ఉత్తరాయణం

స.హ చట్టానికి సవరణ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపాదిత సమాచార హక్కు సవరణ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం పునరాలోచనలో పడడం అభినందనీయం. అయితే, ఆ తరహా బిల్లు సందు చూసుకొని ఏ క్షణమైనా సభలో ప్రవేశం పొందవచ్చు. ఎందుకంటే అన్ని పక్షాలదీ సమాచార హక్కుపై ఒకే తీరు. ప్రజలకు సమాచారం ఏ విధంగానైతే బలమో, ప్రభుత్వానికి రహస్యం ఆ విధంగా బలం. పౌర సమాజం వత్తిడి మేరకు, సమాచారం పొందే హక్కు పౌరుని ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పినందుకు ఆ హక్కు చట్టం అమలులోకి రాగలిగింది. అయితే ఎన్నో ఆటంకాలు ఎదురవుతునే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రభుత్వ విభాగాలు ‘అధికారిక రహస్యాలు’ అన్న ముసుగులో సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఇవ్వడానికి ఇష్టపడని సమచారాన్ని సున్నితమైనదని, దేశ సమగ్రతకు భంగకరం అంటూ ముద్ర వేసేస్తున్నాయి. చట్టాన్ని అతిక్రమించి, సమాచార నిరాకరణ చేస్తున్న బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉండడం లేదు. దేశ వ్యాప్తంగా సమాచార హక్కు కమిషన్‌లో అధికారుల స్థానాలు భర్తీ చేయనందున వేలాది కేసులు పెండింగ్‌లో వున్నాయి. మరోవైపు హక్కుల కార్తకర్తల ప్రాణాలకు పూచీ లేదు. ఇలాంటి లోపాల్ని దిద్దేందుకు నడుం కట్టాల్సిన ప్రభుత్వం ఆ పని మాని చట్టాన్ని నీరుగార్చే సవరణలను ప్రతిపాదించింది. అందులో ఒకటి సమాచార ప్రధాన కమిషనర్ జీత భత్యాలు, పదవీ కాలం ప్రభుత్వం చేతిలో ఉండాలనేది. అలా చేస్తే ఆ అధికారి స్వతంత్రతకు కళ్లెం వేసినట్టే. రాష్ట్ర కమిషనర్ విషయంలో ఈ సవరణ రాష్ట్ర అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతుంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రస్తుతానికి ఈ సవరణలు అటకెక్కినా ముందు ముందు ఇలాంటి ప్రయత్నాలు రాకుండా పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి. సమాచార హక్కు చట్టం రూపంలో తమకు లభించిన ఆయుధాన్ని తుప్పు పట్టించే ప్రయత్నాల్ని తిప్పికొట్టాలి.
-డి.వి.జి.శంకర్‌రావు, పార్వతీపురం

దూరవిద్య ఒక మిధ్య
మున్సిపల్ ఇంజనీర్ల ప్రమోషన్ విషయంలో దూరవిద్య ద్వారా డిగ్రీలు సంపాదించిన వారిని పరిగణనలోకి తీసుకోకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించటం సమర్థనీయమే. వివిధ కారణాలతో విద్యార్థి దశలో పై చదువులు కొనసాగించలేనివారికి దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను ప్రోత్సహించవచ్చనే ఆశయంతో కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులిస్తే నేడు వాటిపై ప్రభుత్వ నియంత్రణ లోపించి కరెస్పాండెన్స్ కోర్సులు దారి తప్పాయి. కొన్ని దూరవిద్యా కోర్సుల్లో తగిన బోధనా తరగతులు నిర్వహించకుండా సరైన శిక్షణ, నైపుణ్యం పెంపొందించకుండానే డిగ్రీలు అమ్ముకుంటున్నారు. అటువంటి డిగ్రీలను ఆమోదిస్తే ప్రభుత్వం కార్యకలాపాల్లో నాణ్యత లోపిస్తుంది. ప్రజానీకానికి నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే కారుణ్య నియామకాల్లో తగిన అర్హతలు లేని ఉద్యోగులతో ప్రజలకు అసౌకర్యంగానే వుంది. ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలను మహద్భాగ్యంగా భావించవలసినవేళ- నాణ్యత లేని, నకిలీ డిగ్రీలు పొందినవారికి ప్రాధాన్యతనిస్తే పూర్తికాలం సమయం వెచ్చించి చదువుకుని డిగ్రీలు సంపాదించినవారికి అన్యాయం జరుగుతుంది. తగిన శిక్షణ, నైపుణ్యం లేని వారితో నష్టమే. రాజస్థాన్, అలహాబాదు వంటి కొన్ని విశ్వవిద్యాలయాల ద్వారా పొందిన సర్ట్ఫికెట్లు చెల్లవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇకనైనా ప్రభుత్వాలు సక్రమంగా తరగతులను నిర్వహించకుండా, పాఠ్యాంశాలను బోధించకుండా ఆషామాషీగా సర్ట్ఫికెట్లు జారీ చేసే ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుని వాటిని నియంత్రించాలి.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

