ఉత్తరాయణం

ఔషధ రంగంలో అక్రమాలకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా నకిలీ మందుల పంపిణీ, వాటి వినియోగానికి చెక్‌పెడుతూ- ఔషధాల్లో నాణ్యతాప్రమాణాలను పెంచేందుకు ‘ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల చట్టాని’కి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం హర్షణీయం. ప్రస్తుత చట్టం ప్రకారం ఏదైనా ఔషధం నాసిరకమని తేలితే ఉత్పత్తిదారుడిని మాత్రమే బాధ్యుడిని చేస్తున్నారు. ఇందులో విధించే శిక్షలు కూడా అంతంత మాత్రంగా వుండడంతో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్న భయం ఉత్పత్తిదారులకు వుండడం లేదు. దీనిని ఆసరాగా తీసుకొని పలు పెద్ద కంపెనీలు చిన్న చిన్న మందుల కంపెనీలకు కమీషన్ ప్రాతిపదికపై ఔషధాల తయారీ బాధ్యతలను అప్పగించి, ఆ ఉత్పత్తులను తమ బ్రాండ్ పేరున విక్రయిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలకు తయారీ కంపెనీలే బాధ్యత వహించాల్సి రావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు శిక్షల నుండి తప్పించుకుంటున్నాయి. తాజా చట్టసవరణల ప్రకారం ఔషధాలలో నాణ్యత కొరవడినా, అవి రోగులకు ఉపశమనం కలిగించకపోయినా మాతృసంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి వుంటుంది. మూడేళ్ల నుండి జీవితకాలం జైలుశిక్ష, లైసెన్సు రద్దు, నాణ్యతా ప్రమాణాలపై స్వతంత్ర సంస్థతో ఆడిట్లు వంటి సవరణలు ఔషధ తయారీ రంగంపై చక్కని నియంత్రణ సాధిస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.
- సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ
పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
వర్షాకాలం వానలతో పాటు సీజనల్ వ్యాధులనూ మోసుకొస్తుంది. విష జ్వరాలు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు విజృంభించనున్నాయి. అధికంగా ముసురుతున్న ఈగలు కలరా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తం కావాలి. ఈగలు, దోమల బెడద నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి. పల్లెల్లో, పట్టణాలు చాలాచోట్ల అపరిశుభ్రత నెలకొంది. స్వచ్ఛత దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. జనావాసాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు ముసిరిన పదార్థాలను ఎవరూ తినకూడదు. దోమల నివారణకై తగు జాగ్రత్తలను తీసుకోవాలి. వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. చిన్నపిల్లలను వర్షాల్లో తిరగకుండా పెద్దలు కనిపెట్టుకోవాలి. వారికి అపరిశుభ్ర వాతావరణంలో తయారయ్యే ఆహార పదార్థాలను తినిపించవద్దు. అంటువ్యాధులు సోకకుండా చూసుకోవాలి. అన్ని ఆసుపత్రులలోనూ సీజనల్ వ్యాధుల దృష్ట్యా వైద్య సిబ్బందిని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం