావ శకలాల మాటున దాగి ఉన్న ఆమె ఉత్తమ వ్యక్తిత్వానికి స్వాగతం పలుకుదాం.

- సాన్వి, సెల్.నం.9440525544

అంతరంగం

సామాజిక చైతన్యంలో
కవుల పాత్ర కీలకం

అభ్యుదయ కవి ఎస్.వేణుశ్రీ

సామాజిక చైతన్యంలో కవుల పాత్ర కీలకమని సీనియర్ కవి ఎస్.వేణుశ్రీ అభిప్రాయపడ్డారు.. అణువణువునా అభ్యుదయ భావాలను పుణికి పుచ్చుకున్న ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన వారు.. సాహితీ సంస్థల నిర్వహణలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఆయనకుంది. ప్రగతిశీల భావాలను అలవోకగా తమ కవిత్వంలో ప్రతిబింబించే నైపుణ్యం గల ఆయన ఛందోబద్ధ పద్యాలను గ్రంథస్థం చేసి అందరి మన్ననలు పొందారు.. వ్యవహారిక భాషా పదాలను.. సామాజిక అంశాలతో కలిపి పద్యాలను అల్లడంలో ఆయన దిట్ట! నాటకాలు, కథలు, వ్యాసాలు రాసిన అనుభవం కూడా వున్న ఆయన వృత్తిరీత్యా కరీంనగర్ మిషన్ హైస్కూల్ నుండి తెలుగు ప్రథమశ్రేణి భాషా పండితులుగా ఉద్యోగ విరమణ చేసి.. సాహిత్య సృజనను ప్రవృత్తిగా మలచుకొని విశ్రాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ‘మెరుపు’ ఆయనతో ముచ్చటించింది. ముఖాముఖిలో ఆయన ప్రకటించిన భావాలు ఆయన మాటల్లోనే ‘మెరుపు’ పాఠకులకు అందిస్తున్నాం..
ఆ మీకు అభ్యుదయ భావాలు ఎప్పటి నుంచి అలవడ్డాయి?
1971-72 ప్రాంతంలో.. వరంగల్‌లో నేను తెలుగు ప్రవేశ కోర్సు అభ్యసిస్తున్న కాలంలో.. ముప్పాల రంగనాయకమ్మ, చెరబండ రాజు, శ్రీశ్రీ, కాళోజీ రచనలు చదివేవాన్ని.. వారి రచనల ప్రభావంతో నాకు అభ్యుదయ భావాలు అలవడ్డాయి. గురువర్యులు భాష్యం విజయసారథి గారి ప్రభావం కూడా నాపై పడింది!

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
ప్రజల సమస్యలను ప్రతిబింబించేది కవిత్వం..పదాడంబరాలు కాకుండా పాటు సామాన్యునికి సైతం అర్థమయ్యేలా సరళంగా ఉండాలి. కవిత్వం అట్టడుగు వర్గాల జనం గోసకు అద్దం పట్టాలి.

ఆ మీ మొట్టమొదటి గ్రంథం ‘స్వేచ్ఛ’ గురించి చెబుతారా?
‘స్వేచ్ఛ’ గ్రంథం నిండా పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలకు, వాటి పరిష్కారాలకు పెద్దపీట వేశాను. రాజకీయ నాయకులపై.. వారి పాలనలోని లోపాలను కవిత్వం ద్వారా ఎత్తిచూపాను.

ఆ మీరు ఏయే ప్రక్రియల్లో రచనలు చేశారు?
వచన కవిత్వం, పద్యకావ్యాలు, నాటకాలు, కథలు, వ్యాసాలు వంటి ప్రక్రియల్లో రచనలు చేశాను.

ఆ మీకు నచ్చిన కవులు ఎవరు?
శ్రీశ్రీ, కాళోజీ..

ఆ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కవిగా మీరు పోషించిన పాత్ర?
సందర్భోచితంగా ఉద్యమానికి ఊపిరి పోసేందుకు కవిత్వాన్ని సృజన చేశారు. సకల జనుల సమ్మెలో, కవుల కవాతు వంటి కార్యక్రమాల్లో కవిగా క్రియాశీలకంగా పాల్గొన్నాను..ఉద్యమ కాలంలోనే ‘స్వేచ్ఛ’ రెండో భాగం, తెలంగాణ ఆత్మఘోష పద్యకావ్యాన్ని వెలువరించాను.

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
స్వేచ్ఛ (1, 2 భాగాలు), ప్రజాభారతం కవితా సంపుటాలు, అలాగే వరేణ్యశతకం, తెలంగాణ ఆత్మఘోష పద్యకావ్యాలు మొత్తం ఐదు గ్రంథాలు ప్రకటించాను.

ఆ ఇప్పుడొస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయం?
ఇప్పుడు వివిధ రూపాల్లో కవిత్వం వెలువడుతోంది. ఏ కవితా రూపమైనప్పటికీ కవిత్వం వుంటే పాఠకులు ఆదరిస్తారు. ఆ ప్రక్రియ కొంత కాలం మనగలుగుతుంది. అయితే.. ఏ యిజాలకు తావివ్వకుండా కవిత్వంలో హ్యుమనిజానికి తావిస్తే బాగుంటుంది.

ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
సాహిత్యంతో పాటు..చారిత్రక శాసనాలను వెలుగులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సాహితీ సంస్థలు, కవులు, రచయితలు ముందుకు రావాలి.

ఆ సాహితీ పురస్కారాలు అవసరమంటారా?
అవసరమే. పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను పెంచే విధంగా ఉండాలి. ప్రతిభను పారదర్శకంగా గుర్తించి ప్రోత్సహించడంలో తప్పులేదు.

