ఉత్తరాయణం

నకిలీ వార్తలు.. మకిలి వార్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పుడు వార్తలు రాసే పాత్రికేయులకు దండన తప్పదంటూ కేంద్ర సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ అందుకు తగ్గ విధి విధానాలు ప్రకటించారు. పత్రికా రంగానికే కాక మొత్తం సమాజానికి జరుగబోయే కీడును శంకించిన ప్రధాని వెంటనే అందుకు అడ్డం పడి ఎంతో మేలు చేశారు. నరేంద్రుని మంత్రివర్గంలో జరిగిన ఈ ఉదంతం- ఇంద్రుని సభలో జరిగిన ఘటనను గుర్తుకుతెస్తోంది. ఆ వృత్తాంతం ఏమనగా...
దేవతల అధిపతి ఇంద్రుడు మొదట్లో ప్రజాస్వామికంగానే ఉండేవాడు. ఒక రోజు సభలో కొలువుతీరి ఉండగా సమాచార మంత్రి సెలవిచ్చాడు-
‘‘ఇంద్రా! నీ పాలన భేషుగ్గా ఉంది.. కానీ రాక్షసులు నకిలీ వార్తలు చెలామణి చెయ్యడంతో తలనొప్పులు తప్పడం లేదు’’.
ఇంద్రుడు తల పంకించి- ‘‘అటులనా..! నకిలీ వార్తలు రాస్తున్నది రాక్షసులా? రాక్షసులు కాబట్టి వారు నకిలీ రాస్తున్నారా?’’ అన్నాడు.
‘‘ఏదైనా ఒకటే కదా ప్రభూ’’ అనబోయి- ఎందుకొచ్చిన న్యూసెన్స్ అని ఆగిపోయాడు మంత్రి.
అంతా కలిసి ఆలోచించి రాజహంసల కమిటీని ఏర్పాటుచేశారు. పాలు, నీళ్ళని వేరుచేసినట్టు అసలు, నకిలీ వార్తలని వేరుచేసి ప్రచురించడానికి. కొన్ని రోజులకి మళ్లీ ఆ కమిటీ పనితీరు మదింపు వేస్తే తెలిసింది. కమిటీ పరిశీలించిన తర్వాత ‘పాస్’ చేసిన న్యూస్‌లో ఒక్కటంటే ఒక్కటి అధికారిక ప్రకటన రావడం లేదని తేలింది. అసలే నిక్కచ్చి కమిటీ. ప్రభుత్వం చేసే ప్రకటనలన్నీ ఉత్త ‘ఫేక్’అని కొట్టిపారేస్తోందని అర్థమైంది. ఇక లాభం లేదని కొంచెం అనుకూల హంసని కమిటీలో వేస్తే.. తర్వాత్తర్వాత ప్రభుత్వ పబ్లిసిటీ తప్ప ఒక్క వేరే వార్త కూడా లేదు. పత్రిక మూతబడింది విశ్వసనీయత లేక.
మళ్లీ కేబినెట్ కూర్చుంది. ఫేక్ న్యూస్‌ను ఎలా ఆపాలని. ఒక నిరాశావాది చెప్పాడు- ‘లాభం లేదు. అసలు వార్త గడప తొక్కేలోగా, నకిలీ వార్త గూగుల్‌ను చుట్టేస్తుంది. ఆ స్పీడ్‌ను ఆపలేం’’ అంటూ.
లాభం లేదని మొత్తం వార్తలని బ్యాన్ చేశారు. నారదుణ్ణి కూడా మాటాడనివ్వలేదు. తరువాత అంతా గందరగోళమే. భృగుమహర్షి రాక తెలియక విష్ణుమూర్తి సరిగ్గా ఆయన్ని ఆహ్వానించలేకపోవడం, లక్ష్మీదేవి అలిగి భూలోకం లోకి పయనమవ్వడం లాంటివి కథలు తెలుసుగా మీకు. తర్వాత మళ్లీ ఇంద్రసభ కొలువుతీరినపుడు ఒక మహామంత్రి భేషైన మాట చెప్పాడు. ‘‘ఇంద్రా! నీ భయంలో అర్థం లేదు.. ఫేక్ న్యూస్ కన్నా, అసలు న్యూస్‌తోనే ప్రమాదం. కాబట్టి నీ ప్రయత్నాలు కట్టిపెట్టు’’ అంటూ.
అయోమయం పడుతున్న ఇంద్రుణ్ణి చూసి కొనసాగించాడు. కాసేపు నీ దృష్టినాకర్షించే నకిలీ వార్త కన్నా, మకిలి అంటించే అసలు వార్త డేంజరు. నువ్వే చెప్పు.. విశ్వామిత్రుడి తపస్సు చెడగొట్టడానికి నువ్వు చేసిన పనులు, కర్ణుడి కవచ కుండలాలు లాక్కోడానికి వేసిన వేషాలు... అలాంటి నిజాలే రాస్తే నీ పనేవౌతుంది?’’
‘‘ఇంతకీ ఏమంటారు మహామంత్రీ..?’’
నా మాటేమిటంటే- ‘‘ఫేక్ యందె జగము వర్థిల్లుచున్నది, ఫేక్ లేని ప్రభుత పేకమేడ లెక్కాయే, గుండెలో మేకు లాంటి ‘ఫేక్’ దించు- అసలు న్యూస్ కంటే, ‘జోకొట్టి లాలించు వార్త’ బెస్ట్. అంచేత ప్రస్తుతానికి నిదానించు. ఏది సత్యం, ఏదసత్యం ప్రక్కనపెట్టి ఏది ప్రియం, ఏది హాయి ఆలోచించు. అట్టే మనసు పాడుచేసుకోకు’’.
మంత్రి సలహా నచ్చి ఇంద్రుడు వెంటనే ఒక వజ్రాలహారం ఆయనకి బహుమతిచ్చాడు. ఆ తర్వాత తేలిందేమిటంటే ఆ వజ్రాల హారం ‘ఫేక్’! ఇదీ వృత్తాంతం- (ఇది కూడా నకిలీ కథే. జర్నలిస్టుని కాను.. గుర్తింపు కార్డు లేదు కాబట్టి ధైర్యంగా రాశా)
బుర్రలు బద్దలు కొట్టుకొనాల్సిన పనిలేదు. ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏదీ లేదు. జస్ట్ కథ అంతే..
-డా డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
తిడితే ‘హోదా’ వస్తుందా?
ఏపీకి ‘ప్రత్యేక హోదా’ సాధించేందుకు- జపాన్ ప్రజల తరహాలో రోజూ గంట సేపు అదనంగా పనిచేద్దామని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది మంచిదే. అయితే, జపాన్ వారు ఎవరిమీదా నోరు పారేసుకోరు. నిజానికి సమర్థ నాయకుడు ఎప్పుడూ నోరుజారడు. కాని చంద్రబాబు కొద్ది రోజులుగా రోజూ భాజపాను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు. అందువల్ల ప్రజల్లో భాజపా పట్ల వ్యతిరేకత బలంగా నాటుకొని తనకు ఓట్లవర్షం కురుస్తుందని ఆయన తాపత్రయం. రాష్ట్రానికి హోదా కోసం కాదు. తిట్లు శ్రుతిమించితే ఎదురు తిరుగుతాయని ఇలాంటి నేతలు తెలుసుకోవాలి. గత ఎన్నికల్లో రాహుల్ మోదీని మితిమీరి తిట్టడం వల్లనే కాంగ్రెస్ ఓడింది.
- గిరిధర్, కాకినాడ
మోదీ హవాకు అడ్డుకట్ట
మోదీ సర్కార్‌కు వరసగా ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. తమ భాగస్వామ్య మిత్రపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత మొదలై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి దారితీస్తున్నాయి. మొన్నటి వరకూ మిత్రుడుగా ఉన్న చంద్రబాబు మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తన ఎంపీలను ఆదేశించారు. శివసేన సైతం భాజపాపై అసంతృప్తిగా ఉంది. కొన్ని విపక్ష పార్టీలు సైతం చంద్రబాబు మద్దతు పలుకుతున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో బిజెపికి తీవ్ర దెబ్బతగిలింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో మోదీకి మెజారిటీ తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికలు మోదీకి గడ్డుకాలంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొన్ని విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరోపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ మూడోఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలు సమాయత్తపరుస్తున్నారు. ఏది ఏమైనా మోదీ ప్రతిష్టకు ఇది తీరని విఘాతంగా మారవచ్చు.
- అయినం రఘురామారావు, ఖమ్మం