ఉత్తరాయణం

పెట్రో మంటల్లో ప్రజలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతూ, ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. కర్నాటక శాసనసభ ఎన్నికల సమయంలో 19 రోజులపాటు స్థిరంగా ఉండి, ఆ తరువాత ధర పెరగని రోజన్నదే లేకుండా పోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర కొంత స్థిరంగా ఉన్నప్పటికీ, ప్రజలకు ఆ ఊరట దక్కలేదు. అక్కడ ధర పెరిగినపుడు ఇక్కడ పంపుల్లో నిర్ద్వంద్వంగా ధర పెరుగుతూ వస్తోంది. 2014 నుండి గణనీయంగా అక్కడ తగ్గినపుడు మాత్రం ఇక్కడ ఆ ఊసే లేదు. ‘ఆయిల్ కంపెనీలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేసేశాం.. ఈ పాపంలో మా పాత్రేమీ లేదు’ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవచనాలు చెబుతోంది. ఇది ఫక్తు నాటకం. ప్రభుత్వం ప్రజల వైపు నిలబడితే కచ్చితంగా మేలు చెయ్యొచ్చు. అసలు ధరకన్నా కొసరు పన్నులే అధికం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నుల్ని వదలుకోలేనక్కరలేదు, తగ్గిస్తే చాలు. పెట్రోల్ ధర సగానికి తగ్గుతుంది. ఆ పని మానేసి, వ్యాపార దృష్టిలో ఇంకొంచెం పన్నులు వడ్డిస్తూ, అయ్యో పాపం అంటూ కేంద్రం బాగా నటిస్తోంది. సామాన్యులకు ఇంధన ధరలతోపాటు, వాటి వల్ల పెరిగే నిత్యావసర సరకుల ధరలు, రవాణా ఖర్చులు అదనం. అంతో ఇంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నపుడే ఇలా వుంటే, రానున్న రోజులు తలచుకొంటేనే భయం పుడుతుంది. అమెరికా పుణ్యమాని ఇరాన్‌లో ఏర్పడిన సంక్షోభం చమురు ధరలపై దుష్ప్రభావం మరింత చూపబోతోంది. మరోవైపు రూపాయి విలువ పతనం దిశగానే ఉంది. ప్రభుత్వం సాకులు వెతక్కుండా సరైన చర్యలు చేపట్టకుంటే అన్ని విధాలా దేశానికి నష్టం. ముందుగా ఇంధనంపై విధిస్తున్న వివిధ రకాల పన్నుల్ని తగ్గించడం వెంటనే జరగాలి.
-డా. డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం

పాతకేసుల ఊసెందుకు?
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల సిఎంల మధ్య స్పర్థ చెలరేగుతూనే ఉంది. అయితే విచిత్రంగా కొంతకాలం ఇద్దరూ విమర్శించుకోకుండా వౌనం వహించారు. అందుకు ‘నాకు ఇది, నీకు అది’ అన్న ప్రత్యేక ఏర్పాటు ఏదో కుదిరే ఉంటుందని జనం అనుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏపీకి ఇవ్వవలసిన ఉమ్మడి ఆస్తిలో భాగం రూ. 50వేల కోట్ల ఊసు చంద్రబాబు ఎత్తడం లేదు. ఓటుకి నోటు కేసు గురించి కెసిఆర్ మాట్లాడం లేదు. హఠాత్తుగా కెసిఆర్ ఆ కేసుని సమీక్షించాలని అనడంతో టిడిపి నేతలు అలవాటు ప్రకారం- ఇదంతా భాజపా కుట్ర అనడం ప్రారంభించారు. కాని అసలు విషయం ఏమంటే- తాను ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు చంద్రబాబు అడ్డు తొలగించడానికే ఓటుకి నోటు కేసుని కేసీఆర్ బయటకు తీసినట్టు అనిపిస్తోంది.
-అభిలాష, కాకినాడ

