ఉత్తరాయణం

ఇది శుభపరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్షను ఖరారు చేస్తూ భారత ప్రభుత్వం అత్యావసరాదేశాన్ని తీసుకురావడం శుభపరిణామం. కఠినమైన చట్టం నేరస్థుల్ని భయపెట్టడానికి, అకృత్యాలను అదుపు చేయడానికి కొంతవరకూ అక్కరకొస్తుంది. జమ్మూలో చిన్నారిపై పైశాచిక ఘటన వెలుగు చూశాక, సమాజంలో నెలకొన్న ఆందోళనను గమనించి ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకొంది. దారుణమైన నేరాల పట్ల తాము మెతక వైఖరి తీసుకోబోమంటూ చెప్పినట్టయింది. అయితే ఈ చట్టంతోబాటు ప్రభుత్వం గైకొనాల్సిన చర్యలు చాలానే ఉన్నాయి. నేరమూ- శిక్షని అమలు చేసే వ్యవస్థని ‘నేరాల సముద్రంలో చిల్లుల పడవ’తో పోల్చినా తప్పులేదు. నేరాలు లక్షల సంఖ్యలో ఉంటే, శిక్షవరకూ వచ్చిన కేసులు వందల్లో ఉంటాయి. చిన్నారులపై అత్యాచారాల్ని నిరోధించే చట్టం పరిధిలో కేసులు లక్షకుపైగానే పెండింగులో ఉన్నాయి. అవి తేలేసరికి చిన్నారి బాధితులు ముసలివాళ్ళయిపోవడం ఖాయం. జమ్మూ దురంతంపై సమాజం ఆగ్రహంగా ఉండి, ప్రభుత్వం మరణశిక్ష ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నాలుగు రోజుల్లోనే మరో నాలుగు పైశాచిక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా, గత పధ్నాలుగేళ్ళలో దేశంలో అమలైన ఉరిశిక్షలు కేవలం నాలుగే. అందులో ఒకటి తీవ్రవాదానికి సంబంధిచినది. కఠిన శిక్షలు ఎంత అవసరమో, అవి జాప్యం లేకుండా అమలు కావడం అంతకన్నా అవసరం. ఈ అత్యవసరాదేశం చట్టంలోని ఒక పెద్ద చిల్లుని మూసివేసినా, మిగతా చిల్లులన్నీ అలాగే ఉన్నాయి. నాలుగు నెలల్లో కేసులు కొలిక్కిరావాలని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న నియమాలు ఆచరణలోకి వచ్చినపుడే ఫలితం. మద్యపాన నియంత్రణ, సామాజిక పోలీసింగు వ్యవస్థని మెరుగుపర్చడం, కేసుల నమోదు, నిష్పాక్షిక దర్యాప్తు, సత్వర విచారణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాల్సిన పనులు. నేరస్థునికి శిక్షపడేలా చూడడంతోపాటు, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. చెడు పోకడలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడానికి మీడియా, పౌర సమాజం కృషి చెయ్యాలి.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
సకాలంలో శిక్షలు పడాలి
పనె్నండేళ్ల లోపు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే రేపిస్టులకు ఉరిశిక్ష నిర్ణయం కేంద్రం తీసుకోవడం, 16 ఏళ్ల లోపు, ఆ వయసు పైబడిన బాలికలు, మహిళలపై అత్యాచారాలు చేసే నిందితులపై శిక్షలు మరింత కఠినతరం చేయడం హర్షణీయం. ఈ శిక్షలను వేగంగా అమలు చేయడం ద్వారా దేశంలో లైంగిక దాడులను అరికట్టవచ్చు. ప్రేమపేరుతో మహిళలను వేధించే వారికి, దాడులు చేసే దుర్మార్గులకూ శిక్షలు మరింత కఠినతరం చేయాలి. మహిళలపై దాడులు జరుగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. అతి ముఖ్యమైన విషయం- ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో నైతిక విలువలను బోధించాలి.

-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
రజనీ మరణం తీరని లోటు
నవీన వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి బాలాంత్రపు రజనీకాంతరావు మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు. రేడియోలో ‘్భక్తిరంజని’ ద్వారా తెలుగు ప్రజలకు మేలుకొలుపు పాడిన ఆయన సంగీత, సాహిత్యాలలో దిట్టగా పేరు గడించారు. టంగుటూరి సూర్యకుమారి గొంతు నుండి జాలువారిన ‘మాదీ స్వతంత్ర దేశం.. మాది స్వతంత్ర జాతి’ పాటకు ఆయన సమకూర్చిన స్వరాలు అద్భుతం. ‘ఆకాశవాణి’లో భక్తిరంజనిని ప్రవేశపెట్టి ‘శ్రీ సూర్యనారాయణా మేలుకో’ వంటి భక్తిగీతాలను అత్యంత శ్రావ్యంగా తెలుగు శ్రోతలకు వినిపించిన ఘనత వారిదే. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులను స్వంతం చేసుకుని, తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్రవేశారు. పలు చలన చిత్రాలకు అద్భుతమైన పాటలు రాసి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రేడియోను నిత్యం వాడేవారికి రజనీకాంతరావు స్వరం పరిచయమై వుంటుంది. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా వారి స్వరాలు, సంగీతం, సాహిత్యం ప్రజల మదిలో నిత్యం కదులాడుతుంటాయి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట