ఉత్తరాయణం

మాతృభాషలకు గ్రహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో మాతృభాషలు మనుగడ కోల్పోతున్నాయని తాజాగా ‘పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా’ సర్వే తెలియజేస్తోంది. వేగంగా చొచ్చుకువస్తున్న పాశ్చాత్య సంస్కృతి, భాషా, సాంస్కృతిక వలసలు, ఆంగ్లం, హిందీ భాషలపై పెరుగుతున్న మోజు, మాతృభాషకు ప్రజలపరంగా, ప్రభుత్వపరంగా ఎదురౌతున్న నిరాదరణ ఫలితంగా దేశంలో అనేక అమూల్యమైన భాషలు అంతరించిపోవడానికి కారణవౌతున్నాయి. 1961 జనాభా లెక్కల ప్రకారం అధికారికంగా 1652 భాషలు వుండగా 2011 జనాభా పరిగణన ప్రకారం ఈ సంఖ్య 1369కు పడిపోయింది. అంటే 50 సంవత్సరాలలో ప్రతీ రెండు నెలలకు ఒక భాష చొప్పున మొత్తం 282 భాషలు అంతరించిపోయాయి. వచ్చే అయిదేళ్ళలో మాట్లాడే వారి సంఖ్య తగ్గనున్న కారణంగా మరొక మూడువందల భాషలు అదృశ్యమైపోతాయని, అందుకే భారత్‌ను ‘గ్రేవ్‌యార్డ్ ఆఫ్ లాంగ్వేజెస్’ ( భాషల మృత్యుదిబ్బ)గా సదరు నివేదిక అభివర్ణించడం పట్ల ప్రభుత్వం, ప్రజలు, భాషాపరిరక్షకులు, పరిశోధకులు అప్రమత్తం కావాలి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఒక సంవత్సరంలోనే 76 జీవ భాషలు అంతరించనున్నట్లు హెచ్చరికలు వెలువడుతున్నాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో కేవలం 22 భాషలనే పేర్కొనడం వలన, వందలాది ఇతర భాషలు అనధికార హోదాలో మిగిలిపోవడం వలన వాటికి ఎలాంటి గుర్తింపు, ప్రాచుర్యం లభించలేదు. మాతృభాషలో బోధన లేని కారణంగా పిల్లలలో పఠనాశక్తి, సృజనాత్మకత, గ్రహణశక్తి లోపించాయని, కనీస విషయ పరిజ్ఞానం లేదని మరో సర్వే తేల్చిచెప్పింది. చిన్న భాషలు బ్రతికివున్న ప్రదేశాలలో వాటిని పరిరక్షించేందుకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచాలి, ప్రతి నగరంలో మాతృభాషా పరిరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. హిందీ, బెంగాలీ తర్వాత అధిక సంఖ్యలో మాట్లాడే భాషగా ఉన్న తెలుగుభాష తన స్థానాన్ని కోల్పోయింది. ఇది తెలుగు ప్రజలందరికీ అవమానకరం. వివిధ విశ్వవిద్యాలయాలలో జరుగుతున్న పరిశోధనలు, విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మాతృభాషలోకి తర్జుమాచేసి సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోనికి తేవాలి. మాతృభాషలలో గతంలో వెలువడిన అమూల్యమైన సాహిత్యాన్ని తిరిగి పునర్ముద్రించి అందుబాటులోకి తేవడంతోపాటు పాఠ్యాంశాలుగా వుంచాలి. భాషా హక్కులపై ప్రజలలో పెద్దఎత్తున చైతన్యం తేవాలి. ఒక సజీవ భాషను నిరాదరించి దానిని అంతరింపజేయడమంటే అది జాతి హననంతో సమానమన్న యునెస్కో అభిప్రాయం ప్రభుత్వాలకు, ప్రజలకు, పౌర సమాజానికి కనువిప్పు కావాలి.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
దేశానికి ప్రమాద సంకేతం
కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకొని విలవిల్లాడడం హృదయ విదారకం. ఎడతెరిపి లేని వర్షాలు గత వంద సంవత్సరాల్లో లేనంతగా కురిసి దాదాపు రాష్టమ్రంతా మునిగి లక్షలాది మంది ప్రజలు సహాయక శిబిరాల్లో చేరడం, 350 మంది మరణించడం దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించినప్పటికీ, సైనిక దళాలు, స్వచ్ఛంద దళాలు అంకితభావంతో సమర్ధవంతంగా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ బాధితుల ఇబ్బందులు కొంతమేరకు తీరుతున్నాయి. వానలు తగ్గినా వరదలు తగ్గడానికి ఇంకొన్ని రోజుల సమయం పడుతుంది. వరద నీరు తగ్గేవరకూ మంచినీటి సమస్య, ఆహార సమస్య, పర్యావరణ సమస్య, వ్యాధుల సమస్యలు తప్పవు. వీటిని నివారించేందుకు పెద్ద పోరాటమే చెయ్యాలి. దేశం యావత్తూ ప్రభావిత రాష్ట్రం పట్ల ఉదారత చూపించడం, బాసటగా నిలవడం మంచి పరిణామం. ఈ విషాదం అందరికీ చేసే హెచ్చరిక ఒకటుందని పౌరుల భావన. అదేమిటంటే ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు. మానవ తప్పిదం వల్ల తీవ్రత పెరిగిన విలయం. గతంలో గాడ్గిల్ కమిటీ ఒక నివేదిక సమర్పించింది. పశ్చిమ కనుమల్లో ఎలాంటి గనుల తవ్వకాలు, అడవుల నరికివేత వంటి ప్రకృతి విధ్వంస కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. ఆ మాట పెడచెవిన పెట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ఫలితమే ఇప్పుడు ఈ వరద బీభత్సానికి కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇంతకుమించిన హెచ్చరిక మరొకటి ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ రక్షణ బాధ్యతను తేలిగ్గా తీసుకుంటున్నాయి. పరిశ్రమల పేరుతో, నగరాల పేరుతో భూమిని, గనుల పేరుతో అడవుల్ని నాశనం చెయ్యడానికి అంగీకారం తెలుపుతున్నారు. ఇకనైనా ఆ ధోరణికి అడ్డుకట్టపడాలి. లేదంటే కరవులొకవైపు, వరదలొకవైపు దేశాన్ని ముంచెత్తుతాయి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇకనైనా పాలకులు కళ్లు తెరిచి వాస్తవాలను గమనంలోకి తీసుకోవాలి.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం
ఇది న్యాయమేనా?
‘నాకు రాజకీయాలు నేర్పుతారా? సర్వసమర్ధుడిననే ప్రజలు నన్ను ఎన్నుకున్నార’ని నిరంతరం చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న రాజకీయ విమర్శలు విస్మయం కలిగిస్తున్నాయి. ‘మాకు జరిగిన అన్యాయానికి వడ్డీతో వసూలు చేస్తాం’ అంటున్నాడాయన. అంటే ఏమిటి? అన్యాయానికి వడ్డీ ఎలా లెక్కిస్తారు? నిధులు ఇవ్వడం లేదంటున్నారు కాబట్టి నిధులపై వడ్డీ అనుకోవాలా? అలా అయితే ఏపీ ప్రభుత్వం కూడ ఉద్యోగులకు కరవుభత్యం, ఇతర అరియర్స్ ఇవ్వడంలో నెలల తరబడి జాప్యం చేస్తున్నది. అందుకుగాను వడ్డీ చెల్లిస్తున్నారా? అరియర్స్ కూడా ఏకమొత్తంగా ఇవ్వకుండా చాలా భాగం ప్రావిడెంట్ ఫండ్‌లో జమచేస్తున్నారు. ఈ బలవంతపు జమలు న్యాయమా?
- భాస్కర్, కాకినాడ
వోట్ల కోసం విమర్శలు
అసోంలో ‘జాతీయ పౌరుల రిజిస్టర్’ (ఎన్‌ఆర్‌సి) ముసాయిదాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ- ‘మాతృదేశంలోనే శరణార్థులా?’ అంటూ ఇదంతా భాజపా కుట్ర అనేశారు అలవాటుగా. మరి దశాబ్దాలుగా కశ్మీర్ నుంచి వెళ్లగొట్టబడి మాతృదేశంలోనే శరణార్థుల్లా అగచాట్లుపడుతున్న కశ్మీర్ పండిట్లు మాత్రం ఈ నేతలకు కనిపించరు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 28వరకు అభ్యంతరాలు, నివాస రుజువులు సమర్పిస్తే ఎన్‌ఆర్‌సీలో మార్పులు చేస్తామని అధికారులు చెప్పినా, ఓటు బ్యాంకు కోణంలో మమత, రాహుల్ లాంటి నేతలు అగ్ని రాజేస్తున్నారు.
- ప్రసాద్, గొడారిగుంట