ఉత్తర తెలంగాణ

పరోపకారం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరహరి మనస్సంతా అలజడిగా ఉంది. చేతిలోని సెల్ వైపు మరోసారి చూశాడు. ఎన్ని సంవత్సరాల కల ఈ సెల్. ఏదో వెయ్యి రూపాయల సెల్‌తో ఇప్పటివరకు నెట్టుకొచ్చాడు. తన కొలీగ్స్ అందరివీ స్మార్ట్ ఫోన్‌లే. అంతెందుకు తన కింద పని చేసే అటెండర్ దగ్గర్నుండి బస్‌లో కనబడే ముక్కుపచ్చలారని ప్రతి అబ్బాయి, అమ్మాయిల దగ్గర కూడా అలాంటి ఫోన్‌లే. తనకు తెలియని విషయాలు చాలా తను ఆఫీస్‌కి వచ్చి తెలుసుకునే సరికే పాతబడతాయి. అరె.. ఇతనికెప్పుడూ ప్రమోషన్ వచ్చింది, ఆయనకెప్పుడు ట్రాన్స్‌ఫర్ అయింది అని తను మాట్లాడుతుంటే, అరె ఆ విషయం నిన్న సాయంత్రమే మెయిల్‌లో పెట్టారు కదా.. వాట్సప్‌లో నిన్ననే తెల్సింది కదా, ఓ నీకు వాట్సప్ లేదు కదూ, అంటుంటే తనకెంతో చిన్నతనంగా అనిపిస్తుంది. కానీ బొటాబొటిగా సరిపోయే జీతంతో ఏం కొనలేదు. ఇంకా రెండు నెలలుగా కూతురి స్కూల్ ఫీజు కూడా కట్టలేదు. మొన్ననే, కట్టలేదని క్లాస్‌లో నిలబెట్టారని కూతురు బాధపడింది. అయినా తనిప్పుడేమైనా ఈ సెల్ కొట్టేశాడా.. లేదే.. అదే తనకు రోడ్‌పై దొరికింది.. ఇప్పుడు అందులో నెంబర్‌కి ఫోన్ చేయవచ్చు. కానీ అవసరమా.. దాని వల్ల తనకేం లాభం. తానేమీ తప్పు చేయలేదు. వాళ్ల అజాగ్రత్త వల్ల పోయింది. అందుకే సిమ్ తీసేశాడు. నెమ్మదిగా అందరూ మర్చిపోయాక, అప్పుడు ఏ రకంగా వాడవచ్చో చూసి వాడదాం.. ఆలోచనల్లోనే ఇంటిదారి పట్టాడు. ఇకముందు తాను కూడా వాట్సాప్ ఉందని గర్వంగా చెప్పొచ్చు. దారిలో ఎవరో తననే సూటిగా చూస్తున్నట్లనిపించింది. గుండె ఝల్లుమంది. తను సెల్ తీసుకునేప్పుడు చూసారా? అనవసరంగా పట్టుబడితే అమ్మో! పరువుపోతుంది. గబగబా బస్టాండ్ వైపు కదిలాడు. బస్ ఎక్కగానే ఇద్దరు పోలీసులు ఎక్కారు. గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. తాను తీసుకోవడం ఏమైనా సిసి కెమెరాల్లో పడిందా.. వెంటనే పట్టుకున్నారా.. అందరి దగ్గర సోదా చేస్తున్నారు. తనను జైల్‌కి తీసుకెళతారా.. ఈలోపు ఈ సెల్ ఎక్కడైనా పారేస్తే.. కానీ పారేయడానికి వీలు కాకుండా అంతా తన చుట్టే ఉన్నారు. చెమట్లు పట్టాయి. ఇంతలో వాళ్లకేదో ఫోన్ రాగానే దొరికిందట అనుకుంటూ వెళ్లిపోయారు. నీరసంగా ఇంటిదారి పట్టాడు. నవ్వుతూ ఎదురొచ్చింది కూతురు శ్రీజ.
‘నాన్నా.. ఇవ్వాళేం జరిగిందో తెలుసా? నాకు మా స్కూల్‌లో పర్స్ దొరికింది. నువ్వు పరాయి సొమ్ము పాముతో సమానం అని చెప్పావు కదాని నేను మా మేడమ్‌కిచ్చాను. అది మా స్కూల్‌కి వచ్చి వెళ్లిన డిఇవోదట. మేడమ్ ఈ విషయం ఫోన్ చేసి చెబితే ఆయన ఎంతో సంతోషపడ్డాడట. మా మేడమ్‌ని ఇంత మంచిగా పిల్లలని తీర్చిదిద్దుతున్నందుకు మెచ్చుకున్నారట. మా మేడమ్ నన్ను పిలిచి, స్కూల్ డే రోజు నాకు బహుమానమిస్తానంది. పైగా నా స్కూల్ ఫీజు రెండు నెలలది మాఫీ చేసేసింది తెలుసా.. ఇదంతా నువ్వు నాకు చెప్పిన నీతి పద్యాల వల్లే జరిగింది నాన్నా.. నాకెంత సంతోషంగా ఉందో.. గుడికెళ్దాం నాన్నా’’ అంటూ సంతోషంగా చెప్పుకుంటూ పోతోంది కూతురు.
నరహరికి ఎక్కడో తగిలింది..్ఛ..తన కూతురు దగ్గర తను పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. చిన్నది అయినా తనకు దిశానిర్దేశం చేసింది. వెంటనే ఆ సెల్‌లో సిమ్ వేసి అతనికి ఫోన్ చేయాలి. ‘అలాగే తల్లీ.. తప్పక పోదాం మరి తయారవు. నాకు ఆ బాబా దారి చూపించాడు’ అంటూ కూతురి తల నిమిరాడు. వెంటనే సిమ్ వేసి అందులోని నంబర్‌కి ఫోన్ చేశాడు. అటువైపు ఎవరో చాలా సంతోషంగా మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అసలు తాను దానికి అర్హుడా.. మీకేం బహుమానం కావాలో అడగండి.. అందులో చాలా ముఖ్యమైన నంబర్లు ఉన్నాయి అని బాధపడుతున్నాం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏమీ వద్దన్నాడు. ఇప్పుడతనికి చాలా ప్రశాంతంగా ఉంది. చిత్రంగా ఇంతకు ముందున్న అలజడి ఆందోళన మాయమై నూతనోత్సాహం వచ్చింది. అతను చెప్పినట్లు గుడి దగ్గరకు సెల్ తీసుకెళ్లడానికి వచ్చిన బాగా ధనవంతులైన వాళ్లు అతను బహుమతి వద్దన్నందుకు బలవంతాన ఒక కొత్త సెల్ చేతిలో పెట్టి ధన్యవాదాలు తెలిపి వెళ్లిపోయారు. భగవంతుని లీలకు అతనికి కళ్లు చెమర్చాయి. ఆ దేవుడికి చేతులెత్తి సర్వస్యశరణాగతి చేశాడు. గుడిలోని జే గంటలు మోగించి ఆశీర్వదించాడు ఆ చిద్విలాసుడు.

- నామని సుజనాదేవి
వరంగల్, సెల్.నం.7799305575

పుస్తక సమీక్ష

పద్య రచనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ‘గండ్ర’!

పేజీలు: 37, వెల : 60/-
ప్రతులకు:
శ్రీమతి గండ్ర విజయ
10-3-537
వివేకానందపురి, రోడ్.నం.3
కరీంనగర్-505001
సెల్.నం.9849328036

ప్రముఖ కవి డాక్టర్ గండ్ర లక్ష్మణరావు పద్య రచనలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ‘నీవు’ అనే కావ్యాన్ని వెలువరించారు. సాధారణంగా శతక మకుటంలో పాదాంతంలో విధించడాన్ని చూస్తాం. కానీ డాక్టర్ గండ్ర గారు ‘నీవు’ శతకంలో ఏక ప్రాసతో పాదాది మకుటాన్ని ప్రయోగించడం ప్రశంసనీయం. పాదాది మకుటం గ్రహించినందున శతకమంతా ఏకప్రాస శతకంగా కూర్చబడటం అనివార్యమైందని గమనిస్తాము మస్తకం మీద మకుటం ఉంచడం ఓ కొత్త ప్రయోగం. ‘నీవు’ సంబోధనతో మధ్యమ పురుషలో సాగిన ఇందలి పద్యాల్లో.. కవి యొక్క విలక్షణమైన ప్రతిభ కానవస్తోంది. ఈ శతకంలో తాత్విక భూమికతో.. రాయబడిన పద్యాల్లో లౌకికపరమైన అంశాలను చక్కగా ప్రస్తావించారు. రూపం శతకానిదే అయినా.. లక్షణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. కవి గండ్ర గారు తనన అంతరంగంలో కదలాడే తాత్విక భావాలను భూమిక చేసుకుని ఇందలి పద్యాలకు అక్షరాకృతినిచ్చారు. జ్ఞానమే ముక్తి సాధానంగా భావించి తాత్త్వికతతో కూడిన అంశాలను ఈ కావ్యంలో చక్కగా ఆవిష్కరించారు. ‘నీవు’ అనే పద్యాది మకుటంతో నవీన ఎత్తుగడతో ఉత్పల మాలల పద్యాలను అల్లి కవి భగదర్పణం చేయడం స్వాగతించదగింది. ‘నీవు’ ఎవరు? వ్యక్తియా? దైవమా? అన్న ప్రశ్నకు సమాధానాన్ని కవి ఓ పద్యంలో చక్కగా ఆవిష్కరించారు. ‘నీవు’ జగాన నిండిన చేతనత్వమా? నిత్య విశేషముగా చలించు సమసమా? అనంతకాలముల నిద్దపు కాంతుల ఆత్మరూపమా? అని హృదయంలో తపించగా వచ్చిన సమాధానము ‘మహత్వ తత్త్వము’ అని తెలపడం ఓ అద్వితీయమైన అనుభవైక వేద్యంగా కావ్యంలో ఆవిష్కరించడం విశేషం!
మధురంగా, ధారశుద్ధితో సాగే ఇందలి పద్యాలు శైలిలో సరళంగా అగుపించినా..లోతైన భావాలుండటం గమనార్హం! శ్రీమన్నారాయణుని కవి మనసారా కీర్తిస్తూ పద్యకావ్యాన్ని కొనసాగించినప్పటికీ.. సమకాలీన సంఘటనలకు, సామాజికపరమైన అంశాలను సైతం పద్యాల్లో బంధించి పాఠకులను మెప్పించారు. ముఖచిత్రం ఆలోచనాత్మకంగా ఉంది. కావ్యానికి నిండు శోభనూ కూర్చింది. పద్యం మొదట్లోనే మకుటాన్ని పెట్టి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కవి గండ్రకు శుభాకాంక్షలు తెలుపుదాం!

- సాన్వి, సెల్.నం.9440525544

మనోగీతికలు

విశ్వాసంతో..

గాజు కళ్లతో గమ్యాన్ని చూడలేక
మొద్దుబారిన మనసుతో
నీతో నీవే యుద్ధం చేస్తూ
ఎంతకాలమిలా కృంగి కృషించి పోతావు!
రా నేస్తమా! రా..!
ఆశ అనే శ్వాసను నింపుకుని రా!
నీ చుట్టూ పరిభ్రమిస్తున్న వాయువు
నిన్ను రక్షిస్తూ నీలో లీనమై ఎలా
బతుకు వీణను మీటుతుందో చూశావా!
ఇలారా! మనసునిండా వెచ్చని ఉషస్సులు
నింపుకుని రా!
మమతల తీరం మరొకటి వుంది
చూద్దువు గానీ..
ఆత్మీయానుభూతులను ఎదలో నింపుకుని
విశాల గగనంలోకి
విహంగాలమై పయనిద్దాం రా!
విను వీధిలో వింతలను
మూడో నేత్రంతో పరికిద్దాం
తపన అనే రెక్కలతో
విశ్వమంత శోదిద్ధాం..
గాయపడిన గుండెలకు లేపనంగా
మలయజ సుగంధాలను మోసుకొద్దాం
ఆగని కాలం కెరటాలను
అదే పనిగా వీక్షిద్దాం
కుమ్మరి పురుగులా తొలుస్తున్న
ఆలోచనలను..
మనసు నుండి తుడిపేద్దాం
వౌనంగా వెనె్నల పాడే గానాన్ని
మళ్లీ మళ్లీ తమకంగా విందాం
హరివిల్లుపై ఊరేగుతూ
ఆనంద సంద్రాలలో మునకలేద్దాం..!
ఉద్రేకాలను వదిలి
విజ్ఞతగా వ్యవహరిద్దాం..
బ్రతుకును నందనవనం చేసి
రేపటి ఆశల సీతాకోక చిలుకలను
అంతులేని విశ్వాసంతో ఎగరేద్దాం!

