ఉత్తరాయణం

ఇరుగూ పొరుగూ కలిస్తే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటన ఉభయ తారకం. ఇరుదేశాల అధినేతల ఆహ్లాద, అనధికారిక సమావేశం ఎవరూ ఊహించనిది. గత కొనే్నళ్లుగా భారత్, చైనాల మధ్య సంబంధాలు అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. డోక్లామ్ సరిహద్దు వివాదం, ఒన్ టెల్ట్ ఒన్ రోడ్డు నిర్మాణంపై అభ్యంతరాలు, పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదం, టిబెట్ అంశంపై పొరపొచ్చాలు తదితర అంశాల మధ్య అనుమానాల స్నేహాన్ని రెండు దేశాలూ నెట్టుకొస్తున్నాయి. పరిస్థితి దిగజారకుండా జాగ్రత్త పడుతున్నాయి. అయితే ఇప్పుడు అధినేతలిద్దరూ ప్రొటోకాల్, సంప్రదాయాలూ, క్రిందిస్థాయి సన్నద్ధతలూ లాంటి అధికారిక లాంఛనాలు లేకుండానే స్వేచ్ఛగా కలుద్దామని తీసుకున్న నిర్ణయం సరైనది. ప్రాప్తకాలజ్ఞత, పరిపక్వతతో కూడినది. ప్రస్తుత ప్రపంచంలో దౌత్య సంబంధాల్ని శాసిస్తున్నది వాణిజ్య బంధమే. అణుయుద్ధాల కన్నా తీవ్ర ప్రభావం చూపగలిగేది వాణిజ్య యుద్ధమే. అమెరికా రక్షణాత్మక వైఖరితో, ప్రపంచ దేశాల నడుమ ఉన్న వాణిజ్య ఒప్పందాల్ని బేఖాతరు చేస్తున్న తీరుతో నష్టపోతున్న దేశాల్లో ముందు వరుసల్లో చైనా, భారత్‌లున్నాయి. చైనా వస్తుదిగుమతులపై, భారత్ ఐటీ ఉత్పత్తులపై అమెరికా తీసుకొంటున్న దుందుడుకు చర్యల ప్రభావం అధికం. వేగవంతంగ జీడీపీ వృద్ధి సాధిస్తున్న ఇరు దేశాలూ పరస్పరం మేలు చెయ్యగల విధానాలు అవలంబిస్తే బలమైన దేశాలుగా నిలదొక్కుకొంటాయి. తద్వారా ‘పెద్దన్న’ మాదిరి సరైన సందేశం పంపగలవు. తోచినప్పుడు ప్రపంచీకరణ, తోచనప్పుడు రక్షణాత్మకత అవలంబిస్తే వారికే నష్టమని. అలాగే తీవ్రవాదంపై, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో స్థానంపై, ఇతర సమస్యలపై సానుకూల దృక్పథం ఏర్పడడానికి ఈ తరహా సుహృద్భావ కలయికలు మార్గం చూపుతాయి. సమావేశం ద్వారా ఏర్పడిన సానుకూల వాతావరణం ఎంతవరకూ ఫలితమిస్తుందన్నది ఆ తరువాత జరిగే కృషిపై ఆధారపడి ఉంటుంది.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొని ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బస్సు డ్రైవర్ల బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం వల్ల గతంలో ఎన్నో స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురై వందలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండకపోవడం సహించరానిది. ఇయర్ ఫోన్సు చెవిలో పెట్టుకొని బస్సులు నడపడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడపడం రానురాను ఎక్కువవుతోంది. చిన్నారుల భద్రత కోసం స్కూల్ యాజమాన్యాలు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. బాధ్యతాయుతంగా మెలిగేవారినే డ్రైవర్లుగా కొనసాగించాలి. సెల్‌ఫోన్, ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం, అతివేగంగా వాహనాలను నడిపే వారిని పక్కనపెట్టాలి. ఈ ఘటనతోనైనా పోలీస్‌శాఖ అప్రమత్తమై- మొబైల్‌లో మాట్లాడుతూ, పాటలు వింటూ డ్రైవింగ్ చేసే వారికి తగినబుద్ధి చెప్పాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

ఇది అనైతికం కాదా?
దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిని ఇటీవల ముట్టడించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం ఎంపీలను పోలీసులు మోసుకుపోయి వ్యాన్‌లో పడేసి అరెస్ట్‌చేయడాన్ని ‘అనైతికం, దమనకాండ’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. అయితే, ఆయన పాలనలోనే విజయవాడలో పట్టపగలు జరిగిందేమిటి? కాంగ్రెస్ కార్యకర్తలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేస్తూ ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించడంతో- ఆ దారిన ముఖ్యమంత్రి వస్తున్నారంటూ వారిని వ్యాన్‌లో తీసుకుపోయి అరెస్ట్‌చేశారు పోలీసులు. దీనినేమంటారు బాబుగారూ! ఇది అనైతికం, దమనకాండ కాదా?
- జ్ఞానబుద్ధ, కాకినాడ

నీతులు ఇతరులకే..!
ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని ధిక్కరించే నియంత అని తిట్టిపోసిన విపక్ష పార్టీలన్నీ పార్లమెంటులో గలాభా సృష్టించాయి. సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుకొని తామే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నాయి. పార్లమెంటు పని చేయనప్పుడు జీతభత్యాలు తీసుకోవడం అనైతికం అని భాజపా సభ్యులు సుమారు 3 కోట్ల రూపాయలను తీసుకోలేదు. ప్రతిపక్షాలేవీ ఈ అంశంపై మాట్లాడనే లేదు. పనిచేయక పోయినా డబ్బు తీసుకోవడం తప్పుకాదనుకున్నాయి. నీతులు ఎదుటివారికి చెప్పడానికే గాని తాము పాటించనక్కరలేదని ప్రతిపక్షాల విశ్వాసం!
- సుభాష్, కాకినాడ