జిల్లాల పేర్లు మార్చాలా?
నెల్లూరు జిల్లాను ‘పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా’గాను, కడప జిల్లాను ‘వై.ఎస్.ఆర్ కడప జిల్లా’గాను పేర్చు మార్చడం వెనుక కులం, రాజకీయం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. కడప జిల్లాకు అన్యమతస్తుడి పేరు ‘తగిలించటం’ వల్ల హిందువుల మనోభావాలను గౌరవించినట్లా? అన్న ప్రశ్నలు లేకపోలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు తెదేపా వ్యవస్థాపకుడైన ఎన్.టి.రామారావు పేరు పెడతామనడం విడ్డూరంగా ఉంది. ఇది అర్థం లేని రాజకీయంతో కూడిన పని. ఎన్‌టిఆర్ 1949 నుండి 1996లో మరణించేవరకూ కృష్ణా జిల్లాలో నివసించలేదు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కొందరు కులం, రాజకీయ కోణంలో డిమాండ్ చేయడం అర్థం లేని వ్యవహారం. రంగా కేవలం విజయవాడలోని కొంత ప్రాంతానికే పరిమితం. తెలుగు జాతినే ఉర్రూతలూగించిన ఎన్‌టిఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టడం అర్థం లేదని అనుకుంటే రంగా పేరుని పెట్టాలనడం మరీ హాస్యాస్పదం.
-ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్

వారు బ్రాహ్మణులే!
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రధాని మోదీ బ్రాహ్మణులే అని గుజరాత్ స్పీకర్ అనడాన్ని వివాదాస్పద వ్యాఖ్యగా భావించనక్కరలేదు. మన పురాణాలు, వేదాలు మనుషులు చేసే పనులను బట్టి కులాలను నిర్ణయించాయి. తెలివితేటలుండి నియమబద్ధంగా నడుచుకుంటూ ఇతరులను విద్యావంతులుగా చేసేవారిని బ్రాహ్మణులని, దేశాన్ని ప్రజల్ని రక్షించేవారిని క్షత్రియులని, వ్యాపారం చేసేవారిని వైశ్యులని, ఇతర వృత్తులు చేసేవారిని శూద్రులని అన్నారు. కాని కాలగమనంలో ఏ కులంలో జన్మిస్తే ఆ కులం వారిగా పరిగణించడం ప్రాచుర్యంలోకి వచ్చింది. పురాతన నిర్వచనం ప్రకారం అంబేద్కర్, మోదీలను బ్రాహ్మణులనడం తప్పుకాదు.
-గిరిధర్, కాకినాడ

రాజకీయ ద్వేషంతో విమర్శలు
దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో స్ర్తిలపై ప్రతినిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి. కాని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి వాటిని విమర్శించడానికి బదులు, ఏపీలోనూ మహిళలపై అకృత్యాలు లెక్కకుమించి జరుగుతున్నట్లు అదేపనిగా విమర్శిస్తున్నారు. అత్యాచారాలు ఏ ప్రాంతంలో జరిగినా అందరూ ఖండించవలసిందే. అయతే, రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి అత్యాచార ఘటనలను ఆసరాగా చేసుకోవడం సమంజసం కాదు. కానీ, విపక్షనేత జగన్ ధ్యాస చంద్రబాబు నాయుడిని ఏదో ఒక సాకుతో తిట్టేందుకేనని అనిపిస్తోంది. పలు ఆర్థిక లావాదేవీల్లో నిందితుడై బెయిల్ మీద బయటకు వచ్చి, తనో స్వాతంత్య్రయోధుడిగా నటిస్తూ జనాల్ని మోసం చేస్తుంటే జగన్ మాటలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్‌కు నిజంగా ధైర్యమే వుంటే ప్రత్యేక హోదాపై వంచించిన భాజపాను విమర్శించాలి. కేసుల నుండి విముక్తి పొందేందుకే జగన్ భాజపాపై సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి.
-ఎం.పురుషోత్తం, ఎమ్మిగనూరు