- వురిమళ్ల సునంద
బుర్హాన్‌పురం, ఖమ్మం
సెల్.నం.9441815722

ఒక్క క్షణం!
ఒక్క క్షణం ఆగు
జారిపోతున్న నీ ఆశల్ని
కారిపోతున్న నీ జన సత్త్వాల్ని
ఒడిసిపట్టు నిన్ను నీవు
పునర్నిర్మించుకో!
నిన్ను ఆవహించిన ఆవేశాల్ని
నిన్ను ఆవరించిన నిరాశ నిస్పృహల్ని
కుబుసంలా వదిలేసుకో!
పైకి చేరాలంటే నిచ్చెన ఎక్కాలి!
ఎదురీత లేకుండా తీరం చేరలేము!
కృషి లేనిదే కార్యసాధన లేదు!
కష్టం లేనిదే సుఖం లేదు
అపజయాన్ని ప్రోత్సాహంగా మలచుకొని
విజయాన్ని చేజిక్కించుకో!
క్షణకాలం నీ మనసులో
ఎగిసిపడే అలలకు
ఎదురీది.. నిర్దేశించిన తీరాన్ని చేరుకో!!

- గంజి భాగ్యలక్ష్మి
హన్మకొండ
సెల్.నం.9441993044

మళ్లీ జన్మిస్తా..!
మళ్లీ జన్మిస్తా..!
చెత్త కుప్పలో నన్నొదిలిన నాన్నను
నిలదీసే..
చైతన్యగా మళ్లీ జన్మిస్తా
ఆడదాన్నని అంగట్లో
అమ్మే కామాంధులను
అంతమొందించే
కాళికగా మళ్లీ జన్మిస్తా
ప్రియుడినని పిండేవాడు
భర్తనంటూ బాధించేవాడు
ఏ రూపంలోనైనా ఏడిపించేటోని
భరతం పట్టే బొమ్మాళినై..
మళ్లీ జన్మిస్తా!
కష్టాలను కనుపాపలకింద దాచిపెట్టి
అవమానాల్ని అంతఃమనసులో అణగబట్టి
వెటకారాల్ని వెక్కిళ్లలో నొక్కిపట్టి
భరించ, సహించే, అస్తమించే సంధ్యలా కాక..
నూతనోదయానికి ఊపిరిపోసే
ఉషలా ఉద్భవిస్తా
మళ్లీ మళ్లీ జన్మిస్తా!

- పెనుగొండ సరసిజ
కరీంనగర్
సెల్.నం.7386806499

గుణపాఠాలు!
పట్టుసడలిన గాలిపటం
గమ్యం మరచిన గమనం
కలలు కనని జీవితం
పరిమళాలు వెదజల్లని పుష్పం
తైలం లేని దీపం
లక్ష్యం కొరవడిన ప్రయాణం
స్వేదం చిందించని యవ్వనం
చమురు ఇగిరిన యంత్రం
వివేకం లేని విజ్ఞానం
కుబుసం విదల్చని వికాసం
ఊట అందని బావి
వినియోగించని ధనం
ప్రయోజనం లేని ప్రయాసలు..
ఇవన్నీ..
మనకు నిత్యం నేర్పే గుణపాఠాలు!

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, సెల్.నం. 9949700037

చరవాణి
సెల్ మోగింది
కబుర్లకు తెరతీస్తూ
కరెన్సీని కరిగిస్తూ
బాంధవ్యాలను కలిపేస్తూ
భాషేదైనా భావాలను చేరవేస్తూ
ఆప్యాయతలకు పట్టం కడుతూ
అనుబంధాలను పెరవేస్తూ
వయోబేధాన్ని చెరిపేస్తూ
వశీకరణంలా పనిచేస్తూ
సంక్షిప్త సందేశాలతో
తక్షణ సమాచారాన్నందిస్తూ
ప్రపంచాన్ని దగ్గర చేస్తూ
కానీ,
ఒక్క క్షణం ఆలోచిద్దాం
అరచేతిలోకి విజ్ఞానాన్ని
అందించిన జ్ఞానాన్ని
అవసరం మేరకే ఉపయోగిద్దాం
భావితరాలకు బాటలు వేద్దాం
విశ్వశాంతికి దోహదపడదాం..

