ఉత్తరాయణం

రాజకీయాల్లో విలువలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఎన్నికల ముఖచిత్రం మారిపోతుండడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. మద్యం, ధనం ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తుండడం మంచి పద్ధతి కాదు. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల కింద రికార్డు సృష్టించాయి. కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు, నేతలు అధికారం అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఎన్నికలలో ప్రవహింపజేస్తూ ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభపెడుతున్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నందున ప్రజలలో అనైక్యత ఏర్పడుతోంది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, ఇతర నేరాల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న వారు సైతం ప్రజాప్రతినిధులైపోయి దర్జాగా అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. ఎన్నికలలో గెలిచాక వారిపై వున్న కేసులు వీగిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. కోట్లకు పడగలెత్తిన వ్యాపారస్థులు స్వలాభాపేక్షతో రాజకీయ రంగప్రవేశం చేసి తమ సంపదను, వ్యాపారాలను కాపాడుకుంటున్నారు. ఒక పార్టీ తరఫున గెలిచాక పదవుల కోసం వేరే పార్టీలో చేరుతున్నందున ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను నేతలు వంచించడం ఇపుడు రొటీన్ వ్యవహారంగా మారింది. విద్యాధికులు, మేధావులు, సంఘ సంస్కర్తలు, ప్రజా పోరాటాలను చేసేవారు మనకెందుకులే అన్న నిర్లిప్త భావంతో రాజకీయాలకు ఆమడ దూరంలో వుంటున్నారు. భవిష్యత్తులో రాజకీయ రంగం గౌరవ ప్రదంగా ఉండాలంటే- ఇప్పటి నుండే యువత, మేధావులు సన్నద్ధం కావాలి. విద్యార్థులకు నైతిక నిష్ఠ, వ్యక్తిగత శీలం, సమాజం, జాతి పట్ల తమ కర్తవ్యం బోధించాలి. ప్రజలు సైతం అవినీతిపరులు, అక్రమార్కులు, కళంకితులను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి.
-ఎం.కనకదుర్గ, తెనాలి
విషజ్వరాల బెడద
శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి వర్షాలకు డెంగ్యూ, మలేరియా, డయేరియా, సైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం, ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టడంలో వైద్య సిబ్బంది అలసత్వం ప్రజల పాలిట శాపాలుగా మారాయి. వృద్ధిరేటు, తలసరి ఆదాయం, అభివృద్ధి పథకాల విషయంలో ఈ జిల్లా అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వ యంత్రాంగం గొప్పలు చెప్పుకుంటుంటే- మరొక పక్క జ్వరపీడితుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ప్రాణాంతకమైన డెంగ్యూ కేసులు జిల్లా వాసులను కలవరపాటు గురిచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రత వల్ల విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా నిర్వహించాల్సిన పారిశుద్ధ్య చర్యలు పల్లెల్లో కనిపించడం లేదు. ఇటీవల డెంగ్యూ మరణాలు సంభవించినా వైద్య ఆరోగ్యశాఖ వాటిని నిర్థారణ చేయకపోవడం గమనార్హం. సిబ్బంది లేమి, నిధుల కొరత, అధికారుల అలసత్వం కారణంగా అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులలో వ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స లభించడం లేదు. దీంతో రోగులు వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. అదనుచూసి ప్రైవేట్ వైద్య కేంద్రాలు టెస్టులు, మందుల పేరిట బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా వైద్య ఆరోగ్య శాఖ నిర్లిప్త వైఖరి అవలంబించడం బాధాకరం. స్వచ్ఛతా కార్యక్రమాలు ప్రచారానికే పరిమితం అయ్యాయి.
-సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం