ఉత్తరాయణం

‘తాజ్’ పర్యాటకుల పరిమితి మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రఖ్యాత అందాల తాజ్‌మహల్ పరిరక్షణకు భారత పురావస్తు శాఖ తీసుకున్న నిర్ణయం భేషైనది. రోజుకు 40వేలమంది పర్యాటకులను మాత్రమే సందర్శనకు అనుమతించాలన్నది ఆ నిర్ణయం. ఏటా లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న తాజ్‌మహల్ చరిత్రకు, భవన నిర్మాణ శైలికి, ప్రేమకు, వివాదాలకు కేంద్రబిందువు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. అలాంటి విశిష్ఠమైన ప్రేమచిహ్నాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఇది జాతీయ సంపద. అపరిమిత సంఖ్యలో పర్యాటకులు వచ్చివెళ్లడం, కాలుష్యం తాజ్ అందాలను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పరిమితి కేవలం దేశీయ పర్యాటకులకు మాత్రమే. విదేశ పర్యాటకులకు ఎటువంటి ఆంక్షలు, పరిమితి లేదు.
-బుగ్గన మధుసూదన్ రెడ్డి, బేతంచర్ల
చైనా వస్తువులు వద్దు
సరళీకృత ఆర్థిక విధానాలు మొదలయ్యాక, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ప్రవేశించాక భారత్‌లో చైనా వస్తువుల తాకిడి పెరిగిపోయింది. ఏమాత్రం నమ్మలేని పొరుగుదేశంతో ఆర్థిక సంబంధాలు నెరపడం సమంజసం కాదు. నాసిరకం, ప్రమాదకరమైన రసాయనాలతో తయారైన వస్తువులను చైనా మన మార్కెట్‌లోకి వెదజల్లుతోంది. చౌకగా లభిస్తుండడంతో ప్రజలు ఎగబడుతున్నారు. కానీ ఇది మన ఆర్థికమూలాలను దెబ్బతీస్తున్నది. చిన్నచిన్న వ్యాపారుల కడుపుకొడుతోంది. మన శత్రుదేశం పాకిస్తాన్‌తో చేతులు కలిపి మనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చైనాను కట్టడి చేయాలంటే ప్రజల వైఖరిలో మార్పు రావాలి. చైనా వస్తువులను బహిష్కరించడం కనీస ధర్మం.
-సరికొండ శ్రీనివాస రాజు, వనస్థలిపురం
కులవృత్తులను ప్రోత్సహించాలి
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కులవృత్తులవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఆదాయం తగినంత లేకపోయినా కులవృత్తులనే నమ్ముకున్నవారిని ఆదుకోవాలి. కులాలవారీ కాకుండా వృత్తులవారీగా సహాయం అందించాలి. కులసంఘాలను ప్రోత్సహించే విధానాలకు స్వస్తి చెప్పి రిజర్వేషన్లపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి రిజర్వేషన్లను తొలగించడమే మేలు. ఎటువంటి ఆస్తిపాస్తులు లేని, నిజమైన కూలీలకు మాత్రమే ప్రభుత్వం సహాయం చేయాలి. ఎన్నికల విధానాల్లో సంస్కరణలు, నాయకుల ఆలోచనాధోరణుల్లో మార్పులు అవసరం. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
-ఎ.వెంకటస్వామి, కర్నూలు