ఉత్తరాయణం

ప్రభుత్వానికి కనువిప్పు కలగదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక దేశంలో నెలకొన్న తీవ్ర అనారోగ్య పరిస్థితులను కళ్ళకు కట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సూచీలో 2014లో మన దేశానికి వున్న 170వ ర్యాంకు తాజాగా 185వ ర్యాంకుకు దిగజారిపోవడం మన పాలకుల తీవ్ర నిర్లక్ష్యవైఖరిని స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు జనాభా నిష్పత్తిప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అవసరం వుండగా మన దేశంలో మాత్రం 11 నుంచి 30వేల మందికి ఒక వైద్యుడు మాత్రమే వున్నాడు. మనకంటే చిన్న దేశాలైన భూటాన్, శ్రీలంక, మాల్దీవులు తమ జిడిపిలో 4 శాతం వరకు ప్రజారోగ్య పరిరక్షణకు నిధులను ఖర్చుచేస్తుండగా మన ప్రభుత్వాలు మాత్రం 1.1 శాతం మాత్రమే ఖర్చుచేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు 6 శాతం వరకు నిధులు ఖర్చుచేస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షకు పెద్దపీట వేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో అత్యవసర వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఏటా ముప్ఫై లక్షలకు పైగా వుందన్న సదరు నివేదిక ఇకనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కావాలి. మాతా శిశు మరణాల రేటు వెయ్యికి 41గా నమోదు చేసుకుంటూ ప్రపంచ దేశాలలో 10వ ర్యాంకులో భారత్ ఉండడం దురదృష్టకరం. పౌష్టికాహార లోపం కారణంగా పదేళ్ళ లోపు వయసు పిల్లల మరణాలు ఇప్పటికీ రెండు కోట్లకు పైపెచ్చు వుందంటే పేదవారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి వుందో ఇట్టే అర్థవౌతోంది. పౌరులు తమ ఆరోగ్యం కోసం సంపాదనలో 33 శాతం చేస్తున్నారు. మరోవైపు ఏటా ఆరు కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువకు జారిపోతున్నారు. రోగులను ఆదాయవనరుగా చూసే కార్పొరేట్ ఆస్పత్రుల సంస్కృతి విశృంఖలంగా వ్యాపించిన దేశంలోప్రభుత్వ వైద్యం పడకేయడానికి ప్రధానంగా పాలకుల విధానాలే కారణం. పేద, మధ్యతరగతి ప్రజల పాలిట సంజీవిని అయిన ప్రభుత్వ ఆస్పత్రులు సిబ్బంది కొరత, నిధుల లేమి వంటి సమస్యలతో కునారిల్లుతుంటే మన పాలకులు సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అన్న నినాదంతో కార్పొరేట్ వైద్యానికి ఊతం ఇచ్చే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తున్నారు.
మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్లాది రూపాయలు వివిధ ఆరోగ్య భీమా పథకాల నిమిత్తం చెల్లించేకంటే ఆ నిధులతో దేశంలోవున్న ముప్ఫైవేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, లక్షన్నర ఉప కేంద్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం ఖర్చుచేయగలిగితే కోట్లాది భారతీయులకు ఎంతో మేలు కలుగుతుంది. చిన్నపాటి రోగాలను భూతద్దంలో చూపెట్టి, రోగులను భయభ్రాంతులను చేసి వారిని, ణ్యమైన వైద్యం పేరిట వారిని పీల్చి పిప్పి చేసే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల బారినుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆధునిక కాలపు గుండె జబ్బులు, కాన్సర్, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల రోగాలు, మధుమేహం వంటి రోగాలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆర్థికాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించే ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేయాలి.

-ఎం.కనకదుర్గ, తెనాలి

కాలుష్యంతో అవస్థలు
హైదరాబాద్ మహానగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో వుంది. వాహనాల సంఖ్య పెరగడం, కాలం చెల్లిన వాహనాలను నడపడం, చెత్తకుప్పలు పేరుకుపోవడం, రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను తగులబెట్టడం, పరిశ్రమల కారణంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇది మానవారోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నది. కాలుష్యానికి కారకులైన వారిని గుర్తించి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు తమ వాహనాలను బయటకు తీయరాదు. పేరుకుపోతున్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. వ్యర్థాలను తగలబెట్టడాన్ని నిరోధించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
వ్యవసాయ కూలీలకూ బీమా
యాదాద్రి-్భవనగిరి జిల్లా వేములకొండ వద్ద ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి 15 మంది మృతి చెందడం అత్యంత విషాదకరం. రెక్కాడితేగాని డొక్కాడని రైతుకూలీలు పనులకు వెళుతూ మృత్యువాత పడ్డారు. జీవనోపాధికి వెళ్లిన 5 నిమిషాల వ్యవధిలోనే వీరంతా విగతజీవులయ్యారు. తమ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఉచిత విద్య అందజేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా వర్తింపజేయాలి. ప్రమాదవశాత్తూ మరణించే రైతుకూలీలకు 5 లక్షల రూపాయల బీమా ఇస్తే వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది.
-గుండమల్ల సతీష్ కుమార్, సంస్థాన్ నారాయణపురం