- ల్యాదాల గాయత్రి
కాగజ్‌నగర్
కొమురం భీం జిల్లా
సెల్.నం.9949431849

మనమంతా..ఒక్కటే..!
మేము భారతీయులం
ఏ ప్రాంతంలో ఉన్నా
మనమంతా ఒక్కటే!
పీల్చే గాలి ఒక్కటే..
నడిచే నేల ఒక్కటే..
మరి ఎందుకు ఈ బేధాలు?
కుల-మత-వర్గాలంటూ, తేడాలెందుకు?
ఇతరులపై ద్వేషమెందుకు?
స్వచ్ఛమైన మనసుతో..
సాగిపోదాం ముందుకు..
మానవత్వాన్ని మదినిండా నింపుకుందాం!
మచ్చలేని మనుషులుగా మారిపోదాం!
విలువైన స్నేహంతో నిండిన
ప్రేమను పంచుకుందాం!

- ఎం.డి.ఖాలిద్, కరీంనగర్

స్నేహం!
రెండు మనసులను కలిపి..
లేత పువ్వులా
వికసింపజేసేది స్నేహం!
స్నేహం పంచే ప్రేమ..
అంతా ఇంతా కాదు
ఆకాశమంతా!
కష్ట సుఖాల్లో వెన్నంటి ఉండి
కలతలు లేకుండా
మమతను పంచుతుంది స్నేహం!
స్వార్థం అంటే అసలే
తెలియనిది స్నేహం!
భగవంతుడు మనకు
ప్రసాదించిన ఓ వరం!

- చీకట్ల సంగీత
తక్కళ్ళపల్లి, జగిత్యాల జిల్లా
సెల్.నం.8374991063

సభాపర్వం
తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5న హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ప్రముఖ కవి ఆచార్య కడారు వీరారెడ్డి రచించిన ‘మేఘాల తీరాన’, ‘విశ్వనయన’ గ్రంథాలను ఆవిష్కరిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి, వేదికపై దాస్యం సేనాధిపతి, డా. కళాదీక్షితులు, ఆచార్య కడారు వీరారెడ్డి, బైస దేవదాసు, డా. గండ్ర లక్ష్మణరావు, డా. పోరెడ్డి రంగయ్య తదితరులు

అంతరంగం

మనసును
రంజింపజేసేదే కవిత్వం
ప్రముఖ కవి డాక్టర్ ఉదారి నారాయణ

డాక్టర్ ఉదారి నారాయణ
ఫ్లాట్.నం.18
కె.సి.బి.గార్డెన్ ఎదురుగా
రాంనగర్, మావల,
ఆదిలాబాద్ జిల్లా-504001
సెల్.నం.9441413666

మనసును రంజింపజేసేదే అసలైన కవిత్వమని భావించే ప్రముఖ కవి డాక్టర్ ఉదారి నారాయణ వృత్తిరీత్యా ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సయ్యద్‌పూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో గ్రేడ్‌వన్ తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. సాహిత్య సృజనను ప్రవృత్తిగా మలచుకుని.. ‘ఆకుపచ్చని ఎడారి’, ‘యాల్లైంది’ కవితా సంపుటులను ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షునిగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్పృహ’ అంశంపై పరిశోధనచేసి పిహెచ్‌డి పట్టా పొందారు. సాహితీ రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి అనేక సంస్థలు ఆయనను పురస్కారాలు సన్మాన సత్కారాలతో అభినందించాయి! తెలంగాణ ఉద్యమ కాలంలోను ఆయన తన రచనల ద్వారా జన చైతన్యానికి కృషి చేశారు. ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖీ వివరాలు ఆయన మాటల్లోనే...

మీరు ఎన్నో ఏట రచనలను ప్రారంభించారు?
నేను నా పదిహేనవ ఏటనే కంద పద్యం రాశాను. ఆ తరువాత డిగ్రీ చదువుతున్నప్పుడు ‘్భరతపుత్ర’ శతకం రాశాను.

మీరు రచనల పట్ల ఆసక్తి చూపడానికి ప్రేరణనిచ్చింది ఎవరు?
నిత్యం కంద పద్యాలను గానం చేసే కుటుంబంలో నేను జన్మించాను. పద్యాలు.. తత్వాలు పాడుకునే ఇంట్లో పెరిగాను.. మా నాన్న ప్రముఖ తత్వకవి, చిన్ననాట నాన్న అలవోకగా తత్వాలు చెబుతుంటే రాసేవాన్ని.. ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న రోజుల్లో గురజాడ పూర్ణమ్మ కథ నన్ను కదిలించింది.. తెలుగు పండితులు పి.రామాచారి గారు సిహెచ్.రాజులు గారు నన్ను చాలా ప్రోత్సహించారు. పిజి చదువుతున్న కాలంలో ఆచార్య ఎన్.గోపిగారి ప్రోత్సాహం లభించింది. అన్నింటికి మించి చిన్నప్పుడు దయనీయంగా వున్న మా కుటుంబ పరిస్థితులు నాకు బలమైన కవితా వస్తువులయ్యాయ.

మీకు నచ్చిన కవులు ఎవరు?
ప్రాచీన కవుల్లో అనంతుడు.. తిక్కన.. వేమన.. ఆధునిక కవుల్లో శ్రీశ్రీ, తిలక్ తదితరులు.

మీ దృష్టిలో కవిత్వం అంటే ఎలా ఉండాలి?
కవిత్వం మనసును రంజింపజేయాలి. మనిషిని సమ్మోహనపరచాలి. సమాజాన్ని సంఘటితం చేయాలి. జీవితానికి తోడుగా నిలవాలి. సమస్యలకు పరిష్కారం చూపగలగాలి.

సాహితీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేయాలంటే ఏం చేయాలి?
సంస్థ సభ్యుల మధ్య సమన్వయం ఉండాలి. నిజాయితీగా కార్యక్రమాలను చేపట్టాలి. కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. వివిధ ప్రక్రియల్లో కార్యశాలలు నిర్వహించాలి. శిల్పం శైలి, నిర్మాణాల్లో వస్తున్న మార్పులను కొత్తగా కలం పట్టేవారికి తెలియజేయాలి. ఉనికి చాటుకోవడం కోసం పసలేని కార్యక్రమాలు నిర్వహించి సాహిత్యాన్ని అభాసుపాలు చేయకూడదు..సేవాభావంతో నిర్వహించాలి.

మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
తెలంగాణ భాషా సాహిత్యాల భూమికపై సాగిన ఉద్యమ ఫలితంగా వచ్చిన కొత్త రాష్ట్రం తెలంగాణ.. మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి సాహితీ సంస్థలు, ప్రభుత్వం, అకాడమీలు ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. మన సాహిత్యం వెలుగులోకి రావడానికి ఎక్కడికక్కడ పరిశోధనలు, ఇతరత్రా సమాచారం సేకరించడానికి సాహితీ సంస్థలు చొరవ చూపాలి.

ఆదిలాబాద్ పట్టణ సాహిత్యంపై మరాఠీ ప్రభావం ఏమైనా ఉందా?
ఆదిలాబాద్ చుట్టూ మూడువైపులా మహారాష్ట్ర ప్రాంతముంది. బంధుత్వాలు అల్లుకుపోయాయి. వాణిజ్య, వైద్య, వ్యాపార సంబంధాలు మహారాష్టల్రో పెనవేసుకున్నాయి. అలాగే ఆదిలాబాద్ సాహిత్యంపైన కూడా మరాఠీ ప్రభావం సహజంగానే పడింది. మరాఠీతో పాటు ఉర్దూ, హిందీ ప్రభావం కూడా పడింది. ఇప్పటికీ ఇక్కడ చాలా కుటుంబాల్లో మరాఠీ సాహిత్యం చదివే వాళ్లున్నారు. మన తెలుగు రచనల్లోను మహారాష్ట్ర సంస్కృతీ ప్రభావంతో పాటు మరాఠీ ముద్ర కానవస్తుంది!

సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారాలు అవసరమే.. కానీ ఎంపికలో..ప్రదానంలో పారదర్శకత లోపించకుండా ఉండాలి. ప్రతిభకు పట్టం కట్టాలి. అర్హులకే అందేలా శ్రీకారం చుట్టాలి.

కొత్త తరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే ఏం చేయాలి?
సాహిత్య సభలు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాలి. అధ్యయనంపై మక్కువ చూపేలా చేయాలి. తెలుగు భాషపై ఆసక్తిని పెంచడానికి కార్యక్రమాలు చేపట్టాలి.

సాహిత్యపరంగా తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం నుండి మీరు ఓ కవిగా ఆశిస్తున్నదేమిటి?
మనకంటూ ఓ భాషా విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ముందుకురావాలి. ప్రతి జిల్లా నుండి సమాచారాన్ని సేకరించి.. తెలంగాణ పదకోశాలను సిద్ధం చేయించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుకు పెద్దపీట వేయాలి.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. dasyamsenadhipathi10@gmail.com

- నామని సుజనాదేవి