ఆ ఇప్పటి కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు,
సూచనలు ఏమిటి?
సామాజిక చైతన్యంలో కవుల పాత్ర కీలకం. కనుక ప్రగతిశీల భావాలతో రచనలు చేసి..సామాజిక రుగ్మతలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు కవులు తమ కలాలకు పనిపెట్టాలి. కవిత్వం రాయడంలోని మెలకువలు తెలియాలంటే.. అధ్యయనంపై దృష్టి పెట్టాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

చిరునామా:
ఎస్.వేణుశ్రీ
ఎల్.ఐ.జి - 1 - 99
హౌసింగ్ బోర్డు కాలనీ, కరీంనగర్-505001
సెల్.నం.9440064033

మనోగీతికలు

సూరారం మల్లి

సన్నజాజి తీగలా..
సంపెంగ పువ్వులా..
అరవిరిసిన కలువలా..
గోదారి నురగలా..
చూడ సక్కగున్నావే
సూరారం మల్లి నీవు
సూపుల్తో..
నీకైపు సూపుల్తో..
మావ గుండె దోసినావు
మంచెకాడ మావ
నీ కోసమెదిరి జూస్తాండు
రాగి సంకటాండుకొని
కొరమేను పులుసుతో
సూరారం మల్లి నీవు
వడి వడిగా వెళ్తుంటే
నిన్ను జూసి సొగసైన చంద్రుడు
సోకులాడినవని కన్నుగీటాడు
మంచె మీద మావ
మబ్బుల్లో తేలుతున్నాడు
సూరారం మల్లి పద పద మంటూ
తుంటరి చంద్రుడు నీ వెంట వస్తాండు
నీ పరువాల ప్రణయాన్ని
తిలకించ జూస్తాండు
నల్ల మబ్బు సందుల్లోంచి
దొంగలా తొంగి తొంగి జూస్తాండు
పలుసుతో బిర్రుగా తిన్న మావ
గుర్రుపెట్టి నిద్దరోతుంటే..
వనె్నలాడి సూరారం మల్లిని జూసి
ఎనె్కన్క వచ్చినోడు
చంద్రుడు ఉసురుమన్నాడు
మావనాడిపోసుకున్నాడు!!

- మొగిలి స్వామిరాజ్
బోధన్, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9963642205

చిల్లర చల్లగుండాలి
జ్యోస్యాలు చెప్పే జ్యోతిష్కులకు తెలియకుండా
నల్ల కుబేరుల నాడికి చిక్కకుండా
నాడు గీతలో బోధించినట్లే
పుట్టినవాడికి మరణం తప్పదని తేలిపోయింది
నిన్నటిదాకా రొమ్ము విరుచుకున్న పెద్దనోటు
నరేంద్రుడి చలవతో నామరూపాలు లేకుండా పోయాయి
పెద్దనోటు పెద్దరికం పద్దు రద్దయినాక
ఇప్పుడు వంద నోటున్నోడిదే హవా అయ్యింది
నల్లకుబేరులు ఎలా నలిగిపోతున్నారో తెలియదు
కానీ, చిల్లర చేతులున్నోల్లే వెలిగిపోతున్నారు
నల్లధనం వెలికి వస్తుందో లేదో తెలియదు కానీ
పోపు డబ్బాల్లో దాచుకున్న పెద్దనోట్లు
పుస్తకాల పుటల్లో భద్రపరచుకున్న సొమ్ములు
ఒక్కసారిగా బయటికొచ్చి బ్యాంకువైపు నడుస్తున్నాయి
బ్యాంకునుండి సొమ్ము తెచ్చుకునేటప్పుడు
పెద్దనోట్లు కావాలని అడిగినోళ్లు
నేడు చిన్ననోట్ల జపం చేస్తున్నారు
రాత్రి, పగలు, పిల్లాజెల్లాతో
డబ్బుల డబ్బాల ముందు క్యూకడుతున్నారు
పెద్దనోట్లకే కాదు.. చిల్లరకూ ఓ రోజొస్తుందని తెలిసాక
జనం చిల్లర డబ్బుల కోసం ఆరాటపడుతున్నారు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్ని విషయాల్లో అన్ని వేళల్లో కాదని
చిల్లర చెల్లుబాటవుతున్న కాలం చూస్తుంటే
పాత నోట్లకు పాతరేసి చిల్లర సల్లగుండాలని కోరుకుందాం

- దాస్యం లక్ష్మయ్య, హుస్నాబాద్, సెల్.నం.9440155240

రోడ్డు మీద బొమ్మ!
ఎండకాలం
ఓ మిట్ట మధ్యాహ్నపు వేళ..
అతని కళ్లు
ఎర్రని నిప్పుకణికల్ని
తలపిస్తున్నాయి!
ఎండ వేడిమికి కమిలిన ఒళ్లు..
అతని చేతిలో ఓ చిన్న పాత్ర
అయినా..
అతను కాలుపై కాలు వేసుకుని..
అగ్ని గోళంగా ఉన్న నింగిలోని
సూర్యున్ని చూస్తున్నాడు!
రోడ్డుపై తాను వేసిన బొమ్మ
భగవంతుడు సృష్టించిన బొమ్మ కన్నా
సుందరంగా ఉందని
అందరూ చూస్తున్నారు!
కరుణ లేని కఠినాత్ములెందరున్నా
కాసులు విసిరే వారికి కొదువలేదు!
కాసిన్ని గంజి నీళ్లకూ
కరువు లేదు!
అతనూ
మహారాజులా బతికేస్తున్నాడు
కాదనగలవారెవ్వరు?

- గంప ఉమాపతి, కరీంనగర్, సెల్.నం.9849467551

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- చిందం సునీత