నాణ్యత లేని కందిపప్పు
తెలుపురంగు రేషన్ కార్డులున్న వారికి కిలో నలభై రూపాయల చొప్పున ప్రతినెలా రెండు కిలోల కందిపప్పును ఇస్తామని ఏపీ ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. మొదటి నెలలో కార్డుదారులకు కిలో చొప్పున ఇచ్చినా, ఆ తర్వాత నెలలో రేషన్ డీలర్లు కందిపప్పును తీసుకునేందుకు వెనుకంజ వేశారు. నాణ్యత లేనందువల్ల దీన్ని కొనేందుకు వినియోగదారులు సుముఖత చూపడం లేదు. రుచీ పచీ లేని కందిపప్పును తక్కువ ధరకు ఇచ్చినా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న సంగతి తేటతెల్లమైంది. తినడానికి పనికిరాని సర్కారీ కందిపప్పును తెల్లకార్డులున్నవారు మాత్రం ఎందుకు కొంటారు?
-సుధీర్, కాకినాడ

కీచక బాబాలు
ఇటీవల చాలామంది నేరగాళ్లు బాబాల అవతారం ఎత్తి, తమ దగ్గర మహిమలున్నాయని అమాయక ప్రజలను నమ్మించి, మాయమాటలతో సొమ్ము చేసుకుంటున్నారు. స్ర్తిల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. వీడియోలు చిత్రీకరించి, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి దొంగ బాబాలను దేవుళ్ళుగా భావించి చాలామంది మోసపోతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు. మాయదారి మహిమలు ప్రదర్శించడం ద్వారా ఎవరూ దేవుళ్ళు కాలేరు. చదువుకున్న ప్రజలే ఇలా మోసపోతే ఎలా? ఇలాంటి ఘరానా మోసగాళ్ళు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారాన్ని చేరవేయాలి. పోలీసులు ఇలాంటివారిపై నిఘావేసి, వారి చర్యలను గమనిస్తుండాలి. కీచక బాబాలను అత్యంత కఠినంగా శిక్షించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

పూర్తి మార్కులివ్వడం సరికాదు
జాతీయ స్థాయిలో ‘నీట్’ పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించగా, తమిళ అనువాదంలో 49 ప్రశ్నల్లో తప్పులు దొర్లినందుకు సంబంధిత అభ్యర్థులకు పూర్తి మార్కులివ్వాలని మధురై హైకోర్టు బెంచ్ తీర్పు ఇవ్వడం సమంజసం కాదు. ఇలాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గినా, ర్యాంకుల్లో చాలా తేడా ఉంటుంది. తమిళ అభ్యర్థులకు 49 ప్రశ్నలకు గాను పూర్తి మార్కులు వేస్తే మిగతా భాషల వారికి అన్యాయం జరిగినట్టు కాదా? అనువాదం సరిగా ఉన్న పక్షంలో ఆ 49 ప్రశ్నలకూ తమిళ అభ్యర్థులందరూ సరైన సమాధానాలు ఇచ్చేవారా? అందుకని వారు జవాబులు రాసిన 131 ప్రశ్నలకు ఎన్ని మార్కులు వచ్చాయో చూసి, ఆ దామాషాలో 49 ప్రశ్నలకు ఎన్ని మార్కులివ్వాలో గణన చేసి కలిపితే సమంజసంగా ఉంటుంది.
-శాండీ, కాకినాడ