ఉత్తరాయణం

ఉఊరక రారు.. వాల్‌మార్ట్ సార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ వాణిజ్య ఒప్పందంతో భారత్‌లో రిటైల్ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకొంటాయి. ఇది దేశీయ చిల్లర వర్తక రంగానికి పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశాలు మెండు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయంగా శాసిస్తున్న బడాకంపెనీలు దేశంలోకి చొరబడకుండా నిలువరించడం దాదాపు అసాధ్యం. తలుపులు మూస్తే, కిటికీలోంచి, కిటికీ మూస్తే సందుల్లోంచి ఎలాగోలా లోనికి చొరబడడం ఆ స్థాయి సంస్థలకు మంచినీటి ప్రాయం. అలాంటిది వాటి రాకకై ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటే- అవి వెనకడుగు వేస్తాయా? ముఖ్యంగా భారత్‌లో విస్తృత మార్కెట్ అన్నది విదేశీ కంపెనీలకు చేతికి అందే కొమ్మన మిఠాయి పొట్లంలా ఉంది. మార్కెట్‌లో ఆధిపత్యం కోసం వివిధ కంపెనీలు పోటీపడితే అంతిమంగా వినియోగదారునికి లాభమే కానీ, సంపూర్ణ గుత్త్ధాపత్యం ఉన్న ఏకైక కంపెనీ పాలబడితే నష్టమే. వాల్‌మార్ట్ రిటైల్ సంస్థ అమ్మకానికి చేసే వస్తు సేకరణలో ఎనభై శాతం చైనానుండే. కాబట్టి దాని వ్యాపారం విస్తరిస్తే ఆ దేశానికి మేలు. ఆ సంస్థ అమెరికాది కనుక వ్యాపార లాభాలు ఆ దేశానివే. కొనుగోలుదారులుగా, ఆ వ్యాపారంలో బలహీన పోటీదారులుగా భారతీయులకు నష్టమే మరి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోడానికి దేశం సిద్ధపడాలి. అపార మానవ వనరులే మన బలం. విద్యా, ఆరోగ్య, కౌశలాల పరంగా దీటుగా ఉత్పత్తులను తయారుచేసే దీర్ఘకాలిక వ్యూహాలుండాలి. దేశీయ పరిశోధన, వాణిజ్య, పరిశ్రమలకు ఊతమివ్వాలి. విదేశీ బడాకంపెనీల నుండి వచ్చే అనారోగ్యకర పోటీ తట్టుకొనే ఆలంబన ఇవ్వాలి. అమెరికా అధ్యక్షుడు- అతి తక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తున్న హార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ సుంకం తగ్గించాలంటూ వకాల్తా పుచ్చుకున్నాడు. అంత చిన్న విషయంలోనే ఆయన తన దేశపు సంస్థ లాభం కోసం ఆలోచించాడు. మన పాలకుల నుండి మన దేశ సంస్థలకు ఆ తరహా భరోసా ఊహించగలమా? ఎగుమతి చేసే చిన్న వ్యాపారికైనా, పండించే రైతుకైనా ఆ ధీమా లభిస్తుందా ఇక్కడ? స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలూ, ఆచరణలు లేకపోతే మన దేశం కేవలం మార్కెట్‌గా మిగిలిపోవడం ఖాయం. పాలకులు యువత ఉపాధికి ‘పకోడి బళ్ళు, బడ్డీలు ప్రయత్నించండంటూ’ చెప్పే అనాలోచిత సలహాలకు మించి, సీరియస్‌గా బుర్రపెట్టాల్సిన సమయమొచ్చింది.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

మైండ్‌సెట్ మారాలి
లోకం పోకడ తెలియని ముక్కుపచ్చలారని పసిపాపలపై ‘మానవ మృగాలు’ పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, వారి బాల్యాన్ని చిదిమేయడం దారుణం. ఈ నరరూప రాక్షసులు అత్యంత హేయంగా, రాయడానికి వీల్లేనంతగా శాడిజాన్ని చూపిస్తున్నారు. కామాంధులు పసిపాపల జీవితాలతో ఆడుకోవడం మనుషుల్లో పెరిగిన పైశాచికత్వానికి పరాకాష్ట. కామం మనిషిని గుడ్డివాడ్ని చేస్తుంది. చదువుకునే కుర్రాళ్ల నుంచి, కాటికి కాళ్ళుచాపే ముసలివాళ్ళవరకు లైంగిక వికారాలకు బానిసలై, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో.. జనం చేత ఎట్లా ఛీ అనిపించుకుంటున్నారో రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం చట్టాలు రూపొందించి చేతులు దులుపుకుంటోంది. పోలీసులు సరిగా స్పందించక పోవడంతో ప్రతిరోజూ ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగుచూస్తున్నాయి. వెలుగులోకి రానివి కోకొల్లలు. ఎన్ని చట్టాలు వచ్చినా పసిపిల్లలపై అత్యాచారాలను అరికట్టలేకపోతున్నామని నిత్యం జరుగుతున్న రేప్‌లను చూస్తే తెలుస్తోంది. అఘాయిత్యాలకు పాల్పడే మృగాలను చట్టాలు, కోర్టులంటూ తిప్పుతూ సమయాన్ని వృథా చేయకుండా ఉరితీయాలి. అప్పుడే మానవ మృగాల మైండ్‌సెట్ మారుతుంది.
- కాయల నాగేంద్ర, హైదరాబాద్

అర్చకుల సమస్యలు తీర్చండి
సకల ఉద్యోగుల సమస్యలన్నింటిపైన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు స్పష్టత ఉన్నదని, ఆయనే పరిష్కార మార్గాలను చూపుతారని మంత్రుల కమిటీ ఛైర్మన్, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. దేవాదాయశాఖలో పనిచేసే అర్చకుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బిల్లును అసెంబ్లీలో పాస్ చేస్తానన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకే పనికి ఒకే రకమైన వేతనం అంశంపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అర్చకులకు, ఉద్యోగులకు జీతాల చెల్లింపు, వాటిని నేరుగా వారి ఖాతాల్లో జమచేసేందుకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఏర్పాటు, దీనిపై తక్షణం తనకు నివేదిక అందించాలని సీఎం ఆదేశించారు. పీఆర్సీ, ఇంటెరిం రిలీఫ్, ఉద్యోగుల సమస్యలు తదితరాలన్నింటినీ సీఎం పరిగణనలోకి తీసుకుంటారని ఆర్థికమంత్రి అన్నారు. తమది ఉద్యోగుల పాలిట స్నేహపూర్వక ప్రభుత్వమని, ఈ విషయాలను ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పలు సందర్భాలలో ఉదహరించారని గుర్తుచేశారు. పదకొండో పీఆర్సీని తెలంగాణ రాష్ట్రావతరణ దినమైన జూన్ 2 లోపలే ప్రకటించి, అర్చకుల సమస్యలను పరిష్కారించాలి.
- సిఎల్‌ఎస్.ప్రసాద్, హైదరాబాద్