ఉత్తరాయణం

నేరం ఆకలిది కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో గుప్పెడు మెతుకులు దొంగిలించాడన్న నెపంతో ఓ యువకుడిని చెట్టుకి కట్టి గ్రామస్థులు హత్య చెయ్యడం అత్యంత బాధాకరం. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, పేదరికం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధోరణి ప్రమాదకర భవిష్యత్తుని సూచించే ఘంటికల్ని వినిపిస్తున్నాయి. దేశంలోనే అక్షరాస్యత, మానవ అభివృద్ధి సూచీల్లో ముందు వరసలో ఉండే కేరళ రాష్ట్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ప్రస్తుత దేశస్థితికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ఆహార భద్రత విషయంలో భారత్ ట్రాక్ రికార్డు గొప్పదేమీ కాదు. ప్రపంచ ఆకలి సూచీలో 118 దేశాల్లో మనది 97వ స్థానం. అంటే ఆకలి తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న దేశం మనది. ప్రపంచంలో పేదల జనాభాలో సగం మంది మన దేశంలోనే ఉన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్లో మూడో వంతు మంది భారతీయులే. అంటే బాలభారతంలో సగభాగం పౌష్టికాహార లోప యుతమే. ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచి, పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే కాకుండా ప్రత్యేక శ్రద్ధతో పిల్లల్లో పౌష్టికాహార లేమిని సరిదిద్దకపోతే భారత్ ముందడుగు వేయజాలదు. బలమైన రాజకీయ సంకల్పం ద్వారానే అది సాధ్యం. పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాలు కూడా శిశు మరణాల్ని తగ్గించుకోవడంలో భారత్ కన్న మంచి ప్రతిభ కనపరుస్తున్నాయంటే అది చిత్తశుద్ధి ద్వారానే సాధ్యమైంది. ఆర్థికాభివృద్ధిలో భారత్ పరుగులు తీస్తోందని చెప్పుకుంటున్నా, పేదరికం, ఆకలిని తగ్గించడం, ఆరోగ్యం అందించడంలో చతికిల పడ్డామంటే ఆ తప్పు ప్రభుత్వాలదే. అలాగే చట్టాన్ని చేతిలోకి తీసుకొనే ప్రమాదకర ధోరణిని అడ్డుకోవాల్సి ఉంది. ‘ఖాప్ పంచాయతీ’లకు మన ప్రజాస్వామ్య దేశంలో చోటు లేదని సుప్రీం కోర్డు అభిప్రాయపడింది. కేంద్రం, రాష్ట్రాలు ఆ తరహా పోకడల్ని పూర్తిగా నియంత్రించకపోతే అరాచకానిదే పైచేయి అవుతుంది. రాజకీయ అవసరాల కోసం ‘మూకస్వామ్యాన్ని’ తలకెత్తుకొంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్టే. వేల కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిన ప్రబుద్ధులు విదేశాల్లో దర్జాగా విహరిస్తుంటే, అన్నం ముద్ద దొంగిలిస్తూ ఓ అభాగ్యుడు దీనంగా ప్రాణం కోల్పోవడం దేశానికి వనె్న తీసుకురాదు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఆర్‌బీఐ ఆదేశాలు బేఖాతర్
పధ్నాలుగు డిజైన్లలో రూపొందిన పది రూపాయల నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని, ఇవి చెల్లవనే అబద్ధపు ప్రచారం వల్ల ఎక్కడివక్కడే నిలువ ఉండిపోతున్నాయని, బ్యాంకులు కూడా వీటిని తీసుకోవాలని రిజర్వ్ బ్యాంకు అన్ని పత్రికల ద్వారా తెలియపరిచింది. ఆర్‌బీఐ ఆదేశాలను రైతు బజారుల్లో నోటీసు బోర్డులపై అంటించి మైకులలో చెప్పినా ప్రయోజనం శూన్యం. కొన్ని బ్యాంకుల వారు కూడా ఈ నాణేలను తీసుకోకపోవడం విచిత్రం. పది రూపాయల నాణేలను తీసుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని గట్టి ప్రచారం జరగాలి. కొన్ని కిరాణా దుకాణాల్లో పది రూపాయల నాణేలు భారీగా ఉండి పోయాయి. ప్రజలలో మార్పు రానట్లయితే ఈ నాణేలన్నింటినీ బ్యాంకులలో జమ చేయించి, ఆ తరువాత వీటిని రద్దు చేయాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
చెరువులను సంరక్షించండి
పంట భూములకు జీవం పోయటంతో పాటు భూగర్భ జలాలను కాపాడడంలో చెరువులు కీలకపాత్ర పోషించేవి. వరుసగా రెండు, మూడేళ్లు వర్షాభావ పరిస్థితిని తట్టుకుని పంటలను కాపాడుతుండేవి. ఒకప్పుడు ప్రభుత్వం కూడా చెరువులలో పూడిక తీయించటం, నీరు-చెట్టు వంటి పథకాలతో నీటి నిల్వలను పెంచేందుకు కృషి చేసేది. అయితే సాగునీటి చెరువుల్లో ఆక్రమణల జోరు పెరిగింది. గ్రామాల్లో చెరువులను ఆక్రమించి గృహాలు, దుకణాలు, కొన్నిచోట్ల చెరువు అంతర్భాగంలో పంటలు పండించటం, మట్టితో పూడ్చి కబ్జాలు చేయటంతో చెరువుల విస్తీర్ణం నానాటికీ కుంచించుకు పోతోంది. చెరువులను కాపాడవలసిన జలవనరుల, రెవెన్యూ,పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ విభాగాలకు చెందిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కుల దందాకు అదుపు లేకుండా పోయింది. ఫలితంగా చెరువులకు దీనావస్థ తప్పడం లేదు. నీరు-చెట్టు, పూడికతీత వంటి పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చించే ముందు- కబ్జాకు గురవుతున్న చెరువులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే రైతన్న ఆశలు నెరవేర్చిన వారే కాకుండా భూగర్భ జలాలను కాపాడిన వారుకాగలరు. చెరువుల్లో ఆక్రమణలను నిరోధించేందుకు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం