ఉత్తరాయణం

డిజిటల్ వేదికపై ‘డేటా’ లూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’కు చెందిన 5 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా వ్యాపారావసరాలకు వినియోగించడం విస్మయం కలిగించని అంశమే. ఈ వ్యవహారంపై ‘ఫేస్‌బుక్’ అధినేత పశ్చాతాపం ప్రకటించినా, మళ్లీ అలాంటి తప్పు జరగదన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇంకోసారి ఇంకో సంస్థ ద్వారా ఇలాంటి పనులు జరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేయకుండా అడ్డుకునే మార్గాలు ప్రస్తుతం ఏ ప్రభుత్వం వద్ద కూడా లేవు. డిజిటల్ సాంకేతికత ఎన్ని సౌలభ్యాలను చేకూర్చిందో, వ్యక్తుల గోప్యతకు అదే స్థాయిలో భంగం కలుగుతోంది. వ్యక్తిగత సమాచారాన్ని అనైతిక పద్ధతుల్లో వాడుకోవడం నేడు షరామామూలైంది. ఉచిత యాప్‌లను ఎరవేసి వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టుకోవడం కొత్తేమీ కాదు. వ్యాపారానికో, ప్రలోభ పెట్టడానికో, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికో వ్యక్తిగత సమాచారాన్ని అనైతికంగా వాడుకుంటున్నా అడ్డుకునే వ్యవస్థ ఏదీ లేదు. కేంబ్రిడ్జి అనాలిటికా వంటి సంస్థలు వివిధ దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేశామని చెప్పుకోవడమే కాదు, ఉచితంగా పొందిన వ్యక్తిగత సమాచారాన్ని మార్కెట్‌కి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటి వంచనలు ఎన్ని జరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. డిజిటల్ వేదికపై సమాచార తస్కరణ జరగకుండా పటిష్టమైన చట్టాలు, కఠిన శిక్షలు ఉంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదు. కాగా, ‘మాది పటిష్టమైన వ్యవస్థ.. దానిలో చొరబడడానికి, ఛేదించడానికి ఓ సూపర్ కంప్యూటర్‌ను వాడినా ఎప్పటికీ ఫలితం ఉండదని, గోప్యతకు భంగం వాటిల్లద’ని ‘ఉడాయ్’ (ఆధార్ కార్డుల జారీ సంస్థ) ముఖ్య అధికారి ఇటీవల సుప్రీం కోర్టుకు నివేదించారు. కానీ, ‘ఆధార్’ డేటా బయటకు పొక్కుతోందని ఇటీవల సాక్ష్యాధారాలతో వార్తా కథనాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అభూత కల్పనలు కాదు, ప్రజలకు వాస్తవాలు తెలియాలి.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం

భాజపాకు కనువిప్పు కావాలి
యూపీ, బిహార్‌లో ఇటీవలి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటమితోనైనా ప్రధాని మోదీ తన వైఖరిని మార్చుకోవాలి. ఉప ఎన్నికల ఫలితాలతో భాజపా నాయకత్వం వాస్తవాలను తెలుసుకుని ప్రజల విశ్వాసాన్ని పొందాలి. అతి విశ్వాసం వల్ల తాము ఓటమి చెందలేదని యూపీ సీఎం యోగి వ్యాఖ్యానించడం సరైనదే. ప్రజా విశ్వాసం కోల్పోవడం వల్ల ఎంతటి నేతలకైనా పరాజయం తప్పదు. ఇందిరాగాంధీ వంటి మహానేతలకే పరాభవం తప్పలేదు. వాస్తవాలను గ్రహించాక, ప్రజలను మెప్పించే విధానాలతో ఇందిరమ్మ తిరిగి అఖండ మెజారిటీతో గెలిచారు. కుంభకోణాల వల్లనే పదేళ్ల యూపీఎ పాలనకు జనం చరమగీతం పాడారు. మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల సామాన్య జనం నానా అవస్థలు పడ్డారు. కేంద్రమంత్రులు జైట్లీ, నితిన్ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలకు సామాన్యుల కష్టాలు తెలియవు. ప్రజల్లో పేరుకుపోతున్న అసంతృప్తిని ఇకనైనా గమనించి మోదీ సరైన విధానాలను అమలుచేయాలి. బహుళజాతి సంస్థలకు మేలు చేసే విధానాలను అమలు చేయడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగదు కొరత వల్ల పేద, మధ్య తరగతి వారు ఇబ్బంది పడుతున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడంలో మోదీ సర్కారు విఫలమైంది. బడాబాబులు వేల కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ బ్యాంకులకు టోపీ పెడుతున్నారు. అయినప్పటికీ ఆర్థిక నేరగాళ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రజలను భయపెడుతున్నాయి. సామాజిక న్యాయం లభించక కొన్ని వర్గాలవారు వివక్షకు గురవుతున్నారు. దేశ సరిహద్దులో శత్రుదేశాల సైనికులను అణచివేయడంలో కేంద్రం కఠిన వైఖరిని అవలంబించడం లేదు. జాతీయ పార్టీలు ఇంకా బలహీన పడి, ప్రాంతీయ పార్టీలదే పైచేయిగా నిలిస్తే జాతీయతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే కుటుంబ పాలన బలపడుతుంది. రాజకీయంగా, భౌగోళికంగా దేశ సమగ్రతకు నేడు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎన్‌డీఏ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న భాజపా ఇకనైనా కళ్లు తెరచి సరైన విధానాలను ఆచరణలో అమలు చేయాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

మతం పేరిట రిజర్వేషన్లు వద్దు
ఓటుబ్యాంకు రాజకీయాలతో ముస్లిం మతస్థులకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం సరికాదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు ఏనాడో తీర్పు చెప్పింది. ఈ తీర్పును విస్మరించి, ఎన్నికల్లో గెలుపు కోసం ముస్లింలకు తాయిలాలు ప్రకటించడం సమంజసం కాదు. దేశంలో రిజర్వేషన్లు లేని కులాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఉద్ధరించాలని నాయకులు ఎందుకు భావించరు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముస్లింలు ఇప్పుడే గుర్తుకొచ్చారా? అధికారాన్ని కాపాడుకోవాలన్న తపనే తప్ప, దేశ సమగ్రత గురించి ప్రాంతీయ పార్టీల నేతలు ఆలోచించడం లేదు. అగ్రవర్ణాల్లో నిరుపేదల సంక్షేమం గురించి మన రాజకీయ పార్టీలకు పట్టదా? రిజర్వేషన్లకు కులం, మతం ప్రాతిపదిక కావడం దారుణం. ఇలాంటి రిజర్వేషన్లు ప్రజలను విడదీస్తాయే తప్ప, దేశ సమగ్రతకు ఏ విధంగానూ దోహదం చేయవు. దేశం గురించి ఆలోచించని రాజకీయ నాయకులు మతం పేరిట కొందరిని ప్రలోభ పెట్టడం, ఇందుకు రిజర్వేషన్లను ఎరగా వేయడం ఆనవాయితీగా మారింది. రిజర్వేషన్లు లేని మతాలు, కులాల గురించి నేతలు ఎందుకు ఆలోచించరు. ఇలాంటి పరిణామాలను ప్రజలే అడ్డుకుని దేశాన్ని కాపాడుకోవాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురము