ఉత్తరాయణం

యువతకు ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, ఉద్యోగాల భర్తీకి ఏపీ మంత్రివర్గం ‘పచ్చజెండా’ ఊపడంతో యువతకు ఊరట కలిగింది. ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’ పేరిట నెలకు రూ.1000 నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల యువతీ యువకులకు ఎంతోకొంత ఆసరా దొరికినట్టే. ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి మండలి ఆమోదముద్ర వేయడం హర్షణీయం. అయితే, రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుత డీఎస్సీలో 10,351 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామని పదే పదే చెబుతున్నారు. కానీ 9,698 టీచర్ పోస్టుల భర్తీకే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయ పోస్టుల్లో కోత పడినట్టు కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 9,698 పోస్టుల భర్తీకి అవసరాన్నిబట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. అంటే ప్రస్తుత డీఎస్సీలో ఈ 9,698 పోస్టులను భర్తీ చేస్తారా? వాటిలోకూడా కోత పెట్టేస్తారేమో? అని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 10,351 టీచర్ పోస్టులకు ఆమోదముద్ర వేసి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు ఆకాంక్షిస్తున్నారు.
-బట్టా రామకృష్ణ, సౌత్ మోపూరు

ప్రమాదకరమైన ప్రయాణం
జంట నగరాలలో సిటీ బస్సులో ప్రయాణం నరకాన్ని తలపింపజేస్తోంది. రద్దీనిబట్టి బస్సుల సంఖ్య లేకపోవడంతో అవి కిటకిటలాడుతూ ఫుట్‌బోర్డులపై విద్యార్థులు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కొంతమంది విద్యార్థులకు ఇదే సరదా అవుతోంది. వేలాడుతూ ప్రయాణించడం వల్ల ప్రమాదవశాత్తూ జారిపడి మరణించడం లేదా అంగవైకల్యం కలగడం అనివార్యమవుతోంది. హెల్మెట్ లేదని, రాంగ్‌రూట్ డ్రైవింగ్ అని, సిగ్నల్ జంపింగ్ అని వివిధ కారణాలతో వాహనదారులకు జరిమానాలు విధించే పోలీసులు ఫుట్‌బోర్డుపై ప్రయాణికులు వేలాడుతుంటే ఎందుకు పట్టించుకోరు? సిటీ బస్సులకు కచ్చితంగా డోర్లు ఉండాలి. ఆ డోర్లను మూసిన తర్వాతనే బస్సులను కదిలించాలి. రద్దీ వేళల్లో ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

మన జైళ్ల గురించి తెలియదా?
శతాబ్దాల పాటు భారత్‌ను పాలించిన బ్రిటన్ దొరలు ఇపుడు జనరల్ నాలెడ్జిలో వెనకబడిపోయారేమో? వాళ్ళ పూర్వీకులు భారత్‌లో దేశభక్తుల్ని శిక్షించడానికి కట్టిన నరక కూపాల్లాంటి జైళ్ళని గుర్తుతెచ్చుకున్నారేమో? అండమాన్‌లో కట్టిన కాలాపానీ సెల్యులార్ జైలు, గాంధీ, నెహ్రూల్ని ఖైదుచేసిన ఎరవాడ లాంటి కారాగారాల్ని చాదస్తంగా ఊహించుకొంటున్నట్టున్నారు. అదీ నిజమే. చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు, బెయిల్ పొందేందుకు డబ్బు లేక సంవత్సరాలుగా మగ్గే అండర్ ట్రయల్స్ ఉండే కనీస సౌకర్యాల్లేని జైళ్లు భారత్ నిండా ఉన్నాయి. అయితే ఘరానా మనుషులకు ఆ ఖర్మేమి పట్టింది? ఎంచక్కా ‘ఐదు నక్షత్రాల జైళ్లు’ వారికోసం నిక్షేపంగా ఉన్నాయి. ఆ తేడా అర్జెంటుగా బ్రిటన్ వారికి తెలియజెప్పాలి. లేకపోతే దేశానికి తొమ్మిదివేల కోట్ల రూపాయల మేరకు టోపీ వేసి, ఇక్కడ న్యాయస్థానాలకు అందకుండా తమ దేశంలో విశ్రాంత జీవితం గడుపుతున్న విజయ్ మాల్యాని భారత్‌కి అప్పజెప్తే ఎక్కడ కందిపోతాడో అని అక్కడ కోర్టులు ఆలోచిస్తాయా? ‘మీ దేశంలో ఆయన్ని బంధించబోయే గది ఎలాఉందో వీడియో తీసి చూపించమంటూ మన దేశాన్ని కోరతాయా?’ ‘అక్కడకన్నా ఇక్కడే జైల్లో బాగా చూసుకొంటాం’ అని మన ప్రభుత్వం తెలియజెప్పాలి. శశికళ సహా ఇతర సెలెబ్రిటీలు కొన్నాళ్ళు జైలులో ఉండాల్సివస్తే ఎంత బాగా చూసుకొంటున్నామో వివరించాలి. ఆమధ్య శశికళకు జరుగుతున్న రాచమర్యాదల్ని వీడియోతో బయటపెట్టి ప్రభుత్వంతో చివాట్లు తిన్న కర్ణాటక అధికారిణి తీసిన వీడియోను సాక్ష్యంగా చూపించాలి. భారీ ఆర్థిక నేరంలో నిందితుణ్ణి అప్పగించమని కోరితే ఆ పనిమాని, అతి మర్యాదలకు పోతున్న క్రౌన్ కోర్టు తీరుకన్నా ఎక్కువ అవమానకరం ఇది. మన దేశంలో ఘరానా పెద్దలకు ఆమాత్రం మందీ మార్బలం, విలాసాలు, వేన్నీళ్లు వంటివి కల్పించలేని దీనస్థితిలో మనం ఉన్నామా? సిగ్గు..సిగ్గు.
-డా. డీవీజీ శంకరరావు,పార్వతీపురం.